top of page

పులసయ్య

#Pulasaiah, #పులసయ్య, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Pulasaiah - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 14/11/2024

పులసయ్యతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


‘పులస’, గోదావరిలోని ఉప్పునీటిలో పెరిగే అరుదైన చేప. వృద్ధాప్యం వచ్చాక సముద్రంలోకి వలస పోతుంది. సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన సమయంలో మత్స్యకారులు వీటిని పడుతారు. దీని వెల అధికం. అతి రుచిగల చేప. దీన్ని సముద్రంలో పడితే, దాన్ని ’వలస చేప’ అంటారు. దీనికి మరోపేరు ’హెల్సా’. ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధి. ధవళేశ్వరం బ్యారేజి నుండి సముద్రం వైపు సాగే గోదావరి ప్రవాహంలో ఇవి దొరుకుతాయి. నదీ ప్రవాహానికి ఎదురుగా అతివేగంగా ఈదగలదు ఈ పులస. సముద్రంలో వున్నప్పుడు ఇవి ’వలస’లుగాను, సముద్రం నుండి గోదావరి నది నీట ఎదురీదుతూ అక్కడ వున్నప్పుడు పులసలుగా పిలవబడతాయి. గోదావరి నదిలో గుడ్లు పెట్టి సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. ఆడ చేపకు (శన) మగ చేపకు (గొడ్డు) అని పేర్లు. ఈ పులస చేపలు చాలా రుచి మరియు ఖరీదు.


జలాశయాల్లో, నదుల్లో, సముద్రాల్లో అనేక రకాల పేర్లతో చేపలు పెరుగుతాయి, ప్రపంచంలో అన్ని వర్గాల వారూ జన్మించి బ్రతుకుతున్నట్లు. 


అతని పేరు పులసయ్య. వయస్సు పాతిక సంవత్సరాలు. పుట్టింది రంగయ్య, బాలమ్మ అనే దంపతులకు. తల్లి, తండ్రి కరోనా కాలంలో గతించారు. పులసయ్య ఏకాకి. పేద పులసయ్య, కలవారు కోట్లకు అధిపతి అయిన ధర్మారావు గారి నౌకర్లలో ఒకడు. వారి వద్ద ఇరవైమంది మగవారు, పదిమంది ఆడవారు పనిచేస్తున్నారు. ధర్మారావు గారికి స్టీమ్ బోట్లు పది వున్నాయి. మగవారు సముద్రంలోనికి వెళ్ళి రొయ్యలను వేటాడి రెండు మూడురోజులకు తిరిగి వస్తారు.

వారికి పెద్ద కోల్డ్ స్టోరేజీ వుంది. మగ నౌకర్లు పట్టి తెచ్చిన రొయ్యలను సైజు వారీగా విడదీసి శుభ్రం చేసి కోల్డ్ సోరేజీలో భద్రపరచడం ఆడవారి పని.


వారానికి పదిరోజులకు ఒకసారి రొయ్యలను ఐసు బాక్సుల్లో భద్రపరిచి అమెరికాకు బ్రిటన్ విమానం ద్వారా ఎగుమతి చేయడం... ధర్మారావు గారి ముఖ్యమైన వ్యాపారం. ఆ సిబ్బందిలో పులసయ్య ఒకడు. అతను అందరికంటే చిన్నవాడు. ముక్కు సూటిగా నడిచేవ్యక్తి. అబద్ధాలు, ఇతరులపై చాడీలు చెప్పడం అతనికి తెలియదు. ఆ కారణంగా పులస, అంటే సాటి వారందరికి ద్వేషం. యజమాని ధర్మారావు ఎంతో అభిమానం. పులసయ్యకు అతని తల్లి గౌరి, రంగయ్యలు ఆ పేరు పెట్టేదానికి కారణం, వారి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయినా సంతతి లేదు.

ఓ పున్నమి రోజున గౌరి, రంగయ్య వెన్నెల్లో ఇంటిముందు చాపపై పడుకొని వుండగా....


"గౌరీ!..."


"ఏందయ్యా!"


"ఏమే!... నీవు ఇంకా ఏమీ అనుకోలేదేమో!..." ప్రీతిగా అడిగాడు రంగయ్య.


"ఏంటయ్య నీవనేది అరదం కాలా!"


"నాకు వారసుడిని ఎప్పుడు ఇస్తావే!"


"ఆ.... అది నా చేతిలో పనా!... ఠక్కున చేసేదాన్ని. దైవం కన్ను తెరవాలి కదయ్యా!" విచారంగా చెప్పింది గౌరి.


"ఆ.... అదీ నిజమేలే!... అయినా ఓ మాట అడగతా!"


"అడుగయ్యా!"


"నీకు ఏమైనా ఇంతవరకు తిననిది తినాలని వుందా!"


గౌరి మౌనంగా ఆలోచనలో వుండిపోయింది.

"అడిగేది నిన్నేనే. నీ మనసున ఏదైనా తినాలనుంటే సెప్పు గౌరీ!" లాలనగా అడిగాడు రంగయ్య.


"వుందయ్యా!"


"ఏందది?"


"పులస"


"ఆ... పులసనా!" ఆశ్చర్యంతో అడిగాడు రంగయ్య.


"అవునయ్యా!...."


"అది చాలా ఎలగల చేపే!" ఆశ్చర్యంతో చెప్పాడు రంగయ్య.


"అట్టాగానా!"


"అవును."


గౌరి మౌనంగా వుండిపోయింది.


"గౌరీ!"


"ఆ...."


"అయినా నీవు తినాలని వుందని అన్నావుగా!... నీకోసం పులసలు తెస్తానే!"


"ఎక్కడ నుంచి?"


"సముద్రం నుంచి!"


"నిజంగా!"


"సత్తెంగా!"


గౌరి ఆనందంగా నవ్వింది. రంగడి హృదయంపై వాలిపోయింది.


రంగయ్య....

సముద్రపు వేటలో కొన్ని పులసలను పట్టాడు. పులస అంటే అందరికీ ఆశే. మిగతా వారు నాకు కావాలంటే నాకు కావాలని వాదులేసుకొన్నారు. ’పులసలు పట్టింది నేను. వీరంతా కావాలని వాదులేసుకొంటుండరు. ఈరితో వాదించి ప్రయోజనం లేదు. యజమాని గారిని అడగాలి’ అది పులసయ్య నిర్ణయం.


అందరూ డ్యూటీ దిగి, సరుకును కోల్డ్ స్టోరేజికి చేర్చారు. రొయ్యల మధ్యన పాతిక పులసలు వున్నాయి.


అందరికీ భట్వాడా (డబ్బు) ఇచ్చి ధర్మారావు పంపేశాడు. తలవంచుకొని నిలబడి వున్న పులసయ్యను చూచాడు.


"ఏరా! ఇంటికి పోలా!"


"అయ్యా!"


"ఏమన్నా కావాలా!"


"అవునయ్యా!"


"ఏం కావాలి?"


"పులస"


"పులసనా?"


"అవునయ్యా!.... నేను పాతిక పులసలు పట్టానయ్యా!.... నా పెళ్ళానికి తినాలని ఆశగా వుందంట అయ్యా!"


ధర్మారావుకు విషయం అర్థం అయ్యింది చిరునవ్వుతో....

"రేయ్!... రంగా!... నీవు కోల్డ్ స్టోరేజ్‍కి ఎల్లి పది పులసలను నీవు తీసుకొని ఇంటికి వెళ్ళు! మిగతా పదిహేనింటిని మన ఇంటికి పంపు. సరేనా!..."


"అట్టాగే సామీ!"


రంగడు కోల్డ్ స్టోరేజ్‍కి వెళ్ళి తాను పది పులసలను తీసుకొని మిగతా వాటిని యజమాని ఇంటికి పంపి, తన ఇంటికి వెళ్ళిపోయాడు. గౌరి ఆ పులసలను చూచి ఎంతగానో సంతోషపడింది. కూరవండి తిన్నది. గౌరి నెల తప్పింది. నవమాసాలూ నిండాయి. ఒకరోజు భానోదయ సమయంలో సుఖ ప్రసవం. మగశిశువును జన్మించింది గౌరి. ఆ దంపతులు అతనికి పులసయ్య అనే పేరు పెట్టారు.


ధర్మారావుకు ఒక కొడుకు గిరిధర్. అమెరికాలో ఎం.బి.ఎ చదువుకొని ఇంటికి వచ్చాడు. తన తండ్రి పులసకు ఇచ్చే గౌరవాన్ని చూచి అతను సహించలేకపోయాడు. పులసయ్యలోని నిజాయితీ గిరిధర్‍కు నచ్చలేదు. నీతి నిజాయితీగా బ్రతికేవాడు. ఇతరులను వారు యజమానులైనా వంగి వంగి సలాములు పెట్టుతారు. గంగాధర్ అహంకారతత్త్వం పులసయ్యకు నచ్చలేదు. పులసయ్యను సమస్యలో ఇరికించి అతన్ని తన తండ్రికి దూరం చేయాలని గిరిధర్ నిర్ణయించుకొన్నాడు.


మిగతా అందరినీ కూడగట్టుకున్నాడు గంగాధర్. పులసయ్యను వేటకు వెళ్ళినప్పుడు సముద్రంలో ముంచి చంపమని వారందరికీ చెప్పాడు గంగాధర్. అందరూ అతను ఇచ్చిన చిల్లరకు లొంగిపోయి తలలు ఆడించారు.


వారి గూడుపుఠాణినీని పులసయ్య చూచాడు. వారి మాటలను విన్నాడు. ఏకాంతంలో తన యజమానిని కలిశాడు పులస.


గంగాధర్ పన్నిన విష వలయాన్ని గురించి పులస ధర్మారావుకు చెప్పాడు.

వివేకవంతుడైన ధర్మారావు అంతా విన్నాడు.

"పులసా!... రేపు నీవు నన్ను కలువు. వేటకు వెళ్ళకు."


"అలాగే సామీ!"


పులసయ్య తన గూటికి వెళ్ళిపోయాడు.


సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సాటి మనుషుల పట్ల ప్రేమాభిమానాలు కలవారు, మంచి మనస్సు కలవారు, ఉత్తములు, స్వార్థం, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈర్ష్వ, జుగుప్స, మనసున కల వ్యక్తులు అధములు. సమాజ విద్రోహులు అలాంటివారిని కనికరించరాదు. తీవ్రంగా శిక్షించాలి.


ధర్మారావు తదనంతరం ఆ కోట్ల ఆస్థికి వారసుడు గంగాధర్. ’గుణహీనుడు. వారి చేతికి పెత్తనం వెళితే.... నాకు వున్న మంచిపేరు ప్రతిష్టలు మంటపాలవుతాయి. కష్ట సుఖాలను సమదృష్టితో చూస్తూ, సహనంతో పులస నీటికి ఎదురీదినట్లుగా జీవ యాత్రను సాగించవలసినవాడు నాకు వారసుడు కావాలి. ఆ లక్షణాలు పులసయ్యలో వున్నాయి. నా వారసుడు పులసయ్య, అనే నిర్ణయానికి వచ్చాడు ధర్మారావు.


పురోహితులను పిలిపించి.... "నేను నా కొడుకుగా, నా వారసుడుగా పులసయ్యను చేసుకోవాలని నిర్ణయించాను. ముహూర్తాన్ని నిర్ణయించండి" అన్నాడు.


పురోహితులు వారంరోజుల్లో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఎంతో ఘనంగా పులస దత్తత జరిగింది.


అన్నదానం జరిగింది. వూరిజనం ధర్మరాజుకు, పులసయ్యకు జేజేలు పలికారు. పులసను మనసారా దీవించారు.


ఆనందాశ్రువులతో పులస ధర్మారావు గారి పాదాలకు తన శిరస్సు వంచి నమస్కరించాడు.


"పులసా!... నీవు పులసవలే... నీ భావి జీవితంలో, ధర్మ రక్షణకు యీ సమాజంలో ఎదురీదాలి నాన్నా!..." మనసారా దీవించి పులసను తన హృదయానికి హత్తుకొన్నాడు ధర్మారావు.


కోరలు పీకిన పాములా గంగాధర్ ఓ మూల కన్నీటితో నిలబడిపోయాడు. 


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


15 views0 comments

댓글


bottom of page