He's an ex
'Premikudu (He's an ex) - Part 7' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 25/07/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 7' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.
గతంలో ఇరువైపుల పెద్దలూ అంగీకరించక పోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి.
శేషగిరి, ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు. పార్వతి, తన భర్తతో కలిసి ఉండటం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు.
తన ఇంటికి వెళ్లిన శేషగిరి, భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ.
శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్నీ తెలుసుకొమ్మని చెబుతుంది గిరిజ తల్లి సరళ.
శేషగిరి ఇంటికి లక్ష్ముం ద్వారా తన ఫోన్ నంబర్ పంపిస్తుంది పార్వతి.
ఆ నంబర్ తండ్రి ద్వారా అందుకున్న శేషగిరి ఆ విషయం భార్యతో చెబుతాడు.
ఇక ప్రేమికుడు పార్ట్ 7 చదవండి.
సాయంకాలం..
ఇంటి ముందు కల్లాపు జల్లుతున్న పార్వతికి.. ఇంటిలోంచి వచ్చిన లక్ష్ముం అగుపించాడు.
"అయ్యా.. ఫోన్ నెంబర్ అందించావా." అడిగింది పార్వతి.
"ఇచ్చానమ్మీ." చెప్పాడు లక్ష్ముం.
ఆ వెంబడే..
"దొబ్బులు పడ్డాను." చెప్పాడు.
"ఏమయ్యిందయ్యా." పార్వతి బెంబేలు పడుతోంది.
"ఏముందమ్మీ.. ఇంకా గతాన్ని తవ్వుకుంటున్నారు." దిగులుగా చెప్పాడు లక్ష్ముం.
పార్వతి ఏమీ మాట్లాడలేక పోతోంది.
"నీ అయ్య పోయేక.. నీ మేనత్త వచ్చి మీ అమ్మ కింద ఉండేదిగా. నువ్వు వచ్చి దానిని పంపేసావు కానీ.. ఉంచుకోవలసిందమ్మీ. ఆవిడికి తిండి ఉండేది.. నీకు తోడయ్యేది." చొరవగా అన్నాడు లక్ష్ముం.
"నేనేమీ పంపేయలేదయ్యా. చుట్టపు చూపుకని పోయి తిరిగి వస్తానని తనే పోయింది. ఇంకా రాలేదు. ఫోన్ చేస్తూనే ఉన్ననయ్యా. ప్రతి మారు ఏదో ఒంట్లో నలతంటూ రాకుంటుంది." చెప్పింది గిరిజ.
"హు. మీ ఇంట ముప్పూటల తింటి కాదనుకొని.. ఆడ ఈడ దేవులాటలు ఆవిడికి ఎందుకో." అనేసాడు లక్ష్ముం.
గిరిజ ఏమీ అనలేదు.
"సర్లే అమ్మీ. పని చూసుకో." లక్ష్ముం అక్కడ నుండి కదిలిపోయాడు.
గిరిజ తన చేతిలోని పనిని తిరిగి చేపట్టింది.
***
రాత్రి..
రాగిణి గదిలో నిద్రపోతోంది.
శేషగిరి.. గిరిజ..
హాలులో సోఫాలో కూర్చొని ఉన్నారు.
గిరిజ ఫోన్ నుండి పార్వతితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు శేషగిరి.
ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉంది.
పలకరింపులు పిమ్మట..
శేషగిరి.. తన తల్లిదండ్రులు ద్వారా తను విన్నది చెప్పేక..
"నీ గురించి విన్నది నిజమేనా." అడిగేసాడు పార్వతిని.
వెంటనే చెప్పలేదు పార్వతి.
"నీకు ఇష్టం లేక పోతే చెప్పొద్దులే." చెప్పేసాడు శేషగిరి.
"లేదు శేషగిరి.. నీకు చెప్పక పోవడమేమిటి." అంది పార్వతి.
ఆ వెంబడే..
"కనిపించవేమో అన్న నీవు ఒక్కమారు ఆ రోజు కనిపించే సరికి నాకు పండగ మాదిరయ్యింది." చెప్పింది.
శేషగిరి ఏమీ అనలేదు.
గిరిజ ఓ శ్రోతలా ఉంది.
"నాన్న పోయక.. పెరాల్సిస్ తో అమ్మ కాలు లాగేసాక.. నేను చితికి పోయాను. నాకు కనీస ఓదార్పు కూడా కరువై పోయింది." పార్వతి మాటలు ముద్దైపోతున్నాయి.
అప్పుడే శేషగిరిని గిరిజ చూస్తోంది.
శేషగిరి నిదానంగానే అగుపించాడు.
తిరిగి పార్వతి ఏమీ చెప్పక పోవడంతో..
తనని తట్టి.. తనను మాట్లాడమని.. గిరిజ సైగలు చేస్తున్నా.. ఏం మాట్లాడాలో తెలియక అయోమయమవుతున్నాడు శేషగిరి.
ఇక తప్పదనుకుందో.. ఇంకేమనుకుందో.. కానీ.. గిరిజ.. శేషగిరి కుడి చేతిలోని తన ఫోన్ ను తీసుకుంది గిరిజ.
"హలో." అంది.
అటు పార్వతి.. గిరిజ గొంతుతో అలజడవుతోంది.
"హలో." తిరిగి అంది గిరిజ.
"ఎవరు." పార్వతి అడగగలుగుతోంది.
"నేను.. శేషగిరి గారి భార్యను. గిరిజను." గిరిజ చొరవ అవుతోంది.
శేషగిరి ఇంకా విస్మయంలోనే ఉండి పోయాడు. భార్యనే చూస్తున్నాడు.
"నా భర్త.. మీ గురించి అన్నీ నాకు చెప్పి ఉన్నారు. సో. ఆయనతో ఏం పంచుకో తలిచారో.. చెప్పండి. ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉంది. ఇద్దరం వినగలం." చెప్పేసింది గిరిజ.
అటు పార్వతి.. సందిగ్ధంలో పడి గిజగిజ లాడుతోంది.
దీర్ఘంగా గాలి పీల్చి.. దానిని మెల్లిగా విడిచి పెట్టి..
"మీ భర్త పేరేమిటి. ఆయన గురించి ముందు చెప్పండి." అడిగేసింది గిరిజ.
శేషగిరిలో మార్పు లేదు.
"చెప్పండి. మీ శేషగిరిగారి మాటలే నేను మీతో మాట్లాడుతున్నాను. సరేనా. చెప్పొచ్చు." సాఫీగా అనేసింది గిరిజ.
అటు పార్వతి కదిలింది.
"శేషగిరిగారి మీద నమ్మకం పెట్టుకొనే మీది చెప్పాలనుకుంటున్నారుగా. చెప్పండి. అవసరం మేరకు ఆయన మీకు సాయం చేస్తారు." చక్కగా చెప్పగలిగింది గిరిజ.
దాంతో పార్వతి మరింత స్తిమితమవ్వగలిగింది.
"ఆయన.. నా భర్త.. కుమార్.." చెప్పగలిగింది.
గిరిజ ఆగింది.
"ఆయన.. ఆయన గురించి చెప్పాలంటే.." సడన్ గా మాట్లాడలేక పోతోంది పార్వతి.
పార్వతి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు.. శేషగిరితో పాటు గిరిజకు కూడా తెలుస్తోంది.
శేషగిరి తల తిప్పి గిరిజని చూస్తాడు.
గిరిజ అప్పటికే శేషగిరిని చూస్తోంది.
గిరిజే తెములుకొని..
"పార్వతి గారూ.. పార్వతి గారూ.. ఏడుపు వద్దు. ప్లీజ్. తమాయించుకోండి. చెప్పాగా. సమస్య తెలిస్తేగా సాయం చేయగలిగేది." గిరిజ నిదానంగానే మాట్లాడ గలుగుతోంది.
అటు పార్వతి ఇంకా కుదురవ్వడం లేదు.
అప్పుడే..
"ఇదిగోండి.. ఇతను మాట్లాడతారు." శేషగిరికి ఫోన్ అందించి..
"ఇప్పుడు మీరు మాట్లాడాలి." చొరవగా చెప్పింది గిరిజ.
శేషగిరి ఇబ్బందిగానే ఫోన్ అందుకున్నాడు.
"పార్వతీ." అన్నాడు.
పార్వతి మాట్లాడకపోయే సరికి.. తను ఇంకా ఏడుస్తున్నట్టే తెలుస్తుంటే..
"పార్వతీ.. సరే.. మనం తర్వాత మాట్లాడదాం.. అధైర్య పడకు. నీకు నేను.. మా ఇద్దరం సపోర్ట్ అవుతాం. కూల్. కూల్." చెప్పగలిగాడు.
భర్త వాటం నచ్చింది గిరిజకి.
శేషగిరి నుండి ఫోన్ తీసుకొని..
"విన్నారుగా.. ప్రశాంతంగా పడుకోండి. మీరు కుదుట పడేక.. మీ వీలు బట్టి తిరిగి మనం మాట్లాడుకుందాం. ఒకరికి ఒకరం ఉన్నామనుకోండి. ఇప్పటికి నేనే ఈ కాల్ కట్ చేస్తున్నాను. గుడ్నైట్." గిరిజ ఆ కాల్ కట్ చేసింది.
ఫోన్ ని సోఫా మీద పడేసి..
"పార్వతి గట్టి స్ట్రగుల్ లో ఉన్నట్టుంది." పార్వతి మీద జాలవుతోంది గిరిజ.
"నాకూ అలానే తోస్తోంది." చెప్పాడు శేషగిరి.
"మన మాటలతో తను కూలవ్వుతోంది. మనం తనతో మాట్లాడదాం." లేచింది గిరిజ.
శేషగిరితో..
"పడుకుందాం. పదండి." అంది.
తన ఫోన్ తీసుకొని గది వైపు కదిలింది.
భార్యను అనుసరించాడు శేషగిరి.
***
మర్నాడు..
తన తల్లితో.. రాత్రి.. పార్వతి కబుర్లును ముచ్చటించింది గిరిజ.
"అంతగా తను బెంబేలవుతోందంటే ఏదో గట్టి దెబ్బే అత్తవారింట లేదా తన భర్త వలన తినుంటుంది." అభిప్రాయ పడింది సరళ.
"నాకూ అలానే అనిపిస్తోంది." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"పాపం.. తన ఆందోళనకు నేను జాలి పడుతున్నాను." చెప్పింది.
"నేచురల్ తల్లీ. పాజిటివ్ థింకింగ్.. అడర్స్టాండింగ్ ఎరిగిన దానివి. నీ సంగతి నాకు తెలుసుగా." కూతురుని మెచ్చుకుంటుంది సరళ.
ఆ వెంబడే..
"అల్లుడుగారి రియాక్షన్స్ ఏమిటి." అడిగింది.
"అబ్బే. మనం ఎరిగిందేగా. ఆయన మెత్తని వారు. నా మాటే తనది అన్నట్టు ప్రతి మారు చెప్పుతుంటారు." గొప్పగా చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"అలా అని.. ఎస్కేపింగ్ మనిషి మాత్రం కాదు." చెప్పింది.
"అంతంతే. మంచిగా పోతే.. మంచే ఎదురవుతోంది." అనేసి..
"సర్లే.. మీ డాడీ లంచ్ కి వస్తారు. వంట చేయాలి." అంది సరళ.
"నేను కూడా." చెప్పింది గిరిజ.
ఆ తల్లీకూతుర్ల ఫోన్ ల సంభాషణ ముగిసింది.
***
లంచ్ చేస్తూ..
"నాన్న ఫోన్ చేసాడు. వస్తున్న మంగళవారం ఊరిలో గ్రామ దేవత పండుగ చేస్తున్నారట. మనల్ని రమ్మన్నాడు." చెప్పాడు శేషగిరి.
"అవునా." అంది గిరిజ.
"మీ అమ్మ, నాన్నల్ని కూడా తీసుకు రమ్మన్నాడు." చెప్పాడు.
"నాన్నకి అవ్వదేమో. చెప్పి చూద్దాం." అనేసింది గిరిజ.
ఆ ఇద్దరి లంచ్.. రాగిణి బొమ్మలతో ఆట.. కొనసాగుతున్నాయి.
***
రాత్రి..
రాగిణి నిద్రపోయింది.
అప్పటికీ పార్వతి నుండి ఫోన్ కాల్ రాకపోయే సరికి..
గిరిజ చెప్పగా..
శేషగిరే.. పార్వతికి ఫోన్ చేసాడు.
అటు.. "హలో." అంది పార్వతి.
స్పీకర్ ఆన్ చేసి..
"ఎలా ఉన్నావు." అడిగాడు శేషగిరి.
"నీ భార్య పక్కన ఉందా." మెల్లిగా మాట్లాడుతోంది పార్వతి.
ఆ వెంబడే..
"తనుండగా.. నా కబుర్లు నీతో చెప్పడం నాకు కష్టమవుతోంది." చెప్పింది.
"అబ్బే. అలా అనుకోకు. తను మంచిది. తను మంచిగా యోచన చేయగలదు. తను మంచిగా మంచిని కోరుకునే మనిషి." నిలకడగా చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"నా భార్య నుండి నేనేమీ దాచ లేను. తనను మభ్య పర్చలేను. సో. నాతో మాట్లాడేలానే తనతో కూడా మాట్లాడ వచ్చు." చెప్పాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments