top of page
Writer's pictureMutyala Laxma Reddy

ప్రమోషన్ డిమోషన్



'Promotion Demotion' - New Telugu Story Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 30/05/2024

'ప్రమోషన్ డిమోషన్' తెలుగు కథ

రచన: M. లక్ష్మా రెడ్డి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఉల్లిపాయలు సన్నగా కట్ చేయాలా అన్న నా ప్రశ్నకి.. సన్నగా.. చిన్నగా కూడా అన్న తన సమాధానంతో ఓ మూడు ఉల్లిపాయలు తీస్కొని.. వాటిని ప్రేమగా ముక్కలు ముక్కలు చేసే పనిలో పడ్డా.. 


 ఎన్ని సార్లు చెప్పినా మీకు గుర్తుండదు గా.. అంటూ.. ఓ చిన్న ఉల్లిపాయ పొర తీసి నా జుట్టుపై పెట్టి.. ఇలా ఐతే నీకు కన్నీళ్లు రావు.. నీతో కంటతడి పెట్టించా అనే బాధ నాకు ఉండదు.. అన్న ఆవిడ మాటలకి.. మనసు మూలల్లో నవ్వొస్తున్నా.. పైకి మాత్రం కాస్త గంభీరంగా ఉండడానికి ప్రయత్నాల్లో పడి ఉన్నా.. గంభీరమే కాదు కాస్త చిరాకు.. ఇంకొంచెం కోపం.. ఇవన్నీ మన ముఖానికి నప్పవు కానీ. ఏదో మానవ ప్రయత్నం.. 


ఎందుకంత కష్టం అనే మీ ప్రశ్నకి.. నిన్నటి మా సంభాషణే జవాబు.. 


నీకు వంటలో సాయం చేస్తూనే ఉన్నాగా అనే నా దయార్ద్ర హృదయానికి.. ఒక్క చికెన్ వండడం తప్ప.. ఇంకేమన్నా వచ్చా.. ? అది కూడా మొహమాటానికి మేం తింటాం కానీ.. ఆ పెరుగు వేయడం ఏంటి.. ? పుల్లటి చికెన్ అని ఒక రకం ఉంటే.. ఇది అందులో వేయాల్సిన మహా వంటకం.. తన సమాధానం.. 

 ఈ సమాధానానికి కాస్త కోపం వచ్చిన మాట నిజమే.. అయినా. తమాయించుకుని మరి తినేప్పుడు ఆహా ఓహో అని అంటారుగా.. నా జ్ఞాపకాల పుటల్లోంచి వాళ్ల అభినందనల బాణం తీసి నేరుగా వాళ్ల మీదకే ప్రయోగించా.. 

జవాబుగా.. గంట మీ కష్టానికి.. కనీసం ఆ మాట అనకుంటే.. ఆ రోజంతా మీ వికార ముఖ సౌందర్యాన్ని మేం తట్టుకోలేంగా.. అన్న పంచ్ పడేసరికి.. 


సరే.. ఇప్పటినుండి నా అందమైన ఈ ముఖాన్ని ఈ కిచెన్ కి.. ఆ చికెన్ కి చూపించను.. అని భీకర ప్రతిజ్ఞ చేసితిని.. 


కట్ చేస్తే.. మళ్ళీ ఈవేళ ఉల్లిపాయల చేతిలో బందీగా.. 

మా ఆవిడ మాటల పోరాటంలో అస్త్ర సన్యాసం చేసిన కట్టప్పలా.. అర్థం అయింది కదా.. 

సరే ప్రస్తుతంలోకి వద్దాం.. 


గతమేమన్న ఘనమా.. అదే గతంలో మునకలేయడానికి.. 

నూనెలో ఆ ఉల్లిపాయలు వేసి.. దోరగా వేయించండి.. అన్న హుకుం జారీ కాబడేసరికి.. చేతిలో గరిటెతో.. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అనుకుంటూ.. గరిటెను లయబద్ధంగా.. తిప్పసాగా.. 

ఇదే డిమోషన్ మరి.. 


నిన్నటిదాకా కుక్ ను.. ఈవేళ ఏమనాలి నా లక్కును.. 

దోరగా.. వేగాలి అన్న దొరసాని మాటలు గుర్తొచ్చి.. 

దోరగా.. తగినంత.. మీక్కావలసినంత అనే పదాలు వంట చేసేప్పుడు తెప్పించే కోపం కాస్త మా ఇల్లాలికి కనబడకుండా ప్రదర్శించి.. గూగులమ్మని అడిగా.. దోరగా అనే రంగుకి చిత్రములు చూపమని.. ఆ చిత్ర విచిత్రాలు అర్థమై అవక.. లేత బ్రౌన్.. ముదురు గోధుమ మధ్య ఏదో అటూ ఇటూ కాని రంగని ఏదో అర్థమై.. అలా దోరగా వేగిన తర్వాత.. 


అల్లంవెల్లుల్లి పేస్ట్ కాస్త.. కొన్ని పుదీనా రెక్కలు, లెక్కలేయకుండా ఇంకొన్ని మేతి ఆకులు.. వేసేసి బాణలికి కింద అంటుకోకుండా వేగించే.. నను వేధించే ప్రహసనం విజయవంతంగా ముగించా.. !


థాంక్స్.. ఇక మీరు దయ చేయొచ్చు అన్న ఆవిడ గారి విడుదల వ్యాఖ్యతో కుందేలు పిల్లలా తుర్రున జారి.. హాల్ వరకు బెన్ జాన్సన్లా లగెత్తి టీవీ ముందు కూలబడ్దా.. 

ఆహలో విద్యా వాసుల వివాహ వైభోగం వీక్షించసాగా.. 

ఓ అరగంట తర్వాత అద్భుతమైన ఘుమఘుమలాడే 

చికెన్ కూర, బగారా రైస్ తో.. నాలుగ్గంటల మా ఆకలి మీద యుద్ధానికి సిద్దం.. 


రెండో ముద్దకి  ఎలా ఉంది అని కనుసైగలతో తను అడిగిన ప్రశ్నకి.. 

ఒక్క పది సెకన్ల తర్వాత, ఈ వంటల వల్లే కదా.. నా ఈ తరగని ఆస్తి.. కరగని మస్తీ అంటూ.. పొట్టని చూపించా.. 


తన అందమే ఆ నవ్వు.. మళ్ళీ ఆ సముద్రంలో మునిగిపోయా.. దిన దిన ప్రవర్దమానం అంటారే.. పాతికేళ్లుగా తన నవ్వులకి అచ్చంగా సరిపోయే పదప్రయోగం అది.. 

అయినా ‘నే చేసినా బావుంటుంది అన్నా’.. నా కుక్ నుండి ఆనియన్ కట్టర్ డిమోషన్ని భరించలేక.. 


“ఏమండోయ్.. మీరు చేసేది బావోక కాదు.. మిమ్మల్ని మరీ కిచెన్ కి అంకితం చేస్తున్నా.. అని నాకే కాస్త బాధగా.. మరికాస్త గిల్టీగా.. కొంచెం ఇంకేదోగా అనిపించి.. మీరు అలా చెప్తే వినరని.. మీ ఈగో తో చిన్న గేమ్ ఆడాను.. నేను ఊహించినట్టే.. మీకు రెస్ట్..”

 

“మరి ఆ ఆనియన్ కోసే జాబ్ ఎందుకో” అన్నాను.. ఇంకా తగ్గని నా చచ్చిన ఈగో ఇంపాక్ట్ వల్ల వచ్చిన పిచ్చి ఫ్రస్ట్రేషన్ వల్ల.. ఆ భావన కనబడనీయలేదు సుమీ. 


“మీరు లేకుండా.. నేను ఉండగలనా.. ఏదో ఓ రకంగా నాతో ఉంటారని.. మీ మాటల్తో.. నా పెదాల పూలు వికసించేలా చేస్తారని.. మీ చలోక్తులతో.. నా అలసట ఆవిరయ్యేలా చేస్తారని..”


మా ఆవిడ కూడా భలే పొయిటిక్ గా మాటడుతుందే.. 


అంతలో.. మా చిన్నాడు.. “ఇక్కడ మేమిద్దరం కూడా ఉన్నాం..” అనడంతో.. శ్రీమతి బుగ్గల సిగ్గుల జల్లులో నన్నేను మరిచా.. ఈగో ఎక్కడో చచ్చి పడి ఉన్నట్టుంది.. ఇక ఆ వేపు చూసే ఉద్దేశ్యం కూడా లేదు.. శ్రీమతి ప్రేమ ప్రదర్శనతో.. డిమోషన్ కాదు డబల్ ప్రమోషనే.. అన్న భావనతో.. ఆకలి మీద యుద్ధం.. సాగించా.. పెళ్ళాం ప్రేమలో మునకలేస్తూ.. 

***

M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...





43 views0 comments

Comments


bottom of page