'Priyamvada' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 12/09/2024
'ప్రియంవద' తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమ శ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.." అంటూ ప్రియంవద పూజా మందిరం శివ నామస్మరణ తో పులకరించిపోతుంది. మహా శివుని తలపై ఉన్న చంద్రవంక, చంద్రవంశ మహారాణి ప్రియంవద చేసే శివ పూజను కన్నార్పకుండా చూస్తుంది. పూజామందిరం సమస్తం త్రినేత్ర జ్ఞాన తేజంతో ప్రకాశిస్తుంది. త్రినేత్ర జ్ఞాన తేజాన్ని చూడగలిగిన ప్రియంవద త్రినేత్ర జ్ఞాన తేజంలో మైమరచిపోతూ శివ నామస్మరణ చేస్తుంది.
ప్రియంవద శివనామ స్మరణ కు భండాసుర గణాల చెవుల వెంట రక్తం కారసాగింది. భండాసుర గణాల హాహాకారాలకు అసురులందరూ హడలిపోయారు.
ప్రియంవద శివ నామ స్మరణను చూసిన ఆమె అత్తమామలు చంద్రవంశీకులు ప్రభ, ఆయువులు "మంగళాకార! సాం బశివ! సదాశివ! పాహిమాం! పా హిమాం!పరమేశ్వర! అండపిండబ్రహ్మాండాల అణువ ణువున కొలువైన కైలాస వాస! కరుణించి కాపాడ కద లిరావయ్య నందీశ్వర వాహన! నాగాభరణ!" అంటూ శివనామ స్మరణ చేసారు. అటుపిమ్మట రాజ తేజంతో ప్రకాసిస్తున్న తమ కుమారుడు నహుషుని సమీపించారు.
"చంద్ర వంశ యశోవర్థన ! దత్తాత్రేయ వర ప్రసాది! వశిష్ట ప్రియ శిష్యా నహుష! నీ సుపరిపాలనలో ప్రతిష్టాన పురము ప్రమోద ప్రభలతో ప్రకాశిస్తుంది. ఎల్లప్పుడు ప్రియాన్నే పలికే ప్రియంవద నీకు ధర్మ పత్ని అయ్యాక ఇలాతలంలో నీ కీర్తిప్రతిష్టలు మరింత పెరిగాయి. నీ ప్రియపత్ని ప్రియంవద పథకానుసారం 99 యజ్ఞాలను నిర్విఘ్నంగా చేసి ధరణీపతుల హృదయాలలో దేవేంద్రుడివయ్యావు.
ఇంద్ర లోకాధిపతి దేవేంద్రుడు సహితం నీతో స్నేహసంబంధాలను అధికం చేసుకోడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక నీ ధర్మపత్ని ప్రియంవద ధర్మపథకానుసారం నూరవ యజ్ఞం ను కూడా చెయ్యి. ", అని ఆయువు కుమారుడు నహుషునితో అన్నాడు.
"నాయన నహుష! నీ తండ్రిగారు చెప్పింది అక్షర సత్యం. ఇప్పటివరకు గడిచిన మీ భార్యాభర్తల జీవన గమనం చిత్రాతిచిత్రం. మహా విచిత్రం. ప్రియంవద నీ జీవితంలోకి వచ్చాక నీ కీర్తి ప్రతిష్టలు సమస్త లోకాలు వ్యాపించాయి.
మన కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం మహర్షుల ఆశ్రమంలో పెరిగిన ప్రియంవదను నువ్వు వివాహం చేసుకున్నావు. నువ్వు ప్రేమించిన అశోక సుందరి, వశిష్ట మహర్షి నిన్ను వివాహం చేసుకోమన్న ప్రియంవద ఒకరే అవ్వడం లలాట లిఖితం తప్ప మరొకటి కాదు. ప్రియంవదను కొందరు మహర్షులు విరాజా అనికూడా పిలిచేవారట గదా?" కుమారునితో అంది ప్రభ.
"అవును. కొందరు మహర్షులు ప్రియంవదను విరాజా అనే పిలిచేవారు మాత. ప్రియంవద పుట్టుక గురించి కూడా రకరకాల కథలు ఋషి వాడలలో ప్రచారంలో ఉన్నాయి. ఆ కథలన్నీ ప్రియంవద కారణజన్మురాలు. ప్రియంవద నిరంతరం ప్రియంగా మాట్లాడుతూ నవ్వు ముఖంతోనే ఉంటుంది. ప్రియంవద తన తొమ్మిదవ సంవత్సరమునే భండాసురుని 30 మంది పుత్రులను సంహరించి బాలాత్రిపుర సుందరి అయ్యింది అని చెబుతున్నాయి..
కొందరు మహర్షుల అభిప్రాయం ప్రకారం ప్రియంవద పార్వతీపరమేశ్వరుల ముద్దుల కుమార్తె. ఒకనాడు పార్వతీ దేవి కల్పవృక్షం దగ్గరకు వెళ్ళింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పం వృక్షం దగ్గర పార్వతీ మాత తన గణపతి సృష్టిని తలచుకుని మహదానంద పడింది. తనకు ఒక కుమార్తె కూడా ఉంటే బాగుంటుందనుకుంది.. కల్ప వృక్షం ఆమె కోరికను తీర్చింది.
పార్వతీ మాత ప్రియంవదను అల్లారుముద్దుగా పెంచింది. ప్రయాగలోని అశోకవనం లో ఉన్న మహర్షుల దగ్గర ప్రియంవద పెరిగితే బాగుంటుంది అని పార్వతీ మాతకు పరమేశ్వరుడు సలహా ఇచ్చాడు. పార్వతీ మాత పరమేశ్వరుని సలహా పాటించింది. అశోక వనంలోని మహర్షుల ధర్మపత్నులకు పార్వతీ మాత ప్రియంవదను అప్పగించింది. మహా సుందరంగా ఉన్న ప్రియంవదకు అశోక వనంలోని మునిపత్నులే అశోక సుందరి అని పేరు పెట్టారు. ప్రియం తప్ప అప్రియాన్ని మాట్లాడని అశోక సుందరిని కొందరు మహర్షులు, మునిపత్నులు ప్రియంవద అని పిలవసాగారు.
ప్రియంవద చిన్నతనంలోనే సమస్త విద్యలను అభ్యసించింది. అశోకవన సంరక్షణలో తన ప్రతిభను చూపించింది. కొందరు మునిపత్నుల కఠిన హృదయాలను తన మంచి మాటలతో కరిగించింది. మరికొందరు ముని పత్నుల అసూయ ఈర్ష్యా ద్వేషాలను తన ప్రియ మాటలతో మటుమాయం చేసింది. అక్కడి మహర్షులు ప్రియంవదను బాలాత్రిపుర సుందరి, లావణ్య, అన్వి, విరాజా అని రకరకాల పేర్లతో పిలిచేవారు. జీవన శ్వాస మూలాలు తెలిసిన ప్రియంవద నాకు అక్కడే పరిచయం అయ్యింది" .. తల్లి ప్రభతో అన్నాడు నహుషుడు.
"ప్రియంవదను సంహరించాలని ఎవరో రాక్షసుడు ప్రయత్నించాడు కదా?" తనయుడు నహుషునితో అన్నాడు ఆయువు.
"అవును తండ్రి అవును. హుండాసురుడనేవాడు ప్రియంవదను చెరబట్టి ఆమె దివ్య శక్తులను తన వశం చేసుకుని ఆమెను తన దాసీని చేసుకోవాలని చూసాడు. ఈ విషయం తెలిసిన పార్వతీపరమేశ్వరులు దేవేంద్రుని దేవతలను పిలిచి, ‘దేవేంద్ర, దేవతలారా! హుండాసురుడు తన తపోశక్తి తో బ్రహ్మ దేవుని మెప్పించాడు. త్రిమూర్తుల చేతిలో తనకు మరణం ఉండరాదని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు.
ఆ తర్వాత తర్వాత హుండాసురుడు త్రిమూర్తుల తర్వాత తనే గొప్ప అనే వర గర్వంతో అనేకమంది మానవ స్త్రీలను చెరబట్టాడు. సమస్త లోకాలలోని లావణ్య వతులంతా తన ఆధీనంలోనే ఉండాలనుకుని నా కుమార్తె ప్రియంవద మీద కన్నేశాడు. ప్రియంవదను మీరే కాపాడాలి " అన్న పరమశివుని మాటలను అనుసరించి దేవేంద్రుడు, తదితర దేవతలు హుండాసురుని మీదకు యుద్దానికి వెళ్ళారు. అయితే వారంతా హుండాసురుని ముందు నిలవలేక పోయారు.
అప్పుడు దేవేంద్రుడు అనేక దివ్య ఆయుధాలను నాకిచ్చి హుండాసురుని సంహరించమన్నాడు. నేను దేవేంద్రుడు ఇచ్చిన దివ్య ఆయుధాల సహాయం తో హుండాసురుని సంహరించాను. అప్పటినుండి దేవేంద్రుడు నాకు మిత్రుడు అయ్యాడు. అప్పుడే నేను ప్రియంవదను వివాహం చేసుకున్నాను. "తండ్రితో అన్నాడు నహుషుడు.
"ప్రియంవదను వివాహం చేసుకున్నాక నువ్వు ప్రియంవద మాటలను అనుసరించి 99 యజ్ఞాలు చేసావు కదా?" నహుషుని అడిగాడు ఆయువు.
"అవును తండ్రి అవును. 99 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసాను. త్వరలో నూరవ యజ్ఞం కూడా చేస్తాను. " అన్నాడు నహుషుడు.
"ప్రియంవద నీకు తోడుంటే నీవెన్ని యజ్ఞాలనైన చేయ గలవు నహుష చేయగలవు.. నూరు యజ్ఞాలు చేసిన వారికి దేవేంద్ర పదవిని అధిష్టించే సామర్థ్యం వస్తుంది. " నహుషునితో అన్నాడు ఆయువు.
"దేవేంద్ర పదవి వస్తుందని యజ్ఞాలు చేయడం సరైన ఆలోచన కాదు తండ్రి సరైన ఆలోచన కాదు. " నహుషుడు తన తండ్రి ఆయువుతో అన్నాడు.
"నిక్కము వక్కాణించితిరి నాథ. నిక్కము వక్కాణించితిరి. ప్రకృతి పరిరక్షణ నిమిత్తం రాజులు, మహారాజులు సామంత రాజులు యజ్ఞాల మీద ఆసక్తి ఉన్న మహాను భావులు విరివిరిగా యజ్ఞయాగాదులు భక్తి శ్రద్ధలతో చేస్తారనే సదుద్దేశంతో నూరు యజ్ఞాలు చేసినవారికి దేవేంద్ర పదవి వరిస్తుందని చెప్పారు. నియమబద్ధంగా చేసే యజ్ఞయాగాదుల వలన ప్రకృతి కాలుష్యం తొలగిపోతుంది. ప్రశాంత జీవనానికి ప్రకృతి పంచభూతాలు చక్కగ సహకరిస్తాయి.
యజ్ఞయాగాదులు చేసేవారు అదే మనసులో ఉంచుకుని యజ్ఞయాగాదులు చేయాలి.. మనసులో ఏదో మరొకటి పెట్టుకుని యజ్ఞయాగాదులు చేయడం వలన మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. " అంటూ ప్రియంవద అందరికీ శివ ప్రసాదం అందిస్తూ నహుషుని సమీపించింది.
"అమ్మా ప్రియంవద,, నీ ధర్మ సూక్ష్మానుసారపథం అనుసరించి, నా పుత్రుడు నహుషుడు 99 యజ్ఞాలు నిర్విఘ్నంగా పూర్తి చేసాడు. నూరవ యజ్ఞం ను కూడా నువ్వే నీ పతిదేవుని తో జరిపించి నహుషుని మహోన్నత ధర్మపత్ని గా దివిలో భువిలో శాశ్వత కీర్తిని ఆర్జించు. " అని కోడలైన ప్రియంవదతో ఆయువు అన్నాడు.
"అమ్మా ప్రియంవద. నా పుత్రుడు నహుషునికి తల్లి పోలికలతో పాటు, తల్లి గుణగణాలు కూడా బాగానే వచ్చాయి. ఈ విషయాన్నే ప్రతిష్టాన పుర ప్రజలందరూ అనుకుంటారు. స్వర్భానుని కుమార్తెనైన నాలో అప్పుడప్పుడు రజో గుణం లేశ మాత్రం ఆవిర్భవిస్తుంది. మీ మామగారు ఆయువు సాంగత్యం వలన అది నాలో నా ఆధీనంలోనే ఉంటుంది. నా పుత్రుడైన నహుషునిలో కూడా రజోగుణం అప్పుడప్పుడు లేశ మాత్రం ఉద్భవిస్తుంది. దానివలన అహం వంటి దుర్గుణాలు కొన్ని ఆవరిస్తాయి. నహుషునిలో ఉన్న ఆ స్వల్ప రజోగుణాన్ని నువ్వే తుడిచిపెట్టేయాలి. " కోడలు ప్రియంవద తో అంది ప్రభ.
"మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు ఉన్నంత కాలం నేనేదైన సాధించగలను అత్తగారు. " అంటూ ప్రియంవద అత్తగారైన ప్రభకు నమస్కారం చేసింది.
నహుషుడు తన ప్రియపత్ని ప్రియంవద సలహాలను అనుక్షణం అనుసరించి తన అపారబాహుబల సంపన్నతతో నిర్భయునిగా ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ కాలం గడపసాగాడు.
ఒకనాడు చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటున్న సరోవరానికి కొందరు జాలరులు వెళ్ళారు. జాలరులు చేపలకై సరస్సులో వల వేసారు. వలలో చ్యవన మహర్షి పడ్డాడు. జాలరులు ఏదో పెద్ద చేప పడిందని వల ను బయటకు లాగారు. వలలో ఉన్న చ్యవన మహర్షిని చూచి జాలరులు "తప్పు జరిగిపోయింది సామి. మమ్ము క్షమించండి" అని అంటూ చ్యవన మహర్షి కాళ్ళ మీద పడ్డారు.
అందుకు చ్యవన మహర్షి "ఇందులో మీ తప్పేం లేదు నాయనలారా! మీరు వలలో పడిన చేపలను తీసుకెళ్ళి అమ్ముకున్నట్లే నన్నూ అమ్ముకోండి. సందేహించకండి" అని జాలరుల తో అన్నాడు.
జాలరులు చ్యవన మహర్షి మాటలను కాదనలేక చ్యవన మహర్షి ని నహుషుని దగ్గరకు తీసుకు వెళ్లి జరిగిందంతా చెప్పారు.
నిరంతరం జలంలో తపస్సు చేసే చ్యవన మహర్షి కి సమానంగ జాలర్లకు ఏమివ్వాలని నహుషుడు ఆలోచన లో పడ్డాడు. అప్పుడు ప్రియంవద చ్యవన మహర్షికి సమానంగా జాలర్లకు గోవులను ఇవ్వమని భర్తకు సలహా ఇచ్చింది.
"గోవులను మేం ఏం చేసుకోవాలి మహారాణి?" అని జాలర్లు ప్రియంవదను అడిగారు.
"గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. దేవతల అనుగ్రహం దక్కడానికి సులువైన మార్గం గోపూజ. గోవును రక్షిస్తే ఆ గోవే మిమ్మల్ని రక్షిస్తుంది. సమస్త సమస్యలను దూరం చేసే దివ్య మాత గోమాత." అని చ్యవన మహర్షి జాలరులకు చెప్పాడు.
చ్యవన మహర్షి మాటలను విన్న జాలరులు నహుషుడు ఇచ్చిన గోవులను స్వీకరించారు. అప్పుడు చ్యవన మహర్షి జాలరులకు స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది అని వారిని ఆశీర్వదించాడు. ఆపై నహుషునికి ఇంద్ర పదవి దక్కుతుంది అని నహుషుని ఆశీర్వదించాడు.
కొన్ని రోజుల అనంతరం వశిష్టాది మహర్షులందరు మంచి శుభ ముహుర్తాన్ని నిర్ణయించగా నహుషుడు ప్రియంవద కనుసన్నల్లో నూరవ యజ్ఞం ను పూర్తి చేసాడు.
అప్పుడు దేవేంద్రాది దేవతలు ప్రియంవదను నహుషుని ఆశీర్వదించారు. ఇంద్రుడు దేవేంద్ర పదవిని స్వీకరించమని నహుషుని కోరాడు. ఇంద్రుని మాటలను విన్న నహుషుడు మృదువుగా "నాకు దేవేంద్ర పదవికన్నా చంద్రవంశ రాజుగా పార్వతీపరమేశ్వరుల ప్రియ పుత్రిక ప్రియంవద భర్తగా ఉండటమే మహాయిష్టం. " అని దేవేంద్ర పదవిని వలదన్నాడు.
నహుషుని మాటలను విన్న దేవేంద్రుడు, తదితర దేవతలు ప్రియంవద నహుషులను మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ వారి రాజ్యమును సస్యశ్యామలం చేసారు.
నహుషుని సోదరులైన వృద్దశర్మ, రజి, గయుడు, అనేనసులకు కావల్సినవన్నీ ప్రియంవద సమ కూర్చింది. వారు యజ్ఞయాగాదులతోనూ, కళాసంబంధ కార్యక్రమాలతోనూ కాలం గడపసాగారు.
ప్రియంవద నహుషులకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే ఆరుగురు మగ సంతానం కలిగారు.
ఒకసారి ఇంద్రుని మీదకు వృత్రాసురుడనే రాక్షసుడు దండయాత్ర చేసాడు. ఇంద్రుడు వృత్రాసుని మీద కు సమరానికి సిద్దమయ్యాడు. ఇంద్రుడు ఇంద్రలోక సింహాసనంను ఖాళీగా ఉంచరాదనుకున్నాడు. ఇంద్రునికి నహుషుడు గుర్తుకు వచ్చాడు. ఇంద్రుడు నహుషుని దగ్గరకు వెళ్ళాడు. నహుషునికి వృత్రాసురుని గురించి చెప్పాడు.
"వృత్రాసురుని మరణం నా చేతిలోనే రాసి పెట్టినట్లుంది. నేను వృత్రాసురునితో యుద్దం చేయడానికి వెళ్ళినప్పుడు అసురులెవరైన ఇంద్రలోక సింహాసనాన్ని ఆక్రమించవచ్చు. అది సమస్త లోకాలకు మంచిది కాదు. కావున నేను యుద్ధం నుండి తిరిగివచ్చేవరకు ఇంద్రలోక దేవేంద్ర పదవిని స్వీకరించు. అందుకు నువ్వే సమర్థుడివి. అలా తమను కాపాడు" అని ఇంద్రుడు నహుషుని అర్థించాడు.
దేవేంద్ర పదవి మీద వ్యామోహం లేని నహుషుడు ముందుగా ఇంద్రుని మాటలను తోసిపుచ్చాడు. ఇంద్రు ని సమస్యను అర్థం చేసుకున్న ప్రియంవద భర్తకు నచ్చ చెప్పడంతో, ప్రియంవద మాటలను అనుసరించి నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. ఆ సమయంలో ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలందరికీ చేదోడు వాదోడు గా ఉండటానికి సిద్ద పడింది.
నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమాది అప్సరసల నృత్యాలను నహుషుడు కనులార చూసాడు. తదితర దేవతల అవసరాలను తెలుసుకుని వారి సమస్యలను తీర్చాడు.
ఒకనాడు నందనవనంలో ఇంద్రుని భార్య అయిన శచీదేవిని నహుషుడు చూసాడు. అతనిలో రజోగుణం పెల్లుబికింది. నహుషుడు శచీదేవిని తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. నహుషుడు శచీదేవి దగ్గరకు వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాడు. తన సమ్మతిని తెలుపమని శచీదేవికి మూడు రోజుల సమయం ఇచ్చాడు.
శచీదేవి సమర రంగాన ఉన్న తన భర్త ఇంద్రునికి తన దగ్గర ఉన్న దేవ గణం ద్వారా నహుషుని దుర్మార్గ గుణాన్ని తెలియచేసింది. ప్రమద గణాల ద్వారా ఇంద్రుడు నహుషుని దుర్మార్గ చిత్తాన్ని ప్రియంవద కు తెలియ చేసాడు.
ప్రతిష్టాన పురంలో ఉన్న ప్రియంవదకు తన భర్త మనో చాంచల్యం ప్రమద గణాల ద్వారా తెలిసింది. వెంటనే తన తలిదండ్రులు పార్వతీపరమేశ్వరుల సహాయంతో శచీదేవిని కలిసింది. ప్రియంవద శచీదేవికి ధైర్యం చెప్పింది.
"సప్త మహర్షులు మోసే పల్లకిలో నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నేను వివాహం చేసుకుంటాను" అని శచీదేవి చెప్పినట్లు చెప్పమని చెలికత్తెకు చెప్పి చెలికత్తెను నహుషుని వద్దకు పంపింది.
చెలికత్తె నహుషుని దగ్గరకు వెళ్ళింది. శచీదేవి చెప్పుకున్నట్లుగా ప్రియంవద మాటలను చెలికత్తె నహుషునికి చెప్పింది.
చెలికత్తె మాటలను విన్న నహుషుడు తను ఎక్కే పల్లకిని మోయమని సప్త మహర్షులను ఆదేశించా డు. నహుషుడు పల్లకిని ఎక్కాడు. సప్త మహర్షులు చేసేదేమీలేక పల్లకిని మోయ సాగారు. పల్లకి శచీదేవి మందిరం వైపుకు కదిలింది.
పల్లకిలో ఉన్న నహుషుడు "కదలండి కదలండి వేగంగా కదలండి " అని సప్త మహర్షులను త్వరపెట్టాడు. నహుషుడు సప్త మహర్షులను "సర్ప సర్ప" అని అన్నాడు. సంస్కృత భాషలో "సర్ప సర్ప అనగా కదలండి కదలండి" అని అర్థం.
నహుషుని వత్తిడికి ఆగ్రహించిన అగస్త్య మహర్షి
"సర్ప సర్ప" అన్న నహుషుని "సర్పం " కమ్మని శపించాడు.
అగస్త్య మహర్షి ఆగ్రహాన్ని కళ్ళార చూచిన నహుషుడు తనలోని అహం ను గమనించాడు. ప్రియం వద తన దగ్గర ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదను కున్నాడు. నహుషుడు తన అహాన్ని తగ్గించుకుని అగ స్త్య మహర్షి కాళ్ళపై పడ్డాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ప్రియంవద తన భర్త తప్పును క్షమించమని అగస్త్య మహర్షి ని సప్త మహర్షులను వేడుకుంది.
ప్రియంవద మాటలకు శాంతిచిన అగస్త్య మహర్షి "నహుష, నువ్వు చేసిన తప్పులను నిజంగా తప్పులుగా భావించి, ప్రజాపరిపాలన విషయం లో నహుష ధర్మం ను పాటించడానికి ఎవరు ముందుకు వస్తారో అప్పుడే నేనిచ్చిన శాపం నుండి నువ్వువిముక్తుడ వవుతావు. " అని నహుషునితో అన్నాడు. అనంతరం సప్త మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
"మన కుమారుడు యయాతి కి మకుటాభిషేకం చేస్తాను. మీరు శాప విముక్తులయ్యే వరకు నేను కైలాసం లో తపస్సు చేసుకుంటాను. " అని ప్రియంవద నహుషునితో అంది. నహుషుడు అలాగే అన్నాడు.
ప్రియంవద యయాతి కి పట్టాభిషేకం చేసింది. తన మీద గౌరవం ప్రేమాభిమానం చూపించినట్లే యయాతి మహారాజు మీద గౌరవం, ప్రేమాభిమానం చూపించమని ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలకు చెప్పింది. ఆ తర్వాత కైలాసం వెళ్ళింది. అక్కడ ప్రియంవద సోదరులు గణపతి, కుమార స్వామి సోదరి తపస్సు చేసుకోవడాని కి అనువైన ప్రదేశం చూపించారు.
నహుషుడు సర్పమై భూమి మీద పడ్డాడు.
నహుష సర్పం దైవ చింతనతో కాలం గడపసాగింది.
ప్రియంవద తన తపోతేజంలో బాలా త్రిపుర సుందరి గానూ, లావణ్య గానూ, అన్విగాను కొందరు మహర్షులకు దర్శనం ఇచ్చింది.
పాండవులు అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు ఒక సారి సర్పంగా ఉన్న నహుషుడు భీముని బంధించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ధర్మరాజు సర్పరూపంలో ఉ న్న నహుషునికి నమస్కరించి తన చంద్ర వంశం గురించి తెలియచేసాడు.. సర్ప రూపంలో ఉన్న నహుషుడు "నేను మీ పూర్వీకుడిని నహుషుడిని" అని తన పరిపాలన గురించి, తన తప్పుల గురించి ధర్మరాజు కు చెప్పా డు. పరిపాలనా విషయంలో నహుష ధర్మం పాటించడానికి ధర్మరాజు నేను సిద్ధం అనగానే నహుషుడు శాప విముక్తుడయ్యాడు.
నహుషుడు శాప విముక్తుడయ్యాడని తెలిసి ప్రియంవద నహుషుని కలిసింది. ప్రియంవద నహుషులు ఇద్దరూ స్వర్గాన్ని చేరారు.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments