top of page
Writer's pictureSimha Prasad

పుత్రుడు


'Puthrudu' New Telugu Story

Written By Simha Prasad



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

‘‘రేపు సాయంత్రం నాలుగు గంటల స్లాట్‌ ఒక్కటే ఖాళీగా వుంది. బుక్‌ చేయమంటావా?’’


‘‘చేసెయ్యండి చేసెయ్యండి’’


ఇంట్లో వారికి వినిపించకుండా, లోగొంతుతో మెడికల్‌ ల్యాబ్‌ వారితో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణకు అపాయింట్‌మెంటు తీసుకున్నాను.


చిన్న గదిలోంచి నాన్న దగ్గు విన్పించింది. దూసుకెళ్ళాను. ‘‘ఎలా వుంది నాన్నా. జ్వరం నెమ్మళించిందా... ’’

సమీపించబోతోంటే, ‘‘ఆగాగు. ముందెళ్ళి డబుల్‌ మాస్కు పెట్టుకురా’’ కోప్పడ్డారు.


‘‘అక్కడేం నిధులు మురిగిపోతున్నాయనీ మాటిమాటికీ పరుగెడుతున్నారు. ఆయనకేమీ కాదు. మనల్ని చంపిగాని పోరు’’ నా భార్య రయ్‌మని రెచ్చి పోతోంటే వారించాను.

‘‘ష్‌... నాన్న వింటే బాధపడతారే’’


‘‘విన్నాకైనా బుద్ధొస్తుందనే గట్టిగా మాట్లాడుతున్నా. ఆయనకి మీరొక్కరేనా కొడుకు? మీకొక్కరికేనా బాధ్యత?’’


‘‘నీకు దణ్ణం పెడతాను గాని గమ్మునుండవే. అసలే ఆయన ఆరోగ్యం దిగజారుతోందని నేను ఆందోళనపడుతోంటే, మధ్యన నీ నస ఏంటే’’ కసిరి, నాన్న గదిలోకెళ్ళాను.


ఆయన వారిస్తున్నా వినకుండా చెయ్యి పట్టుకుని చూశాను. కాలిపోతోంది.

‘‘కరోనాయేరా... నాకేం డౌటు లేదు. రుచీ పచీ తెలీడంలేదు. దగ్గు వదలటం లేదు….. ’’ నిర్లిప్తంగా అన్నారు.


‘‘టెస్ట్‌ చెయ్యకుండా అలా ఎలా ఒక నిర్ణయానికొచ్చేస్తారు? రేపు సాయంత్రం ఇంటికే వచ్చి శాంపిల్‌ తీసుకెళ్తారు. ల్యాబ్‌కెళ్తే త్వరగా అవ్వొచ్చు గాని అక్కడ చాంతాడంత క్యూ వుంటుంది. వారివల్ల మనకు ప్రమాదముండొచ్చని ఇంటికే రమ్మన్నాను’’.


‘‘నా వల్ల వాళ్ళకీ ప్రమాదం వుండొచ్చుగా! అలా ఎందుకాలోచించట్లేదో చెప్పనా? నీకు నేనే ముఖ్యం గనుక!’’ నవ్వి అన్నారు. ‘‘గత జన్మలో బంగారు పూలతో భగవంతుణ్ణి పూజించి వుంటాను. నన్ను పూలలో పెట్టి చూసుకునే కొడుకువి లభించావు!’’ నాన్న కళ్ళు మెరిశాయి గాని స్వరం గాద్గదికమయ్యింది.


‘‘ప్లీజ్‌ నాన్నా. ఎక్కువ మాట్లాడొద్దు. నిన్న డాక్టర్‌ రాసిచ్చిన మందులు శ్రద్ధగా వాడదాం. దానికి తగ్గిపోతే అదృష్టమేగా!’’ వేడినీళ్ళు తెచ్చిచ్చాను.


టాబ్లెట్సు వేసుకున్నాక, టెర్రేస్‌ మీదకెళ్ళి అన్నయ్యలిద్దరికీ ఫోన్‌ జేసి నా అనుమానం బయటపెట్టాను.


‘‘ఇంకా ఇంట్లో పెట్టుకున్నావేంరా, ప్రభుత్వాసుపత్రిలో చేర్చెయ్‌. వాళ్ళు బాగానే చూసుకుంటార్లే’’ అన్నాడు పెద్దన్నయ్య.


‘‘నాన్న మీద నీకొక్కడికే ప్రేమ వున్నట్టు నటిస్తుంటావుగా. నువ్వు చూసుకోక నాకెందుకు ఫోన్‌ చేశావు? నేనేం డబ్బు సర్దలేను. ఇప్పుడు రాలేను’’ అనేశాడు చిన్నన్నయ్య.

చిన్నగా నిట్టూర్చాను.


ల్యాబ్‌ నుంచి టెక్నీసియన్‌ వచ్చి శాంపిల్‌ తీసుకొంటోంటే, నా భార్య ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదిరాయి.

‘‘ముసలాయనకి కరోనా వచ్చిందా? ముందే ఎక్కడికో అక్కడికి పంపేయండి. ఎంత పోరుతున్నా వినకుండా మీరు మరీ అంటుకు తిరుగుతున్నారు. మీకేమైనా అయితే నేనూ పిల్లలూ అనాథలైపోతాం. అడుక్కు తినాల్సొస్తుంది!’’ ఏడుపందుకుంది.


‘అనాథ’ మాట నా గుండెల్ని వేనవేల వక్కలు చేసింది. వాడి బాణం దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడుతూ చూశాను.


‘‘అదేం మాటే. మనచుట్టూ ఎందరో వున్నారు. ఎవర్నీ అనాథలు కానివ్వరు. చేయి అందిస్తారు. చేయూత ఇస్తారు’’


‘‘మనూళ్ళో సోనూసూద్‌లు లేరు గాని, కరోనా అయితే ఇంకేం ఆలోచించకుండా మీ నాన్నని మీ అన్నయ్యల దగ్గరికి పంపించెయ్యండి. మనింట్లో వుంచుతానంటే మాత్రం వూరుకునేది లేదు ’’


‘‘ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ఇప్పుడేం అల్లరి చెయ్యకు. ఎవరైనా వింటే గొడవైపోతుంది’’.


మర్నాడు మెయిల్లో రిజల్ట్‌ వచ్చింది. కరోనా పాజిటివ్‌!

మెదడు బ్లాంక్‌ అయింది. మ్రాన్పడి నిస్సత్తువగా కూలబడ్డాను. కళ్ళల్లో కన్నీటి వాగు కట్టకు గండి పడింది!

‘‘నాన్నా... నాన్నా... !’’ గుండెలు మూగగా ‘గుండెలు’ బాదుకున్నాయి.


ఇప్పుడేదేదో అయిపోతుందని ఊహించుకుని ఆందోళన పడటం అనవసరం. కరోనా బారిన పడిన ఎందరెందరో కోలుకుంటున్నారుగా!


ధైర్యం తెచ్చుకున్నాను. ఆలస్యం చెయ్యడం ఏమాత్రం మంచిది కాదనుకుని బైక్‌ బయటికి తీశాను. మా చుట్టుపక్కలి అన్ని ఆసుపత్రుల్లో ఎంక్వైరీ చేశాను. కరోనా పేషెంట్లకి బెడ్స్‌ లేవన్నారు.


మిత్రుడు వాసుకి ఫోన్‌ చేసి విషయం వివరించి సాయం కోరాను.


‘‘ప్రభుత్వాసుపత్రిలో చేర్చెయ్‌. అక్కడ ట్రీట్‌మెంట్‌ బాగానే వుంటోంది’’

‘‘ఇవతల మా నాన్నరా. రిస్కు తీసుకోలేను’’


‘‘ప్రైవేటు వాళ్ళు ఎంతెంత బిల్లుల్తో ఎడాపెడా వాయించేస్తున్నారో పేపర్లలో చూసే వుంటావు. కడకి నిన్ను నువ్వు అమ్ముకోవాల్సొస్తుందేమో ఆలోచించు’’ హెచ్చరించాడు.


‘‘నేనేమైనా ఫరవాలేదు. నాన్న బతకాలి. అంతే. నీకు తెలిసిన ఆసుపత్రుల్లో ఎంక్వైరీ చెయ్యరా. దూరమైనా ఫరవాలేదు... ’’.


ఇద్దరం జల్లెడ పట్టాం. ఒక ప్రముఖ హాస్పిటల్లో బెడ్‌ దొరికింది. లక్ష డిపాజిట్‌ చేయమన్నారు. సేవింగ్సంతా డ్రా చేసి జమ చేశాను.


‘‘హాస్పిటల్‌ కెళదాం. రెడీ అవ్వు నాన్నా. అంబులెన్స్‌ వస్తోంది... ’’


‘‘నా అనుమానమే నిజమైందన్నమాట. బరువంతా నీ నెత్తిన పడటం ఎందుకురా. అన్నయ్యలకి ఫోన్‌ చెయ్యి. ప్రాణం మీది కొచ్చిందని చెబితే వస్తారు... ’’


మౌనమే సమాధానంగా ఇచ్చాను.

‘‘అర్థమైందిలే. రక్తం పంచుకునిపుట్టారు. ఆస్తులు పంచుకుని వెళ్లారు. ఇంక వాళ్ళకి నాతో పనేంటి!’’ శుష్కహాసం నాన్న పెదాల మీద కదిలింది.


‘‘అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు. మీకు 15 రోజుల్లో నయమైపోతుంది. రికవరీ రేటు చాలా ఎక్కువగా వుంది నాన్నా’’.


‘‘ఆశ పీక లావు!’’


బయల్దేరుతోంటే అన్నారు ‘‘పూజామందిరంలోని అంక్షింతలు తెచ్చియ్యి. కోడల్ని కూడా రమ్మను’’.

మా ఆవిడ గదిలోంచి రాలేదు. నేనే నమస్కరించాను. ఎందుకో నా కన్నీళ్ళు జారి ఆయనకి పాదాభిషేకం చేశాయి.

‘‘నా ఆయుష్షు కూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా వర్ధిల్లరా!’’


ఏడ్చేశాను. ‘‘కోడల్ని తప్పు బట్టకు. పిల్లల కోడి. అర్థం చేసుకో’’ నా భుజం తట్టారు.


గుమ్మం దాటుతూ ఆగి, ఒక మడిచిన కాగితం నా జేబులో పెట్టారు. ‘‘ఇప్పుడు చూడొద్దు. ఆసుపత్రి నుంచి నన్ను తీసుకొస్తావే, అప్పుడు చూడు... ’’


ఆ మాటల వెనుక ఏదో అపశృతి విన్పించింది. తుళ్ళిపడి నీళ్ళు నిండిన కళ్ళతో చూశాను. కళ్ళతో భరోసా చెప్పి నా భుజం సాయంతో అడుగులేశారు.

నాన్నని ఆసుపత్రిలో చేర్చి ఎంతో ధైర్యం నూరిపోసాను. దేవదూతల్లా కన్పిస్తోన్న డాక్టర్లకి, సిస్టర్స్కి నమస్కరించి, ప్రత్యేకంగా చూడమని అర్థించి, బయటికొచ్చాను. ఎంతో నిశ్చింత ఫీలవుతూ రోడ్డు పక్క బడ్డీ దగ్గర టీ తాగుతోంటే, తక్షణం రమ్మని ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది.


సగం తాగిన టీ గ్లాసుని పక్కన పెట్టి లోపలికి పరుగెత్తాను.

‘‘అర్జంటుగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు పట్రండి’’ సిస్టర్‌ చెప్పింది.


‘‘మీ దగ్గర లేవా?’’

‘‘వుంటే ఎందుకు చెబుతాను. త్వరగా వెళ్ళి తెండి... ’’


మూడు నాలుగు మెడికల్‌ షాపుల్లో అడిగాను. లేవన్నారు.

వాసుకి చెప్పాను.

‘‘జలగలు రక్తపానం మొదలు పెట్టాయి... ’’

‘‘సెటైర్లొద్దు. ఎక్కడ దొరుకుద్దో నీకేమైనా తెలిస్తే చెప్పరా’’

‘‘ప్రాణావసరమైన ప్రతీదీ ఇండియాలో బ్లాకులో లభించును... ’’


ఇంతలో ఇంకో ఫోన్‌ వచ్చింది. మెడికల్‌ షాపు వాళ్లేమోనని చటుక్కున ఎత్తాను.


‘‘మీక్కావాల్సిన ఇంజెక్షన్లు నా దగ్గరున్నాయి. నలభై వేలు అవుతుంది... ’’

ఒక్క నిమిషమూ వృధా చెయ్యలేదు. వాసు దగ్గర అప్పుచేసి, కొని తీసుకొచ్చి ఇచ్చాను.

‘ఇంక నాన్న ఆరోగ్యానికి ఢోకా వుండదు’ సంబరపడ్డాను. జరిగిందంతా అన్నయ్యలకి ఫోన్లో చెప్పాను.


మర్నాటి పేపర్లో నకిలీ రెమ్‌డెసివర్లు అమ్ముతున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారని వార్త వచ్చింది. గుండెలు జారిపోయాయి. ఆగమేఘాల మీద ఆసుపత్రికెళ్ళాను.


‘మేలు చేయకపోతే మానె, హాని చేయకుండా చూడు దేవుడా!’ లాంజ్‌లోని వినాయకుడ్ని ప్రార్థించి, నాన్న ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేశాను. వార్డులోకి వెళ్ళనివ్వలేదు. సిస్టర్‌, నాన్న వివరాలు కనుక్కునొచ్చి చెప్పింది.


‘‘ప్రస్తుతానికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు. ఇంతకుమించి ఇప్పుడే ఏమీ చెప్పలేం’’


‘‘నకిలీవి వస్తున్నాయని నా భయం’’

‘‘అది తెలిసీ ఎలా తెచ్చావ్‌? పేషెంట్‌ బతకాలనుకుంటున్నావా, చంపెయ్యాలనుకుంటున్నావా’’ కళ్ళు మూసుకుని పడింది.


నలుగురూ వచ్చి ఆవిడ్ని శాంతపరిచారు. కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగాను.

మరి రెండ్రోజులు గడిచాయో లేదో, ఒక రాత్రివేళ ఆసుపత్రి వారు ఫోన్‌ చేసి, ‘‘పేషెంట్‌కి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా వుంది. అర్జంటుగా ఆక్సిజన్‌ సిలిండర్‌ తీసుకురండి’’ ఆర్డరేసారు.


‘‘ఆ బెడ్‌కి ఆక్సిజన్‌ సౌకర్యం లేదా?’’

‘‘అయిపోయింది’’ లైన్‌ కట్‌ చేశారు.


సంగతి విని, ‘‘రేపు చూద్దురు గాన్లెండి. పడుకోండి’’ అంది భార్య.

‘‘ఆక్సిజన్‌ ప్రాబ్లమే. రేపటికెలా వుంటుందో!’’ ఫ్యాంట్‌ తొడుక్కుంటూ అన్నాను.


‘‘మహా అయితే అటు అవుతుంది. అంతేగా! అదీ మన మంచికే అనుకుని, ఒక ఏడ్పు ఏడ్చి వూరుకోండి. ఆయన కోసం ఇల్లు గుల్ల చేస్తానూ, నా పిల్లల నోట్లో మట్టి గొడతానూ అంటే నేను సహించను’ చేతులు తిప్పుతూ ఖరాఖండీగా చెప్పింది.


‘‘ఆయన మా నాన్నే’’ దీనంగా చూసాను.

‘‘అందుకే ఇంతదాకా చేశారు. మీతోబాటు నేనూ చాకిరీ చేశాను. అది చాలు. ఇంకేం ఎగరక్కర్లేదు. మన రెక్కలు చాలా చిన్నవని మర్చిపోకండి.. ’’


ఆమె గొణుగుడు పట్టించుకోకుండా బయటికి నడిచాను.

బైక్‌ తీస్తూ వాసుకి ఫోన్‌ చేశాను. ‘‘నువ్వే సాయపడాల్రా’’ ఏడ్చేశాను.


‘‘ఆసుపత్రి వారు నీకు నరకం చూపిస్తున్నట్టున్నారే!’’

‘‘నన్ను నరక బాధలు పెట్టినా ఫరవాలేదు. నాన్న మాత్రం నరకయాతన పడకూడదు... !’’

‘‘సరిసరే... బరస్టవ్వకు. హాస్పిటల్లో కనుక్కో. ఎక్కడ దొరికేదీ వాళ్లే చెబుతారు’’

‘‘నీకే సోర్సూ తెలీదా?’’


‘‘ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేస్తాన్లే గాని, నువ్వేమీ అనుకోనంటే నాదో మాట. మరీ అంత తాపత్రయం వద్దు. పెద్దాయన. పండుటాకు. రాలక తప్పదు. అది ఎప్పుడన్నదే ప్రశ్న. రోజులు గడిచేకొద్దీ బిల్లు పెంచి పెంచి కడకి ఆసుపత్రి వాళ్ళు నిన్ను కట్టుబట్టల్తో రోడ్డుమీదకి తోలేస్తారేమోనని నా భయం’’


‘‘సరే గాని, నువ్వే డబ్బు సర్దాలిరా. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు. కాని నాన్నకోసం తప్పట్లేదు’’ దీనంగా అర్థించాను.


‘‘నువ్వో మొండిఘటానివి. ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్‌ చేస్తాన్లే’’

హాస్పిటల్‌ అటెండెంట్‌ని బండి మీదెక్కించుకుని తిరిగి, ఎలాగైతేనేం ఆక్సిజన్‌ సిలిండర్‌ చేజిక్కించు కోగలిగాను.


‘‘టైమ్‌కి తెచ్చారు’’ అన్నాడు డాక్టర్‌. మరో మాటకి అవకాశం ఇవ్వలేదు.


ఏదో అధైర్యం, మరేదో భయం గుండెల్ని కసబిసా నలిపేస్తోంటే, అక్కడే రాయిలా కూర్చుండిపోయాను.


‘‘నాన్నకి త్వరగా నయమై ఇంటికొచ్చేట్లు చూడు తండ్రీ. మూడు నెలల్లో నాన్నని తీసుకుని తిరుపతి వస్తాను. ఇద్దరం తలనీలాలిచ్చి నీ దర్శనం చేసుకుంటాం’’ ఆపదమొక్కులవాడికి మొక్కాను.


ఆయన కొండంత అభయం పట్టినట్టు అనుభూతించాను.

నాన్న పరిస్థితి ఎప్పటికప్పుడు అన్నయ్యలకి తెలియ బరుస్తున్నాను. వారి నుంచి సరైన రెస్పాన్స్‌ లేదు. బహుశా కోవిడ్‌ మహమ్మారి గురించి భయపడుతున్నారేమో పాపం!


రోజూ ఆసుపత్రి కెళ్తున్నాను. డాక్టర్లు, నర్సులు, అటెండెంట్ల ద్వారా నాన్న ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్నాను. ఎంచేతో ఒకరి మాటలకీ, ఇంకొకరి మాటలకీ పొంతన వుండట్లేదు!

మరి నాలుగురోజులు ప్రశాంతంగా గడిచాక అయిదోరోజున తుఫాను పంజా విసిరింది.


నాన్న కాలం చేశారని చావు కబురు చల్లగా చెప్పి, 6. 4 లక్షల బిల్లు నా చేతిలో పెట్టారు.

ఘొల్లుమన్నాను.


బిల్లు చూసి అనుకొని కాబోలు కంగారుపడ్డారు సిబ్బంది.

‘‘నాన్న... దేవుడు నాన్న... !’’ ఆపై దు:ఖోధృతి నా నోరు పెగలనివ్వలేదు.


వాసు, మరో ఇద్దరు స్నేహితులూ వచ్చారు. అంతా వెళ్ళి నా ఆర్థిక పరిస్థితి గురించి ఆసుపత్రి వారికి చెప్పి బ్రతిమాలారు.

‘‘సరే, ఆరు లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్ళండి’’ అన్నారు ఎంతో దయ దలుస్తున్నట్టు.

‘‘మీ అన్నయ్యలకి చెప్పి డబ్బు సర్దమందాం... ’’ నా ఫోన్‌ తీసుకుని వాసూయే వారితో మాట్లాడాడు.

‘‘మా తమ్ముడికి చాదస్తం జాస్తి. శవం కోసం పిచ్చివాడు కూడా ఆరు లక్షలు తగలెయ్యడు. వదిలేసెయ్యమను. హాస్పిటల్‌ వాళ్ళే ఏదో చేస్తారు’’ అన్నాడు పెద్దన్నయ్య.


‘‘నేను వద్దన్నా వినకుండా ప్రైవేటు హాస్పిటల్లో చేర్చాడు. ముందు చూపు లేకపోతే తర్వాతిలాగే ఏడవాల్సొస్తుంది. సారీ, నాదగ్గర నయా పైస లేదు !’’ నిర్దాక్షిణ్యంగా అన్నాడు చిన్నన్నయ్య.


‘‘వీళ్ళెక్కడి అన్నయ్యలు రా. అసలు వీళ్ళు మీ నాన్న కొడుకులేనా?’’


వాసు ప్రశ్నకి జవాబివ్వకుండా, ‘‘నీకు తెలిసిన మార్వాడీ వుంటే చూడరా. నా ఫ్లాటు తాకట్టు పెడతాను’’ అన్నాను దృఢస్వరంతో.


‘‘నీకు నిజంగానే మతిపోయింది. నీ అన్నయ్యల్లా నువ్వూ చేతులు దులిపేసుకో. కరోనా శవాన్ని వాళ్ళు ఎక్కువసేపు వుంచుకోరు. ఎక్కడో అక్కడ పెద్ద గొయ్యి తీసి మూకుమ్మడిగా ఖననం చేయించేస్తారు’’


‘‘ఆయనెవరో అనాథ అయినట్టు మాట్లాడతావేంట్రా. ఆయన మా... మా నాన్న… మా ఆచారం ప్రకారం శాస్త్రోక్తంగా కట్టెలు పేర్చే శవదహనం చేస్తాను. ఆయన పుణ్యాత్ముడు. ఆయనకి పుణ్యగతులు దక్కి తీరాలి!’’

నా వంక వెర్రిగాచూశారంతా. ‘‘నీ ఫ్లాట్‌ బ్యాంకుకి తనఖా పెట్టే లోన్ తీసుకున్నావుగా. ఇంకెవడిస్తాడు అప్పు ?’’ ఒక మిత్రుడు ప్రశ్నించాడు.


‘‘కొంత అప్పు తీర్చేశాను. ఫ్లాట్‌ విలువ బాగా పెరిగింది. మార్వాడీలు ఇస్తార్రా. మీరీ సాయం చేసిపెట్టండ్రా. ఎంతో టైం లేదు... ’’ చేతులు జోడించాను.


‘‘ఈ అప్పూ వడ్డీ తీర్చడానికి నీ బతుకంతా కష్టపడాలి తెలుసా!’’

‘‘పడతాను నాన్న కోసం నువ్వున్నట్టు నన్ను నేను అమ్ముకోడానికీ సిద్ధమేరా వాసూ’’


ఎలాగైతేనేం, ఆసుపత్రి వారి బాకీ చెల్లించి నాన్న పార్థివ దేహాన్ని అంబులెన్సులో శ్మశానవాటికకు తీసుకెళ్లాం. వద్దని ఆపినా వాసు ‘తగిన జాగ్రత్తలు తీసుకున్నాన్లే’ అంటూ వెంట వచ్చాడు. నాకూ గ్లోవ్స్‌ తెచ్చిచ్చాడు.


అక్కడా పెద్ద క్యూ వుంది. స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సొచ్చింది.

‘‘ఎలాంటి పాడు కాలం వచ్చిందో చూడు. అన్నింటికీ కొరతే’!’ బాధగా అన్నాను.


‘‘అవును. ప్రేమాభిమానాలకీ కొరత వచ్చింది. మీ అన్నయ్యలే దానికి నిలువెత్తు సాక్ష్యం. నువ్వు పెద్ద మినహాయింపులే’’


‘‘వాళ్ళని తప్పుబట్టకు. వారి పరిస్థితులు అలాంటివి !’’ నా భార్య గురించి నాన్న చెప్పిన మాటల్ని నెమరువేసుకుంటూ అన్నాను.


‘‘ఎవర్నీ తప్పు బట్టవు కదా! ప్రభుత్వాల పాలనలోని డొల్లతనం ఇదిగో ఇప్పుడు బాగా బయటపడింది. ఇంతదాకా ఎంతో అభివృద్ధి చెందామని జబ్బలు చరుచుకున్నాం. అది బలుపు కాదు వాపు అని కరోనా ముఖం మీద గుద్ది మరీ చెప్పింది’’ వ్యాఖ్యానించాడు వాసు.


వాడి మాటలు నా బుర్రకేం ఎక్కలేదు. నా మనస్సు నిండా నాన్న ఆలోచనలే. ఆయన దయార్ద్రపు చూపు, మాట, చేయూత, ప్రోత్సాహం ఏ జన్మలోనూ మరచిపోలేను!

శవదహనం పూర్తయ్యింది.


చితికి నమస్కరించి కదుల్తోంటే అన్నాడు వాసు ‘‘కరోనా సోకిందంటే చాలు ఆమడ దూరం పరుగెడుతున్న ఈ కాలంలో నువ్వింత చేయడం అపూర్వం. ఏ కొడుకూ చేయలేనంత ఎక్కువగా చేశావు. నువ్వు నా ఫ్రెండ్‌వైనందుకు గర్వంగా వుందిరా’’


‘‘నాకు బతుకు ఇచ్చిన నాన్నని బతికించుకోలేకపోయిన అభాగ్యుణ్ణి!’’ బావురుమన్నాను.


‘‘నిన్ను పెంచి పెద్దచేయడం తండ్రిగా ఆయన బాధ్యత. రేపు నువ్వూ నీ పిల్లలకి అలాగే చేస్తావు. ఇందులో చిత్రమేం లేదు’’

‘‘నేను... నేను... నాన్న కొడుకుని కాదు. నాన్న చేరదీసిన అనాథని. ఇప్పుడు చెప్పు. ఎంత సేవ చేసినా ఆయన ఋణం తీరుతుందా?’’ వేదనతో సుళ్ళు తిరుగుతూ అడిగాను.


వాసు కదిలిపోయాడు. వేదనగా సానుభూతిగా చూసి నా భుజం మీద చేయి వేసి అనునయంగా నొక్కాడు.


‘‘ఒక మనిషి చేయగలిగిందానికన్నా ఎక్కువే చేశావు. నువ్వు ఋణవిముక్తుడివి కాకపోతే ఇక ఆ పదానికి అర్థమే వుండదు. పద స్నానం చేద్దాం... ’’


నీళ్ళ పైపు దగ్గరికి వెళ్తూ ఆగి, జేబులోంచి నాన్న ఇచ్చిన కాగితం బయటికి తీశాను.


‘‘నా కోసం, నా బదులు నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావురా. నేను పున్నామ నరకంలో పడకుండా రక్షించిన నువ్వే నువ్వే నా పుత్రుడివిరా హరీ!’’


***

సింహ ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

సింహ ప్రసాద్ పేరుతొ కథలు రాసే నా పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ . 1973 నుండి రచనలు చేస్తున్నాను . ఇంతవరకు 408 కథలు,66 నవలలు ప్రచురితమయ్యాయి . 82 కథలకు,18 నవలలకు,2 నాటకాలకు బహుమతులందుకున్నాను. వివాహ వేదం,తిరుమల దివ్యక్షేత్రం ,స్వేచ్చా ప్రస్థానం ,స్త్రీ పర్వం,ధిక్కారం ,అభయం ,63 బహుమతి కథలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. నివాసం హైదరాబాద్ లో.


337 views1 comment

1 bình luận


M A Padmanabha Rao
M A Padmanabha Rao
02 thg 3, 2023

పుత్రుడికి సరైన నిర్వచనం ఈ కథ. సింహప్రసాద్ గారు అద్భుతమైన రచయిత. వారి కలం నవరసాలను వెదజల్లుతుంది👏👏👏

Thích
bottom of page