Pukaru Written By Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
"ఏమేవ్... కాఫీ తొందరగా తగలెట్టు... అవతల ఆఫీస్ కి టైం అయిపోతోంది... వెధవది... కాఫీ కడుపులో పడితే కానీ ఏ పనీ అయి ఛావదు...ఏమేవ్... వినిపిస్తోందా..." అంటూ అరుస్తున్నాడు రాఘవయ్య పెళ్ళాం మీద...
"అబ్బబ్బబ్బా... ఏమిటండీ... ఆ గావుకేకలు... తెస్తున్నాను..
కాసేపైనా దేముడి ముందర ప్రశాంతంగా కూర్చుని దండం పెట్టుకోనివ్వరు కదా...ఇదిగో మింగండి" అంటూ కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేసి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయి... కసా... కసా కూరలు తరిగేస్తూ... వేడి వేడి నూనెమూకుట్లో... కరివేపాకు వేసింది...
"ఓయ్ పంకజం... నీ కోపం అంతా వంట మీద చూపించకు... తినలేక చస్తున్నాను... అసలే ఉప్పు, పులుపు లేని చప్పిడి వంట తగలెడతావ్.... దానికి తోడు ఇలా మాడ్చేసావనుకో... ఆఫీస్ లో నేను బాక్స్ ఓపెన్ చేయగానే... నాతో పాటు తినే వాళ్ళకి కూడా నా బతుకేంటో తెలిసిపోతుంది..." అంటూ ఆవిడని ఇంకా రెచ్చగొట్టాడు రాఘవయ్య...
"ఏంటన్నారు... మీ బతుకేంటో అందరికి తెలిసిపోతుందా...
ఏమైంది మీ బతుక్కిప్పుడు....
రోజుకోరకం కూర, పప్పు చేసిపెడుతున్నాను కదా... నా చేతి వంటకే పేరు పెడతారా" అంటూ అప్పడాల కర్ర అందుకుంది..
"ఏంటే... ఏంటి అప్పడాల కర్ర చూపిస్తున్నావ్... ఇప్పుడేమంటావ్... నీ వంట పెంట...నీ గొంతు కాకి గొంతు .. నీ మొహం గ్రద్ద మొహం..." అంటూ పంచ పైకి మడ తేసి కట్టాడు రాఘవయ్య....
"ఏంటి రెచ్చిపోతున్నారు..." అంటూ అప్పడాల కర్ర రాఘవయ్య మీకీ విసిరికొట్టింది పంకజం. ఆ
అప్పడాల కర్ర సరాసరి వెళ్లి రాఘవయ్య కాలిమీద పడి లబో.. దిబోమన్నాడు......
ఐనా పంకజం ఊరుకోకుండా... "ఇంకెప్పుడు నా జోలికి రాకండి... పోయి ఆ కాఫీ తాగి తగలడండి... చల్లగా ఇచ్చి చచ్చావ్ అంటూ మళ్ళీ నామీదే పడి ఏడుస్తారు..." అంటూ ఉరిమి చూసింది పంకజం...
'కుయ్యో... మొర్రో' అంటూ ఆ కాఫీ ఏదో గొంతులో పోసుకుని... బాత్రూంలోకి దూరాడు రాఘవయ్య....
****** ***** *****
పెళ్ళై 25ఏళ్లయినా... అలాగే ఉంటారు వాళ్లిద్దరూ...
వాళ్ళకి పిల్లలు లేరు... ఉండుంటే కొంచమైనా మారేవారేమో...
ఎప్పుడు చుసిన ఇలా పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటూనే ఉంటారు...
వారి జీవన విధానమే నిత్య రణం....
కానీ అది వారి ప్రేమాయణం...
ఒకళ్లంటే ఒకరికి ప్రాణం...
ఆలా సాగిపోతోంది వాళ్ళ జీవన ప్రయాణం....
***** ***** *****
"ఏమేవ్... ఆఫీస్ కి వెళ్ళొస్తాను... నువ్వు జాగ్రత్త... బాత్రూం జారుతోంది... అడుగు గట్టిగా వేయి... నేను లేను కదా అనేసి.. కాఫీలోనూ , టీ లోనూ పంచదార వేసేస్కోకు... నీకు షుగర్ ఎక్కువగా ఉంది... అన్నానికి ముందు టాబ్లెట్ వేసుకో.. జాగ్రత్తగా ఇంటి పట్టునే తగలడు...
పెత్తనాలకి పోకు..." అంటూ లక్ష జాగ్రత్తలు చెప్తూ... గుమ్మం దాటుతున్నాడు రాఘవయ్య...
"ఆ సర్లెండి నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ... ముందు మీరు హెల్మెట్ పెట్టుకుని తగలడండి... నాకు చెప్పొచ్చారు కానీ మీకే జాగ్రత్త తెలీదు... బాక్స్ లో మీకు ఇష్టమైన వంటే చేసి పెట్టాను... ఎవరికీ పెట్టకుండా మీరే తినండి" అంటూ దగ్గరగా వెళ్లి నుదిటిన ప్రేమగా ముద్దుపెట్టుకుని... జాగ్రత్తగా వెళ్ళిరండి... అంది...
ఇది వారింట్లో నిత్యకృత్యం...
వారిద్దరూ పిల్లి ఎలకల్లా తగువులడుకోడంతో... పిల్లలులేరన్న లోటు ని కూడా మర్చిపోతుంటారు....
కొట్టుకోకపోతే వాళ్ళకి పొద్దుపొడవదు....
***** ***** *****
రాఘవయ్య ఆఫీస్ కి వెళ్ళింది మొదలు... పక్కింటి వనజమ్మ, జలజమ్మలతో కబుర్లు మొదలెట్టేస్తుంది పంకజం...
ఇంక లోకాభిరామాయణం అంతా... వీళ్ళకే కావాలి...
'అయ్యో.. అలాగట వదినా ....' 'ఇలాగట వదినా' అంటూ... వాళ్ళమీద... వీళ్ళమీదా పుకార్లు సృష్టించి మరీ చెప్పేస్తూ ఉంటుంది జలజమ్మ....
మొగుడిమీద వీరంగం ఆడేసే పంకజానికి... జలజమ్మ మాటంటే ఎంతో నమ్మకం... ఆమెను గుడ్డిగా నమ్మేస్తుంది...
ఆవిడ చెప్పిన మాటల్లో అబద్దాలే ఎక్కువుంటాయి... అది తెలిసే... రాఘవయ్య... చాలాసార్లు నచ్చచెప్పాలని చూసినా..
అగ్గిమీద గుగ్గిలం అయ్యేదే తప్ప... వినేది కాదు... అయినా ఆయన చెప్పడం మానడు, ఈవిడ పుకార్లు వినడము మానదు...
***** ***** *****
రోజూలాగే ఇవాళ కూడా వాళ్ళ మీటింగ్ షురూ...
"వదినా... మీ ఎదురింట్లో కొత్తగా దిగిందిచూడు ఆ సీత... దానికెంత పొగరో తెలుసా... రోజూ మొగుడితో గొడవేనంటే నమ్ము.. పైగా అత్తగార్ని కూడా కొడుతోందిట" అంటూ సీత మీద లేని పోనివేవో చెప్పేసింది జలజమ్మ... అదంతా వింటూ నోరునొక్కుకుంటూ... "అవునా జలజా... ఈరోజుల్లో కోడళ్ళు ఇంతేనమ్మా... మనరోజుల్లో ఐతేనా.. అత్తగారి మాటే వేదమాయే" అంటూ దీర్ఘాలు తీస్తూ...ఊసులు చెప్పుకుంటూ ఉండగా..
"అయ్యో వదినా... మాటల్లో పడి మర్చిపోయాను... పొయ్యిమీద పాలు పెట్టాను... ఉంటానే... అన్నం తినేసి మజ్ఙానం వస్తాను మీ ఇంటికి" అంటూ పరుగందుకుంది జలజమ్మ ...
పంకజం కూడా ఇంటిలోకి వెళ్లిపోతూ ఎదురింటివైపు చూసింది....
అత్తగార్ని వీల్చైర్ మీద కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెడుతోంది సీత... ఆమె అత్తగారి మోహంలో ప్రశాంతతను బట్టి చెప్పొచ్చు సీత ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకుంటోందో...
వాళ్ళిద్దరినీ చూసి.... 'జలజమ్మొదిన చెప్పింది నిజం కాదేమో ?...' అనిపించింది పంకజానికి మొదటిసారి...
'హ... సర్లే..' అంటూ ఇంట్లోకి వెళ్లి తలుపువేసుకుని .. పని చేసుకుంటోంది పంకజం...
కాసేపటికి... ఎవరో తలుపుకొడుతుంటే...
'ఏంటి... అప్పుడే వచ్చేసింది జలజమ్మొదిన' అనుకుంటూ వెళ్లి తలుపుతీసింది... అంతే ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది...
"లోపలికి రావచ్చా పిన్ని గారూ" అంటూ పలకరింపుగా నవ్వుతూ నిలబడింది కొత్తగా వచ్చిన ఎదురింటి సీత...
"హా.. రామ్మా..." అంటూ లోపలికి తీస్కెళ్ళి కూర్చోమని కుర్చీ చూపించింది...
"నా పేరు..."
"హ తెలుసమ్మా... సీత కదూ... మా జలజమ్మొదిన చెప్పింది..
"అవును పిన్ని... మేము కొత్తగా వచ్చాము కదా... పరిచయమ్ చేసుకుందామని వచ్చాను...."
'ఈమె ఎంత సౌమ్యంగా, హుందాగా ఉంది... అసలు వదిన చెప్పినట్టుగా ఏమి లేదే' అనుకుంది మనసులో పంకజం...
"మీ గురించి తెలుసుకోవచ్చా పిన్ని" అంది సీత...
"అయ్యో.. దానిదేముందమ్మా... నేను మా అయన ఇద్దరమే ఉంటాం... మాకు పిల్లలు లేరు... మా ఆయన బ్యాంకు మేనేజర్ .. ఇంకో నాలుగేళ్లు సర్వీస్ ఉంది... ఏదో ఆలా కాలక్షేపం మాకు" అంది..
"మీరేమీ అనుకోనంటే నాదొక చిన్న మనవి పిన్నీ...మీ గురించి మీ భర్త గురించి జలజ ఆంటీ నా దగ్గరకి వచ్చి లేనిపోనివన్నీ చెప్తోంది..ఆవిడకి దూరంగా ఉండండి... నేను వచ్చి నెలే అయినా... నాకు మీ గురించి అర్ధమయింది .... పొద్దున్న మీరు, బాబాయ్ గారు చిన్నపిల్లల్లా పొట్లాడుకుని, మళ్ళీ ఎంతప్రేమగానో మాట్లాడుకోడం అంతా నేను గమనించాను....
కల్మషం లేని మీ ప్రేమకి నిదర్శనం అది.. మీరంటే నాకు ఎంతో అభిమానం గౌరవం ఏర్పడింది. అందుకే మీకు వచ్చి చెబుతున్నాను... నేనేమైన తప్పుగా చెప్పి ఉంటే మన్నించండి..." అంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది...
పంకజానికి బుర్ర మొద్దుబారిపోయింది...
జలజమ్మ నాగురించి సీతకు, సీత గురించి నాకు చెడుగా చెప్పిందన్నమాట.....
ఇన్నాళ్లు జలజమ్మొదిన ఏమి చెప్తే అదే నిజమనుకున్నాను... అయన ఎన్నోసార్లు చెప్పారు... దాన్ని నమ్మకే అని... విన్నానా? పైగా అయనమీదకి యుద్ధం ప్రకటించేదాన్ని... అనుకుంటూ బాధగా కూర్చుంది ...
ఇంతలో... ఎం వదినా... పని ఐపోయిందా... ఆలా కుర్చున్నావ్ అంటూ లోపలికి వచ్చింది జలజ... ఆవిడ్ని చూస్తూనే అరికాలుమంట.. నెత్తికెక్కింది పంకజానికి... కానీ తమాయించుకుని... జలజ ఎం చెప్తుందో చూద్దామని ఆగింది...
"వదినా... ఆ రంగమ్మ...మొగుడ్ని ఏవత్తో వలలో వేసుకుందిట, మా పనమ్మాయి చెప్పింది..." అంటూ రంగమ్మ మొగుడిపై పుకార్లు లేవనేత్తిన్ది జలజమ్మ....
ఇంక వినలేకపోయింది పంకజం...
"చూడు జలజా! నాకు ఇకమీదట ఇలాంటివి ఏమి చెప్పకు... నాకు చాలా పనిఉంది.. నేను తరువాత మాట్లాడుతాను" అంది...
జలజమ్మకు ఎదో తేడాకొట్టింది...' ఇవాళ దీనికేదో అయ్యింది.. తొందరగా జారుకోవాలి... 'అనుకుంది మనసులో...
"సర్లే వదినా... ఉంటాను మరి" అనేసి బయటకు వెళ్ళిపోయింది...
జలజమ్మ వెళ్లడంతోనే... భళ్ళుమని తలుపు వేసుకుంది పంకజం .... సోఫా లో కూర్చుండిపోయి...ఆలా ఎదో ఆలోచించుకుంటూ... ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీకుండానే నిద్రపోయింది...
***** ***** *****
సాయంత్రం 5...
"ఏమేవ్ తలుపుతియ్యి" అంటూ డోర్ కొడుతున్నాడు రాఘవయ్య...
ఆ చప్పుడికి మెలుకువొచ్చి.. చూస్తే... సోఫా లో ఉంది... 'అయ్యో ఇదేంటి ఇలా మొద్దునిద్రపోయాను' అనుకుంటూ వెళ్లి తలుపుతీసింది...
"ఏంటే.. .. వంట్లోకానీ బాగోలేదా... నేనొచ్చేసరికి ఇంట్లోనే ఉన్నావ్... జలజమ్మింట్లోనో వనజమ్మింట్లోనో ఉంటావ్ కదా రోజునూ..." అంటూ వెటకారంగా నవ్వాడు రాఘవయ్య...
మాములుగా ఐతే ఈపాటికి అప్పడాల కర్ర విరిగేది ఆలా అనేసరికి...
కానీ పంకజం ఏమి మాట్లాడకుండా... లోపలికి వెళ్లి కాఫీ కలిపి పట్టుకొచ్చి ఇచ్చి... పక్కన కూర్చుంది...
"ఏంటోయ్ ఆలా సైలెంట్గా ఉన్నావ్... నిజంగానే వంట్లోబాగోలేదా" అంటూ నుదిటిపై చేవేసి "జ్వరమేమి లేదు మరి ఎందుకు డల్గా ఉన్నావ్?" అన్నాడు...
అమాటకు బదులుగా... నీరు నిండిన కళ్ళతో భర్త వంక చూసింది....
"ఏమైందే... నీ కంట్లో నీళ్ళేంటి" అంటూ కంగారుపడిపోయాడు రాఘవయ్య...
"ఏమండీ... మీరు ఎన్నోసార్లు చెప్పారు పుకార్లు పుట్టుంచేవారికి దూరంగా ఉండమని.. మీ మాట నేను వినలేదు సరికదా... మీ పైన ఒంటి కాలుతో లేచి, నాలుగు చేతులతో యుద్ధం చేసేసేదాన్ని...
ఇవాళ నాకు బుద్ది వచ్చిందండి...
ఎదురింటమ్మాయి సీత వచ్చి 'జలజమ్మ... మనపైన లేనిపోనివన్నీ ప్రచారం చేస్తోందని, ఆమెతో జాగ్రత్తగా ఉండమ'ని చెప్పివెళ్ళింది... మాములుగా ఐతే నేను ఆ పిల్లని నమ్మేదాన్ని కాదేమో... కానీ సీత గురించి జలజమ్మ నాతో చెప్పింది కూడా ఉట్టి మాటలే అని నేను తెలుసుకున్నాను..
అందుకే నేను సీతని నమ్మగాలిగాను" అంటూ రాఘవయ్యను పట్టుకుని భావురుమంది...
"ఊరుకోవే పిచ్చిదాన... ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావ్...
ఇకమీదటైనా చెడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండు...
గాంధీ గారు చెప్పినట్టు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు...
భగవద్గీత చదువు.. చాగంటి వారి ప్రవచనాలు విను, లేదా నీకిష్టమైన పాటలు పెట్టుకుని విను... మనసు ప్రశాంతం గా ఉంటుంది...సరేనా అంటూ ఓదార్చాడు రాఘవయ్య...
ఆరోజు నుండి... పుకార్లు సృష్టించే వారికి దూరంగా ఉంటూ.. మంచిని పంచేవారితో స్నేహం గా ఉంటూ... భగవద్భక్తిని అలవరుచుకుని ప్రశాంతంగా జీవించింది పంకజం...
��చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్న మహాత్ముని మాట మననం చేసుకుంటూ..��
��శుభం ��
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
అద్భుతం గా ఉంది... మన చుట్టూ పూకార్లు పుట్టించేవారు ఉంటారు, వారితో జాగ్రత్తగా ఉంటూ...వారికి దూరంగా ఉండాలనే సందేశం చాలా బాగుంది 👌👌👌👋👋👋
చాలా బాగుందండి. చెడు మాట్లాడకూడదు. చెడు చూడకూడదు. చెడు వినకూడదు అని అంటారు గానీ, బయట ప్రపంచంలో మనుషులు చేసే మొదటి మూడు పనులు ఇవే అవుతుంటాయి. అటువంటి వారికి కనువిప్పు కలిగేలా రాశారు. చాలా బాగుందండి.
Coffee laaga ruchiga undi 😊