top of page

ప్రేమాయణం



'Premayanam' - New Telugu Story Written By  Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 09/08/2024 

'ప్రేమాయణంతెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ప్రేమ అన్నది ఒక భావోద్వేగం, ఒక మనిషి నిత్య సాన్నిహిత్యాన్ని బలంగా కోరుకునే భావన. ప్రేమకు మూలం విశ్వాసం. ఒక వ్యక్తి నుంచి, మనం కోరుకునే మమతాను రాగాలు, అండ దండలు, ప్రోత్సాహము, భద్రత, వంటివి సతతము లభిస్తాయన్న ధృఢమైన నమ్మకం. అటువంటి భావోద్వేగం మాధవ్ కి రాధను చూసినప్పుడు, రాధకు మాధవ్ యెదురైనప్పుడు కలగడం దైవికం. 


ఇద్దరూ ఒకే అపార్టుమెంటు సముదాయములో, తమ కుటుంబాలతో కలిసి వుంటున్నారు. కానీ అతనిది ఏ బ్లాక్ అయితే ఆమెది సి బ్లాక్. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో, అసిస్టెంటు ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అయితే, వారి డిపార్టుమెంటులు వేరు. ఆమెది ఇంగ్లీషు, అతనిది వాణిజ్య నిర్వహణ. వారి తొలి కలయిక ఎంతో యాదృచ్చికంగా, యూనివర్సిటీ ఆడిటొరియం వద్ద జరిగింది. అలా కలిసిన కొన్ని రోజుల తరువాత, వారు తాము ఒకే చోట నివసిస్తున్నామన్న సంగతి గ్రహించి, ఒక వింత అనుభూతికి గురయ్యారు. ఆ అనుభూతి, గత జన్మల వాసనలనుండి ప్రభవించి, హృదయాంతరాళాలలో ధ్వనిస్తున్న, ఒక వినీ వినబడని వలపు పిలుపుగా వారు భావించారు. 


ఊహల్లో యుగళగీతాలు పాడుకుంటూ, వనాలలో విహరిస్తున్నప్పటికీ, వారు

అపార్టుమెంటు ఆవరణలో జాగింగ్ చేసినప్పుడు, పార్కింగు ప్రదేశములో యెదురైనప్పుడు, యూనివర్సిటీ కాంటీనులో తారసపడినప్పుడు, ఒకరి నొకరు మౌనంగా, ఆరాధనాభావంతో చూసుకోవడానికే పరిమితమయ్యారు. అందుకు మొదటి కారణం బిడియమైతే, రెండవది ఆ ప్రేమ భావన చెదరిపోతుందన్న భయం. దేవదాసు “బాధే సౌఖ్యమనే భావన రానీయవోయ్” అన్నాడని, అతని చేతగాని తనాన్నినిందిస్తాం. కానీ ఎందరో "ఎంత చేరువో అది అంత దూరము ”, “విరహం కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా" అని అపస్వరాలతో పాడుకుంటూ బ్రతికేస్తున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్య పోతాము. 


ప్రేమకథలలో మధ్యవర్తిత్వం చేసేందుకు దేవుడు పక్షినో, మనిషినో, మేఘాలనో అందుబాటులోవుంచిన వైనం కథలు చదివినవారికి, విన్నవారికి సుపరిచితమే. ఇక్కడ ఆ పరమాత్మ, రాధకు ఇద్దరు తరుణ వయస్కులైన వదినలను, తోడుగా ప్రసాదించాడు. జాగింగు చేసేటప్పుడు, మరదలి చూపులు, మాధవ్ చూపులతో ముడిపడి, విడివడ లేక గిజగిజ లాడడం, వారి సూక్ష్మదృష్టిని దాటిపోలేదు. ఇంకే ముంది, జవరాళ్ళ సరదాలకు రంగం సిద్ధమైంది. సానుభూతి వచనాలు, సరస సంభాషణలకు తెర లేచింది. కొన్ని రోజుల తరువాత, ఈ దొంగచూపుల అంకం నుంచి, వారి ప్రేమాయణం ముందుకు సాగక పోవడంతో, విసిగిన వదినలు, ఒక రోజు రాధ లేనప్పుడు మాధవ్ ని నిలదీసారు. 


 తే. గీ. “ఎంత కాలము చూపుల సంతకాలు

 చెప్పు సోదరా! నీ ప్రేమ నిప్పుడైన

 మనువు కోరుచు లేఖను మగువ కివ్వు

 ప్రేమ యానము ముగింపు పెళ్ళి కాదె!


విన్నావు కదా! మరచిపోకు. రేపు సాయంత్రం ఆరు గంటలప్పుడు, స్విమ్మింగ్ పూల్ దగ్గరకి రా. కవితలు వ్రాస్తావట. నీ లేఖ కవితలా వుండాలి. రాకుంటే, వచ్చే వారంలో మా రాధకు, శిశుపాలుడితో పెళ్ళి ఖాయం చేసేస్తాం”. 


మాధవ్ ఒక్క నిమిషం పాటు స్థాణువై నిలిచాడు. వారి చొరవ, ప్రసన్నత, నిర్దేశము, అతడిని ముగ్ధుడిని చేసాయి. ఒక అయోమయ స్థితిలో అతడు, " థాంక్యూ" అని గొణిగాడు. అతని నుండి ప్రతిస్పందన రాకముందే, వారు వెళ్ళిపోయారు. బహుశా ఆ స్పందన రూపాన్ని వాళ్ళు ముందే వూహించి వుంటారు. మాధవ్ బుద్ధికి పదును పెట్టాడు. మనసుకు రెక్కలు తొడిగాడు. ఆత్మతో సంభాషించాడు. దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ప్రేమ లేఖ వ్రాసాడు. అనుచితమైన భావాలు, అసభ్య పదాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. 


మరునాడు సాయంత్రం వారు చెప్పిన సమయానికి, స్విమింగ్ పూల్ దగ్గరకి చేరుకున్నాడు. అక్కడ సిమెంటు బెంచి మీద కూచుని, ముగ్గురు యువతులు కబుర్లు చెప్పుకుంటూ కనబడ్డారు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతని వయసు గాని, అచార్య స్థానముగాని, అతనిలోని యవ్వనభావాలతో కలగలిసి వుండే బెరుకుని, వుద్వేగాన్ని నిలువరించలేకపోయాయి. అతడు వారి ముందు నిలబడి, ముందుగా రాధ వదినెలకు నమస్కరించాడు. వారి హస్త సంజ్ఞానుసారము, ఒక కవరు రాధకు అందించాడు. 


ఆమె పెద్ద వదిన " ఒక అరగంట తర్వాత రా! మా రాధ బదులిస్తుంది" అని నవ్వుతూ చెప్పింది. తలెత్తకుండానే, కవరునందుకున్న రాధ, అతని వేపు చూడలేదు. 


"నవ్వక పోయినా పరవాలేదు, కనీసం తలయెత్తి చూడలేదు. రాధ! ఎంత బాధని యిస్తున్నావు" అని తలపోస్తూ, మాధవ్ అక్కడినుండి వెళ్ళిపోయాడు. రాధ లేఖను తెరిచింది. అందులో ఒక పద్యముంది. చిన్న వదిన ఆ పద్యాన్ని పెద్దగా చదివింది. 


సీ/ విఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయ

 గురుదేవి! నాయందు కరుణ చూపు

 బంధుమిత్రులు మెచ్చు సాధు సద్గుణ శీలి 

 అలివేణి! నా పల్కు లాలకించు

 తల్లిదండ్రుల ప్రియాత్మజ! గారాల తనయ!

 నాస్నేహ హస్తంబు నాదరించు

 భక్తి తత్పరతతో పరమాత్ము సేవించు 

 చెలి! ప్రేమ ప్రార్ధన స్వీకరించు 


 తే. గీ/ వినుము ఓర్మి వహించి నా విన్నపంబు

 నీవు లేకుండ మనలేను నిమిష మైన 

 తరళ లోచన! నా జీవి తంబు, నిన్ను 

 ధర్మ పత్నిగా పొందిన ధన్యమగును. 


లేఖ చదివిన చిన్న వదిన యిలా అంది. 

” తీర్చి దిద్దిన ముత్యాల్లాంటి అక్షరాలు అతని శ్రద్ధను తెలుపుతున్నాయి. లేఖ చుట్టూరా వున్న పుష్ప లతలు, అతని లలిత హృదయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సీసపద్యం, అతని గంభీరమైన ప్రేమను, తేట గీతి అతని బేలతనాన్ని చాటుతున్నాయి. ”


" నిజమే ! చక్కగా చెప్పావు" అంది పెద్ద వదిన. 


. అక్కా! ఓకే చెప్పమందామా? " వుత్సాహంగా అడిగింది చిన్న వదిన.


" జోకా! ఇది ప్రేమ లేఖలా లేదు. రానీ చెప్తాను" అంది పెద్ద వదిన. రాధ నిస్సహాయంగా చూస్తూ వుండిపోయింది. కాసేపయ్యాక మాధవ్ వచ్చాడు అతన్ని చూస్తూనే పెద్దవదిన యిలా అంది. 


" ఏమయ్యా! ఇది వుద్యోగ దరఖాస్తులా, అమ్మాయి బయోడేటాలా, వుంది. పెళ్ళికి ప్రేమ ఒకటే చాలదు. మోహంకూడా వుండాలి. ఇందులో మా మరదలి అందచందాల ప్రసక్తి లేదు గాబట్టి, పెళ్ళి చేస్తాం గాని శోభనం చేయము. సరేనా?" 


" అవునక్కా! నేను సరిగా గమనించలేదు. ఇందులో కుసుమాలే గాని కుసుమాయుధాలు లేవు. ప్రార్ధన ఒక రోదన లా వుంది. ధర్మ పత్ని అని మా రాధను గుళ్ళూ గోపురాలకి త్రిప్పుతావా యేంటి?" అని చిన్న వదిన పరిహాసమాడింది. 


 వారి మాటలకు మాధవ్ గుండె గతుక్కుమంది. సంప్రదాయంగా వుంటే ఆధునికమేది అంటారు, కాస్త సరసంగా వ్రాస్తే, ఇంత తెగింపా అంటారు. ముందు ఈ అక్కలను కాకా పట్టాలి" అని అనుకున్నాడు. 


" భారతీయతకు అద్దం పట్టేలా, స్త్రీ స్వరూపాన్ని నిర్వచించేలా, మీ కట్టూ

 బొట్టూ వున్నాయి. అందువల్ల, మిమ్మల్ని చూసి, ఆ ముగ్గురు దేవేరులు దిగివచ్చారని, ఎవ్వరైనా భ్రమ పడి తీరుతారు. అలాంటి మీరు చదువుతారని, ఇలాంటి వర్ణన. ”


మాధవ్ మాట పూర్తిగాకముందే పెద్దవదిన చిరుకోపం నటిస్తూ, " ఆప వోయ్! నీ దొంగ పొగడ్తలు. ఒక కుర్రాడిలా మా యెదుటే, రాధను దొంగ చూపులు చూసావుగా? ఆ కుర్రతనంతోనే ఇంకోలేఖ వ్రాసి యివ్వు. నచ్చితే కలిసి విందు భోజనం, నచ్చకుంటే విడిగా మందు పానం. రేపు అకార్డ్ హోటల్లో కలుద్దాం, ఇదే సమయం. కాస్తన్నా స్టయిలుగా రా" అంది. 


మాధవ్ మనసులో తిట్టుకున్నాడు. 


"వీళ్ళ ప్రసక్తి లేకుండా నేరుగా రాధతో మాట్లాడ గలిగితే బాగుండేది. అయినా నా పిచ్చికాని, రాధ ఆ అవకాశమిస్తే గా! పిల్ల కోడిలా, యూనివర్సిటీలో టీచర్లతోనో, స్టూడెంట్సుతోనో వుంటుంది. ఇక్కడ వదినలతో. ముద్ద బంతి పువ్వులా, అమాయకంగా వుండే ఈ పిల్లతో, ఏమంటే యేమొస్తుందో నన్న భయమే లేకుంటే, ఎప్పుడో చెప్పేసే వాడిని. ఈ తిప్పలు తప్పేవి"అని మాధవ్ అనుకుంటుండగా చిన్న వదిన యిలా ఆదేశ మిచ్చింది. 


 ఆ. వె/. సూటు బూటు వేసి షోకుగా రావలె

చెలియ పైన కవిత చెప్పవలెను 

మధుర భాషలోన, అందాలు వర్ణించి 

లలన లేత మనసు గెలువ వలెను. 


రాధ వదినెలు చెప్పిన విధంగా, మరునాడు సాయంత్రం మాధవ్ అకార్డ్ హోటల్ కి చేరుకున్నాడు. 


 తే. గీ/ పలువరస, క్లోజప్ పేస్టుతో చెలువుమీర, 

సూట్ల రారాజు రేమండ్ సూటు తొడిగి, 

ఆలివరు పెర్ఫ్యూం, చక్కగా అద్ది మేన, 

మాధవుడు వచ్చె ఠీవిగా రాధ కడకు. 


అతడిని ప్రశంసా పూర్వకంగా చూసి, లేఖ కోసం చేయి చాపింది పెద్ద వదిన. మాధవ్ లేఖను ఆమెకు అందించాడు. వదినలిద్దరూ లేఖను చూసారు. పెద్ద వదిన, చిరునవ్వుతో లేఖను రాధకిస్తూ " ముద్దుల మరదలా! ఇదిగో నీకోసం ఒక వరుడు వచ్చాడు. నచ్చితే చెప్పు" అంది. రాధ లేఖను చదివింది. 


 సీ/ బాలేందు వదనము, పసిడి కాంతుల మేను 

సర్వాంగ సుందరీ! స్వస్తి! స్వస్తి ! 

సొంపైన చెక్కులు, ఇంపైన అధరాలు

చంచరీ కచికుర! జయము! జయము!. 

చక్కని కనుదోయి, సంపంగి నాసిక 

స్మిత సుందర వదనా, శివము! శివము! 

తీరైన కంఠమ్ము, బారెడు కేశాలు

సొగసైన జవ్వనీ, శుభము! శుభము! 


 తే. గీ/. చిలిపి నవ్వుల అనురాగ మొలక బోయు, 

వాలు చూపుల వలపుల వాన కురియు, 

జీవితేశ్వరివై నాకు, ద్రోవ చూపు 

సమ్మతి నీయవే వేవేగ సారసాక్షి. 


లేఖ చదివిన పెద్దవదిన " బాగుందయ్యా! సంకోచపడుతూనే చక్కగా వర్ణించావు. నీవు ప్రేమించిన అమ్మాయికి జయం పలికి అండగా వుంటానన్న భరోసా యిచ్చావు. మంచి ఆరాధనా భావముంది నీలో. కానీ ఒక్క అనుమానం. రాధ నీకన్న చిన్నది కదా, ఆమెను త్రోవ చూపమంటున్నావేం?"


"థాంక్స్ అక్కా! అన్ని పరిశోధనలు, పురుషులకన్న స్త్రీలే యెక్కువ సామర్ధ్యాలు కలిగి వున్నారని, నిరూపించాయి. అందుకే మా మేనేజ్మెంటు విద్యార్ధులకు మెటర్నల్ స్టైల్ అఫ్ లీడర్షిప్ అంటే తల్లి శైలి నాయకత్వం బోధిస్తున్నాం. ఆ అవగాహనతోనే, రాధను నాకు మార్గదర్శిగా వుండమని కోరాను. " 


 రాధను గమనిస్తున్న చిన్న వదిన, " అదిగో కురిసె, వాలు చూపుల వలపుల వాన. రాగరంజితాయెను మా మురిపాల చాన. అనగా, ఈ వరించి వచ్చిన వాడే మనోహరుడు" అంది. 


 రాధ సిగ్గుతో, " పో! వదినా!" అంటూ పెద్ద వదిన భుజంపై తలవాల్చి, మాధవ్ ని ప్రేమగా చూసింది. మాధవ్ ముఖం పున్నమి చంద్రునిలా వెలిగిపోయింది. రాధా మాధవులను ప్రక్క ప్రక్కన కూర్చోబెట్టి వదినలిద్దరిలా ఆశీర్వదించారు. 


 తే. గీ/వేల్పు గణములు మీకు దీవెన లొసంగ

బంధుమిత్రులెల్ల మిమ్ము సమాదరించ

చెలిమితో సాగు గాక! మీ జీవనమ్ము 

అస్తు! విజయోస్తు! కల్యాణ మస్తు! అస్తు!


పులకించిన హృదయాలతో అందరూ విందు భోజనం చేయడానికి, డైనింగ్ హాలు లోకి వెళ్ళారు. ఒక నెలరోజుల తర్వాత, ఆ ప్రేమ జంట కల్యాణం వైభవోపేతంగా జరిగింది. "మనసైన జవరాలే వలచింది. మనుగడే ఒక మలుపు తిరిగింది" అని మాధవ్ సుస్వరాలతో పాడుకున్నాడు. నిజమేగదా! వివాహంతో వారి ప్రేమాయణం కొత్త పుంతలు తొక్కింది. సరసాలు, గిల్లి కజ్జాలు, అలకలు, విరహాలతో ఆ ప్రేమ పధం కాంతులీనుతూ ఆ క్రొత్త జంటను స్వాగతిస్తోంది. 

 @@@

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).


 


117 views0 comments

Commenti


bottom of page