#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Premikudu (He's an ex) - Part 22' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 07/10/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 22' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.
పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి.
డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్ కు గట్టిగా చెబుతాడు.
ఇక ప్రేమికుడు పార్ట్ 22 చదవండి.
హోటల్ కెళ్తున్న దారిలో..
"అల్లుడు సార్.. మీది ఏం ఫైరండీ బాబూ.. ఏం చెప్పారు. కుమార్ దిమ్మ తిరిగాడు." అన్నాడు సుందరం.
"నేను సరిగ్గానే మాట్లాడే కదా." అడిగాడు శేషగిరి.
"ఓ రేంజిలో మాట్లాడేరు. బ్రహ్మాండంగా తేల్చేసారు." చెప్పాడు సుందరం.
ఆ వెంబడే..
"మా గిరిజమ్మ అదృష్టవంతురాలు." అన్నాడు.
శేషగిరి చక్కగా నవ్వుకున్నాడు.
"వచ్చిన పని ఐపోయింది. తిరిగి వెళ్లిపోదాం." చెప్పాడు.
అర నిముషం తర్వాత..
"అల్లుడు సార్.. రాత్రి ప్రయాణం ఎందుకు. ఎలానూ రూం తీసుకున్నారు. రేపు ఉదయం ప్రయాణమైతే బాగు." చెప్పాడు సుందరం.
ఆ వెంబడే..
"ఎలానూ రెండు రోజుల ప్రొగ్రాం కదా ఇది." చెప్పాడు.
"నిజమే. కానీ ఈ విషయాలు గిరిజ వాళ్లతో పంచుకోవాలి." శేషగిరి ఆత్రంలో ఉన్నాడు.
"ఫోన్ ఉంది కదా అల్లుడు సార్." సుందరం తేలిక పరుస్తున్నాడు.
శేషగిరి ఏమీ అనలేదు.
హోటల్ చేరే వరకు వాళ్లిద్దరి మధ్య మాటలు ఆడలేదు.
హోటల్ ముందు కారు ఆపుతూ..
"మీరు రూంకి వెళ్లండి అల్లుడు సార్. నేను కారు పార్కింగ్ కి వెళ్లి వస్తాను." చెప్పాడు సుందరం.
శేషగిరి.. సుందరంతో..
"రిసెప్షన్ లో తాళం తీసుకొని రూం కెళ్లు. నేను హోటల్ లాన్ లో కూర్చొని వస్తాను. చెట్లు ఉన్నాయిగా. నేచురల్ గాలి ఉంటుంది. ఫోన్ మాట్లాడి రాగలను." చెప్పాడు.
కారు దిగాడు.
***
ఇంటి నుండి షాపుకు వచ్చాడు కుమార్.
తన స్టాఫ్ పనులు చేసుకుంటున్నారు.
కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్న కుమార్ ని చూస్తూ..
"అన్నా.. ఎవరు వాళ్లు." అడిగాడు ఒకడు.
కుమార్ ఏమీ చెప్పలేదు. చిన్నగా తలాడించాడు.
ప్రశ్నించడానికి ఆ ఒకడు తిరిగి యత్నించ లేదు. తన పనిని కొనసాగిస్తాడు.
కొద్ది సమయం తర్వాత..
"నేను త్వరలో మరో ఊరు షిప్ట్ కావాలి. ఈ షాపు పూర్తిగా మూసేస్తాను. మీరు వేరే చోట్ల పనులు చూసుకోండి." చెప్పాడు కుమార్.. తన స్టాఫ్ ని చూస్తూ.
వాళ్లు మొహాలు చూసుకుంటారు. కానీ ఏమీ అడగలేక పోయారు.
"మీకు ఎప్పటి జీతాలు అప్పటికి చెల్లించేసి ఉన్నాను. ఈ నెలది పూర్తిగా ఎవరిది వారికి చెల్లిస్తాను.. మధ్యలో మూసేస్తున్నప్పటికి." కుమారే చెప్పాడు.
తిరిగి వాళ్లు ఏమీ అనలేక పోయారు.
***
సుందరం రూంలో ఉన్నాడు.
ఏసీ వేసుకొని సోఫాలో నడుము వాల్చి.. స్వేద తీరుతున్నాడు.
కళ్లు మూసుకొని కునుకుకు ప్రయత్నిస్తున్నాడు.
దీనికి ముందు..
ఇంటికి ఫోన్ చేసి.. భార్యతో మాట్లాడేడు..
రేపు ఉదయం ఇక్కడి నుండి బయలుదేరుతున్నట్టు.. చెప్పి..
"జాగ్రత్తగా ఉండండి." చెప్పాడు కూడా.
***
శేషగిరి.. ఓ మూలగా.. ఓ చెట్టు నీడన.. కర్ర బెంచీ మీద కూర్చొని ఉన్నాడు.
గిరిజతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
"వెల్.. సాధించారు." గిరిజ గొప్పవుతోంది.
ఆ వెంబడే..
"పార్వతికి సరైన చేయూతిచ్చారు." చెప్పింది.
"అంతా నీ డైరక్షన్. నువ్వు లేందే నేనింత చేయలేను." గిరిజను శేషగిరి మళ్లీ మెచ్చుకుంటాడు.
"లేదు. తలంపు మీది. నాది ఒట్టి మాట సాయమే." చెప్పింది గిరిజ.
"యు ఆర్ మై లక్కీ చాంప్." తమకంగా చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"రిజా.. ఐ లవ్ యు." చెప్పాడు.
అటు గిరిజ హాయిగా నవ్వుతూ..
"థాంక్యూ డియర్." అంది పొందికగా.
అ పిమ్మట.. చిన్నపాటి పాజ్ పిమ్మట..
"అన్నట్టు.. పార్వతికి ఫోన్ చేసారా." అడిగింది గిరిజ.
"లేదు.. ఇంకా లేదు." చెప్పాడు శేషగిరి.
"అలానా. ఐతే.. ఇక్కడికి రండి. తనతో మనిద్దరం మాట్లాడొచ్చు." చెప్పింది గిరిజ.
"సరయ్యితే." అనేసాడు శేషగిరి.
ఆ వెంబడే..
"రిజా.. నాకు ఇప్పటికీ చిత్రంగా ఉంది. కుమార్ చాలా త్వరగా సరౌండవ్వడం. పైగా ఎట్టి రిఫ్లెక్షన్స్ లేకుండా." చెప్పాడు.
"మరే. మీరు చెప్పింది విన్నాను కనుక చెప్తున్నాను.. ఇది మీ క్రెడిటే. మీరు భళేగా అతడ్ని లాక్ చేసారు. మరి అతడికి ఏం పాలుపోతోంది." అంది. అటు గిరిజ చిన్నగా నవ్వుతోంది.
ఆ వెంబడే..
"మీరు చెప్పినవి మమ్మీ.. డాడీలతో షేర్ చేసుకుంటాను. మీ తెగువకు వాళ్లు చాలా మురిసిపోతారు." చెప్పింది. తను మురిసిపోతూనే ఉంది.
"పాప ఏం చేస్తోంది." శేషగిరి అడుగుతున్నాడు.
గిరిజ చిన్నగా తెమిలి..
"మమ్మీతో ఆడుకుంటుంది." చెప్పింది.
"సరే.. ఉండనా మరి. రేపు ముఖాముఖీ మాట్లాడుకుందాం." చెప్పాడు శేషగిరి.
"అన్నట్టు.. హోటల్ రూం ఎలా ఉంటుంది. మీతో పాటు సుందరంని ఉంచగలరా. లేకపోతే.. అతడికి మరో రూం తీసి ఇవ్వండి." చెప్పింది గిరిజ.
"వద్దొద్దు. రూం పెద్దదే. ఇద్దరం ఉండగలం." చెప్పాడు శేషగిరి.
"గుడ్నైట్ డియర్." అంది గిరిజ పొందికగా.
"గుడ్నైట్ మై రిజా." చెప్పాడు శేషగిరి సొంపుగా.
వాళ్ల ఫోన్ కాల్ సంభాషణ ఆగింది.
***
రూం డోర్ బెల్ తో తెములుకొని.. వెళ్లి తలుపు తీసాడు సుందరం.
రూంలోకి వచ్చి.. రిప్రైషై..
మంచం అంచున కూర్చున్నాడు శేషగిరి.
"నిల్చునే ఉన్నావేం. కూర్చో సుందరం." చెప్పాడు.. సోఫా కుర్చీ చూపుతూ.
సుందరం అందులో కూర్చున్నాడు.
"మా గిరిజమ్మ తెగ ఆనందపడి ఉంటోంది.. కదూ అల్లుడు సార్." నవ్వుతూ అన్నాడు.
"అవును సుందరం." శేషగిరి నిండుగా చెప్పాడు.
అర నిముషం తర్వాత..
"ఆ పార్వతి ఎవరో.. మీ క్కావలసిన ఆవిడా అల్లుడు సారూ." అడిగాడు సుందరం.
"పార్వతి ఆవిడ కాదు సుందరం." టక్కున సవరణలా చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"తను నాకంటే చిన్నదే." చెప్పాడు.
"అలానా." అనేసి.. ఊరుకున్నాడు సుందరం.
సుందరంతో పార్వతి గురించి మరింత డిటైల్డ్ గా మాట్లాడ రాదనుకున్నాడు శేషగిరి.
అందుకే మాట మార్చేలా..
"సుందరం.. కుమార్ మాత్రం మారు మాట్లాడక పోవడం ఏమిటంటావ్." అడిగాడు.
ఆ వెంబడే..
"నా గట్టి మాటలే కారణం కదూ." అన్నాడు.
"ముమ్మాటికి కావచ్చు. కానీ అల్లుడు సార్.." ఆగాడు సుందరం.
శేషగిరి.. సుందరంని చూసాడు.
'ఏం చెప్తాడో.' అనుకున్నాడు.
"అతడి వాలకం.. తేలు కుట్టిన దొంగ లా అనిపించింది. అతడిది తప్పు ఉంది. అది నిజం. కానీ.. కనీసమైనా సెల్ఫ్ డిపెన్స్ తను చేపట్టక పోవడం ఆలోచించాలనిపిస్తోంది అల్లుడు సారూ." అనేసాడు సుందరం.
శేషగిరి జర్కయ్యాడు. సుందరంనే చూస్తున్నాడు.
"అప్పటికి మన నుండి ఎస్కేప్ కావడానికి అతడు మీ దానికి తందాన తానా పాడేడా.. ఏమో." నసుగుతాడు సుందరం.
"ఏమిటి సుందరం నీ ట్విస్ట్." శేషగిరి నీరుకారుతాడు.
"తప్పు ఉన్నోడు మరీ అంత వేగిరంగా బుద్ధిమంతుడయ్యి పోతాడా." లాజిక్ లా అన్నాడు సుందరం.
ఆ వెంబడే..
"మనం మనుషులం. నమ్మకాలన్నవి అంత ఈజీగా ఏర్పర్చుకో రాదు. తర్కించుకోవాలి." చెప్పాడు.
శేషగిరి మెల్లిగా జావకారిపోతున్నాడు.
"అల్లుడు సారూ.. మీరు ఇదైపోకండి. అనుకోవాలి అనే చెప్పాను. అతడు నిజంగా మారితే సంతోషమేగా." చెప్పాడు సుందరం.
ఆ వెంబడే..
"ఐనా.. ఈ కుమార్ దగ్గరికి ఆ పార్వతిని పంపడం లేదుగా. ఆ పార్వతి దగ్గరికే ఈ కుమార్ ని రమ్మన్నారుగా. దానికి అతడు ఒప్పుకున్నాడు. మన ఇంటకి వస్తుండగా.. కుమార్ ఇకపై ఏం ఆడగలడు. అతడు గుప్పెట్లోనే ఉంటాడు. పాతవి చేస్తే నలిగి పోతాడు." చెప్పాడు.
"అంతే అంటావా." అడిగాడు శేషగిరి.
"అంతేగా అల్లుడు సారూ. రకరకాలుగా అనుకుంటున్నామే తప్పా. అతడిని మీరు బాగా లాక్ చేసేసారు." చెప్పాడు సుందరం.
శేషగిరి జీర నవ్వు నవ్వేసాడు.
"అల్లుడు సార్.. ఆ పార్వతికి చెప్పేరా." అడుగుతున్నాడు సుందరం.
ఆ వెంబడే..
"ఆవిడ.. ఆమె.. తెగ ఆనందపడుతుంది." చెప్పాడు.
సుందరంని విచిత్రంగా చూస్తూ.. 'వీడేమిటి. తికమక మనిషిలా ఉన్నాడు.' అనుకున్నాడు శేషగిరి.
'వీడితో ఎందుకులే.' కూడా అనుకున్నాడు.
తమ మధ్య మాటలు ఆపాలని..
"లే. డిన్నర్ కి వెళ్లి.. వచ్చి పడుకుందాం. కాస్త బడలికగా ఉంది." లేచాడు శేషగిరి.
సుందరం లేచాడు.
"ఈ రోజు శనివారం. నాది టిఫిన్." చెప్పాడు.
"నాదీ డిటో." కదిలి రూం బయటికి వచ్చేసాడు శేషగిరి.
రూం తాళం పెట్టి.. శేషగిరి వెంట నడిచాడు సుందరం.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Yorumlar