పునర్జన్మ
- Sudarsana Rao Pochampalli
- Aug 17, 2023
- 4 min read
Updated: Aug 19, 2023

'Punarjanma' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'పునర్జన్మ' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
శ్రీ కృష్ణ భగవానుడు భగవత్ గీతలో నుడివిన విధమేమిటంటే
"జాతస్య హి ధృవో మృత్యుః ధృవం జన్మ మృత్యుస్యచ "
తస్మాదపరిహార్యే ర్దేన త్వం శోచితు మర్హ సి.
అంటే
పుట్టినవారికి మరణము తప్పదు. మరణించినవారికి జన్మము తప్పదు.. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకించ తగదు.
"దేహినోస్మిన్యథా దేహే కౌమారం, యౌవనం, జరా తథా దేహాంతర ప్రాప్తిర్తీరస్తత్ర న ముహ్యతి. "
ఈ మానుష శరీరం కష్ఠతరమైన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే అవస్థలను దాటుకుంటూ ముందుకు వెడుతుంది. అలాగే తర్వాతి అవస్థ ఐన మృత్యువుని దాటుకుని మళ్ళీ కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ప్రజ్ఞావంతులైనవారు ఈ మృత్యువు కోసం విచారించక ఆత్మ దర్శనం కోసం ప్రయత్నం చేస్తారు.
ఇక మన నిత్యవాడుకలో
పూర్వ జన్మ సుకృతం
జన్మ జన్మల బంధం
మళ్ళీ జన్మలో నీ కడుననే పుడుతాను
జన్మ జన్మకు నువ్వేకావాలె
పూర్వజన్మ కృతే పాపం వ్యాధి రూపేణ పీడితం
ఇట్ల పునరపి జననం. పునరపి మరణం అను భావనతో మనుషులుటారు.
వచ్చింది నింగి నుండే. ఆత్మ పోయేది నింగిలోకే
అనుబంధమవై తోటే. కలకాలముండలేను
కరుణించు తల్లి యనుచు. కను మరుగు అగును జీవి
గాలిలో తేలియాడి. గగనాన తిరిగి తిరిగి
అనుబంధ ప్రీతి తోడ. అవనికే తిరిగివచ్చి
ఏ అమ్మ కడుపులోనో. జీవుడై పుట్టునాత్మ
భాగవత తెనుగు సేత భమ్మెర పోతనామాత్యుడు తనకు పునర్జన్మ లేకుండునట్లుగా ఉండడానికి భాగవతము తెనుగించ పూనుకుంటాడు.
"ఒరయన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్ బురాణవళుల్
తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగున్ జయరు మున్ను భాగవతమున్ దీనిన్ దెనిగించి నా
జననంబున్ సఫలంబు జేసేద బునర్జన్మంబు లేకుండగన్. "
జన్మరాహిత్యం. లేక మోక్షం అంటే ఏమిటి ?
జీవునికి సూక్ష్మ శరీరం ఉంటుంది. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు.
జీవుడు చేసే ప్రతి కర్మకూ కర్మఫలం ఉంటుంది. అది పుణ్య రూపంలోనో. పాప రూపంలోనో ఉంటుంది. కర్మ ఫలాన్ని ఈ జన్మలో కొంత అనుభవించడం జరుగుతుంది. మిగిలిన కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఇంకా కొన్ని జన్మలను ధరించవలసి వస్తుంది.
ఆ జన్మలలో మరల కొత్త కర్మ ఫలాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా జీవుడు జన్మ పరంపరలలో చిక్కుకొని ఉంటాడు.
చివరకు ఏదో ఒక జన్మలో ధ్యాన మార్గాన్ని ఆశ్రయిచి పరబ్రహ్మను గూర్చి తెలుసుకోవడం ప్రారంభించ వచ్చు. అప్పుడు కర్మ ఫలం క్షీణించడం ప్రారంభమౌతుంది. మొత్తం కర్మ ఫలం క్షయమయినప్పుడు ఇంక జన్మ ఉండదు. దీనినే జన్మ రాహిత్యం లేక మోక్షం అంటారు. ధ్యానము ద్వారా మోక్షం లభిస్తుంది.
జన్మ రాహిత్యం జ్ఞానులకు, పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది. పాపులు చావు, గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటారు. తల్లి తిన్న పులుసు, చేదు పదార్థాల వలన వేదన పడుతారు. ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతారు.
గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తారు. ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూ ఇటూ కదలుతూ గత జన్మలో పాప పుణ్యాలను ఎరుకజేసి పాపకార్యాలు తలచుకొని మరింత చింతిస్తారు. తను ఆర్జించిన సంపదలను అనుభవించిన భార్యా బిడ్డలు తనను పట్టించుకొనక పోవడము గుర్తు చేసుకొని రోధిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అను భావన.
పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకొని కర్మననుసరించి నిర్దిష్టమైన స్త్రీ గర్భం లో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన అయిదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు. పది రోజులకు రేగుపండంత కఠినమైన ఎర్రటి మాంసపు ముద్దలా తయారౌతాడు. ఒక మాస కాలానికి తల భాగం తయారౌతుంది. రెండు మాసాలకు చేతులు, భుజాలు ఏర్పడుతాయి. మూడు మాసాల కాలానికి చర్మం, రోమాలు, గోళ్ళు, లింగం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. ఐదవ మాసానికి ఆకలి, దప్పి వస్తాయి. ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణ వైపుగా కదలిక మొదలౌతుంది. ఇలా మెల్లెగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది.
జీవుడుదుర్గంధభూయిష్టమైన ఈ గర్భకూపమునుండి నన్ను త్వరగా బయటికి త్రోసివేయు తండ్రీ మరో జన్మ యెత్తి నీ పాద సేవ చేస్తాను నాకు మోక్ష ప్రాప్తిని కలిగించు అని పరి పరి విధాల ప్రార్థిస్తాడు.
