top of page

ప్రేమికుడు - పార్ట్ 3


He's an ex

'Premikudu (He's an ex) - Part 3' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 05/07/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 3' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.


గతంలో ఇరువైపులా పెద్దలూ అంగీకరించక పోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరి గిరిజతో వివాహాలు జరుగుతాయి.


శేషగిరి, ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు.



ఇక ప్రేమికుడు పార్ట్ 3 చదవండి.


"ఆకలవుతోంది. అన్నం వడ్డించు." అనసూయతో చెప్పాడు.


 ఆమె లేచింది.


 "మళ్లీ నీ పాత వాలకం అగుపిస్తోంది. భయమేస్తోంది బిడ్డా." అప్పలస్వామి చెప్పేసాడు.

 శేషగిరి ఏమీ అనలేదు. కానీ అతడు ఎంతో అవస్త పడుతున్నాడు.


 అనసూయ అన్నం పెట్టింది.

 శేషగిరి తింటున్నాడు.


 శేషగిరే కదపాలన్నట్టు..

 "మీ లక్ష్ముం మామే చెప్పాడు. తన అమ్మ వైద్యం కోసరం పార్వతి.. పురం వెళ్లినట్టు." చెప్పాడు. 


 అప్పలస్వామిని చూస్తున్నాడు.


 "అంటే.. దానింటికి వెళ్లావా." అనసూయ టక్కున కలగ చేసుకుంది.


 "ఆఁ." అనేసాడు శేషగిరి.


 ఆ వెంబడే..

 "నాకే తప్పుడాలోచన లేదు. గతంలో పరిచయం.. పైగా.. ఇన్నాళ్లు ఆమె వివరాలు నాకు తెలియవు. కలిసి మాట్లాడాలి అనుకున్నాను." చెప్పాడు.


 అనసూయ ఏమీ అనలేదు.

 అప్పలస్వామి మాత్రం ఆగి..

 "దాని బోగాట్లు చెప్పుకో తగ్గవి ఏముంటాయి. ఏమున్నా మనకు ఎందుకు. ముఖ్యంగా నీకు ఎందుకు." గబగబా అన్నాడు.


 శేషగిరి మాట్లాడ లేక పోయాడు. అలాగని తిండాప లేక పోయాడు.

 తింటూనే ఉన్నాడు.

 వాళ్ల మధ్య మాటలు లేవు.


 శేషగిరి తిండి ముగించి లేస్తుండగా..

 "కొద్దిగా అన్నం వడ్డిస్తాను. పెరుగు వేసుకో." అనసూయ అంటుంది.


 "ఆఁ. గడ్డ పెరుగు. నీకు ఇష్టమేగా. తిను." అప్పలస్వామి కలగచేసుకున్నాడు.


 "అవునవును. నా ఇష్టాఇష్టాలు మహా తీర్చి పెట్టారు." లేచిపోయాడు శేషగిరి.


 పెరటి లోకి పోయి.. చేయి, నోరు కడుక్కొని.. వచ్చాడు.

 అనసూయ తుండుగుడ్డ అందించింది.

 తుండుగుడ్డ పనిని కానిచ్చేసి.. దానిని మంచం మీద పడేసాడు శేషగిరి.


 "అలా వెళ్లి వస్తాను." చెప్పాడు.


 "ఇంకెక్కడకి." అప్పలస్వామి అడిగాడు.


 "ఊరు కొత్తా. నాకూ తెలిసిన వాళ్లు ఉంటారు. కబుర్లాడి వస్తాను." చెప్పాడు శేషగిరి.


 "ఏ కబురులు. దాని బోగాట్లకా. దాని నుండి పడిన నామోసిలు చాలు చాలు." అప్పలస్వామి హైరానా అవుతున్నాడు.


 తగ్గడానికి శేషగిరికి ఇష్టం లేదు.

 "చాల్లెండి. పార్వతి మూలంగా ఏ నామోషిలు పడలేదు. మీ పెద్దలు యాగీలు మూలంగానే రచ్చ రచ్చ ఐంది. ఛ. నన్ను మాట్లాడనిచ్చారా. ఛఛ." విసుక్కున్నాడు.


 "నాన్న చెప్పేది వినుకోరా. కూర్చొని ఈడనే మాట్లాడుకో." అనసూయ చెప్పింది.


 ఆ వెంబడే.. అప్పలస్వామితో..

 "బిడ్డని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు. ఎప్పుడుదో తవ్వడం ఎందుకు. బిడ్డని కూర్చొపెట్టుకొని మాట్లాడుకోవచ్చుగా. వాడంటున్నాడుగా.. వాడిలో ఏ తప్పుడు ఆలోచన లేదని. వినుకో." అనసూయ కూలవుతోంది.. ఎందుకో.


 "సర్లేవే. దాని కబురులేగా వీడికి కావాలి. మనకి తెలిసినవి చెప్దాం. కూర్చో బిడ్డా." అప్పలస్వామి తగ్గాడు.


 శేషగిరి కాస్తా స్తిమిత పడగలుగుతున్నాడు.

 మంచం మీద కూర్చున్నాడు.


 "లేగు. మనమూ అన్నం తిందాం. తింటూ బిడ్డతో మాట్లాడకో వచ్చు." అనసూయ చెప్పింది.


 అప్పలస్వామి లేచాడు.

 అనసూయ వడ్డన చేసింది.

 ఆ ఇద్దరూ భోంచేస్తున్నారు.

 అప్పలస్వామి.. కొడుకుతో చెప్పుతున్నాడు..


  "మొగుడు, పెళ్లాలకు పడడం లేదట. ఇద్దరూ విడిపోవచ్చు." 


 శేషగిరి తృళ్లి పడ్డాడు.

 తమాయించుకుంటూ..

 "ఏంటి నాన్నా. నువ్వు పార్వతి గురించేనా చెప్పేది." అడగ్గలిగాడు.


 "ఆఁ. దాని గురించే. చాన్నాళ్లుగా దీనత్తోరింట గొడవలవుతున్నాయి. దీని అబ్బ ఉన్నప్పుడు దీని ఆటలు సాగాయి. మరి.. వాడి నోరు అంతడిది. ఆడు పోయాక.. దీని పప్పులు ఉడక లేదు. అప్పుడప్పుడు తగువులాడి వచ్చేది.. సర్దితే తిరిగి పోయేది. 


ఇప్పుడు ఏకంగా వచ్చేసినట్టే ఉంది. చాన్నాల్లుగా ఇక్కడే ఉంటుంది. ఏదో జబ్బు చేసి దీని తల్లి కాలు లాగేసింది. అది నడవ లేదు. దీని అబ్బ ఉన్నప్పుడే దీనింటి మెరుపులు. చుట్టాలు కూడా ఇప్పుడు చేరేది లేదు. చేరతీసేది లేదు." అప్పలస్వామి చెప్పాడు.


 శేషగిరి మాట్లాడలేక పోతున్నాడు.

 బిత్తరయ్యి ఉండిపోయాడు.

 అనసూయ.. అప్పలస్వామి భోజనాలు చేసి లేచారు.

 అనసూయ చక్కపెట్టుకుంటుంది.


 అప్పలస్వామి.. కొడుకు ఎదురుగా బల్ల మీద కూర్చున్నాడు.

 శేషగిరికి తన తల్లిదండ్రుల కదలికలు తెలుస్తున్నాయి. కానీ పరధ్యానంలోనే ఉన్నాడు.


 "నడుము వాల్చు." అనసూయ.. కొడుకు దగ్గరకు వచ్చింది. చెప్పింది.


 ఆ వెంబడే..

 "చేసుకున్నోళ్లకు చేసుకున్నంతే. నా బిడ్డను ఆడిపోసుకున్నారు. తిప్పలు పడుతున్నారు." అంది. 


 నేల మీద చతికిల పడింది.

 శేషగిరి కెలికేయ పడ్డాడు.

 కుదరవ్వలేక పోతున్నాడు. 

 ఇంచు మించుగా అనాలోచనగానే లేచి నిల్చున్నాడు.

 చేతి వాచీ వంక చూసుకుంటూ..

 "బస్సు వచ్చే టైం. నేను ఇంటికి వెళ్లిపోతాను." చెప్పాడు.


 "అదేంట్రా." అనసూయ అంది.


 అప్పలస్వామి ఏమీ అనడం లేదు.

 అలాగే ఆ ఇద్దరూ శేషగిరిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.


 శేషగిరి తెచ్చుకున్న బేగ్ తీసుకొని..

 "మీరు జాగ్రత్త. అమ్మా.. డాక్టర్ చెప్పినట్టు తింటుండు. ఆ బలం మందులు అయ్యే వరకు వాడు. వస్తా." అతడు అక్కడి నుండి భారంగానే కదిలాడు.

***

 శేషగిరి.. గిరిజ మంచం మీద పడుకొని ఉన్నారు. వాళ్ల మధ్య రాగిణి పడుకుంది.


 రాగిణి నిద్ర పోతున్నట్టు గుర్తించాక..

 ఒత్తిగిల్లి.. శేషగిరి తన కుడి చేతి నాలుగు వేళ్లతో మెత్తగా గిరిజ ఎడమ భుజం చేతిని తట్టాడు.


 గిరిజ వెల్లికిలు పడుకొనుంది. కళ్లు మూసుకొని ఉంది.

 శేషగిరి చేష్టకి.. గిరిజ కళ్లు తెరిచింది. తల తిప్పి.. అతడిని చూస్తోంది.


 "రా." శేషగిరి సున్నితంగా పిలిచాడు.


 "ప్రయాణం చేసి వచ్చారు. నాకా ఓపిక లేదిప్పుడు. ఈ రోజుకు వద్దు." చెప్పింది గిరిజ.


 రాగిణి నిద్ర పోయేక.. శేషగిరి.. గిరిజ హాలులోకి వెళ్తుంటారు. సోఫా కమ్ బెడ్ న తమ శారీరక అలజడులని చల్లార్చుకుంటుంటారు.. అప్పుడప్పుడు.


 "ఇప్పుడు దానికై కాదు." మెల్లిగా చెప్పాడు శేషగిరి.


 "మరి." గిరిజ వింతవుతోంది.


 శేషగిరి నెమ్మదిగా మంచం దిగాడు.

 "నీతో మాట్లాడాలి." చెప్పాడు.


 గిరిజ లేచింది. మంచం దిగింది. 

 తలగడని తిప్పి రాగిణి కదలికలకు అడ్డుగా పెట్టింది.

 శేషగిరి కూడా తన తలగడని అలానే సర్దాడు.

 వాళ్లిద్దరూ ఎప్పుడూ చేసేదే ఇది.

 ఇద్దరు హాలులోకి వచ్చారు.


 హాలులో బ్లూ లైట్ వెలుగుతోంది. 

 సీలింగ్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు శేషగిరి. 

 ఎప్పటిలాగా సోఫాని బెడ్ గా విప్పక.. సోఫాలానే ఉంచి కూర్చున్నాడు.

 భర్త పక్కనే గిరిజ కూర్చుంది.


 "నీతో నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి. నీతో దానిపై చర్చించాలి." చెప్పాడు శేషగిరి.


 "ముందు విషయం చెప్పండి." గిరిజలో ఏ మార్పు రాలేదు.


 అర నిముషం తర్వాత..

 "నిజానికి నీ వద్ద దాపరికం కాదు. అనవసరమని చెప్ప లేదు. కానీ ఇప్పుడు నీకు అది చెప్పాలి.." చెప్పుతున్నాడు శేషగిరి.


 అడ్డై.. 

 "ఉపోద్ఘాతం ఆపి.. విషయంకి రండి." గిరిజ కలగచేసుకుంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










150 views0 comments

Comments


bottom of page