'Prematho Sita ki' - New Telugu Poem Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 26/05/2024
'ప్రేమతో... సీత కి' తెలుగు కవిత
రచన: M. లక్ష్మా రెడ్డి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రియమైన సీత గారికి...
శ్రావణం కాబోలు... చిరుజల్లులు మంచుముత్యాల్లా
మేనిని తడిపేస్తున్నాయి...
మనసుని తడిమేస్తున్నాయి...
అచ్చం జాబులోని మీ మాటల్లానే
ఎంతల్లరోయ్.....
ఇక్కడి పూలకి సుకుమారం మరీనండి...
మీరు వాటిలా ఉంటారేమో అని మనసులో అనుకున్న మరుక్షణం...
సిగ్గేమో వాటికి... నా నయనాలకి వేడుకలా మరింత రమణీయంగా కనబడుతున్నాయి...
మీకు పోటీనా...
కోటి పూల సొగసు కూడినా...
మీతో పోటీనా...
అదసలు కుదిరే పనేనా...
సాయం వేళ మబ్బులుపట్టిన ఆకాశంకేసి చూస్తే.....
అదేంటో మీరు రాసిన ఉత్తరాల అక్షరాలు... నాకోసం
ఆ నీలం రంగు కాన్వాసుపై వడివడిగా అల్లుకుంటున్నాయి,
నా ఒక్కడికే మీ మాటల్లా వినబడుతూ...
మీర్రాస్తున్నట్లే కనబడుతూ...
ఏం మాయో...
ఈ హిమామూ, మీ మనసల్లే.....
మరీ చల్లదనం... మరులుగొలిపే సౌందర్యం...
అల్లేసుకున్న భావన... కమ్మేసిన ఆకర్షణ.....
ఏంటీ... ???
ప్రేమిస్తున్నానా. ? మంచి మనసుని...
మంచు లాంటి మనసుని...
సాయంకాలం కరిగి... కాస్త నిశి కమ్ముకునే వేళ...
తారలు తళుకులీన ముస్తాబయ్యే సమయాన.....
ఏంటో సీతా... నీ తొలిలేఖ మొదలు...
ఘడియ కింద... నా కనులలో నిక్షిప్తమైన నీ...
ఈ వేళ లేఖ దాకా...
ఆ అక్షరాలే... నీ రూపమై...
ఆ భావాలే... అనుబంధమై...
ఈ శశివేళ... అడుగు దూరంలో నువ్వున్నట్టు...
ఏనాటికీ... నాతోనే ఇలా ఉండమని అడగమన్నట్టు...
ప్రతివేళా... నీతోనే ఉంటున్నా...
నా సమస్తం... నువ్వే అన్నట్టుగా...
ఇది... నీ మది అక్షరాల మాయా...
లేక నీ లేఖ భావాల మంత్రమా.....
సీతా అని పిలిచేస్తున్నా అని ఏమనుకోకోయ్...
సీతగారు... ఇలా పిలవాలని... ప్రయత్నించినా...
మొదటి లేఖతోనే మర్చిపోయా... ఇపుడు కూడా
కాసేపటికే... మీ నీ గా. మీరు నువ్వుగా...
ఇది కాదు పరివర్తనం.....
నా హృదయం... నీ ఆవర్తనం.
కాబోయే... జీవిత భాగస్వామిని... నా జీవన సారధిని...
ఈ మన ఒంటరివేళల... గారు అనడమంటే... ,
అపరిపక్వ జ్ఞానమావదూ... కదూ...
ఇలా నీ కబుర్లతో
సమయం సాగుతూ...
చీకట్లు నలుపురంగుl నిర్వచనంలా పరుచుకుంటూ...
ఈ లోకం నిద్దట్లోకి...
మరి నేను. నా కలల వెలుగులోకి...
నీ తోడు కదా... ప్రకాశమే... అవును,
నా ఊహలూ... నీ వల్ల కాంతివంతమే...
నిజమోయ్ సీతా.
జాబిలి ఓ వైపు... తోడుగా బోలెడు తారకలు...
సీతామహాలక్ష్మి గారు నా వైపు...
అంతే... అంతే...
ఆకర్షణ సమరం అప్పుడే ముగిసింది...
నేనే విజేతనని మళ్ళీ వేరుగా విన్నవించాలా...
ఓ బుంగమూతి జాబిలి... చిరుకోపాల తారకలు...
మరెందుకోయ్... ఓటమి తెలిసీ... పోటీకి...
పర్లేదు... నా సీత నవ్వులు కొన్ని మోసుకెళ్ళండి...
మీ అందం... వేల రెట్లు ఇనుమడిస్తుంది...
ఇది కలలా... లేదు సీత...
కళ్ళెదుట ఉన్నట్టే ఉంది... నా కథ...
నీ వల్ల... మన ప్రేమకథ...
ఈ కథకి... నువ్వే ఆది... నువ్వే అది...
వేకువజామున సడిసేయక నా కలల నుండి జారుకుని...
పనివేళలనూ... అనుక్షణం మనసుని పెనవేసుకుని...
నా మదిమాటు ఆలోచనల రాజ్యం చేజిక్కించుకుని...
నా హృది అంతఃపురాన్ని నీ ప్రియవశం చేసుకుని...
బదులుగా... బహుమతిగా.....
నా పెదాల అంచున... చెరగని నవ్వుని...
ఈ కనుల చివర... మెరుపు కాంతిని...
ఇచ్చి... నన్ను నాకే కొత్తగా... పరిచయం చేస్తున్న...
సీతకి...
నా సీతామహాలక్ష్మి కి.....
ప్రేమతో... నీ రామ్!
ఒక్క నిమిషం.....
ఇంకా మనసు దాటి... కాగితం గూటికి
చేరని పదాలెన్నో...
నీ లేఖాక్షరాల వల్ల... ఈ ఎద విన్యాసాలెన్నో...
భావాలని ఆపాలని... లేదు
కాలం... కలం ఆగేలా లేవు
ఈలేఖకి ముగింపు లేదు...
కాస్త విరామం తప్ప.....
ఈ లేఖ నిను చేరులోగా
నేను మరిన్ని పదాలని
సిద్ధం చేసుకోని...
వాటి సాయంతో
నీతో భావ ప్రకటనా
యుద్ధం చేసుకోని...
ఈ ప్రవాహం ఎలా ఆపడం... వల్ల కావట్లేదే...
కానీ... ఈ క్షణం తప్పట్లేదే...
నిను కలిసే క్షణానికై... నీ వీక్షణకై వేచిచూస్తూ...
నీ చేవ్రాలు... ఆ పరిమళం... నను వేగిరంగా చేర ఆశిస్తూ...
ప్రేమతో... సీత కి... నీ రామ్
***
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను లక్కీ.. లక్మారెడ్డి
రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..
అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..
నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..
నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...
ధన్యవాదాలు...
బావుంది, మరో సీతారాముల ప్రేమ!