'Premanuraga Devatha' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
" ఏమండీ ! నిన్న మా ఊరి సుభద్రమ్మ ఫోన్ చేసింది. మా అక్కకు కాస్త ఆయాసంగా ఉంటే ఆవిడే అక్కను తీసికెళ్ళి పట్నంలో డాక్టరుకు చూపించిందిట. వాళ్ళు పరీక్షలన్నీ చేసి ' గుండె బలహీనంగా ఉంది, జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలి ' అని చెప్పి మందులిచ్చారుట. వెళ్లి చూసొద్దామండి " అంది సరళ.
" అయ్యో ! అలాగా ! రేపు నేను ఆఫీసులో శెలవు పెట్టి వస్తాను. మీ ఊరికి వెళ్ళొద్దాం " అన్నాడు రమణ. భర్తకు టిఫిన్ పెట్టి అతన్ని ఆఫీసుకు పంపించిందే కానీ సరళ మనస్సంతా తన అక్క భారతిని గురించిన ఆలోచనలతో ఉండి మనసంతా బాధతో నిండి పోయింది. భారతి తనకు వరసకే అక్క గానీ తల్లి కంటే ఎక్కువ. తమ చిన్నతనానే తల్లి చనిపోతే తనను, తన చెల్లెలు విజయను, తమ్ముడు వంశీని కష్టపడి పెంచి పెద్ద చేసింది.
తండ్రి రామయ్యతో పాటు తను కూడా పొలాలలో కూలి పనులకు వెళ్ళి కష్టపడి పనిచేసి తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచి తల్లి లేని లోటును తీర్చింది. ఆమెను ఆ ఊరిలోని తోటి కూలీ అయిన ప్రసాద్ కిచ్చి పెళ్ళి చేశాడు తండ్రి .అతను మొదట్లో అక్కను బాగానే చూసుకున్నా క్రమేపీ చెడు వ్యసనాలకు లోనయి పని మానేసి డబ్బుల కోసం ఆవిడను వేధించి హింసించేవాడు. భారతి ఓర్పుగా భరించేది. తండ్రికి తెలిసి, అల్లుడికి నచ్చచెబుదామని ప్రయత్నించి విఫలమయ్యాడు. త్రాగుడు ఎక్కువై కొన్నాళ్ళకు ప్రసాద్ చనిపోయాడు.
పుట్టెడు దుఃఖంతో భారతి పుట్టింటికి చేరి తమను, తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నది. కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆ దిగులుతో కొన్నాళ్ళకు రామయ్య చనిపోయాడు. ఇంక తమ కుటుంబానికి తల్లీ, తండ్రీ తనే అయి అహర్నిశలూ కష్టపడి పనిచేస్తూ తమను చదివించింది. కుటుంబ పోషణకు తను తెచ్చే కూలీ సరిపోయేది కాదు. ఎదుగుతున్న ఇద్దరు చెల్లెళ్ళు , తమ్ముడు. పట్నంలో వాళ్ళ పోషణకు, చదువు ఖర్చులకు తను మరింత కష్టపడి సంపాదించాలని నిర్ణయించుకుంది. పైగా ముగ్గురినీ హాస్టల్లో ఉంచి చదివించటమాయే. హాస్టల్ ఫీజు, బట్టలు, కాలేజీ ఫీజులు తప్పనిసరాయె!
తనే స్యయంగా నాలుగు గేదెలను కొని వాటిని పోషించేది. పాలేరులను పెట్టుకునే స్థోమత లేక పొలం గట్లమీదకు పచ్చిక కోసం తనే వాటిని మేపుకెళ్ళి వాటిని తోలుకుని వస్తూ దారిలో ఆ ఊరి చెరువులోకి మొలలోతు దిగి వాటికి శుభ్రంగా స్నానం చేయించి తీసుకొచ్చేది. ప్రక్క ఊళ్ళో పాలకేంద్రానికి నడిచి వెళ్లి పాలు పోసొచ్చేది. తను కూలీకెళ్ళొచ్చిన సంపాదన , పాలు అమ్మిన సంపాదన అంతా జాగ్రత్తగా కూడబెట్టి చెల్లెళ్లకు, తమ్ముడికి పంపగా మిగిలినడబ్బును దాచేది. బాంకులో తమ ఇల్లు తనఖా పెట్టి కొంత మొత్తం డబ్బును లోనుగా తీసుకుని నెమ్మదిగా కొంత పొలం కొనుగోలు చేసింది.
తన పొలంలో కొంత మంది కూలీలను పెట్టుకుని వరి పంట వేసింది. తను కూడా కూలీలతో సమానంగా పని చేస్తూ సమయానికి నాట్లు, పంటకు నీళ్లు పెట్టేది. వరి కోత, కుప్ప నూర్పిడి చేసి అహర్నిశలూ కష్టపడి పనిచేసి ధాన్యాన్ని పండించింది. ఆ పంటను అమ్మి బ్యాంకు లోన్ తీర్చి ఇల్లు తనఖా విడిపించింది.
ఆ ఊరి రైతు కామయ్య కన్ను భారతి మీద పడింది. ఒకరోజున పొలంలో కొడవలితో గడ్డి కోస్తుండగా వచ్చి భారతి చేయి పట్టుకుని తన మనసులోని కోరిక తీర్చమన్నాడు. ఒంటరి ఆడది , అందునా మగ దిక్కులేని కుటుంబమంటే లోకువ సహజం కదా! వాడి ప్రవర్తనకు అసహ్యించుకుని చేయి విదిలించుకుని వాడిని కొట్టేందుకు చేతిలోని కొడవలెత్తింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి వాడు పరుగు లంఘించుకున్నాడు. ఆ సాయంత్రం గ్రామ పెద్దల ముందు రచ్చబండ వేదికగా జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది భారతి. అందరూ భారతి చేసిన పనిని మెచ్చుకుని కామయ్యను నిందించి అతనిచేత భారతికి క్షమాపణ చెప్పించారు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరి బహిష్కరణ చేస్తామని కామయ్యను హెచ్చరించారు. ఆ రోజు నుంచి నిప్పులాంటి భారతి వంక చెడుగా కన్నెత్తి కూడా చూసేందుకు ఎవరికీ ధైర్యం లేదు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి తలలోని నాలుకలా సాయపడే భారతి అంటే అందరికీ అభిమానం.
అలా రోజులు గడుస్తుండగా తమ డిగ్రీ చదువులు పూర్తవగానే మంచి సంబంధాలు చూసి పొలం అమ్మి తనకు , చెల్లికి పెళ్ళి చేసింది. గేదెలను అమ్మి వంశీని పై చదువుల కోసం వేరే పట్టణంలో ఉంచి చదివించింది. వాడికి ఉద్యోగం రాగానే ప్రయోజకుడయ్యాడు, ఇంక తమ కష్టాలు తీరుతాయని సంతోషించింది. కానీ ఆ సంతోషం ఇట్టే ఆవిరైపోయినట్టుగా వాడు తోటి ఉద్యోగస్తురాలు, ధనవంతురాలు అయిన ఉమను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇల్లరికపు అల్లుడయ్యాడు.
వంశీ ఒక ఇంటివాడయ్యాడని సంతోషించి ఆ దంపతులను ఇంటికి రమ్మని పిలిచింది. వాడు ఉమను ఇంటికి తీసుకు రాకపోగా ‘ తనకు ఆ ఊరిని, తమను చూడటం ఇష్టం లేదనీ, ఇంక తనతో బంధుత్వం వదులుకోవాలని, తనకు అంతా అత్తామామ, ఉమే సర్వస్వం ‘ అని తెగేసి చెప్పాడు. అది విని భారతి గుండె విలవిలలాడింది. తన మనసుకు తనే సర్ది చెప్పుకుని ఎక్కడున్నా వాడు చల్లగా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని దీవించింది. పొలాల్లో కూలీ పనులకు వెళ్లి ఆ సంపాదనతో తను బ్రతుకుతోంది.
ఇన్నేళ్ళూ తమ కోసం అహర్నిశలూ రెక్కలు ముక్కలు చేసుకుని తమను కష్టపడి పెంచిన అక్కను చూసి తను, చెల్లి చాలా బాధపడేవాళ్ళు. ఎన్నోసార్లు అక్కను తమ వద్దకు వచ్చి ఉండమని తాము చెప్పినా నవ్వి ఊరుకుని 'మీరే ఇక్కడికి రండమ్మా ! మీరు నా బిడ్డలే ' అనేది. ఇంక చేసేది లేక బలవంతంగా అక్క చేత కూలీ పనులను మాన్పించి ఆమెను ఇంటివద్దే ఉండి విశ్రాంతి తీసుకునేట్టు చేశారు సరళా వాళ్ళు. అక్కను కాస్త దగ్గరుండి జాగ్తత్తగా కనిపెట్టుకుని ఉండమని ప్రక్కింటి సుభద్రమ్మకు చెప్పి తను నెలనెలా కొంత పైకము ఆవిడకు పంపుతున్నది. అక్క వద్దు వద్దన్నా ఆమెను బలవంతంగా ఒప్పించి తమ భర్తల అంగీకారంతో కొంత డబ్బును అక్క పేరున ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, ప్రతి నెలా కొంత వడ్డీ అక్కకు అందేటట్టుగా ఏర్పాట్లు చేశారు తను, విజయ.
తనకు వీలు కుదిరినప్పుడల్లా అక్కను చూసొస్తున్నది. అలాంటి అక్కకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే మసంతా చాలా బాధగా ఉంది. ఏదో చప్పుడైతే తృళ్ళిపడి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి అటువైపు చూసింది. రమణ ఆఫీసు నుంచి అప్పుడే లోపలికి వస్తున్నాడు. సరళ లేచి వంటగదిలోకి వెళ్లి మంచినీళ్లు, వేడి వేడిగా టీ తయారుచేసి భర్త చేతికందిచ్చి తనూ త్రాగుతూ అతని సరసన కూర్చున్నది. వాడిపోయిన భార్య ముఖాన్ని చూసి ఆమె బాధ అర్ధమై ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకొని అనునయించి ధైర్యం చెప్పాడు రమణ. భర్త అనునయ మాటలతో సరళ మనసు కాస్త తేలికపడి గువ్వలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆరాత్రి భోజనాలు చేశాక అన్యమనస్కంగానే నిద్రకుపక్రమించింది సరళ.
తెల్లవారగానే సరళ భర్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళింది. ఇంటి తలుపు తట్టగానే సుభద్రమ్మ తలుపు తీసింది. ' ఎవరూ' అని సన్నగా అక్క మాట వినిపించింది. పరుగు పరుగున అక్క వద్దకు వెళ్ళి "అక్కా !" అని పిలవగానే వేయి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది ఆవిడ ముఖం. "రామ్మా ! సరళా ! అంటూ చేయి చాపటానికి ప్రయత్నించింది . నులకమంచంలో గాజుకళ్ళతో చిక్కి శల్యమై పడుకుని ఉన్న అక్కను చూడగానే గుండె తరుక్కుపోయింది సరళకు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుని "నీకేం కాదక్కా ! ధైర్యంగా ఉండు." అని ధైర్యం చెప్పి ఊరడించింది. మరికాసేపటికి విజయ కూడా భర్తతో కలిసి వచ్చింది. ఇద్దరినీ చూసి భారతి మరింత సంతోషించింది. కాసేపటికి అక్క కొంచెం అన్నం తిని మందులు చేతికిస్తే వేసుకుని నిద్రపోయింది.
నెమ్మదిగా కాస్త బయటకు వచ్చినాక సుభద్రమ్మ చెప్పిన మాట విని అవాక్కయ్యారు సరళా వాళ్లు. "అక్కకు గుండెనెప్పి వస్తే ప్రక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకెళితే 'గుండె పోటు' వచ్చింది. ఇంకోసారి ఆవిడకు గుండెపోటు వస్తే బ్రతకడం కష్టం. జాగ్తత్తగా ఉండాలి . ఈ విషయం ఆవిడకు తెలియనివ్వద్దు అని చెప్పి మందులు ఇచ్చి పంపారుట డాక్టర్లు. అందుకే మీకు ఫోన్లు చేశాను. ఖంగారు పడతారని 'ఆయాసం' అని చెప్పాను " అంది సుభద్రమ్మ.
ఇంక అక్కను ఇక్కడ ఉంచకూడదు. ఎలాగైనా ఆమెకు నచ్చ చెప్పి తన వద్దకు తీసుకెళ్లి కంటికి రెప్పలా కాపాడుకోవాలని నిర్ణయించుకుంది సరళ. ఆ విషయమే అక్క నిద్ర లేవగానే తనతో చెపితే "ఇక్కడే పుట్టాను .ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా తనకు ప్రాణం. ఈ మట్టిలోనే కలిసి పోవాలి." అని చెప్పింది.
నాలుగు రోజుల పాటు అక్కవద్దే ఉండి ఆవిడకు సపర్యలు చేసి ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక నిదానంగా తనను ఒప్పించచ్చు అనుకుని మిన్నకుంది సరళ.
ఆరాత్రి తీవ్రమైన గుండెపోటు వచ్చి ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయింది భారతి. ఊహించని ఈ హఠాత్పరిణామానికి గుండెలవిసేలా ఏడ్చి వంశీకి కబురు చేశారు సరళా వాళ్ళు. అతను రాలేదు. ఇంక తమకు తామే గుండె దిటవు చేసుకుని సరళ, విజయ కలిసి భారతికి తలకొరివి పెట్టారు. ఊరివాళ్లంతా భారతి గుణగణాలను, ఆవిడ ఆదర్శవంతమైన జీవితాన్ని వేనోళ్ళ శ్లాఘించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆ తర్వాత ఆవిడకు జరగవలసిన కర్మ కాండలన్నీ సరళ, విజయ శ్రద్ధగా దగ్గరుండి జరిపించారు. ఆ ఇంటిని ప్రాథమిక బడికి విరాళంగా వ్రాసి రిజిస్టర్ చేసి ఇచ్చారు . కొన్ని రోజులు అక్కడే ఉండి భారతి పేరున విగ్రహం తయారు చేయించి ప్రతిష్టించి , సంతాప సభ ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి భక్తితో , ప్రేమతో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఊరందరికీ అన్నదానం చేశారు సరళా వాళ్ళు. పుట్టెడు దుఃఖంతో తమ తమ భర్తలతో తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు సరళ, విజయ.
తమను కనకపోయినా ఎన్నో కష్టాలకోర్చి తన జీవితాన్ని పణంగా పెట్టి, కన్నతల్లి కంటే మిన్నగా తమను పెంచి పెద్దచేసి తమ కోసమే బ్రతికిన 'తల్లి లాంటి అక్క ఋణం ' తీర్చుకున్నారు సరళ, విజయలు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments