He's an ex
'Premikudu (He's an ex) - Part 1' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 25/06/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పలస్వామి కబురుతో.. ఊరికి బయలు దేరాడు శేషగిరి.
శేషగిరి తండ్రి అప్పలస్వామి.
బస్సు కుదుపులు శేషగిరిని చికాకు పరస్తున్నాయి.
'హైవేకు బస్సు ఎక్కే వరకు ఇంతే.' అనుకున్నాడు.
***
శేషగిరి ఆఫీస్ లో ఉండగా అప్పలస్వామి ఫోన్ చేసాడు.
"అమ్మకు పది రోజుల నుండి జ్వరం తగ్గడం లేదు. ఇక్కడి డాక్టర్ పట్నం తీసుకు పొమ్మన్నాడు. ఓ మారు రా." అప్పలస్వామి చెప్పాడు.
రెండు రోజులకు సెలవు పెట్టి.. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు శేషగిరి.
డోర్ బెల్ వత్తాడు.
తలుపు తీస్తూనే.. భర్తని చూసి..
"ఇలా వచ్చేసారేమిటి." అడిగింది భార్య గిరిజ.
ఇంట్లోకి వెళ్లి.. తన నాన్న కబురు చెప్పాడు శేషగిరి.
"అవునా. అత్తమ్మగారికి ఇంకా నయం కాలేదా." అడిగింది గిరిజ.
"నేనూరు బయలుదేరుతున్నాను. ఒక జత బట్టలతో బేగ్ సర్దివ్వు." చెప్పాడు శేషగిరి.
టవల్ తీసుకొని.. బాత్రూంలోకి దూరాడు.
రిప్రెషై వచ్చాడు.
"కాఫీ కలపనా." అడుగుతోంది గిరిజ.
"వద్దు. బస్సు టైం కావస్తోంది." చెప్పాడు శేషగిరి.
"దార్లో ఏమైనా తీసుకోండి. ఇంటికి చేరాక ఫోన్ చేయండి." భర్తకి గిరిజ బేగ్ అందించింది.
"సరే. రాగిణి ఏది." అడిగాడు శేషగిరి.
రాగిణి.. శేషగిరి కూతురు. తనకి మూడేళ్లు.
"పక్కింటిలో ఆడుకుంటుంది." చెప్పింది గిరిజ.
"ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. లేదంటే.. మీ అమ్మగారింటికి వెళ్లండి." చెప్పాడు శేషగిరి.
"రేపటికి వచ్చేస్తారుగా." అడిగింది గిరిజ.
"వెళ్లడమే రాత్రి అవుతోంది. రేపు డాక్టర్ ని కలిసి మాట్లాడతాను. అమ్మను తీసుకు రావలసి ఉంటుందో లేదో తెలుస్తోంది." గజిబిజిగా చెప్పాడు శేషగిరి.
"మా ఇద్దరం ఈ రాత్రికి ఇక్కడే ఉండగలం. ఐతే గీతే రేపు మీరు రాకపోతే.. అమ్మింటికి వెళ్తాం." చెప్పింది గిరిజ.
వీథి లోకి నడిచాడు శేషగిరి.
బస్సు స్టాండ్ వైపు వెళ్తున్నాడు.
అక్కడికి ఐదు నిముషాల నడక దూరంలోనే అది ఉంది.
***
బస్సు కుదుపులు లేవు.
విండో నుండి బయటికి చూసాడు శేషగిరి.
హైవే చక్కగా ఉంది.
సీట్ వెనుక్కు స్తిమితంగా జార పడ్డాడు శేషగిరి.
చల్లని గాలికి అతడి రెప్పలు మెల్లిగా మూత పడ్డాయి.
***
మర్నాడు..
అనసూయ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ వద్దకు బయలు దేరాడు శేషగిరి.
శేషగిరి తల్లి అనసూయ.
శేషగిరి తల్లిదండ్రుల ఊరు చిన్నదే కానీ.. చిన్న చిన్న వీథులతో.. చాలా మలుపుల కూర్పులతో చింపిరి చింపిరిగా ఉంటుంది.
ఇంటికి పది నిముషాల నడక దూరంన డాక్టర్ డిస్పెన్సరీ ఉన్నా మలుపుల మాటున అటు చేరడానికి అవస్థలు పడక తప్పదు.
శేషగిరి అదే తంతున అటు వెళ్తున్నాడు.
అప్పుడే..
"శేషగిరి." అతడిని పిలుస్తున్నట్టు వినిపించడంతో..
వెనుతిరిగాడు.
'ఎవరు..' ఆశ్చర్యమయ్యాడు.
'పార్వతి.. కదూ..' పోల్చుకున్నాడు.
ఆ ఇంటి ముందు నిల్చుని ఉంది. ఆ ఇల్లు ఒకప్పుడు పార్వతి ఉన్నది.
నాలుగడుగులతో ఆమెను చేరాడు.
"పోల్చుకున్నావా." పార్వతి అడుగుతోంది.
"లావయ్యావు." చెప్పాడు శేషగిరి.
"అదే.. ఇంటి ముందు నుండి వెళ్తుంటే.. గడపలో ఉన్నాను. నీ నడకతో నిన్ను పోల్చుకున్నాను." చెప్పింది పార్వతి.
శేషగిరి నడక చాలా స్లోగా ఉంటుంది. పైగా అడుగులు ఎత్తి పడనట్టే జరుగు తుంటాయి.
"చాన్నాళ్లయ్యింది." అన్నాడు.
పార్వతినే చూస్తున్నాడు.
"నిన్ను చూసి నాలుగేళ్ల పై మాటే." పార్వతి అంది.
ఆ వెంబడే..
"ఈ మధ్యనే.. మీ అమ్మ.. నాన్న ఇక్కడే.. ఇలానే ఇంటి ముందే అగుపించారు. వాళ్లు నాతో మాట్లాడరుగా. అందుకే నేను పలకరించలేక పోయాను." తల దించుకుంది పార్వతి.
"అమ్మకి జ్వరం. డాక్టర్ ని కలవడానికి వాళ్లు ఇటే రావాలిగా." చెప్పాడు శేషగిరి.
"ఎప్పుడు వచ్చావు." అడుగుతోంది పార్వతి.
"రాత్రి. అమ్మ విషయమై డాక్టర్ ని కలవడానికి వచ్చాను." చెప్పాడు.
ఆ వెంబడే..
"నువ్వు ఎప్పుడు వచ్చావు." పార్వతిని అడిగాడు శేషగిరి.
"రెండు నెలల పై మాటే." చెప్పింది పార్వతి.
తను అప్పుడు ఎటో అస్తవ్యస్తంగా చూస్తోంది.
పార్వతి తీరు శేషగిరిని విస్మయ పరస్తోంది.
అడిగి తెలుసుకొనే సమయం లేక..
"డాక్టర్ ని కలవాలి. కలుద్దాం." చెప్పాడు శేషగిరి.
అక్కడి నుండి కదిలి పోయాడు.
***
డాక్టర్ ని కలిసి.. తిరిగి వస్తూ.. పార్వతి ఇంటి ముందుకు వస్తూనే ఇంట్లోకి చూసాడు శేషగిరి.
గడపన ఎవరూ లేరు. ఇంటి తలుపు మూసి ఉంది.
చికాకు పడ్డాడు.
నడకను కొనసాగించక తప్పలేదు.
అతడి అడుగులు భారంగా ముందుకు పడుతున్నాయి.
'పార్వతి.. పార్వతి..'
శేషగిరి మనసు.. మైదానంలో.. ముసురుకు చిక్కిన పిట్టలా ముడుచుకు పోతోంది.
ఎలాగోలా తన ఇంటిని చేరాడు శేషగిరి.
"డాక్టర్ ఏమన్నాడు." అప్పలస్వామి అడుగుతున్నాడు.
అనసూయ మంచం మీద ఉంది.
కొడుకును చూసి లేచి కూర్చొంది.
శేషగిరి స్టూల్ ని లాక్కొని కూర్చున్నాడు.
చేతిలోని రిపోర్ట్స్ ని మంచం మీద పెట్టాడు.
"ఇది వైరల్ ఫీవరట. బ్లడ్ టెస్ట్ లు పడతాయట. మంచి సౌకర్యంగా ఉంటుంది పట్నం తీసుకు వెళ్లమన్నారు." చెప్పాడు.
ఆ వెంబడే..
"నేను పట్నంలో ఉంటున్నానని డాక్టర్ కి చెప్పావటగా." అన్నాడు తండ్రినే చూస్తూ.
అప్పలస్వామి ఏమీ అనలేదు.
"సర్లే. పురం కంటె పట్నం వైద్యం మంచిగా లభిస్తోంది." చెప్పాడు శేషగిరి.
"నిస్సత్తువ తప్పా.. ఈ మధ్య దడి దడి జ్వరం రావడం లేదురా." అనసూయ చెప్పుతోంది.
అనసూయ నీర్సం శేషగిరికి తెలుస్తోంది.
"సర్లే అమ్మా. నువ్వు ఆగు. నేను నిన్ను పట్నం తీసుకు పోతా. నయం పర్చి తెచ్చి దిగబెడతా." చెప్పాడు.
"నాన్న ఒకడయ్యిపోతాడురా." అనసూయ నసిగింది.
ఆ వెంబడే..
"ఈ మధ్య పనులు ఉన్నా.. నన్ను వదిలి పొలాల వైపుకు కూడా పోవడం లేదు. వంటలంటూ చెయ్యిలు కాల్చుకుంటున్నాడు." నొచ్చుకుంటోంది.
శేషగిరి కలగ చేసుకున్నాడు.
"ఇద్దరూ నాతో వస్తారు." చెప్పాడు.
అప్పలస్వామి.. అనసూయ మొహాలు చూసుకుంటున్నారు.
"నాన్నా.. మీ ఇద్దరి బట్టలు చూపండి. నేను సర్ది పెడతాను." లేచాడు శేషగిరి.
"లేదురా. మీ సూరి మామ ఇన్ని రోజులు పొలాల పనులు చూస్తున్నాడు. నేను ఉండాలి. నేను ఉండగలను. పర్వాలేదు." అప్పలస్వామి గజిబిజిగా చెప్పాడు.
శేషగిరి తల్లి వైపు చూసాడు.
అనసూయ.. అప్పలస్వామినే చూస్తోంది.
"నేను ఉండగలనే. నువ్వు వీడితో వెళ్లు. తగ్గేకనే రా. నేను వచ్చినా అక్కడ ఎన్నాళ్లు ఉండ వలసి వస్తోందో." నసుగుతున్నాడు అప్పలస్వామి.
అనసూయ తల తిప్పింది. కొడుకును చూస్తోంది.
"ఎప్పుడు వెళ్తాం." అడిగింది.
"ఇప్పుడే." చెప్పాడు శేషగిరి.
"అయ్యో. రాత్రి కెలికినట్టు తిన్నావు. వండుతాను. తిని వెళ్లు." చెప్పాడు అప్పలస్వామి.
"లేదు నాన్న. ఇప్పుడు బస్సు ఉంటుందిగా. దార్లో తినొచ్చులే." చెప్పాడు శేషగిరి.
అనసూయ.. అప్పలస్వామి మరేమీ అనలేదు.
అప్పలస్వామి చూపినవి.. తీస్తూ.. అనసూయ బట్టలను ఒక బేగ్ లో సర్ది పెడుతున్నాడు శేషగిరి.
'సాధ్యమైనంత త్వరగా చూపండి.' డాక్టర్ హెచ్చరిక పదే పదే అతడికి గుర్తు వస్తోంది.
డాక్టర్ చెప్పేక.. అనసూయ ఆరోగ్యం శేషగిరిని కలవర పెడుతోంది
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments