కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Pula Bata Veyyandi' New Telugu Story By Ramakuru Lakshmi Mani
రచన: రామకూరు లక్ష్మి మణి
“అబ్బా! హాయిగా ఉందండి, నారాయణ గారు.. మీ ఇంటి వాతావరణం ...చక్కగా బోల్డు చెట్లు వేశారు ఇంటి ముందు..” అన్నాడు కేశవ్.
లోపలి ప్రవేశిస్తూనే, మంచి గాలి వీస్తూ పచ్చని చెట్లతో కనులవిందుగా అనిపించింది. ఇంట్లోకి ప్రవేశించే మెట్ల పక్కన రంగురంగుల పూలతో కుండీలు స్వాగతం పలికాయి.
నారాయణ, కేశవ్ ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులు...నారాయణ కేశవ్ కన్నా సీనియర్. కేశవ్ నారాయణ చేసే బ్యాంకు కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్యాంకు కి దగ్గరగా
ఇల్లు చూసుకోడానికి నారాయణ సహాయం అడిగాడు.
ఇదివరకు చేసే బ్రాంచ్ కి దగ్గరలో ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే అది చాల దూరం అవటం వలన ప్రస్తుతం చేస్తున్న చోటికి రావడానికి రోజూ ఇబ్బంది పడుతున్నాడు. తమ రోడ్డులోనే ఇల్లు ఖాళీగా ఉంది, చూడటానికి రమ్మని తనతోబాటు తీసుకు వచ్చాడు నారాయణ ..
ఇల్లు చూసారు, చాలా నచ్చింది కేశవ్ కి. మర్నాడు భార్యని కూడా తీసుకొచ్చి చూపించి అడ్వాన్స్ ఇస్తానని ఇంటి ఓనర్స్ కి చెప్పి వచ్చాడు.
ఇంతదూరం వచ్చారు మా ఇంటికి రండి అంటూ నారాయణ ఆహ్వానంతో వాళ్ళింటికి వెళ్ళాడు. నారాయణ భార్య రాధిక లోపల్నించి వచ్చి నమస్కారం చేసింది.
ముందు రూమ్ లో కూర్చున్నారు. అన్నీ చక్కగా నీట్ గా మంచి కళాత్మకంగా సర్ది ఉన్నాయి.
ఇంతలో నారాయణ ఇద్దరు కొడుకులు లోపల్నించి వచ్చారు. మంచినీళ్ల గ్లాసులతో ఒకరు, టీ కప్స్ పట్టుకుని ఒకరు. నారాయణ పరిచయం చేసాడు. చిన్నవాడు టెన్త్ క్లాస్, పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు వినయంగా నమస్కరించి లోపలి వెళ్లి పోయారు.
కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు..బ్యాంకు విషయాలు మాట్లాడుకున్నారు. చిన్నవాడు వచ్చి వాళ్ళు తాగిన మంచినీళ్ల గ్లాసులు , టీ కప్స్ లోపలికి తీసుకెళ్లాడు. అది చూసిన కేశవ్ మనసులోనే అభినందించకుండా ఉండలేక పోయాడు. తర్వాత కేశవ్ భార్యతో వచ్చి ఇల్లు చూసుకుని , అడ్వాన్స్ ఇచ్చి రాబోయే ఫస్ట్ కి మంచి రోజు చూసుకుని వస్తామని చెప్పాడు.
కేశవ్ ఇల్లు మారిన తర్వాత నారాయణతో కలిసి ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. వాళ్ళు ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు..ఒక వారం కేశవ్ స్కూటర్ని , ఒక వారం నారాయణ స్కూటర్ ని తీసి ఇద్దరూ ఒకే బండి మీద వెళ్లాలని అనుకున్నారు. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చని నారాయణే అలా ప్రతిపాదించాడు.
కేశవ్ భార్య ప్రభ అంత స్నేహశీలి కాకపోవడం తో రాధికకి, ఆమెకి అంత స్నేహం కలవలేదు. కేశవ్ కి ఇద్దరు కూతుళ్లు. పెద్దది టెన్త్ పాసయ్యి ఇంటర్ లో చేరింది., చిన్నది టెన్త్ లోకి వచ్చింది. కేశవ్ కి నారాయణ కొడుకుల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఎప్పుడు వాళ్ళింటికి వెళ్లినా చక్కగా వచ్చి నమస్కారం చేస్తారు వినయంగా.. 'మంచి నీళ్లు కావాలా అంకుల్' అని అడుగుతారు. రాధిక కూడా ఎంత పనిలో ఉన్నా బయటకు వచ్చి పలకరించి వెడుతుంది.
ఆమె ఏదో ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తుందని , పెరాలిసిస్ తో ఉన్న అత్తగారిని చూసుకోడానికి ఆరు నెలలు లీవ్ పెట్టిందని నారాయణ మాటల్లో తర్వాత తెలిసింది కేశవ్ కి.
కేశవ్ ఇంటికి ఎప్పుడైనా నారాయణ వస్తే ఒక్కసారి కూడా ప్రభ వచ్చి పలకరించదు.. ఏనాడూ పిల్లలు బయటకు వచ్చిన పాపాన పోలేదు. అంతేగా.. ఆవు చేలో మేస్తూంటే, దూడ గట్టున మేస్తుందా అన్నట్లు తల్లి లాగే పిల్లలు కూడా.
పిల్లలు ఏరోజు పొద్దున్నే నిద్ర లేవరు .. లేచిన తర్వాత పక్క బట్టలు తీసి మడత పెట్టడం, తాగిన పాల గ్లాసులు తీసుకెళ్లి సింక్ లో వెయ్యడం, తిన్నతర్వాత ప్లేట్స్ తియ్యడం లాంటి అలవాట్లేమీ కనబడలేదు. జుట్టు దువ్వుకుని ఆ వెంట్రుకలు అలాగే దువ్వెనకు ఉంచేయడం, రాస్తున్న పెన్నులు, పుస్తకాలు అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ పడేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
కేశవ్ కి తన పిల్లలు సరిగ్గా పెరగటం లేదు అనిపించింది మొట్టమొదటి సారిగా.. 'ఆడపిల్లల్ని పెంచే విధానం అది కాదు' అనిపించింది.
“ఈరోజుల్లో మగపిల్లలికి కూడా అన్ని పనులు రావాలండి” అంటాడు నారాయణ ..
“ఎప్పుడైనా రాధికకి ఒంట్లో బాగులేకపోతే నేను, మా అబ్బాయిలు కలిసి వంట చేస్తాము. వాళ్లకి
గిన్నెలు తోమడం, కూరలు తరగడం లాంటి పనులు వచ్చు. పెద్దయి పెళ్లి అయిన తర్వాత భార్యకి కూడా సహాయం చేస్తూ, భార్య కష్టసుఖాలు అర్ధం చేసుకుంటూ సంసారాన్ని చక్కగా నడిపించుకోవచ్చు..పిల్లల్ని పెంచడం లో తన పాత్ర కూడా ఉంటె ఆడవారికి కొంత భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. “ అంటాడు నారాయణ.
నారాయణ మాటలు విన్న తర్వాత కేశవ్ ఆలోచనలో పడ్డాడు. నిజమే చిన్నతనం లోనే అన్ని పనులు చెయ్యడం అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్లకి అత్తగారింటికి వెళ్ళాక గొడవలు ఉండవు. ఆడపిల్లలకయినా, మగపిల్లలకయినా మర్యాద, మన్నన , సంస్కారం నేర్పాలి
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే.. అప్పుడే పెళ్ళి అయిన తర్వాత ఒకరిని మరొకరు అర్ధం చేసుకుని చక్కగా సంసారం చేసుకుంటారు.
నారాయణ కుటుంబాన్ని చూసిన కేశవ్ కి ఎన్నో నేర్చుకోవాలి వారినుండి అనిపించింది..తన ఆడపిల్లల్ని మంచి దారిలో పెట్టాలంటే అలాంటి వారిని చూపించి, వాళ్ళు ఏమి నేర్చుకోవాలో తెలియచెప్పాలనిపించి తన పిల్లలికి కూడా నారాయణ పిల్లల మాదిరి మర్యాద, వినయం, పెద్దవాళ్ళని గౌరవించడం లాంటివి నేర్పాలని నిశ్చయించుకున్నాడు కేశవ్.. అయితే అదేదో కొట్టి, తిట్టి కాకుండా, దాస్టికం చెయ్యకుండా వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునేట్లు
చెయ్యాలని తరచు వాళ్ళిద్దర్నీ నారాయణ ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ మగపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో కళ్లారా చూసేట్లు చేసాడు. వాళ్ళ అమ్మానాన్నలకు వాళ్ళు
సహాయం చేస్తూ ఎన్నో పనులు చెయ్యడం చూసారు కేశవ్ కూతుళ్లు. వంటపని దగ్గర్నుండి, బయట సామాను కొనుక్కురావడం వరకు అన్నీ చేస్తున్నారు..అన్ని పనులు చేస్తూ కూడా చదువుని నిర్లక్ష్యం చెయ్యట్లేదు.
ఇంటికి వచ్చాక యధాలాపంగా పోలుస్తున్నట్లు కాకుండా వాళ్లకి అర్ధం అయ్యేట్లుగా చెప్పేవాడు.
ఇప్పుడు అన్ని పనులు చెయ్యడానికి అలవాటు పడితే , పెద్దయిన తర్వాత ఎలాంటి కష్టాన్నయినా తట్టుకోగలుగుతారు..ఎంత పెద్ద పనులయినా చేయగలుగుతారు..అని వాళ్లకి అర్ధమయ్యేట్లు చెప్పాడు.
ఆడపిల్లలు కదా ఇట్టే పట్టేసేవాళ్ళు తండ్రి చెప్పిన దాన్ని. తండ్రి తమ మంచికే చెప్తున్నాడని అర్ధమయ్యింది వాళ్లకి.
వాళ్ళల్లో చాల మార్పు వచ్చింది రెండు నెలలకి.
ఒకరోజు పొద్దున్నే నారాయణ పెద్దకొడుకుని వెంటబెట్టుకుని స్వీట్స్ తో వచ్చాడు. ఎం సెట్ లో మంచి ర్యాంకు వచ్చిందని చెప్పడానికి.
కేశవ్ కూతుళ్లు ఇద్దరూ బయటకు వచ్చి అభినందించారు . ప్రభ లోపల్నుంచి స్వీట్ తో వచ్చి అబ్బాయి నోట్లో పెట్టి దీవించింది. కేశవ్ వాళ్ళ వంక ఆప్యాయంగా చూశాడు..ఇన్నాళ్లకు తన కూతుళ్లు తాను ఆశించినట్లు
మారినందుకు.
ఆడపిల్లల్నయినా, మగపిల్లల్నయినా చక్కగా పెంచాలి. వారి జీవితాన్ని పూల బాటలో నడిచేట్లు చేసే బాధ్యత తల్లితండ్రులదే అని నా నమ్మకం కేశవ్ గారు అన్న నారాయణ గారి మాటలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు కేశవ్.
***శుభం ***
రచయిత్రి పరిచయం : నా పేరు రామకూరు లక్ష్మి మణి ( pen name )
అసలు పేరు--( official ) R.L.Manikyamba
నేను ప్రభుత్వ హై స్కూల్ టీచర్ గా పనిచేసి పదమూడేళ్ళక్రితం రిటైర్ అయ్యాను. నా విద్యార్హతలు M A, MEd, M.phil
నాకు చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం అంటే మక్కువ. సంగీతం లో ప్రవేశం ఉన్నా దానిని కొనసాగించలేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యి కొన్ని నాటికలలో పాల్గొనడం జరిగింది. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం నా హాబీ..అడపాదడపా రాస్తూ వారపత్రికలకి పంపేదాన్ని. ముద్రితమయ్యాయి.
గత రెండేళ్లుగా ప్రతిలిపి లో కధలు, ధారావాహికలు, వ్యాసాలు,కవితలు రాస్తున్నాను. నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు గెలుచుకోవడం జరిగింది.
కథ చాలా బాగుంది మేడం. మంచి సందేశం ఉంది.