#AlluSairam, #అల్లుసాయిరాం, #PulirajakiAidsVasthunda, #పులిరాజాకిఎయిడ్స్వస్తుందా, #సామాజికసమస్యలు, #StoryOnSocialProblems
Pulirajaki Aids Vasthunda - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 17/01/2025
పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా - తెలుగు కథ
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
శీతాకాలపు సాయింత్రం మంచు మబ్బులు సూర్యుడిని వేగంగా కమ్మేస్తున్నాయి. ప్రభుత్వ హైస్కూల్లో ఏడవ పీరియడ్ గంట మ్రోగింది. పదోతరగతి విద్యార్థులకి జీవశాస్త్రం క్లాస్ చెప్తున్న గీత మేడం దగ్గరికి హెడ్మాస్టారు సింహాచలం, జాతీయ సేవా పథకం (NSS) తరఫున ఇందు మేడం వస్తుండడం చూసి, క్లాస్ ఆపి “ఏంటి సార్?” అంటూ వారి దగ్గరికి వచ్చింది గీత.
హెడ్మాస్టారు “ఈమె ఇందుగారు! జాతీయ సేవా పథకం తరఫున విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చారు. తొమ్మిది, పదోతరగతి విద్యార్థులు కలిపి ఒకే తరగతిగదిలో కలిపి అవగాహన కార్యక్రమం చెయ్యాలి!” అని చెప్పారు.
గీత ఆశ్చర్యంగా “సార్! విద్యార్థులకి ఎయిడ్స్ పై అవగాహన అంటే, అమ్మాయిలకి వేరేగా, అబ్బాయిలకి వేరేగా అవగాహన చెప్పాలేమో కదండీ. మొత్తం అందర్ని ఒకే తరగతిగదిలో పెట్టి అవగాహన కార్యక్రమం అంటే, విద్యార్థులు వారికి ఉన్న సందేహాలు కూడా అడగలేరు కదా. అప్పుడు పూర్తి అవగాహన జరగదు కదా సార్!” అని అంది.
ఇందు మాట్లాడుతూ “నిజమే మేడం! అలానే చేయాలి. కాకపోతే, విద్యార్థుల్లో లైంగికపరమైన కోరికల వలన మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందని చాలా అపోహలుంటాయి. ఆడామగా తేడాలేకుండా యిద్దరికీ ఒకేసారి చెప్తేనే, అన్ని విధాలా మంచిది! ఇప్పటివరకు చాలా స్కూల్లో యి అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మేడం. మీరు, సార్ మాకు తోడుగా ఉంటే మొదలుపెడతాను!” అని అంది. తొమ్మిదో తరగతి విద్యార్థులందరూ వచ్చి కూర్చున్నారు.
బోర్డు మీద హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం -2024 అని ఇందు రాస్తుంటే, గీత మేడం మాట్లాడుతూ “స్టూడెంట్స్! ఎయిడ్స్ అవగాహన గురించి ఇందు మేడం చెప్తారు. అల్లరి చెయ్యకుండా సైలెంట్ గా వినండి. మేడం అడిగినవాటికి మాత్రమే సమాధానాలు చెప్పండి!” అని అంది.
ఇందు మాట్లాడుతూ “హాయ్ స్టూడెంట్స్!” అని అంటే “హాయ్ మేడం!!” అని విద్యార్థులు గట్టిగా చెప్పారు.
ఇందు కొనసాగిస్తూ “మీకు హెచ్ఐవి, ఎయిడ్స్ మీద ఏమైనా సందేహాలు కాగితం మీద రాసి, ఎవరైనా వాలంటీర్లుగా వచ్చి, అవి తీసుకుని అమ్మాయిలు రాసినవి గీతమేడంకి యివ్వండి. అబ్బాయిలు రాసినవి హెడ్మాస్టారుగారికి యివ్వండి. మీ పేర్లు రాయాల్సిన అవసరం లేదు!” అని అంది. అందరూ రాసి యిచ్చారు.
ఇందు ఎయిడ్స్ గురించి చెప్తూ “ఈ అవగాహనలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, మనకి వ్యాధి రాకుండా చూసుకోవడం. రెండు, వ్యాధి సోకినవారిని జాగ్రత్తగా చూసుకోవడం! మొదటిభాగం చూస్తే, హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్! ఈ స్థాయికి పూర్తిగా రోగనిరోధకశక్తి నిర్వీర్యం అయిపోతుంది!” అని చెప్తుండగా, హెడ్మాస్టారు విద్యార్థులు రాసిన కాగితాల్లో నుంచి కామన్ గా ఉన్నవి, అర్థం లేనివి అన్ని వేరుచేసి ఇందు చేతికి యిస్తూ “పేర్లు రాయోద్దు అన్నారు కదా నచ్చినట్లు పిచ్చిగా రాయడమేనా! వేషాలు వెయ్యకుండా మేడం చెప్పినవి శ్రద్ధగా వినండి!” అని అన్నారు.
ఇందు అన్ని కాగితాలు ఒకసారి చూసుకుని “చాలామంది ఎయిడ్స్ ఎలా వస్తుంది అని రాశారు. ప్రేమ ఏదో, ఆకర్షణ ఏదో తెలియని కౌమారదశలో ఎక్కువశాతం యి వ్యాధి బారినపడుతున్నారు. 15-24 సం. వయస్సులో దాదాపు 35 శాతం కేసులు నమోదవుతున్నాయి. సురక్షిత లైంగిక సంబంధాలు కలిగివుండకపోవడం దీనికి కారణం! ఇంకో కారణం, సాధారణంగా ఈకాలంలో గర్భిణులకి చాలావరకు రక్తహీనత ఉంది. యాక్సిడెంట్స్ అయ్యినప్పుడు, కారణం ఎదైనా రక్తం అవసరమైనప్పుడు వాట్సాప్ ల్లో బ్లడ్ కావాలని మేసేజ్లు పెట్టేయడం, హడావిడిగా రక్తపరీక్షలు చెయ్యకుండా ఎవరిదో రక్తం ఎక్కించేయడం, దురదృష్టవశాత్తు, ఆ రక్తం యిచ్చినవాళ్లు హెచ్ఐవి పాజిటివ్ అయ్యుంటే గర్భిణీకి సోకి, తనకి పుట్టబోయే బిడ్డకు సోకుతుంది.
ప్రపంచాన్ని కుడా చూడకముందే, ఆ శిశువు వైరస్ ని చూస్తుంది! అంతేకాకుండా, ఇతరులకు వాడిన సూదులు, సిరంజ్లు శుభ్రం చేయకుండా వినియోగించడం వంటి కారణాల వల్ల వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది! ఇదెవరో గాని, విల్ ది టైగర్ కింగ్ గెట్ ఎయిడ్స్? అని రాశారు. అంటే, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని తెలివిగా అడిగారు. ఎందుకు రాదు. కచ్చితంగా వస్తుంది. ఎంతకీ పులి రాజైనా, బలం ఉందని ఎగిరెగిరి పడుతున్నా, సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కంటికి కనిపించని వైరస్ దగ్గర కుడా ఓడిపోవాల్సిందే!” అని అంటే అందరూ నవ్వారు.
ఇందు కొంచెం నీళ్ళు తాగుతూ చేతి వాచ్ చూసి “సార్ ఇంకో పదినిమిషాల్లో అయిపోతుంది!” అని అంటే “ఎంతసేపైనా పర్వాలేదు మేడం. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. యిది చాలా అవసరం!” అని అన్నారు హెడ్మాస్టారు.
ఇందు మాట్లాడుతూ “థాంక్యూ సార్! స్టూడెంట్స్, యిక రెండవ భాగం, ఎయిడ్స్ అనేది ఎలా సోకుతుందో తెలిసింది కదా. మనకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి గాని, దురదృష్టవశాత్తు, వ్యాధి వచ్చిందని ఆల్రెడీ బాధపడుతున్నవారికి ధైర్యం చెప్పి ఆదరించకపోయినా పర్వాలేదు. మనకు ఎక్కడ వచ్చేస్తుందో అనేసి వాళ్ళని కించపరుస్తూ వెలివేసినట్టుగా దూరంపెడితే, వాళ్లు మరింత మనస్థాపానికి గురై, ఉన్న కాస్త రోగనిరోధకశక్తి కూడా పోతుంది. అది వాళ్ళ జీవితాన్నే దెబ్బతీస్తుంది! గమనించాల్సిన విషయం ఏంటంటే, హెచ్ఐవి పాజిటివ్ అయినంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్టు కాదు. సింపుల్ గా చెప్పాలంటే, హెచ్ఐవి గొంగళిపురుగు దశ అయితే, ఎయిడ్స్ అనేది సీతాకోకచిలుక దశ అని మాట.
హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ గా మారడమంటే, పూర్తిగా రోగనిరోధకశక్తి పోయినట్లే, దానికి సంవత్సరాలు పడుతుంది. హెచ్ఐవి కి సరైన నివారణ లేదా టీకా లేనప్పటికీ, యాంటీరెట్రోవైరల్ చికిత్స వ్యాధి యొక్క గమనాన్ని నెమ్మదిస్తుంది. హెచ్ఐవితో నివసించే వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుంది. ఈమధ్యనే, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ ఉండడం వల్ల చాలామంది హెచ్ఐవి పాజిటివ్ నుంచి కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి! ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువమంది ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం మూడవస్థానంలో ఉంది. ఏం మార్పు తీసుకురావాలన్న యువత వలనే సాధ్యం అవుతుంది. యువత ఉన్న ఎక్కువ దేశం కాబట్టి, విద్యార్థులందరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన ఏర్పర్చుకుని, వ్యాధి నివారణలో, వ్యాధిగ్రస్తులకి ఆదరించడంలో, యువత భాగస్వామ్యులుగా మారి భారతదేశంలో యి వ్యాధి పేరు వినిపించకుండా చెయ్యాలి!” అని ముగిస్తే విద్యార్థులంతా ఆపకుండా చప్పట్లు కొట్టారు.
చివరగా హెడ్మాస్టారు “మేడం చాలా బాగా చెప్పారు. విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకి కుడా అవగాహన వచ్చింది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా?” అని అడిగితే “సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, వస్తుంది. తీసుకుంటే, రాదు!” అని అందరూ చప్పట్లు కొడుతూ ముక్తకంఠంతో నినదిస్తుంటే, తను చెప్పిన మాటలు విద్యార్థుల నోట వింటూ ఇందు మురిసిపోతుంది.
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
పులి రాజా కి ఎయిడ్స్ వస్తుందా?:
అల్లు శాయి రామ్
చిన్న - పెద్ద అందరికీ అవగాహన కల్పించాలి జాగ్రత్తల గురించి.
ఆసుపత్రులలో, బ్లడ్ బ్యాంక్ లలో ... రక్తం పరీక్ష చేయాలి, రెండు - మూడు సార్లు ... తీసుకునే టప్పుడు, ఇచ్చేటప్పుడు ... దాంట్లో హెచ్ ఐ వి లేక ఎయిడ్స్ సోకి ఉందా అని.
పి. వి. పద్మావతి మధు నివ్రితి
Nice story..... Good content 😁 👍 👍