కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Pushyami' Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
విధి లిఖితం పుష్యమికి అనుకూలంగా ఉంది.
అందుకే పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అందలం ఎక్కించింది.
ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు ఈ కథను చక్కగా మలిచారు.
అది తూర్పుగోదావరి జిల్లా కోస్తా ప్రాంతములో గల అమలాపురంకు సమీపంలో ఉన్న '‘పేరూరు' అన్న ఒక చిన్న గ్రామము. శతాబ్దాల కాలమునాటి పాత ఆంధ్ర పట్టణమన్న మాట..
ఆ వూరు చాలా పాతబడిన వంశ పారంపర్య గృహాలైన అతిపెద్ద భవంతులతో నిండి ఉంటుంది. అటువంటి తాత ముత్తాతలనాటి ఒక భవనంలో ఆ ఊరిలో అందరికంటే శ్రీమంతుడైన ఆదిశేషయ్యగారు, ఆయన అర్ధాంగి సీతామహాలక్ష్మి గారు ఉంటున్నారు..
ఆది శేషయ్యగారి తండ్రి, తన ఇద్దరు కూతుళ్లకూ పెద్గ పెద్ద కట్నాలూ, పసుపు కుంకుమల కింద చెరో పది ఎకరాల కొబ్బరి తోటలు వ్రాసి ఇచ్చి చాలా ఘనంగా పెళ్లిళ్లు చేసాడు. చిన్న కొడుకులు ఇద్గరూ పట్టణాలలో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడిన మూలాన వారి వాటాల ఆస్తిని విభజించి ఆయన బ్రతికుండగానే ఇచ్చేసారు.పెద్ద కొడుకైన ఆదిశేషయ్య కు వ్యవసాయంపై మక్కువ మూలాన తండ్రి ద్వారా సంక్రమించిన ఏభై ఎకరాల కొబ్బరితోటలు, వరిధాన్యం పండే పొలాలను తన స్వశక్తి తో తెలివి తేటలతో రెట్టింపు చేసుకున్నాడు. అటు భార్య కూడా చాలా ఆస్తితోనే వచ్చింది..
ఎకరం పైగా ఉన్న స్థలంలో కట్టబడిన పాత కాలం భవనం అయినా, రెండస్తుల విశాలమైన భవనం .. పెద్ద పెద్ద లోగిళ్లు, మండువాలు, హాళ్లు, అలాగే ఒక ఇరవై పడక గదులు ఉన్న ఇల్లు. తర తరాలుగా వస్తున్న ఉమ్మడి కుటుంబం కావడం మూలాన ఆ ఇంట్లో ఎన్నో పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు జరుగుతూ ఉన్నమూలాన ఆ ఇంటి గదులు ఒక్కోసారి సరిపోయేవి కావు..
ఆ భవన ప్రాంగణం లోనే ధాన్యపు గాదెలు, పప్పులూ, ఉప్పుల బస్తాలతో కొట్టుగది నిండుగా కనిపిస్తూ ఉంటుంది.. ఇంటి వెనుకాల పశువుల పాకలు, గేదెలు ఆవులు, పనివాళ్లు పాలేర్లతో హడావుడిగా ఉంటుందెప్పుడూ.. ఒక పెద్ద వంటశాల విడిగా కట్టుకున్నారు.. అక్కడ ఎప్పుడూ పొయ్యిలు నిత్య అగ్నిహోత్రం లా వెలుగుతూనే ఉంటాయి.. ఇంటివారికి, పనివారికి, వచ్చిపోయే అతిధులకు ఒక అన్న సత్రంలాగ పెద్ద పెద్ద పొయ్యి ల మీద డెగిశాలలో వంటలు తయారౌతూనే ఉంటాయి ! అలాగే ఆదిశేషయ్యగారి చెల్లెళ్లూ తమ్ముళ్లు ఏ శుభకార్యమైనా ఈ అన్నగారింట్లోనే అందరూ కలుసుకుని జరుపుకుంటారు..
ప్రతీ సంక్రాంతి పండుగకు శేషయ్యగారి దివాణం తన తమ్ముళ్లూ, చెల్లెళ్ల కుటుంబాలతో కళ కళ లాడిపోతుంది.. ఆ ఊరిలోని సంక్రాంతి సంబరమంతా వీరింట్లోనే తిష్టవేసిందా అన్న అనుభూతి కలుగుతుంది.. వారి తండ్రి ఎవరిపట్లా వివక్షత చూపకుండా సమానంగా ఆస్తి పంచడం ఒక కారణమైతే, చిన్నప్పటి నుండీ అందరూ కలిసి మెలిసి పెరిగిన మూలాన ఆ కుటుంబం మధ్య మమతానురాగాలూ, ఒకరకమైన క్రమశిక్షణ వారందరూ పండుగలకూ పబ్బాలకూ వారి తండ్రి తరువాత ఆ ఇంటికి పెద్దవాడైన శేషయ్య గారింట్లో కలవడానికి దోహదపడింది !
ఎంత ఐశ్వర్యం ఉన్నా విధి ఆ కుటుంబాన్ని చిన్న చూపు చూసిందేమోనన్నట్లుగా ఆ దంపతులకు పిల్లలు లేరు.. ఆదిశేషయ్యగారి వయస్సు ఏభై అయితే సీతాలక్ష్మిగారి వయస్సు నలభై సంవత్సరాలు ఉంటాయి.. ఆ దంపతులు పిల్లలకోసం మొక్కని దేవుడు లేడు, దర్శించని పుణ్య క్షేత్రం లేదు.. ఎవరైనా వీరికి ఫలానా స్వామివారి అనుగ్రహం పొందితే పిల్లలు కలుగుతారని చెపితే చాలు, ఆ స్వామి గారిని, శిష్యులను తమ ఇంటికి పిలిచి ఎన్నోరోజులు ఆశ్రయం కలిగిస్తూ వారు చెప్పినట్లుగా, హోమాలూ పూజలూ చేసినా ఫలితం శూన్యం.. పిల్లల లేరన్న దిగులు మటుకు వారి ముఖాలలో కనిపిస్తూనే ఉంటుంది !
సీతామహలక్ష్మి చెల్లెలు రాజేశ్వరి కూడా అక్కగారి ఊరైన " పేరూరు" కి ఇరవై మైళ్లు దూరంలోనున్న తాండవపల్లి లో ఉంటుంది.. ఆవిడది కూడా జమీందారీ కుటుంబమే .. అక్క చెల్లెళ్లిద్దరూ వీలున్నప్పుడల్లా ఒకరింటికి ఒకరు వెళ్లడం, పండగలకు పబ్బాబాలకు కలుసుకోవడం చేస్తూ ఉంటారు.. ఆవిడకూ ఒక్కడే కొడుకు.. అక్కకు పిల్లలు కలగకపోవడం రాజేశ్వరికి కూడా బాధగా ఉంటుంది.. పాపం అక్క అని జాలిపడుతూ అక్క గురించే ఎల్లవేళలా ఆలోచించే రాజేశ్వరికి ఒకరోజు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది.. వచ్చిందే తడువుగా ఊరుకోలేకపోయింది !
రాజేశ్వరి గారింట్లో వంట చేసే సులోచనమ్మగారికి నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు.. ఇద్దరాడపిల్లల తరువాత అబ్బాయిలు, వారి తర్వాత మరో ఇద్దరమ్మాయిలు.. ఒక్కొక్కరికి పెద్దగా వయస్సు వ్యత్యాసం కూడా ఉండదు.. రెండేళ్ల తేడా ఉండచ్చు.. సులోచనమ్మగారి భర్త రామకృష్ణ శాస్త్రి గారు పౌరోహిత్యం చేస్తారు.. పెద్దగా రాబడి లేకపోవడంతో సులోచనమ్మ గారు రాజేశ్వరిగారింట్లో వంటావిడగా కొన్ని సంవత్సరాలనుండి పని చేస్తున్నారు.. రాజేశ్వరిది కూడా వ్యవసాయ కుటుంబమే ..
అక్కతో చెప్పింది.. 'పిల్లలు లేరని బాధపడేకంటే, ఇప్పుడే ఎవరినైనా తెచ్చుకుని పెంచుకోవచ్చు కదా, ఇంక అలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ వయస్సుకూడా దాటిపోతుందే అక్కా' అంటూ సలహా ఇచ్చింది !
'ఎవరిస్తారే రాజీ పిల్లలను పెంచుకోడానికి.. ఏ చెట్టకీ ఆ కొమ్మ బరువుకాదు.. కష్టపడైనా తమ పిల్లలను పెంచుకుంటారే గానీ ఎవరికీ దానం చేయ'రంటూ నిరాశ వ్యక్తంచేసింది !
నీవు బావగారితో ఆలోచించి " ఊ" అనక్కా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను, నీకు చక్కని బిడ్డను ఇప్పిస్తానని వాగ్దానం చేసింది..
అక్క అంగీకారం ఇవ్వడంతో సులోచనమ్మగారికి చెప్పి వప్పించింది.. మీ బిడ్డకు మహారాణీ యోగం పడుతుంది.. హాయిగా మీ బిడ్డ బంగారపు తూగుటుయ్యాలలో ఊగుతుంది.. అలాగే మీ దరిద్రం కూడా తీరుతుంది సులోచనమ్మగారూ, పంతులుగారితో ఆలోచించండి ఈ విషయం.. మీరు పంపుతున్నది మా అక్క గారింటికని ఆలోచించండి అంటూ ఒప్పించింది !
తమ బిడ్డల్లో ఒకరైనా సుఖంగా దర్జాగా జీవిస్తారని , అదీగాక తమకు కూడా ఆర్ధికంగా ఆసరా దొరుకుతుందన్న ఒక ఆశ ఆ దంపతులను ప్రలోభపరిచింది !
ఆ తరువాక రాజేశ్వరి ఆఘమేఘాలమీద తన అక్కనూ బావగారినీ, ' తాండవపల్లి' వచ్చేయమంది ! సులోచనమ్మగారి పిల్లందరూ కూడా చక్కగా బొమ్మల్లో ఉంటారని, పేదకుటుంబమైనా చక్కని సంస్కారం నిజాయితీగల కుటుంబమని అక్కకు కావలసిన వివరాలన్నీ చెప్పింది !
మంచిరోజు, వర్జ్యం లేకుండా ఆ మరుసటిరోజు ఆది శేషయ్య దంపతులు, వారి కుటుంబ శ్రేయోభిలాషులైన గౌరీపతి శర్మగారిని వారి భార్యను కలుపుకుని రెండు గుర్రపు బండ్లలో బయలదేరడానికి సన్నహాలు చేసుకున్నారు.. జమీందారీవంశం, రాజసం ఉట్టిపడుతున్న కుటుంబం, మేడమీద ప్రత్యేకంగా ఒక గదిలోనున్న రెండు పల్లకీలను బయటకు తీసారు.. ఒక పల్లకీలో తాము దత్తత చేసుకుని పెంచుకోబోయే బిడ్డను కూర్చోపెట్టి తీసుకొచ్చే నిమిత్తం, మరో పల్లకిలో అరటి పళ్ల గెలలు, పనసపళ్లు, సులోచనమ్మగారికి అరడదను జరీ చీరలు అలాగే శర్మగారికి పట్టు ధోవతులు, కండువాలూ, ఆడపిల్లలకు పట్టులంగాలూ జాకెట్లూ, మగపిల్లలకు చొక్కాలూ లాగులూ, నాలుగురకాల స్వీట్లు, జంతికలూ, జున్నుపాలు ఇంక ఏమేమో సరంజామాతో బయలదేరారు..
ఆ పల్లకీ మంచి ముత్యాలతో పొదగబడి ఉంది.. పల్లకీ కప్పు ఎర్రటి ముఖమల్ బట్టతో అలంకరించి ఉంది.. అంచులకి పొడుగాటి పూసలు కుచ్చులూ వ్రేలాడుతున్నాయి.. పల్లకీ రంగు రంగు పూల దండలు, నగిషీ చెక్కిన కలంకారీ బొమ్మలతో మెరిసిపోతోంది. కూడా ఇద్దరు సన్నాయి విద్వాంసులు.. చాలా అట్టహాసంగా బయలదేరారు..
అనుకున్న టైమ్ ప్రకారం వీరు ఎక్కిన గుర్రపు బండ్లు , పల్లకీలు శర్మగారింటి ప్రాంగణం ముందు ఆగాయి.. అసలే పల్లెటూరు, ఊరు ఊరంతా తరలి వచ్చింది ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ! వారిది తాటాకులతో అల్లిన పాక .. చిన్న పాక అయినా కళ కళ్లాడుతోంది, పేడతో అలికిన వాకిళ్లు అందమైన ముగ్గులతో చూడ మనోహరంగా ఉంది..
అప్పుడే తులసికోటకు పూజ చేసిన చిహ్నంగా దీపపు ప్రమిదలో దీపం కాంతివంతంగా వెలుగుతోంది.. తులసమ్మవారు ఎర్రని ముద్ద మందారాలతో అలంకరించుకుని వీరిరాకకోసం ఎదురుచూస్తున్నట్లుగా కనపడుతున్నారు ! వాకిలి అంతా బంతిపూల చెట్లతో ఒక పవిత్రత చేకూరుస్తోంది ఆ ఇల్లు.. పిల్లలు గర్భదరిద్రం లో ఉన్నా, వారి ముఖాలలో ఎంతో కళ.. ముద్దుగా నిలబడి ఉన్నారందరూ.. వసారాలో వేసిన చాపమీద వచ్చిన వారందరూ కూర్చున్నారు.. పిల్లందరినీ పేరు పేరునా చూపెట్టారు.. ఈలోగా శేషయ్యగారు, కొన్ని పత్రాలు తీసి శర్మగారి చేతిలో పెడుతూ........
"మీరు వేరేవిధంగా భావించకండి శర్మగారూ . మీకు అయిదెకరాల కొబ్బరి తోటను మీ పేరు మీద వ్రాసాను.. ఒక అయిదులక్షల సొమ్ము ఇస్తున్నాను.. పిల్లలుగలవారు, పెద్దవారు.. మీ లాంటివారి ఇంట్లో పుట్టిన బిడ్డను మేము దత్తత తీసుకోడానికి మీ అంగీకారానికి కృతజ్నత"లంటూ ఆయన పాదాలకు నమస్కరించారు.. సీతామహలక్ష్మి గారు సువర్చలగారికి ఆవిడ తెచ్చిన వస్తువులన్నీ అందచేసారు !
పల్లకీ సావిడలో ఆగి ఉంది .. బోయీలు చేతులు కట్టుకుని నిలబడ్డారు.. ఈలోగా వారి ఎడపిల్ల నాలుగేళ్లది నెమ్మదిగా అడుగులేస్తూ పల్లకీలోకి దూరిపోయి కూర్చుండిపోయింది.. ఇంకా ఎవరిని తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు శేషయ్యదంపతులు.. ఆడపిల్లే బాగుంటుందని దంపతులు ఇంట్లో అనుకున్నారు.. అలా పల్లకి లో కూర్చున్న ఆ పాపను చూసి అందరూ ఫక్కున నవ్వుకున్నారు.. అమాయకంగా ముగ్ధత్వంతో కూర్చున్న ఆపాప వారికి చాలా నచ్చేసింది.. పాలుకారుతున్న ఆ చిన్ని ముఖంలో మూడొంతుల భాగం నల్లని అమాయకమైన పెద్ద పెద్ద కళ్లు, చిన్ని సున్నాలా మూతిని చుట్టి కూర్చుంది ఆ పిల్ల.. అందరిలోకీ పసిమిఛాయతో కల కళ్లాడిపోతోంది..
నల్లటి జుట్టు గాలికి కళ్లమీద పడుతుంటే అలాగే అందరినీ వింతగా చూస్తోంది.. " పుష్యమీ" దిగు తల్లీ అని సులోచనగారు పిలుస్తుంటే, సీతామహలక్ష్మి గారు, ఒద్దండీ, ఆ పాప అమాయకంగా సరదాపడి పల్లకీ ఎక్కింది ఎంతో ఇష్టంగా.. పుష్యమి నే పెంచుకుంటాం అనగానే అందరూ హర్షథ్వని వ్యక్తం చేసారు !
వచ్చిన వాళ్లందరూ వీడ్కోలు తీసుకుంటూ మరోసారి రామకృష్ణ శర్మ దంపతులకు నమస్కరించారు.. ఎంతైనా కన్న హృదయం, ఏ తల్లికీ బిడ్డ బరువుకాదు, కానీ అదృష్టం వచ్చి వారింట తలుపులను తట్టింది.. రామకృష్ణ శర్మగారు పుష్యమి పుట్టినపుడు జాతకం వేసి చూసారు........ మహారాణీ లా అష్టైశ్వర్యాల మధ్య పెరుగుతుందని ఆ పాప జాతకం చెపుతోంది !
ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఊహకు అందనిది..
పుష్యమి ద్వారానే కన్న తల్లితండ్రుల దరిద్రం తీరింది !
ముత్యాలపల్లకీలో పసిడిబొమ్మ పుష్యమి కూర్చుంది.. పల్లకీముందు ఇద్దరు సన్నాయి వాయిద్యకారులు
‘పల్లకీ, పల్లకీ
రతనాల పల్లకీ
రంగు రంగుల పల్లకీ’, అంటూ సన్నాయి వాయిస్తుండగా
పల్లకిని మోస్తున్న నలుగురు బోయీలు ' ఒహో ఒహో' శబ్దంతో మోస్తున్న పల్లకీ మందగమనంతో, చిరుమువ్వల శబ్దంతో ముందుకు సాగింది .. అందులో కూర్చున్న అందాల బొమ్మ పుష్యమి కి తెలియదు.. తను ఒక రాకుమార్తెగా ఒక మహాసామ్రాజ్యంలోకి అడుగు పెడ్తోందని..
రంగు రంగుల పల్లకీ లోకి ఎక్కి కూర్చోవాలనే ముచ్చటపడింది కానీ, ఆ పాప ముచ్చట ఆమె జీవిత పంధాన్నే మార్చివేస్తుందని ఆ పాప కే కాదు, ఆమెను కన్న ఆమె తల్లి తండ్రులకే తెలియదు.. విధివిలాసం అంటే ఇదే. అదృష్టం అన్నది ఏ రూపంలో ఏ క్షణాన్న వస్తుందో ఎవరూ చెప్పలేరన్నది చాలా నిజం..
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
コメント