#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #పూజనీయులుస్త్రీలు, #PujaniyuluSthreelu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 45
Pujaniyulu Sthreelu - Somanna Gari Kavithalu Part 45 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 25/03/2025
పూజనీయులు స్త్రీలు - సోమన్న గారి కవితలు పార్ట్ 45 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పూజనీయులు స్త్రీలు
----------------------------------------
ప్రేమ రూపము ఇంతి
ఆమె ఉంటే కాంతి
క్షీర సాగరంలా
పొంగిపొర్లును శాంతి
ఇంటికందము పడతి
ఆమె ఉంటే జగతి
ఉద్యమిస్తే గనుక
కుటుంబాల్లో ప్రగతి
ఆణిముత్యము మగువ
ఎప్పుడుండును ఎగువ
సృష్టికాధారమే
ఉంది మదిలో తెగువ
గుబాళించే కలువ
లలనకివ్వుము విలువ
నేర్పు ఎంతో గలది
నడుపును సదన పడవ
పూజనీయులు స్త్రీలు
జీవితాల్లో మేలు
ఉపకరించే వారు
ఒక్కరున్నా! చాలు

కనీస కర్తవ్య పాలన
----------------------------------------
చక్కని త్రోవ చూపాలి
చిన్నారులకు జగతిలో
మిక్కిలి ప్రేమ నింపాలి
వారి లేత గుండెల్లో
భవిత బాగా దిద్దాలి
ఉత్తమ పౌరులు చేయాలి
దేశభక్తి అణువణువునా
పొంగిపొర్లుతుండాలి
నైతిక విలువలు నేర్పే
సంస్కర్తలు రావాలి
దేశకీర్తి చాటి చెప్పే
దేశభక్తులు లేవాలి
అద్దంలాంటి పిల్లలు
సుతిమెత్తని మల్లెలు
జాగ్రత్తగా చూడాలి
అడుగుముందుకేయాలి

నవ్వుల బాలుడు-నింగిని భానుడు
----------------------------------------
ముద్దులొలుకు బాలుడు
భారతమ్మ పుత్రుడు
సదన గగనంలోన
కాంతులీను భానుడు
వెన్నెల రాత్రుల్లో
అందమైన చంద్రుడు
సంతస వేళల్లో
నవ్వు మొగం ఉన్నోడు
కాబోయే పౌరుడు
బాధ్యత గల వీరుడు
మా అందరి ప్రాణము
మా ఇంటి చిన్నోడు
రోశమున్న సైనికుడు
మా వంశ వారసుడు
చదువుకుంటే గనుక
అవుతాడు గొప్పోడు

సంతోషమెక్కడ?
----------------------------------------
సంతోషానికి మించిన
ఐశ్వర్యమసలు లేదు
గుండెల్లో నిలువుకొనిన
ఏది కూడా సాటి రాదు
నిత్యమైన సంతోషము
నీ చేతుల్లో ఉన్నది
కాపాడుకొనుము అనిశము
చెత్తా వదిలిన మంచిది
ఎక్కడో లేదు నాకము
దాని స్థానమే హృదయము
నీలోనే ధ్యానంలో
నిర్మించుము! ఆ లోకము
పనికిరానివి వదిలితే
మకిలి పనులు మానితే
నీ వెంటే సంతోషము
మిత్రుడగును అనునిత్యము

ఉన్న దాంట్లో తృప్తి చా(మే)లు!
----------------------------------------
లేని దాని కోసము
ఎందుకు! ఆరాటము
ఉన్న దాంట్లో ఉంది
మిక్కిలి ఆనందము
సంతృప్తే లేనిది
మానవుని జీవితము
సర్దుబాటు అన్నది
అసలు సిసలు మార్గము
ఎండమావుల్లో
నీటికై వెదకులాట
కాదా! అవివేకము
అగునోయ్! వృథా వేట
ఉన్న దాన్ని కోల్పోకు
భ్రమల్లో పడిపోకు
భగవంతుడిచ్చినది
సృష్టిలోన మిన్నది
-గద్వాల సోమన్న
Comments