'Puli Ledu Gili Ledu' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 18/05/2024
'పులి లేదు గిలి లేదు' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
"చంటి! ఇలా రా! అక్కడేమి చేస్తున్నావు" అంది శాంతమ్మ. పుస్తకం మీద స్కెచ్చు పెన్నులతో పిచ్చి గీతాలు గీస్తున్న మనవరాలు చంటితో.
"ఏమి లేదు నానమ్మ" అంది.
"ఏది ఆ పుస్తకము ఇటూ తీసుకురా!" అంటే, తెచ్చిచ్చింది చంటి.
"ఏంటి వీటి మీద ఇలా రాస్తే, టీచర్స్ కొట్టరూ!" అంది శాంతమ్మ.
"నేను కాదు తమ్ముడు బాబీ!" అని అలవోకగా, అబద్ధం ఆడింది చంటి.
"తమ్ముడు, ఇక్కడ లేడుగా! వాడెక్కడ గీసా”డన్న శాంతమ్మతో, "ఇందాక గీసి వెళ్ళా”డని ఇంకో అబద్ధం ఆడింది చంటి.
అపుడు శాంతమ్మకు చంటి మొహంలో కోడలు, సుజిత కనపడింది. సుజిత ఇంతే! నిముషంలో అబద్ధ మాడుతుంది.
ఐదేళ్ల చంటికి ఎలాగైనా, అబద్ధాలాడకుండా మాన్పించాలని, శపథం చేసింది శాంతమ్మ. సరైన సమయం కోసం ఎదురు చూడసాగింది. అయినా కోడలుతో, "చంటి అబద్ధాలు ఆడుతుంది, సుజితా! ఎలాగైనా, దాన్నినిజం మాట్లాడేట్లుగా చేయా”లంది శాంతమ్మ.
"అదేమీ లేదే! అది ఎపుడు ఆడింది. ఉండండి దాన్నడుగుతాను. యే చంటి ఇటురా! ఏంటి, నానమ్మతో, అబద్ధం ఆడావా!” అంది సుజిత.
"లేదమ్మా! బాబీ బుక్ మీద గీతలు గీస్తే, నానమ్మ నన్ను అంటుం”దని ఏడ్చింది చంటి.
"నా తల్లే, ఏడవకు, నువ్వు ఆడవు కన్నా. ఆ బాబీ గాడే చేసుంటాడు. అది గీయలేదుట, అత్తయ్యా! మీకు ఆ బాబీ గాడంటే ఇష్టం. వాడిని నెత్తి కెక్కించుకోకండి" అంది సుజిత.
ఇంతలో లోపలికి వచ్చిన బాబీని పిలిచి, "ఏరా!, బుక్ మీద పిచ్చి గీతలు గీసావా! లేదా" అని అడిగింది, సుజిత, బాబీని.
"లేదమ్మా నేను ఇపుడే వస్తున్నాను నేను గీయలే”దన్నాడు బాబీ.
"ఇందాకా గీసావా లేదా!" అని సుజిత అంటే, "నేనిపుడే వస్తున్నాను నేను గీయలే”దన్నాడు, బాబీ.
"సుజితా! నాకు, బాబీ మీద ఇష్టం, చంటి మీద అయిష్టం అంటూ, ఏమి లేదు. నేను చూస్తూనే ఉన్నా, హాల్లో కూర్చుని చంటి ఆ పుస్తకాల మీద గీస్తుంటే!" అంది శాంతమ్మ.
ఇంట్లోకి అపుడే వచ్చిన రఘు కూడా, "అవును సుజితా ! చంటి చీటికీ మాటికి అబద్ధాలు ఆడుతుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే, మనకే నష్టం. మొన్న నా జేబులో నుండి పెన్ తీసింది. పెన్ ఇవ్వంటే.. . నేను తీయలేదని అబద్ధం ఆడిం”దన్నాడు రఘు.
అందరూ తనని అంటుంటే, చంటి ‘మమ్మీ’ అంటూ ఏడుపు లంకించుకుంది.
"లేదులే బంగారు! అబద్ధం ఆడకూడదమ్మా!” అంది సుజిత.
ఏడుస్తూనే అలాగేనని తలూపింది చంటి, అమ్మను కరుచుకుని.
మళ్ళీ, మామూలే, చంటి అబద్ధాలు ఆడుతూనే, వుంది. దాన్ని వెనకేసుకుని వస్తూనే ఉంది సుజిత. ఒకరోజు సుజితకు కూడా ఆ అనుభవం ఎదురైంది. హాల్లో కూర్చుని టివీ చూస్తుంది సుజిత. చంటి వంటింట్లోకి వెళ్ళి చెగోడీలు తీసుకు పోయి, బయట ఫ్రెండ్సుకు పెట్టీ తను తింటుంది.
మళ్ళీ, వంటింట్లోకి, వెళ్ళి చేగోడీలు తీసుకెళ్తున్న చంటిని "ఏంటి! బయటకు తీసుకెళ్తున్నావు” అంది.
"ఏమి, లేవు మమ్మీ" అంటూ చేతులు వెనక దాచుకుంది.
"చూపించు నీ చేతులు!" అంటే వెనక అల్మరాలో వాటిని వేసి "చూ”డని వట్టి చేతులు చూపించింది. "అల్మరాలో ఏమి పెట్టా”వంటే! "ఏమి లే”వంది చంటి.
"ఏయి కొడతా! తీయి అల్మారలోనివి” అంటే, “ఇవి ఇక్కడే వున్నాయి, నేను పెట్టలే”దని మళ్ళీ ఇంకో అబద్ధం ఆడింది. ఇందంతా తన రూంలో పడుకుని వింటూనే వుంది శాంతమ్మ.
"అబద్ధాలు, ఆడితే, చంపేస్తా, చెప్పు నువ్వు పెట్టావు కదూ!” అక్కడ అంది సుజిత. మళ్ళీ “లేదు మమ్మీ" అని బుకాయిస్తుంటే, రెండు దెబ్బలు వేసింది, సుజిత. "నేను అక్కడ పెట్టలేదని" ఏడుపు లంకించుకుంది చంటి.
శాంతమ్మ ఇక రంగంలోకి దిగి, "సుజితా! కొట్టకు, చెప్పాలి వాళ్ళు వినేట్లుగా!" అంటూ చంటిని దగ్గరకు తీసుకుని, "నువ్వు పెట్ట లేదులే కానీ ఆడుకో పో!" అని బయటకు పంపింది.
"సుజితా! ముందు పెద్దవాళ్లము మనం దాని ముందు అబద్ధాలు ఆడితే, వాళ్ళూ వాటినే పాటిస్తారు. పిల్లలకు మనం ఏమి తెలియదనుకుంటాము. కానీ చిచ్చర పిడుగులు, మనం చెప్పే మంచి విషయాలను, గ్రహించరు కానీ, ఇలాంటి వాటిని పట్టించుకుంటారు. పిల్లలున్నప్పుడు మనం ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడాలి.
మొన్న పనిమనిషి, నన్ను డబ్బులడిగింది, నేను దానితో, ‘నా దగ్గర ఎక్కడుంటాయి!’ అన్నాను. అది విని చంటి, ‘నానమ్మ! బీరువాలో పర్సులో డబ్బులు పెడతావుగా, లేవన్నావు, ఏంటి?" అంది.
వెంటనే నేను “అవి నా డబ్బులు కాదు, దేవుడికి హుండీలో వేయటానికి తీసి పెడుతున్నా” అన్నాను. దానికేమి తెల్సు అంత క్రితం పనిమనిషికి నేను డబ్బులిచ్చిన సంగతి, అది నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని.
నేను అబద్ధమాడిన పుణ్యానికి, నిజంగా నా పర్సులో డబ్బు గుళ్ళో హుండీలో వేసివచ్చా. దేవుడికి వేయకపోతే, ఏదన్నా అవుతుందనే భయంతో. ఇలాంటివన్నీ చూసి వాళ్ళు, మా నానమ్మ ఆడింది, మా అమ్మ ఆడిందేలే! మేము అబద్ధం ఆడినా తప్పులేదనుకుంటారు" అంది శాంతమ్మ.
అపుడు, సుజిత కూడా, పిల్లల ముందు జాగ్రత్తగా, వుండాలనుకుంది.
"ముందు ఇక దాన్నేమి అనకు, నేను చూసుకుంటానిక" అని భరోసా ఇచ్చింది సుజితకు శాంతమ్మ.
రోజు రాత్రిపూట శాంతమ్మ దగ్గర పడుకుంటుంది, చంటి. ఆరోజు చంటి "నానమ్మ కథ చెప్పవా" అంది. బాబీకూడ వచ్చి "నేను వింటా కథ అంటూ" వచ్చి మంచం ఎక్కాడు.
"సరే అయితే వినండి ఒక ఊళ్లో రామయ్య అనే రైతు వుండేవాడు. రామయ్యకు కృష్ణ అనే కొడుకు వుండేవాడు. రామయ్య రోజు, తనకున్న మేకలను తోలుకుని అడవికి వెళ్తుండేవాడు. అక్కడ పచ్చటి చెట్లు, చేమలు వుంటే, వాటిని మేకలు తింటూ ఉండేవి. కృష్ణకు ఆకతాయితనం ఎక్కువ. అందర్నీ సరదాగా ఆట, పట్టిస్తూ వుండేవాడు. ఇది వద్దని తండ్రి రామయ్య ఎన్నోసార్లు చెప్పేవాడు.
ఒకసారి కృష్ణ, నాన్నతో పాటు మేకలు తోలుకుని అడివికి వెళ్ళాడు. రామయ్య, కృష్ణతో “నేను పక్కన పొలంలో పని చేస్తుంటాను, , నువ్వు మేకలను, చూస్తూ వుండు. అడివిలో నుండి, పులి వస్తె, నన్ను కేకేయ్యి. లేదంటే, పులి, మన మేకలను తింటుం”దని చెప్తాడు.
"సరే పులి రాగానే పిలుస్తాను, నిన్ను" అని అంటాడు కృష్ణ.
"నాన్నా!, అదిగో పులి!" అని కేకేస్తాడు కృష్ణ. రామయ్య, వచ్చి "ఏదీ పులి!" అనగానే, "వుత్తనే పులి లేదు గిలి లేద”న్నాడు.
"అలా అబద్ధం ఆడకూడదు ఆట పట్టించకూడ”దని, కృష్ణను తిట్టి వెళ్తాడు.
మళ్ళీ రెండోసారీ, "నాన్నా! అదిగో పులి" అని మళ్ళీ కేకెస్తాడు,
మళ్ళీ పరుగున వచ్చాడు రామయ్య. "ఎక్కడా, పులి" అన్నాడు. మళ్ళీ "పులి లేదు, గిలి లేదు, వుత్తనే" అన్నాడు కృష్ణ.
"ఈసారి నిజంగా పులివొచ్చినా, నేను రాను. ఏం ఆటలుగా ఉందా!" అని అరచి వెళ్తాడు, రామయ్య.
ఈసారి నిజంగానే పులి వొచ్చింది. "నాన్నా!, అదిగో పులి" అని పెద్దగా కేకేసాడు భయంతో కృష్ణ.
“ఇపుడు రెండు సార్లు, పులి వచ్చిందని అబద్ధం ఆడిన కృష్ణ మాటలు, రామయ్య వింటాడా, మళ్ళీ వస్తాడా!"అని ప్రశ్నించింది, శాంతమ్మ, పిల్లలను. "ఊహు రాడన్నారు", పిల్లలు.
"కరెక్ట్ గా చెప్పారు. రామయ్యకు, కృష్ణ మీద నమ్మకం పోయింది. ఈసారి కూడా అబద్ధం ఆడి వుంటాడని వెళ్ళలేదక్కడికి. పులి మేకలతో పాటు కృష్ణను కూడా అడివిలోకి లాక్కుపోయింది. తర్వాత రామయ్య వెళ్ళి చూస్తే మేకలు లేవు, కృష్ణా లేడు. అయ్యో! అని ఏడ్చాడు.
ఇక్కడ నీతి ఏంటంటే, అబద్ధాలు ఆడితే, మీ అమ్మానాన్నకు, స్కూల్లో, టీచర్సుకు మీమీద నమ్మకం పోతుంది. మీరు నిజంగా నిజం చెప్పినా కూడా నమ్మరు. అందుకని చంటి ఎపుడూ, నిజం, మాట్లాడుతుంది చంటి చెప్పేది వినవచ్చు అన్నట్లుగా ఉండాలి, సరేనా! నిన్న చేగోడీలు నువ్వే కదా అల్మరలో పెట్టింది చంటి" అనగానే, "అవునంది" చంటి. ఎందుకు? అట్లా అబద్ధం చెప్పావంటే, అమ్మ కొడుతుందని, అలా చేసానంది చంటి.
నువ్వు తీసినప్పుడు తీసానని చెపితే, మీ అమ్మ ఏమనదు. ఇపుడు ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చటానికి, నువ్వు రెండు అబద్ధాలు ఆడావు. మీ అమ్మ చూపించన్నప్పుడు, చూపించకుండా వెనకున్న అల్మారలో, పెట్టటం, నువ్వు వెనక్కి నడిచి వెళ్లి పెట్టటం మీ అమ్మకు కనపడుతుంది. చేతుల్లో లేవు, అల్మరాలో లేవని, చెప్పే బదులు మొదటే, మమ్మీ నేను చేగోడీలు తీసానంటే ఏమనదు.
అన్నా అమ్మే కదా! కాకపోతే, ఎక్కువ తీసుకెళ్ళి, తినకూడదని కేకలేసేది. నీ పొట్ట పాడైతే మీ అమ్మకేగా బాధ. దానికే, ఆమ్మ తిడుతుంది, కొడుతుందని వూహించుకుని అబద్ధం ఆడకూడదు. ఇప్పటికి, అబద్ధం బావున్నా తర్వాత, అందరూ నిన్ను నమ్మరు బంగారు!" అంది శాంతమ్మ చంటితో.
వెంటనే, బాబీ “నేను అబద్ధం ఆడను, ఆడితే, పులి తింటుం”దని భయంగా అన్నాడు.
"నేనూ! ఇక అబద్ధం ఆడను" అంది చంటి.
"ఆ ఇద్దరూ నా బంగారాలే! అస్సలు ఇక అబద్ధం ఆడరుగా! గుడ్, ఇక పడుకోండి, పొద్దునే లేచి స్కూల్కు వెళ్ళాలి కదా!" అన్న శాంతమ్మతో అలాగే, నానమ్మ అంటూ, కళ్ళు మూసుకున్నారు పిల్లలిద్దరూ.
***
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments