top of page

పూలసజ్జతో పాపాయి

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #పూలసజ్జతోపాపాయి, #PulasajjathoPapayi, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 38

Pulasajjatho Papayi - Somanna Gari Kavithalu Part 38 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/03/2025

పూలసజ్జతో పాపాయి - సోమన్న గారి కవితలు పార్ట్ 38 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పూలసజ్జతో పాపాయి


పూల సజ్జ పట్టుకుని

పాపాయి వచ్చింది

దండ ఒకటి తీసుకుని

దైవానికి వేసింది


పూలవంటి త్యాగము

వాటికున్న స్వభావము

ఒక్కింత ఇవ్వమని

మనసారగ కోరింది


దండలో దారంలా

దానిలోని తావిలా

నలుగురికి సాయపడే

గుణమిమ్మని వేడింది


పూల సజ్జతో పాటు

గృహానికి చేరింది

ఉప్పొంగే మదితో

నాట్యమే చేసింది















పాపాయి ఇంటి వెలుగోయి

----------------------------------------

మా చిట్టి పాపాయి

మా కంటి వెలుగోయి

నట్టింట వెలసిన

పండు వెన్నెల రేయి


చిలుకలా నవ్వేను

పువ్వులా విరిసేను

నింగిలో తారలా

ముద్దుగా మెరిసేను


మాకెంతో మక్కువ

పసిడి కన్న ఎక్కువ

సదనంలో దీపము

పాపే అపురూపము


మా రాక కోసమే

వాకిట్లో చూసేను

ప్రేమతో చుట్టుకొని

తీగలా మారేను










పిచ్చుక ప్రబోధం

----------------------------------------

నొప్పించే మాటలు

తెప్పించును కోపము

మెప్పించే చర్యలు

చేస్తేనే గౌరవము


నీచమైన తలపులు

తెచ్చును తలవంపులు

ఆదిలో త్రుంచితే

మిగులు పేరు ప్రతిష్టలు


నీతిలేని మనుషులు

చూడ ఎండమావులు

ఉపయోగము శూన్యము

అంతులేని నష్టము


మెదడు లేని కండలు

పగిలిపోయిన కుండలు

దేనికీ!కొరగావు

గాడి తప్పిన మనసులు

















జర జాగ్రత్త!

----------------------------------------

భగవంతుని కన్నులు

అన్నింటినీ చూచును

ఎవరూ మూయలేరు!

తప్పించుకో లేరు!


వ్యాపిస్తే దుష్టులు

ఉండవు సుఖశాంతులు

క్షీణించును భువిలో

ఇక శాంతిభద్రతలు


ప్రతి దానికి ఫలితము

తప్పక ఉండునోయి!

జాగ్రత్త! వహించుము

మంచి పనులు చేయుము


ఎవరిని చులకనగా

ఎప్పుడూ చూడొద్దు

ఎన్నడూ హేళనగా

మాట్లాడ కూడదు


మంచినే చూడాలి

మమతనే పంచాలి

లోపాలను సరిదిద్ది

మార్పునే తేవాలి















పావురాయి పలుకులు

----------------------------------------

విలువైనది జ్ఞానము

అజ్ఞానం తరుమును

రక్షించును ప్రాణము

ఆనందం పంచును


ప్రతి రోజూ ధ్యానము

చేస్తేనే శాంతము

దొరుకును ఆరోగ్యము

మనసున ఆహ్లాదము


కొన్నిసార్లు మౌనము

పాటిస్తే క్షేమము

అన్ని చోట్ల మౌనము

కల్గించు అయోమయము


పేదోళ్లకు న్యాయము

జరిగేలా చూడడము

వీలైతే సాయము

అందిస్తే పుణ్యము


-గద్వాల సోమన్న


Comments


bottom of page