#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PusthakaPatanamSreshtam, #పుస్తకపఠనంశ్రేష్టము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 29
Pusthaka Patanam Sreshtam - Somanna Gari Kavithalu Part 29 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/03/2025
పుస్తక పఠనం శ్రేష్టము - సోమన్న గారి కవితలు పార్ట్ 29 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పుస్తక పఠనం శ్రేష్టము
పుస్తకాన్ని పట్టుకో
మస్తకాన్ని వెలిగించుకో
అక్షరాల వనంలో
ఆనందము పొందుకో
నిజ నేస్తము పుస్తకము
మరువవద్దు ఈ విషయము
ప్రయాణంలో తోడుగా
ఉండునోయ్! మిత్రునిగా
హస్త భూషణం నాడు
చరవాణి ఈనాడు
చూడు చూడు ఈ చిత్రము
జాగ్రత్త! నీవు మాత్రము
మంచి అలవాటు పఠనము
చేసుకొనుము అభ్యాసము
పెద్దవారి మాటలను
తెచ్చుకొనుము జ్ఞాపకము

సర్ సి. వి. రామన్ గారు
----------------------------------------
సాటిలేని శాస్త్రవేత్త
సర్ సి.వి.రామన్ గారు
సాంకేతిక రంగంలో
గొప్ప పేరు తెచ్చినారు
'రామన్ ఎఫెక్ట్' ను రామన్
కనిపెట్టి మేలు చేసెను
నోబెల్ శాంతి బహుమతి,
భారతరత్న గైకొనెను
తిరుచిరపల్లిలో పుట్టెను
అంచెలంచెలుగా ఎదిగెను
భౌతిక శాస్రంలో పలు
పరిశోధకులు గావించెను
'రామన్ ఎఫెక్ట్' కనుగొన్న
రోజు 'జాతీయ సైన్స్ దినం'
'సర్ సి.వి.రామన్ సేవలు'
ప్రపంచంలోనే ఘనం

మా మంచి మాస్టారు!
----------------------------------------
బడిలోకి మాస్టారు
ప్రేమగా వచ్చారు
కొత్త కొత్త విషయాలు
గొప్పగా చెప్పారు
మానవతా విలువలు
మాకు బోధించారు
జీవితాన చదువులు
ముఖ్యమని తెలిపారు
పెద్దోళ్ల సలహాలు
తీసుకోమన్నారు
కన్నోళ్ల పద్ధతులు
పాటించమన్నారు
విలువైనది కాలము
వాడుకోమన్నారు
అతి చిన్న జీవితము
జాగ్రత్త! అన్నారు
మా మంచి మాస్టారు
మా పాలిట దైవము
చీకటి తరిమి భవిత
వెలిగించే దీపము
ప్రియమైన మాస్టారు
మా క్షేమమే కోరు
కనుపాపలా కాసే
వారికి సాటి లేరు

బలము ఉన్నది కలము
----------------------------------------
నాకెంతో ఇష్టము
వ్రాత వ్రాసే కలము
తలరాత మార్చేది
నా గుండెకది బలము
కవీంద్రుల కరమున
నాట్యమే ఆడేను
అక్షరాల వనమున
వాసమే చేసేను
కాగితంపై రాతలు
చక్కగా వ్రాసేను
జేబులో ముద్దుగా
ఆసీనమయ్యేను
పరీక్ష వేళల్లో
అత్యంత అవసరం
అక్షరాలకు కలము
తండ్రిగా మారేను
విద్యార్థులకు కలము
ఉండాలోయ్! సతతము
అన్నీ చోట్ల కలము
కొలువుదీరును నిజము
పలు రంగుల్లో కలము
ఉండును అంగట్లో
బలము ఉన్నది కలము
అధికారుల చేతుల్లో

మా బడి దైవ గుడి
----------------------------------------
అమ్మలాగ లాలించును
నాన్నలాగ ప్రేమించును
అందమైనది మా బడి
అనురాగాల పుప్పొడి
తారతమ్యాలు లేనిది
సామరస్యమున్నది
శ్రేష్టమైన మా బడి
శ్రేయస్సును కోరునది
వినోదాన్ని పంచునది
వికాసాన్ని పెంచునది
అజ్ఞానం తొలగించే
విజ్ఞాన ఘన దీపమది
పాటలతో,ఆటలతో
కథలతో,పాఠాలతో
ఆనందం ఒసగునది
అమ్మను తలపించునది
మహోన్నత వ్యక్తిత్వం
మనసున మానవత్వం
పెంపొందింప జేసేది
దానవత్వం తరిమేది
ఉజ్వల భవితకు పునాది
జీవితాల్లో ఉగాది
సాటిలేని మేటి బడి
బాలలుండే చోటు అది
బాల్యానికి కవచమది
బంగారు బాట అది
అభివృద్ధి పథంలోన
నడిపించే నాన్న అది
గురువులుండే మందిరం
చూడంగా సుందరం
బడికి పంపాలి పిల్లలను
తప్పకుండా అందరం
-గద్వాల సోమన్న
Comments