ఇలా శోకించే శిశువు వాయు దేవుని సహాయంతో ఈ లోకం లో జన్మించి వెంటనే ముందు జన్మ జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడ్వడం మొదలు పెడుతాడు. ఆ తరువాత పరాధీనుడై శరీర బాధలు ఇష్టాయిష్టాలు, చెప్పుకోలేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాప పుణ్యాలను మూటగట్టుకొని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎత్తుతాడు. ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్ష ప్రాప్తి చెందేంతవరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం చెబుతుంది.
నైనం ఛిందంది శస్త్రాణి నైనం దహంతి పావకః
న చైనం కేదయం త్వాపోన శోషయతి మారుతః
ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించ లేవు, అగ్ని దహించ లేదు, నీరు తడుప లేదు, గాలి ఆరబెట్టనూ లేదు.
పంచ భూతాలతో తయారైంది శరీరం. దహ్యతే ఇతి దేహం. దహింపబడేది కనుక ఈ శరీరాన్ని దహం అన్నారు.
పాంచ భౌతిక శరీరాన్ని నాశనం చేయగలవన్నీ కూడాను ఆత్మను ఏమీ చేయ లేవు.
దేహం యొక్క ధర్మం వేరు. ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం నశించేది. ఆత్మ నిత్యమైనది.
శరీరం పుడుతుంది చస్తుంది. ఆత్మ పుట్టదు చావదు.
ఆత్మ మార్పు చెందనిది. సర్వ వ్యాప్తమైనది. సత్యమైనది.
మనిషి శరీరం కాదు ఆత్మ పదార్థం.
"న జాయతేమ్రియతే వా సకదాచిత్ నా యం భూయత్వా భవితా వా న భూయః"
అజోనిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే.
ఆత్మ పుట్టేది కాని చని పోయేది కాని కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది, మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైంది కాదు ఎప్పుడూ ఒక లాగే ఉండేది. నాశనం లేనిది. సనాతనమైనది. అది చంపదు. చంపబడదు. దేహం నశించినా ఆత్మ నశించదు.
"నత్యేవా హం జాతు నాసం నత్వం నేమే.
న చైవ న భవిష్యామః సర్వేవయమతః పరం
నేను ఇదివరకు ఏ కాలములోనూ లేనట్లు కాదు. నువ్వు కూడా ఇదివరకు ఎన్నడు లేనివాడవు కావు.. అదే విధంగా మనమందరము భవిస్యత్ లో ఉండమని అనుకోవద్దు.
ఆత్మకు సంబంధించి విత్తు అనబడేది జీవాత్మ. చెట్టు అనబడేది పరమాత్మ. పరమాత్మ అంటే సర్వం తానే అయిన నిత్య సత్య సచ్చితానంద స్వరూపం.
జీవాత్మ తొలి దఫా జన్మలో "సాధారణ ఆత్మ"గానే ఉంటుంది.
దుష్ట సాంగత్యాలు, దుర్జన ప్రభావాలు, లౌకిక కోర్కెలు వాటికోసం చేసే దుష్కర్మల వల్ల "దుష్టాత్మ" గా మారుతుంది.
సజ్జన సాంగత్యం, పరోపకార పరాయణత్వం, సేవా భావాలవల్ల "శుద్ధాత్మ" గావికసిస్తుంది.
"వాసాంసి జీర్ణాని యథా విహాయ న వాని గృహ్ణతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సం యాతి నవాని దేహి".
ఎలాగైతె మనందరం చిరిగిన బట్టలు వదిలి నూతన వస్త్ర ధారణ చేస్తామో అలాగే నిరుపయోగమైన ఈ శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహం లోనికి ప్రవేశిస్తుంది.
ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చవచ్చు.
బట్టలు పాతవై చినిగిపోతుంటే వాటిని తీసి అవతల పారవేసి కొత్తవి తొడుక్కుంటాము కదా!శరీరానికి కూడా అలాగే వయసు మళ్ళిన తర్వాత ముసలితనం వచ్చేసి శిథిలమై పోయిన లేదా రోగగ్రస్తమైనా దాని పనితనం మరణం ద్వారా ముగిసి పోతుంది. అప్పుడు ఆత్మ వేరొక శరీరాన్ని ధరిస్తుంది.
ఈ దేహం ఒక వస్తువైతె మనం దేహ ధారులం.
మరణం అంటె పాతబడిన భౌతిక శరీరాన్ని వదిలేసి కొత్తదనం కలిగిన ఆత్మగా మారడం. ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంలో నూతన జన్మ పొందడమే.
ఈ జన్మలో మంచి పనులు చేస్తూ ధర్మాచరణ చేస్తే మరలా మంచి జన్మ లభించ వచ్చు. లేదా నిరర్థకమైన జీవితం గడిపి పరులను పీడించి బ్రతికితే ఏ కుక్కగానో. నక్కగానో మరో జంతువుగానో జన్మించవచ్చు.
సామర్థ్య స్థాయికెదిగిన వారు తమ తలిదండ్రుల సేవ, పెద్దల పట్ల గౌరవము. పిల్లల పట్ల వాత్సల్యము. భార్య లేదా భర్తల పట్ల అనురాగము. సాటి జనుల పట్ల మర్యాద. జంతువులు పక్షుల పట్ల భూత దయ. దైవమందు భక్తి. ఇత్యాది సలక్షణాలతో జీవితము గడిపితె దైవానుగ్రహ పాత్రులై సద్గతులను పొందుతారు. తిరిగి ఉత్తమ జన్మ పొందుటకు మార్గం సుగమమౌతుంది.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments