He's an ex
'Premikudu (He's an ex) - Part 8' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 30/07/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 8' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. తన ఇంటికి వెళ్లిన శేషగిరి, భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తెస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్నీ తెలుసుకొమ్మని చెబుతుంది గిరిజ తల్లి సరళ.
శేషగిరి ఇంటికి లక్ష్ముం ద్వారా తన ఫోన్ నంబర్ పంపిస్తుంది పార్వతి. ఆ నంబర్ తండ్రి ద్వారా అందుకున్న శేషగిరి ఆ విషయం భార్యతో చెబుతాడు. పార్వతితో శేషగిరి, గిరిజ మాట్లాడుతారు.
ఇక ప్రేమికుడు పార్ట్ 8 చదవండి.
సోఫాలో భర్త పక్కనే కూర్చున్న గిరిజ నిజంగా మెల్లిగా గర్వపడుతోంది.. భర్త మాటలు వింటూనే.
"అది సరే. వచ్చే మంగళవారం ఊర్లో గ్రామ దేవత పండుగ కదా. మేము వస్తున్నాం. మనం అప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు." చెప్పుతున్నాడు శేషగిరి.
అడ్డై..
అటు.. "ఇక్కడా.. ఊరిలోనా.. వీలవుతోందా." గాభరా పడుతోంది పార్వతి.
ఆ వెంబడే..
"మీ వాళ్లు ఏమనేస్తారో." అనేసింది.
"ఎవరూ ఏమన్నా ఎందుకులే. మా ఇద్దరం నీ ఇంటికే రాగలం. నిశ్చింతగా ఉండు." చెప్పేసాడు శేషగిరి.
అటు.. పార్వతి ఏమీ అనకపోయే సరికి..
"సరే ఉంటాను. మేము సోమవారం వస్తున్నాం. నిన్ను కలుస్తున్నాం." అన్నాడు శేషగిరి.
ఆ వెంబడే..
ఆ ఫోన్ కాల్ శేషగిరి వైపు నుండే కట్ కాబడింది.
గిరిజని చూస్తూ..
"మనం అనుకున్నట్టే చెప్పాను." చెప్పాడు శేషగిరి.
"అంతే." అనేసింది గిరిజ.
ఆ వెంబడే..
"మీరు మూడు రోజులు సెలవు పెట్టండి." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"డాడీకి ఫోన్ చేసి మీరు విషయం చెప్పారటగా." అడిగింది.
"అవును. తనది బిజీ షెడ్యూలట. పండగ నాటికైనా రాలేనన్నారు. మీ మమ్మీని తీసుకు వెళ్లమన్నారు." చెప్పాడు శేషగిరి.
"మమ్మీ చెప్పింది. మనల్ని ఈ సారికి వెళ్లమంది." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"నాన్న కారు ఇస్తామన్నారు. ఎంచక్కా మనమే వెళ్లి వద్దాం. అందుకే డ్రయివర్ కూడా వద్దన్నా. మీరే డ్రయివింగ్ చేయొచ్చు." సరదా పడుతూ అంది.
"సరే." అనేసాడు శేషగిరి.
"పడుకుందామా." లేచింది గిరిజ.
శేషగిరి లేవకపోవడంతో..
"రండి." అంది.
"సోఫాని బెడ్ చేద్దామా." గుసగుసగా అన్నాడు శేషగిరి.. భార్య కళ్లల్లోకే చూస్తూ.
"అలానా." చిత్రంగా అంది గిరిజ.
"ప్లీజ్రా." గమ్మత్తుగా అన్నాడు శేషగిరి.
తన కుడి కాలి బొటన వేలిని నేలన రాస్తూ.. 'సరే' అన్నట్టు తలాడించింది గిరిజ.
శేషగిరి హుషారై..
***
సోమవారం..
మధ్యాహ్నం..
శేషగిరి కన్నవారింటన..
అప్పలస్వామి.. మనవరాలుతో ఏనుగు ఆట ఆడుతున్నాడు.
అనసూయ.. కొడుక్కు.. కోడలుకు కొసరి కొసరి వడ్డన చేస్తోంది.
రేపటి పండగ సందడి నేడే ఆ ఇంట కనబడుతోంది.
ఉలవ చారు అన్నంని మక్కువతో జుర్రుతున్నాడు శేషగిరి.
పచ్చి పులుసు అన్నంని ఇష్టంగా తింటుంది గిరిజ.
పిల్లల భోజనాల తర్వాత..
అప్పలస్వామి.. అనసూయ భోజనాలు కానిచ్చేసారు.
అంతా నట్టింటన కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు.
రాగిణి.. అప్పలస్వామి చుట్టూ గింగిరాలు కొడుతోంది.
అప్పలస్వామి.. మధ్య మధ్య వీథిలోకి పరుగున వెళ్తూ.. ఇంటి ముందున్న కారు చుట్టూ చేరిన పిల్లల్ని అదమాయించి వస్తున్నాడు. తిరిగి మనవరాలుని ఆడిస్తున్నాడు.
మాటల మధ్యన.. గిరిజను చూస్తూ..
"మీ అమ్మింటోళ్లు గొప్పోళ్లమ్మా. మా బిడ్డ అదృష్టం. మంచింట అల్లుడయ్యాడు." గొప్పగా చెప్పింది అనసూయ.
"మరే. ఈరకాడు.. మనోడ్ని మంచి సమయంన చూసారు. ఆ వేళా విసేసమే. మనోడు బూర్ల బుట్టన పడ్డాడు." కలగచేసుకున్నాడు అప్పలస్వామి.
గిరిజ అన్నింటికీ చిన్నగా నవ్వేస్తోంది.
'ఏమైనా.. మా ఆయన బంగారం.' అనుకోకుండా ఉండలేక పోయింది.
ఆ పైన.. 'మా అదృష్టం.' అనుకుంది కూడా.
***
ఆ సాయంకాలం..
తయారై..
"మేము బయటికి వెళ్తాం." చెప్పాడు శేషగిరి..
అప్పలస్వామితో.
"ఎటు అనకూడదు." నసిగాడు అప్పలస్వామి.
గిరిజ అప్పుడే కలగచేసుకుంటూ..
"పార్వతిని కలిసి వస్తాం." చెప్పింది.
"అటు ఎందుకు." అనసూయ కస్సుమంది.
"పార్వతి.. మీ అబ్బాయి పరిచయస్తురాలు. పైగా తను కష్టాల్లో ఉందట. కలిసి మాట్లాడితే బాగుంటుంది." చక్కగా చెప్పింది గిరిజ.
"కోడలుకు అన్నీ చెప్పేసావా." అప్పలస్వామి కంగారవుతాడు.
శేషగిరి ఏమీ అనక పోయేసరికి..
"ఆఁ. నాతో చెప్పారు మామ గారు." చెప్పింది గిరిజ.
ఆ వెంబడే..
"తెలిసిన వాళ్లు ఇబ్బంది పడుతుంటే మాట సాయమైనా చేయక పోతే ఎలా. పైగా మనం మనుషులం మామగారు." అంది.
అప్పలస్వామి.. అనసూయని చూసాడు.
తను చిందరవందరవుతోంది.
అవేవి పట్టించుకోకుండా..
రాగిణిని తీసుకొని.. గిరిజతో వీథిలోకి నడిచాడు శేషగిరి.
అప్పలస్వామి.. అనసూయ చేష్టలుడిగి అటు చూస్తూ ఉండిపోయారు.
"తెలుసుగా. అటు దార్లు బాగోవు. కారులో వెళ్లలేం. నడిచి పోదాం." చెప్పాడు శేషగిరి.
'సరే' అన్నట్టు తలాడించేసింది గిరిజ.
రాగిణిని ఎత్తుకున్నాడు శేషగిరి.
ఆ ఇద్దరూ నడుస్తున్నారు.
"పంచాయితీ ఉందిగా. రోడ్లు పని చక్కపర్చవచ్చుగా." అంది గిరిజ.
"నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతి మారు ఇలానే అంటావు." నవ్వేడు శేషగిరి.
ఆ వెంబడే..
"ఈ ఊరిలో మూడు వర్గాలు. పైగా ఎవరికి వారే పెద్దలు." చెప్పాడు.
"మీరూ ప్రతి మారు ఇలానే అంటారు." గిరిజ కూడా నవ్వింది.
ఇద్దరూ నడుస్తున్నారు.
"పల్లెటూర్లలో అంతా ఒక కట్టు మీద ఉంటారనుకున్నాను." అంది గిరిజ.
"ఒన్స్ అపానే టైం." నవ్వేడు శేషగిరి.
తండ్రి చంకన ఉన్న రాగిణి.. ఆ ఇరుకు వీథుల్ని.. సాలల్లోని పశువుల్ని.. చుట్టూని.. వింత వింతగా సరసరా తల తిప్పుతూ చూస్తోంది.
వాళ్లు పార్వతి ఇంటి ముందుకు చేరారు.
రాగిణిని కిందకి దించి..
గడప ఎక్కి.. పార్వతి ఇంటి తలుపు తట్టాడు శేషగిరి.
కూతురుని పట్టుకొని గిరిజ వీథిలోనే నిల్చుంది.
పార్వతి తలుపు తీసింది.
శేషగిరిని చూస్తూనే..
"వచ్చారా." అంది.
ఆ వెంబడే..
"బయలుదేరినట్టు ఫోన్ లో చెప్పారుగా. ఎంత సేపు ఐంది వచ్చి." అడుగుతోంది.
వీథిలోనే ఉండిపోయిన గిరిజని, రాగిణిని చూసి..
"నీ భార్య.. నీ పాప కదూ." అడిగింది శేషగిరిని.
"అవును." చిన్నగా నవ్వేడు శేషగిరి.
అతడిని తప్పించుకుంటూ.. గడప దాటి.. గబగబా వీథి లోకి వచ్చింది పార్వతి.
"రండి. రండి." అంది గిరిజతో.
రాగిణిని ఎత్తుకుంది.
రాగిణి కాస్తా ఇబ్బందవుతోంది. తల్లిని చూస్తోంది.
"ఆంటీ." చెప్పింది గిరిజ.. కూతురుతో.
పార్వతి..
వచ్చిన వాళ్లని తమ ఇంటి మధ్యన చావడి లాంటి ఖాళీ స్థలంలో మంచం వేసి కూర్చుండ పెట్టింది.
తాగడానికి నీళ్లు ఇచ్చింది.
రాగిణి చేతికి చొరవగా చక్కెర బొమ్మనిచ్చింది.
తను ఒక స్టూల్ లాంటి బల్ల మీద ఆ మంచంకి చేరువలోనే కూర్చుంది.
"మీరు రావడం నాకు కాళ్లూ చేతులు ఆడడం లేదు." చెప్పింది.
గిరిజ నవ్వేసింది.
"కూలవ్వు." శేషగిరి చెప్పాడు.
తర్వాత..
నిముషం వరకు వాళ్ల మధ్య మాటలు లేవు.
ఈ లోగ..
రాగిణి తన చేతిలోని చక్కెర బొమ్మతో ఆడుకుంటుంటే..
"బేబీ.. దీనితో ఆడుకో వచ్చు. దీనిని తినవచ్చు." చెప్పాడు శేషగిరి.
రాగిణి దానిని అటు ఇటు తిప్పుతూ ఉంది.
"ఏం జరిగింది పార్వతి గారూ." గిరిజే కదిపింది.
పార్వతి మొహంలో సడన్ గా మారిన మార్పుని గమనించి..
"కూల్ గా మాట్లాడుకుందాం. విషయం తెలిస్తేనే పరిష్కారం వైపు కదలగలం." చెప్పాడు శేషగిరి.
"చెప్పాలంటే చాంతాడంత." పార్వతి నిస్సత్తువవుతోంది.
"పూర్తిగా తెలిస్తేనే ఏమైనా చేయగలం." కలగ చేసుకుంది గిరిజ.
పార్వతి మాట్లాడలేక బిత్తరవుతోంది.
పార్వతిని కుదురు చేయాలని..
"మీ అత్తమామలు గురించి చెప్పు." అడిగాడు శేషగిరి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments