He's an ex
'Premikudu (He's an ex) - Part 18' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 17/09/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 18' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.
పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు. సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు.
తను కుమార్ తో మాట్లాడతానంటాడు శేషగిరి.
కుమార్ ను స్టేషన్ కు పిలిపిస్తాడు ఎస్సై.
అతని తండ్రి మరణించిన విషయం చెబుతాడు.
తండ్రి తనని చిన్నప్పుడే వదిలేసినట్లు చెబుతాడు కుమార్.
ఇక ప్రేమికుడు పార్ట్ 18 చదవండి.
మర్నాడు..
తన స్టాఫంతా వచ్చేక..
వాళ్లకి పనులు అప్పగించి..
కుమార్ బయటికి వెళ్లబోతుండగా..
"పోలీస్ స్టేషన్ కా. " అడిగాడు ఒకడు.
"లేదు. ఐనా ఎందుకు. వెళ్ల వలసిన పని లేదు. " చాలా మామూలుగా చెప్పాడు కుమార్.
"కుట్టుకు వాళ్లు డ్రస్ లు ఇస్తారనుకున్నాం. " మరొకడు అన్నాడు.
"అబ్బే. అదేం లేదు. " చెప్పాడు కుమార్.
ఆ వెంబడే..
"పనులు చూసుకోండి. " చెప్పాడు.
సైకిల్ తీసుకొని కదిలాడు.
తిన్నగా రెల్వే స్టేషన్ కు వెళ్లాడు.
ప్లాట్ఫామ్ చివరికి పోయి నిల్చున్నాడు.
అటు ఎవరూ లేరు.
జేబు నుండి ఫోన్ తీసుకొని.. పార్వతికి ఫోన్ చేసాడు.
అటు పార్వతి ఫోన్ కాల్ కి కనెక్ట్ కాగానే..
"ఏంటే నీ దిమాకు. ఎన్ని మార్లు రమ్మన్నా ఏదో సాకు చెప్పుతావ్. ఈ మారు ఏం చెప్పకు. నీ మేనత్త రాకపోయినా నువ్వు వచ్చేయ్. " గబగబ మాట్లాడేసాడు కుమార్.
పార్వతి ఏదో చెప్పబోయింది.
"ఛుఫ్. ఇక కుదరదు. " విసురుగా అనేసాడు.
ఆ వెంబడే..
"నాకు దెబ్బ తగిలింది.. " చెప్పబోతున్న కుమార్ కి అడ్డై..
"దెబ్బా. ఏమైంది. హాస్పిటల్ లో చేరారా. " పార్వతి అడుగుతోంది అతి మామూలుగా.
"హే. ఆపు నీ లొల్లి. ఏం. హాస్పిటల్ అంటున్నావ్. నేను చావాలి అనుకుంటున్నావా. " పెడసరంగా అనేసాడు కుమార్.
పార్వతి ఏమీ అనలేదు.
"ఆ దెబ్బ వంటికి కాదు. నాకు మట్టుకు సంబంధించింది. నేనేం చచ్చిపోయంత పిరికోడ్ని కానులే. " చెప్పాడు కుమార్.
ఆ వెంబడే..
"నా గుండె ఇప్పుడు వెలితిగా ఉంది. నువ్వు వచ్చి తీరాలి. " చెప్పాడు.
వెంటనే ఫోన్ పెట్టేసాడు.
పార్వతి బిగుసుకుపోయింది.
***
ఎంతో సేపటి తర్వాత..
తనంతట తానే తేరుకోగలిగిన పిమ్మట..
ముంతడు నీళ్లు తాగేక..
గిరిజకి ఫోన్ చేస్తోంది పార్వతి.
లంచ్ కి వంట చేస్తున్న గిరిజ..
కాల్ కి కనెక్ట్ ఐ.. "హలో పార్వతి గారు. " అంది.
"గిరిజ గారూ.. అతడు.. అదే.. నా భర్త.. ఫోన్ చేసాడు. ఈ సారి బాగా వాగాడు. నన్ను వచ్చేయమని పోరెట్టాడు. " చెప్పింది పార్వతి.
గిరిజ తెములుకోక పోతుండగా..
"ఏమి చేయను. " అడిగేసింది పార్వతి.
"మీ మేనత్త రాలేదని చెప్పలేక పోయారా. " అనేయ గలిగింది గిరిజ.
"అదీ చెప్పాను. ఈ మారు వినుకోవడం లేదు. " అటు పార్వతి గందికవుతోంది.
స్విచ్ వేస్తే లైటు వెలిగినట్టు..
"ఒక పని చేయ్. " అంది గిరిజ.
"ఏమిటి. " వెంటనే అడిగింది పార్వతి.
"అతనినే వచ్చి తీసుకు వెళ్లమని గట్టిగానే చెప్పు. " చెప్పింది గిరిజ.
అంతే గట్టిగా.. "అతడు రాడుగా. " అంది పార్వతి.
"మనకు కావలసింది అదే. " చెప్పింది గిరిజ.
"అలా చేయనా. " అడిగింది పార్వతి.
"ఆఁ. అంతే. " అనేసింది గిరిజ.
"ఐతే.. ఇప్పుడే చేసి చెప్పనా. " అడిగింది పార్వతి.
"చేసి చెప్పేయండి. చూద్దాం. ఏమి చేస్తాడో. " గడుసుగా అంది గిరిజ.
పార్వతే ఆ కాల్ కట్ చేసేసింది.
***
కుమార్ కి ఫోన్ చేస్తోంది పార్వతి.
అతడు షాపులో ఉన్నాడు.
షర్ట్ కు క్లాత్ కటింగ్ చేస్తున్నాడు.
వస్తున్న ఫోన్ కాల్ కి కనెక్టై.. తన స్టాఫ్ ని పరికిస్తూ..
"చెప్పు. బయలుదేరావా. " చాలా చాలా సౌమ్యంగా అడిగాడు కుమార్.
'ఓ. షాపులో ఇతడు ఉన్నట్టు ఉంది. ఛ. ఇతడు మారడు. అందరి మధ్య ఒకలా.. ఒంటరిగా వేరేలా. ' అనుకుంది పార్వతి.
"మీరు రండి. మీతో కలిసి వచ్చేస్తాను. " చెప్పింది.
కుమార్ తన స్టాఫ్ నే చూస్తున్నాడు.
"నాకు కుదరుదు. నువ్వే వచ్చేయవచ్చుగా. " అన్నాడు చాలా నింపాదిగా.
'అబ్బ.. రోజూ ఇలా సౌమ్యంగా ఉంటే ఎంత బాగున్ను. ' అనుకుంటుంది పార్వతి.
"నాకు బోలెడు పనులు ఉన్నాయి. వచ్చేయ్ డియర్. " చెప్పాడు కుమార్ బతిమలాటలా.
'అబ్బబ్బ.. ఏం నటిస్తున్నావ్. ' అనుకుంటుంది పార్వతి.
"మీరే వచ్చి నన్ను తీసుకు వెళ్ల వచ్చు. " సూటిగానే చెప్పగలిగింది.
"సర్లే. నీ వీలు బట్టే వచ్చేయ్. " అనేసి..
"మరి ఉంటాను. బై. జాగ్రత్త. " అనేసాడు కుమార్.
పార్వతి కాల్ కట్ చేసేసింది.
కుమార్.. తన స్టాఫుని చూస్తూ..
"మేడమ్. ఏవో పనులట. పాపం తన అమ్మగారికి బాగోలేదు. రాలేక పోతోంది. చాలా నొచ్చుకుంటుంది. " కోరి చెప్పాడు.
ఆ వెంబడే..
చిన్నగా నవ్వేసి.. పనిలోకి తిరిగి వెళ్లాడు కుమార్.
లోలోపల మాత్రం కుతకుతలాడుతున్నాడు.
***
పార్వతి వెంటనే గిరిజకి ఫోన్ చేసింది.
విషయం చెప్పింది.
"అతను రమ్మన్న ప్రతి మారు.. మీరు ఇకపై ఇదే మాదిరి సమాధానం ఇస్తూ కాలయాపన చేస్తుండండి. ఈ లోగ మేము చేసేది చేస్తాం. " చెప్పింది గిరిజ.
పార్వతి 'సరే' అంది.
"మీరు మాత్రం హైరానా పడొద్దు. అన్నీ సవ్యమవుతాయి. " చెప్పింది గిరిజ.
ఆ తర్వాత.. ఆ ఫోన్ కాల్ కట్ చేసేసింది.
***
లంచ్ కి వచ్చిన..
శేషగిరితో ఈ విషయాల్ని చెప్పింది.
ఆ వెంబడే..
"మనం తొందర పడాలి. " అంది.
"అనుకున్నాంగా.. వస్తున్న శనివారం సెలవు పెడితే.. ఆదివారం కలిసి వస్తోంది.. కనుక కుమార్ వద్దకు వెళ్లాలని. " గుర్తు చేస్తున్నట్టు చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"పార్వతి నుండి కుమార్ షాపు, ఇంటి అడ్రస్ లతో పాటు.. కుమార్ ఫోన్ నెంబర్ ఆల్రడీ తీసుకొని ఉన్నాంగా. " చెప్పాడు.
"అవునవును. అన్నట్టు పార్వతి నెంబర్ ని.. పార్వతి పేరున.. మీ ఫోన్ లో ఫీడ్ చేసాను. అవసరం బట్టి మీరు తనతో డైరక్ట్ గా మాట్లాడొచ్చు. " చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"ఆఁ. డాడీ కూడా మీతో చెప్పారుగా.. డ్రయివర్ సుందరంతో కారు ఇస్తానని. సుందరంని మీతో ఉండనీయండి. " చెప్పింది గిరిజ.
శేషగిరి 'సరే' అన్నట్టు తలాడించాడు.
"రండి.. పాప భోజనమయ్యింది. మనం లంచ్ చేద్దాం. రిప్రెషయ్యి వచ్చేయండి. " గిరిజ వడ్డనకై డైనింగ్ టేబుల్ వైపు కదిలింది.
శేషగిరి టవల్ తీసుకొని.. బాత్రూం వైపు నడిచాడు.
***
శనివారం..
ఉదయం.. తొమ్మిది దాటుతోంది..
కుమార్ ని కలవడానికి శేషగిరి బయలుదేరాడు.
సుందరం కారు డ్రైవ్ చేస్తు్న్నాడు.
ఫ్రంట్ సీట్ న శేషగిరి ఉన్నాడు.
కారు నిదానంగా ముందుకు పోతోంది.
"అల్లుడు సార్.. చూసుకున్న వేళా విశేషం.. మిమ్మల్ని చూడగానే.. మా సార్ కి మీరు నచ్చేసారు." అన్నాడు సుందరం.
శేషగిరి చిన్నగా నవ్వేడు.
"మీకు గుర్తుందా. మా సార్ మీ ఆఫీస్ కు వచ్చి.. ఓ సర్టిఫికేట్ కోసం మీ సీటుకు వచ్చారు. మీరు లేచి రిసీవ్ చేసుకున్న విధం.. మా సార్ పని చేసి పెట్టే విధం.. తెగ బాగుంది. ఏదైనా మీరు మంచోళ్లండి బాబూ. " చెప్పాడు సుందరం.
చిన్నగా నవ్వేస్తూ.. "ఆ రోజు మీరూ ఉన్నారా అక్కడ. " అడిగాడు శేషగిరి.
"అయ్యో.. ఎన్ని మార్లు కోరేది అల్లుడు సార్. మీరు నన్ను మీరు అనొద్దని. అలా అనకండి. ఆఁ. " ఇబ్బంది పడ్డాడు సుందరం.
"సరేలే. అలవాటు చేసుకుంటాను. " చెప్పాడు శేషగిరి.. సుందరంనే చూస్తూ.
"ఆ రోజు సార్ వెనుక ఫైల్ పట్టుకు వచ్చింది నేనే. " చెప్పాడు సుందరం.
"అవునా. అబ్జర్వ్ చేయ లేదు. " మెల్లిగా చెప్పాడు శేషగిరి.
"ఆ రోజు ఇంటికి వెళ్లేక.. పెద్దమ్మగారితో.. గిరిజమ్మతో మీ కబుర్లే ఆడారు మా సార్. " చెప్పాడు సుందరం.
ఆ వెంబడే..
"మీకు తెలిసి ఉండక పోవచ్చు.. మీ వివరాలు సేకరించమని మా సార్ పురమాయించింది నన్నే." గొప్పైపోతున్నాడు.
"అలానా. " అనేసాడు శేషగిరి.
"ఆయ్. మీ ఆఫీసులోనే కాక.. మీ ఊరి వచ్చి కూడా మీకై తెలుసు కున్నాను. " చెప్పాడు సుందరం.
"అవునా. మా ఊరు మీ.. నీకు ఎలా తెలుసు. " శేషగిరి విస్మయమయ్యాడు.
"మీ ఆఫీసు వాళ్లు ద్వారా మీ ఊరు తెలుసు కున్నాను. " సుందరం నవ్వుతాడు.
"భలే వాడివోయ్. నాకై డిటెక్టివ్ అవతారం ఎత్తేసావా. " శేషగిరి కూడా నవ్వుతాడు.
"ఆయ్. మరి మా సార్ ఉప్పు తింటున్నాను కదండీ. " నసిగాడు సుందరం.
ఆ వెంబడే..
"గిరిజమ్మ ఇంటర్మీడియట్ లో ఉండగా నేను సార్ కారుకు డ్రయివర్ గా చేరాను. గిరిజమ్మని నేనే ఎక్కువ మార్లు కారులో తిప్పేను. తను చాలా మంచిది. తనకు కనికరం జాస్తీ. " చెప్పాడు సుందరం.
"నిజమే.. అనతిలోనే అట్టివి నాకు గిరిజ నుండి ఎరికయ్యాయి. " చక్కగా చెప్పాడు శేషగిరి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments