top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 17


He's an ex

'Premikudu (He's an ex) - Part 17' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 12/09/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 17' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు. సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు.


తను కుమార్ తో మాట్లాడతానంటాడు శేషగిరి. 

కుమార్ ను స్టేషన్ కు పిలిపిస్తాడు ఎస్సై.



ఇక ప్రేమికుడు పార్ట్ 17 చదవండి. 


కుమార్.. యస్ఐనే చూస్తున్నాడు.


యస్ఐ ఒక ఊరు పేరు చెప్పాడు.

"నీకా ఊరు తెలుసా." అడిగాడు.


'తెలియదు' అన్నట్టు తలాడించాడు కుమార్.


"సైగలు వద్దు. మాట్లాడు." కసిరాడు యస్ఐ.


"తెలయదు సార్." చెప్పాడు కుమార్. తను బెంబేలవుతున్నాడు.


"మీ ఊరు ఏది." అడిగాడు యస్ఐ.


"మా ఊరు ఇదే." చెప్పాడు కుమార్.


"మరి మీ నాన్న ఆ ఊరిలో ఉంటున్నాడా." అడిగాడు యస్ఐ.


"ఏమో." చెప్పాడు కుమార్.


"అంటే.. సరిగ్గా చెప్పు." యస్ఐ కోపం కుమార్ కు తెలుస్తోంది.


"ఎప్పుడో నా నాన్న నన్ను వదిలి ఎటో పోయాడు." చెప్పాడు కుమార్.


"అంటే.. అప్పటి నుండి నీ నాన్న సంగతి నీకు తెలియదా." అడిగాడు యస్ఐ.


"అవును సార్." చెప్పాడు కుమార్.


"మరి నువ్వు వెతక లేదా. పోలీసులకు కంప్లెంట్ ఇవ్వ లేదా." అడిగి ఆగాడు యస్ఐ.


"నేను వెతక లేదు.  కంప్లాంట్ ఇవ్వాలని నాకు తెలియదు." చెప్పాడు కుమార్.


"మరి మీ మిగతా వాళ్లు." అడిగాడు యస్ఐ.


"అప్పటికే అమ్మ లేదు. చనిపోయింది. నేనొక్కడ్నే మిగిలాను." చెప్పాడు కుమార్.


"మరి బంధువులు." అడిగాడు యస్ఐ.


"నాకలాంటి వాళ్లు లేరు." చెప్పాడు కుమార్.


నిముషం గడిచాక..

"మీ నాన్న గుడ్స్ రైలు కింద పడ్డాడో.. గుడ్స్ రైలు గుద్దేసిందో.. పట్టాల మీద ముక్క ముక్కలై చచ్చాడట. అతడి జేబులో నీ షాపు బిల్లు.. అతడి మొలకు ఆ బిళ్ల తాడు ఉన్నాయట. ఎంక్వైరీ కి ఇక్కడికి పంపారు." చెప్పాడు యస్ఐ.


కుమార్ అచలనమైనా.. స్టడీగానే నిల్చునే ఉన్నాడు.

యస్ఐనే చూస్తున్నాడు.

"రిపోర్ట్ రాసి పంపుతాం. నువ్వు వెళ్లు. అవసరమైతే నిన్ను పిలుస్తాం." చెప్పాడు యస్ఐ. 


కుమారు కదిలాడు.

అతడి ఎమోషన్స్ ఇదమిత్థంగా ఇవని తెలిపే వీలు కానరావడం లేదు.

 ***

పోలీస్ స్టేషన్ నుండి తన షాపుకు వచ్చాడు కుమార్.  

సైకిల్ తో షాపు ముందే ఆగిపోయి..

"రెండు దాటి పోయింది. మీ భోజనాలు అయ్యాయా. నేను ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తాను." తన స్టాఫ్ తో చెప్పాడు.


వెంబడే.. సైకిల్ ఎక్కి.. ఇంటికి బయలుదేరాడు.

"అన్న మామూలుగానే ఉన్నాడు. ఎందుకు పిలిచారో. ఏమైందో." ఆ స్టాఫ్ లో గుసగుసలు మొదలయ్యాయి.


"అన్న తెలుసుగా. ఏ ఊసుకు పోడు. తన పని తనదేలా తిరుగుతాడు." ఒకడు అన్నాడు.


"ఏమైనా బట్టలు కుట్టించుకోడానికి పిలిపించుకున్నారేమో." మరొకడు అంటాడు.


"అవునవును. అంతే.. అంతే." 

ఇంచుమించుగా అంతా ఇలానే అనేసుకున్నారు.

***

ఇంటికి వెళ్లిన కుమార్..

భోజనం చేయ లేదు.

మంచం మీద అడ్డంగా పడి.. కళ్లు మూసుకున్నాడు.

అతడు ఏడవడం లేదు.. అలా అని లోలోన బాధ పడడం కూడా లేదు.

ఆ తర్వాత..

ఏమీ కానట్టు లేచాడు. 


భోజనం చేసాడు.

షాపుకు వెళ్లాడు.

***

డిన్నర్ లో ఉండగా..

నాగేశ్వరరావు నుండి శేషగిరికి ఫోన్ వస్తోంది.

డైనింగ్ టేబుల్ దరి నుండి కదిలి.. తన గదిలో ఉన్న తన ఫోన్ ని.. తీసుకొని తిరిగి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చాడు శేషగిరి.

"మీ డాడీ." గిరిజతో చెప్పాడు.


ఫోన్ రింగవుతూనే ఉంది.

"మాట్లాడండి." చెప్పింది గిరిజ. 


ఆ కాల్ కి కనెక్ట్ ఐ.. 

"హలో అంకుల్." అన్నాడు శేషగిరి.


"బిజీయా." అటు నాగేశ్వరరావు అడిగాడు.


"డిన్నర్ లో ఉన్నాం." చెప్పాడు శేషగిరి.


"తర్వాత చేస్తాను." చెప్పాడు నాగేశ్వరావు.


"అరె. లేదు లేదు. చెప్పండి అంకుల్." వెంటనే చెప్పాడు శేషగిరి.



భోజనం ముందు కూర్చున్నాడు.

ఫోన్ స్పీకర్ ని ఆన్ చేసాడు.

గిరిజని చూస్తున్నాడు.

"అదే.. ఆ పార్వతి ఆర్ధిక స్తోమత ఎంత మాత్రం వరకు ఉంటుంది." అడిగాడు నాగేశ్వరరావు.

ఆ వెంబడే..

"మన హంటింగ్ ముందే మనం అన్నింటినీ బేరేజీ వేసుకుంటేనే మంచిది." చెప్పాడు.


"నాకున్న అంచనాల ప్రకారం వాళ్లకి మంచిగానే పంట భూములు ఆ రోజుల్లో ఉన్నట్టు నాకు తెలుసు. మరి ఇప్పుడు.. అడిగి తెలుసుకుంటాను." చెప్పాడు శేషగిరి.


"ఆ ప్రయత్నం చేయండి అల్లుడుగారు." చెప్పాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"అందుకే ఫోన్ చేసాను. సరే.. డిన్నర్ కానీయండి." చెప్పాడు నాగేశ్వరరావు.


అంతలోనే..

"డాడీ.. మీ డిన్నర్ ఐందా." గిరిజ గట్టిగానే అడిగింది.


అప్పుడు శేషగిరి తన ఎడమ చేతిలోని ఫోన్ ని.. గిరిజ ఎడమ చేతిలో పెట్టాడు.

"మాదీ అవుతోందమ్మా." చెప్పాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"ఇదిగో అమ్మ మాట్లాడుతోంది." చెప్పాడు.


పావు నిముషం లోపునే..

"కర్రీ ఏమిటే." అటు నుండి అడుగుతోంది సరళ.


"ఎంత మారుతున్నా.. ఆడవాళ్ల మధ్య.. ముఖ్యంగా తల్లీ కూతుళ్ల మధ్య ఈ మాటలు పోవు." అటు నాగేశ్వరరావు గట్టిగానే అంటున్నాడు.


ఆ మాటలకి ఇటు శేషగిరి నవ్వుకుంటున్నాడు.

ఇవేవీ పట్టనట్టు.. "గుడ్ల పులుసు." చెప్పింది గిరిజ.


"మాది అరటి బజ్జీ.. వాము చారు." సరళ చెప్పుతోంది.


"వావ్." అంది గిరిజ.


"పాప పడుకుందా." అడిగింది సరళ.


"ఏదీ. భోజనం అయ్యేక.. టీవీ చూస్తూ ఇంకా ఆడుకుంటుంది." చెప్పింది గిరిజ.. రాగిణి గురించి.


"సరే భోజనం కానీ." అనేసింది సరళ.


"గుడ్నైట్.. మమ్మీ.. డాడీ." అంది గిరిజ.


అటు వాళ్లు కోరస్ లా.. "గుడ్నైట్" అన్నారు.


ఆ ఫోన్ కాల్ కట్ ఐంది.. గిరిజ ద్వారా.

"డాడీ చెప్పింది కూడా తేల్చుకోండి." చెప్పింది గిరిజ.


'అలానే.' అన్నట్టు తలాడించాడు శేషగిరి.

వాళ్ల డిన్నర్ కావస్తోంది.

***

పనులయ్యాక..

రాగిణిని తీసుకొని గదిలోకి వెళ్లారు.. గిరిజ.. శేషగిరిలు.

గిరిజ ఫోన్ ని అడిగి తీసుకున్నాడు శేషగిరి.

"మరెందుకు. పార్వతికి ఫోన్ చేసి అడిగేస్తాను." చెప్పాడు.


గిరిజ సవ్యంగా తలాడించేసి.. రాగిణిని పక్కన వేసుకొని.. మంచం మీద పడుకుంది.

శేషగిరి మంచం అంచున కూర్చొని.. పార్వతికి ఫోన్ చేసాడు.

అటు ఫోన్ కాల్ కనెక్ట్ కాగానే.. స్పీకర్ ఆన్ చేసాడు.

"హలో." అంది పార్వతి.


"ఒక విషయం.. మీకు ప్రస్తుతం పంట భూములు ఉన్నాయిగా. ఎన్ని ఉంటాయి. వ్యవసాయం ఎలా చేస్తున్నారు." అడిగాడు శేషగిరి.

గిరిజ చిన్నగా నుదుటన కొట్టుకుంటుంది. భర్తనే చూస్తోంది.

అది గమనించిన శేషగిరి.. బొమలు ఎరగ వేసాడు.

దానికి గిరిజ ఏమీ అనలేదు. 'మాట్లాడమన్నట్టు' మాత్రం సైగ చేసింది.


"ప్రస్తుతం మూడెకరాల పాతిక గుంటలు పొలం ఉంది. కౌలుకి ఇచ్చాం." అటు పార్వతి చెప్పుతోంది.


"సరే ఐతే. ఉంటా మరి." అనేసాడు శేషగిరి.


అంతలోనే..

"ఆ ఫోన్ ఇలా అందించండి." చెప్పింది గిరిజ. చేయి చాపింది.


ఆ చేతలో ఫోన్ పెట్టాడు శేషగిరి.

"హలో పార్వతి గారూ.. మరేం లేదు.. మీ ఆర్థిక స్థితి అంచనాకై ఇలా అడగడం జరిగింది. మీ ఫ్యూచర్ ప్రణాళిక బాగు కోసమే మా ఆరాటం. అంతే." గిరిజ సానుకూలంగా మాట్లాడింది.


"సంతోషమండీ. నా పట్ల మీ శ్రద్ధకి థాంక్సండీ." అటు పార్వతి చెప్పింది.


"అయ్యో. మనం మనం ఒకటి అనుకున్నప్పుడు మనం మన కోసం ఆలోచించు కోవాలిగా." చెప్పింది గిరిజ.


పార్వతి ఏమీ అనలేదు.

"సరే. ఉంటా మరి. గుడ్నైట్." అంది గిరిజ.


"గుడ్నైట్." చెప్పింది పార్వతి.

ఆ ఫోన్ కాల్ కట్ చేసేసి..

"మీరు మీరీ సూటిగా మాట్లాడేస్తారు. కొంత పొలైట్ గా మాట్లాడు తుండండీ. ప్లీజ్." చెప్పింది గిరిజ.. భర్తని చూస్తూ.


ఆ వెంబడే..

"మన మాటలతో ఎవరూ హర్ట్ కారాదు. అలానే ఎవరూ తికమక పడ కూడదు." చెప్పింది.

తల గొక్కుంటున్నాడు శేషగిరి.

"ఇక.. లేచి.. లైట్ తీసి పడుకోండి." చెప్పింది గిరిజ. 


తను భర్త బేలతనాన్ని చూడలేక పోతోంది.

"సారీ రా. నేను నిన్ను ఇబ్బంది పరుస్తున్నాను." మెల్లిగా చెప్పాడు శేషగిరి.


"అరె. ఇట్ డజ్నాట్ మేటర్. జస్ట్ మై ఒపినియన్." గిరిజ తేలిక పరుస్తోంది.


ఇంకా తననే చూస్తున్న భర్తని చూస్తూ చిన్నగా నవ్వేసింది గిరిజ.

తనకి భర్త అమాయకత్వం తెలుస్తోంది. అతడి గిల్టీనెస్ అవగతమవుతోంది. దానిని తుంచాలనే ప్రయత్నంగా..

"పాప పడుకుంది. మీరు లైట్ ఆర్పి.. హాలులోకి పదండి." మెల్లిగా చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"సోఫాని బెడ్ చేసి ఉంచరూ." అంది తమాషాగా.


శేషగిరిలో కదలిక వచ్చినా.. తను బెరుగ్గానే ఉన్నాడు.


"ప్లీజ్.. నాకు కావాలి." గిరిజ గోముగా అంది. భర్తని చూస్తూ మెల్లిగా కను కొడుతోంది.

దాంతో శేషగిరి ఫ్లాటయ్యిపోయాడు.

***


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










135 views0 comments

Comments


bottom of page