'Puttina Gadda' - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 18/08/2024
'పుట్టిన గడ్డ' తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆరోజు మిత్రులందరూ- అంటే- అప్పటి స్కూలు మేట్లూ బెంచుమేట్లూ ఇప్పటి కాలేజీ మేట్లు అందరూ పోష్ ప్రాంతంలో పోష్ గా కట్టిన గాంధారి అపార్టుమంట్స్ క్లబ్ హౌస్ లో గుమికూడారు. టిన్డ్ కూల్ డ్రింక్స్ చప్పరిస్తూ వరసగా గుండ్రంగా రౌండ్ టేబుల్ కలయికలా కూర్చున్నారందరూ. వాళ్ళ ఆలోచనలు ఆకాంక్షలు యవ్వన వేగంతో ముడిపడి సముద్ర అలల్లా హోరున లేచి పడుతున్నాయి. యవ్వనపు రోజులంటే కళ్ళేనికి అందని శ్వేత గుర్రాలే కదా! ఇంతకీ వాళ్ళ చర్చల్లోని విశేషం ఏమిటని? మొన్న పదిరోజుల క్రితం బిజినెస్ డిగ్రీలు అందిపుచ్చుకున్నారు వాళ్ళందరూ.
ఉన్నఊరు విడిచి, గగన వీధుల్ని దాటి పర దేశాలకు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ కరెన్సీలు ఎక్కడున్నావని? కచ్చితంగా ఇప్పటికి ప్పుడు అంతటి భారీ విలువ గల కరెన్సీలు భారతదేశంలో లేవుగా! అంచేత, తమ యుక్త వయస్సులో వాంఛల తేరు ఎక్కాలంటే డాలర్స్ లేదా యురోస్- అదీ లేకపోతే దీనార్లు గలగలమని నడయాడుతూన్న దిక్కువేపే సాగిపోవాలి మరి-- ఇక్కడుండి ఎన్ని అగచాట్లు పడినా చుక్కాని లేని నావలా అవక తవకగా క్రింది స్థాయిన బ్రతుకీడ్చుతూ ఉండ వలసిందే! కష్టే ఫలీ అన్న సూత్రం ఇక్కడ మక్కికి మక్కీగా పనికి వస్తుందా-- సందేహస్పదమే--
మొదట అవినాశ్ అన్నాడు- “లక్కిలీ ముందస్తు పథకంతో మనం ప్రతిష్ఠాత్మకమైన బిజినెస్ స్కూలులో చేరాం. సెలేక్షన్ ప్రోసెస్ లో మన బిజినెస్ స్కూలుకి అంతర్జాతీయంగా పోజిటివ్ ర్యాంకింగ్ ఉంటుందని మా నాన్న ఈరోజే తియ్యటి కబురందిం చారు. దాని ఆధారంగా నేను పోస్ట్ గ్రేడ్వేషన్ కోసం మూడు ఫారిన్ యూనివర్సిటీలకు అప్లయ్ చేసాను. అవేమిటో చెప్పేదా? “
“ఇందులో దాపరికం దేనికి? కమౌట్ విత్ ట్రూత్! మేమెవరమూ నీతో పోటీకి రాములే-- “ ఏక కంఠంతో ఫ్రెండ్సందరూ క్లబ్ హౌస్ పైకప్పు లేచిపోయేలా గట్టిగా అరిచారు.
అప్పుడ అవినాశ్ విషయానికి వచ్చాడు- “చెప్తాను చెప్తాను. మరి మీరు కూడా మీ గురించి దాపరికం లేకుండా చెప్పాలి. ఓ కే! ”
ఆ బదులు విన్నంతనే మిత్రులు మరొక మారు ఓకేలతో రెచ్చిపోయారు. ముమ్మరమైన వయసులోని ఉద్వేగం అటువంటిది మరి. ఊహించలేనంత ఎత్తున ఉత్తుంగ తరంగమై లేస్తుందది.
అవినాశ్ చెప్పసాగాడు- ”మొదటిది- స్టాన్ ఫోర్డ్- రెండవది- వాషింగ్టన్- మూడవది- కాలిఫోర్నియా-- “
దానికి విష్ణుచక్రవర్తి స్పందించాడు- “వారెవా! ఏకంగా మూడు పులితోకల్ని ఒక్క చేత్తో పట్టుకోబోతున్నావన్నమాట! వాటిలో ఏ ఒక్కదానిలో నైనా సీటు దొరికితే ఇక నిన్నాపేదెవరట- అమ్మాయిల్ని కన్న అమ్మలూ నాన్నలూ మీ ఇంటి ముందు క్యూకట్టి నిల్చోరూ! ఇక నా గురించి నేను చెప్తాను మరి, నేనేమో—కొలంబియా- ప్రిన్సిటన్- మిషగాన్- వీటితో బాటు నీలాగే స్టాన్ ఫోర్ట్ కి కూడా అప్లయి చేసాను. ఏదో ఒకటి తప్పకుండా నన్ను పిలుస్తూంది. ఏమో చెప్పలేం- ఎక్కడో ఒక చోట నాకు ఇంటర్న్ షిప్పుతో బాటు ఉద్యోగం కూడా ఇస్తారేమో! మరి మీ సంగతి? ” అంటూ తోటి మిత్రుల వేపు చూపులు సారించాడతడు.
ఆ చూపులోని సూటిదనం గుర్తించిన మిగతా వాళ్ళందరూ- అంటే రాంగోపాల్- భానుచందర్- విశ్వాస్- గంగాధరం- వరసగా వాళ్ళకు నచ్చిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు పేర్లు చెప్పారు ఏకధాటిగా సగర్వంగా-- ఐతే-- వాళ్ళలో ఇద్దరు- వాసుదేవరావు, మోహనరావు ఇద్దరూ వెనుకడుగు వేసారు;అంత దూరం వెళ్ళడానికి గాని, అక్కడ స్టే చేయడానికి గాని తమకు తాహతు లేదని-- ఇక చివరి ఘట్టంగా అప్పుడో ఇప్పుడో తమను చేసుకోబోయే వనితా మణుల ప్రసక్తి కూడా వచ్చింది వాళ్ళ మధ్యకు.
అవకాశం కలసి రావాలే గాని- రిచెస్ అండ్ రిసోర్సస్ ఉండాలే గాని డేషింగ్ గా- మంచి పొడవుగా- బహు యాక్టివ్ గా ఉండే యురోపియన్ అమ్మాయిల్ని లాటిన్ అమెరికన్ అమ్మాయిల్ని భాగస్వామినులు చేసుకోవడంలో తమకు ఇసుమంత అభ్యంతరమూ లేదని పరస్పరావగాహనతో తేల్చుకు న్నారు. ఆ అంగీకారంతో వాళ్లు మళ్లీ కేరింతలు కొడ్తూ రెండవసారి టిన్డ్ కూల్ డ్రింక్సుని తెప్పించుకుని తాగారు.
ఐతే- మరొక వారం రోజులు సాగిన తరవాత, గంగాధరం కూడా వెనక్కి తగ్గాడు తను ప్రేమించి పెళ్ళి చేసుకోబోయే
అమ్మాయికి తను వృత్తి పరమైన పైచదవుల కోసం అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదని- ముఖ్యంగా అటువంటి చలి ప్రాంతాలలో ఆమెకు జులుబూ రొంపా త్వరగా అంటు కుంటుందని-- అంతగా అవసరమనుకుంటే గంగాధరం ఆరంభించబోయే అంకుర
సంస్థకు తన తండ్రే తగినంత పెట్టుబడి పెట్టి సహాయం చేయగలడని బాహాటంగా ప్రకటన చేసిందామె--
మరొకసారి క్లబ్ హోస్ లో ఆనవాయితీ ప్రకారం కలుసుకున్న మిత్రులు అతడి పరిస్థితికి మిక్కలి విచారం తెలియచేసారు. ఏది ఏమైతేనేం మొత్తం పదిమంది బిజినెస్ స్కుల్ మేట్స్ వలసపక్షుల్లా విదేశీ తావులకు వెళ్లిపోవడానికి సంసిధ్ధులయిపోయారు. ఆమాటకు వస్తే కూర్చున్న చోట నిల్చుని తీరిగ్గా మంచినీళ్లు తాగే తరనికి చెందిన వాళ్ళా వాళ్ళు! పరుగెత్తి పాలుతాగే వయసు కాదూ వాళ్ళది!
మార్పులు రెండు రకాలు. ఒకటి బాహాటంగా కనిపించేది. రెండవది- అట్టడుగు భూగర్భ జలంలా మెల్లగా నిశ్శబ్ద నిశ్వా నంలా రూపొందే అంతర్గతమైనది. అంతరాత్మకు మాత్రమే అందే భావస్రవంతి వంటిది. అటువంటి భావస్రవంతేదో అవినాశ్ లో చోటుచేసుకున్నట్లుంది;ఉదయకాలపు గాలివీచికలా- ఎక్కడో నిశ్శబ్దంగా కురిసిన తుంపురకు జీవమొచ్చిన కొండవాగులా--
ఒకరోజు ఉదయమే విష్ణుచక్రవర్తికి ఫోను వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి పేరు గమనించి ఆశ్చర్యంగా క్షణంపాటు తేరి
చూస్తూండి పోయాడు. ఫోను చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు;అవినాశ్ తండ్రి కనకాంబర రాజుగారు. “నమస్కారం సార్! చెప్పండి సార్. బాగున్నారా సార్? ”ఆయన పట్ల విష్ణుచక్రవర్తికే కాదు, చాలా మంది అబ్బాయిలకు మర్యాదా మన్ననా ఉంది. ఎందుకంటే- వాళ్లకు అవసరం వచ్చినప్పుడల్లా పలురకాల యోగ్యతాపత్రాలు ధ్రువపత్రాలు తయారు చేసిచ్చి ఆదుకుంటుంటారు. ఆదమరచి ఎండల్లోగాని వెళ్తే పానీయాలు కూడా ఇచ్చి సేదతీరుస్తారు.
అప్పడు అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అటునుంచి బదులొచ్చింది- “నాకేం? నేను బాగానే ఉన్నాను. అక్కడకి బాగోలేనిది నీ ఫ్రెండు అవినాశే! ”
ఆ మాట విన్నంతనే అతడికి ఖంగుతి న్నట్లయింది. “అవినాశ్ కా! ఏమైంది సార్? ప్లీజ్! త్వరగా చెప్పండి సార్”
“ఆదినుంచీ వాడిది మూడీ పర్సనాలిటీయే కదా! ఇప్పుడు వాడి మూడ్ ఎందు చేతనో మరింత పెట్రేగినట్లుంది”
“ఒక్క నిమిషం సార్! మీరన్నట్టు వాడిది మూడీ టైపే-- కాని- చాలా ఇంటలీ జెంట్ గయ్ సార్. వాడికొక్కడికే స్టాన్ ఫోర్డులో సీటు దొరక వచ్చని మేమందరమూ అనుకుంటున్నాం సార్! అక్కడ గాని సీటి దొరికితే—ఫ్యూచర్ కి ఆకాశమే యెల్లంటారు సార్”
“కావచ్చు. కాని చిన్నచిన్న విషయాలలోనూ తనకు తానుగా మనసు మార్చుకునే వాడిని ఏమనాలి! ”
“సారీ సార్ అడ్డువచ్చినందుకు—ఇంతకీ ఏమైంది సార్? ”
“అది చెప్పడానికే నీకు ఫోను చేస్తున్నది—మీ ఫ్రెండు విదేశాలకు వెళ్లి చదువుకోనంటున్నాడు. పాస్ పోర్టు తీసుకున్నతరవాత వీసాకి అప్లయి చేయాలి కదా! చేయనంటున్నాడు. అక్కణ్ణించేమో రిమైండర్ల పైన రిమైండర్ లు వచ్చి పడుతున్నాయి. నేనేమో ఇక్కడ—మావాడు అమెరికాకి వెళ్లి పై చదువులు సాగించబోతున్నాడని అక్కడే ఊద్యోగం చేయబోతున్నాడని అందరివద్దా దండోరా కూడా వేసేసాను. ఇప్పుడేమో వాడు-- ”
ఆయనావాక్యం పూర్తిచేయక మునుపే “హాఁ! ”అని నోరు తెరచి నిల్చున్నవా డు నిల్చున్నట్లుగా ఉండిపాయాడు విష్ణు చక్రవర్తి- కొన్ని క్షణాల వరకూ అతడి నోట మాట రాలేదు.
“అదంతా నువ్వే అడిగి తెలుసుకుందువు గాని—మొదట దీనికి బదులియ్యి—వలపుt వయసు సిగ్గెరగదంటారు కదా- వాడు ఎవరైనా అమ్మాయి చూపుల్లో చిక్కుకున్నాడా? ”
“నో సార్! నాట్ ఎటాల్ సార్! అవినాశ్ దృఢ మనస్కుడు సార్. అంత తేలిగ్గా ఒరిగిపోడు సార్. నా మాట నమ్మండి సార్. మరేదో
కారణం అయుంటుంది” ఆ మాటతో అటునుంచి ఫోను పెట్టిసిన చప్పుడు వినిపించింది విష్ణుచక్కవర్తికి--
ఈసారి మిత్రుల కలయిక క్లబ్ హౌస్ లో జరగలేదు. ఉసేన్ సాగర్ ప్రక్కనున్న నిర్మానుష్యమైన స్థలాన చోటు చేసుకుంది. యథాప్రకారం అందరి చేతుల్లోనూ టిన్డ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి.
మొదట అవినాశ్ కి సన్నిహితుడైన విష్ణుచక్రవర్తే అడిగాడు- “మాకందరకూ తెలుసు- ఏదో జరిగుంటుందని—లేక పోతే నీ వంటి బ్రిలియంటే క్యాండిడేట్ ఇంతదాకా వచ్చి వెనక్కి తిరగడం ఏమిటి! స్టాన్ ఫోర్టు వాళ్ళు నీకిచ్చిన ప్రొవిజినల్ ఆఫర్ వెనక్కి తీసుకున్నారా! తీనుకున్నా పోయేదేమిటంట- మిగతావి ఉన్నవే కదా- మాతో బాటు చేరిపో! ”
విన్నాడే గాని, అవినాశ్ బదులివ్వలేదు. కూల్ డ్రింక్ టిన్నుని ఖాలీ చేస్తూ లేచి వెళ్లి అక్కడున్న డస్ట్ బిన్ లోకి విసిరి మళ్లీ వచ్చి యథా స్థానాన కూర్చున్నాడు. “అటువంటి నిరాశాజనకమైన సంఘటనేదీ జరగలేదు. మా ఇంట్లో వాళ్లు అనుకుంటున్నట్టు నేనెక్కడా ప్రేమ వ్యవహారంలో పడలేదు. నన్ను త్వరగా చేరమని రిమైండర్ కూడా వచ్చింది. అంతే కాదు- నాకు స్కాలర్ షిఫ్పుకూడా ఇస్తామని స్పెషల్ ఆఫర్ కూడా చేసారు”
దానితో మిత్ర బృందమంతా- హాఁ- అంటూ నోరు తెరిచారు.
“మరింకేం కావాలిరా నీ మతిమండా! ”అంటూ అందరూ ఏక కంఠంతో నిందించారు. కాని అవినాశ్ వాళ్ళ మాటల్ని ఖాతరు చేయలేదు.
“అదంతా ప్రక్క న పెట్టండి. విష్ణుచక్రవర్తి ఒకటన్నాడే—అదే కరెక్టు—”
అదేమిటన్నట్టు ఉక్కుమ్మడిగా సణుగుతూ కళ్ళెత్తి చూసారు. అవినాశ్ చెప్పసాగాడు- “వాడింతకు ముందు అన్నాడుగా మా నాన్నతో- ఏదో జరిగుంటుందని- అదే కరెక్ట్! అకారణంగా మితమీరిన స్థాయిలో ఎమోషనల్ అయిపోయి నాకు అడ్డురాకుండా ఉంటే నేను చెప్తాను. కుడ్ యు ప్రామిస్? ”
అందరూ తప్పదన్నట్టు చూపులు చూస్తూ తలలాడించారు. “ఇక చెప్తాను వినండి. ఒక్కొక్కరికి ఒక్కొక విధమైన మనస్తత్వం ఉంటుంది. నాకున్న మనస్తత్వం కూడా అటువంటిదే-- ఇక వాస్తవానికి వస్తే చిన్న చిన్నవాటికి మెత్తబడి పెళుసుబారిపోయే మనస్తత్వం కాదు నాది. ఇక విషయానికి వస్తాను. నన్ను మొన్న మన బిజినెస్ స్కూలు వారు పిలిచారు. అక్కడే ఈ తతంగమంతా ఆరంభమైంది” అది విన్న వెంటనే మిత్రబృందం ఏక వాక్యంతో ఆశ్యర్య పోయారు- “నిన్ను పిలిచారా! మరి మమ్మల్ని—“ అని నసుగుతూ సగంలో ఆగారు.
“ఔను! నన్ను మాత్రమే పిలిచారు- గోల్డ్ మెడల్ ఇవ్వడానికి—ఎందుకంటారా- గ్రేడేషన్ లో హయ్యర్ డిస్టింక్షన్ సంపాదించినందు కు. అప్పుడు నాలా గోల్డ్ మెడల్ అందుకోబోయే వారందరికీ ప్రశాంసా పత్రాలివ్వడానికి ఋషికేశ్ నుండి ఒక కాషాయ వస్త్రధారిని పిలిపించారు. మొదట్లో ఆయనను మామూలు కాషాయ వస్త్రధారే అనుకునాను. గేదరింగ్ లో కాషాయ రంగులో మంగళకరంగా ఉండటం కోసం పిలిపించారను కున్నాను.
కాని నేనీ విషయంలో తప్పటడుగు వేసాను. ఆయన చెప్పిన మూడే మూడు మాట లు విన్న తరవాత హిమపర్వత జలపాతంలో పడి ఎక్కడికో కొట్టుకు పోయాననిపించింది. ఆయన ప్రస్తావించిన మొదటి అంశం- ఇప్పటి మన తరం వారు రాను రాను ఓ విధమైన అంతర్యుధ్ధానికి లోనవుతూ శాంతిని కోల్పోతున్నారు.
దీనికి కారణం- లాలస కోసం యావ పెరిగి పోవడం. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేక్షణలో తేలిన అంశం- గత యువతరం ఆలోచనా తీరులోనూ ఇప్ప టి వాళ్ళ ఆలోచనా తీరులోనూ తేడా స్పష్టంగా కనిపిస్తూంది. ఎలాగో ఒకలా మిలియనర్లు కావాలనే కాంక్షతో డబ్బు మాయలో పడిపోతున్నారు. పదుగురి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా ఆరాటపడుతూ ఎండమావుల వెంట వెళుతూ చుట్టు ప్రక్కల వారి గురించి గాని, ముఖ్యంగా అసహాయులుగా వెనుకబడి అట్టడుగున మిగిలిపోయిన అభాగ్యుల గురించి గాని ఆలోచించడం లేదు.
ఇటు వంటి అంతులేని ఆరాటం వల్ల, అంతర్గతమైన ఆందోళన- అధైర్యం- నిరుత్సాహం పెరిగిపోతున్నాయన్నారాయన. ఆ విధంగా మనకు మనమే గోతులు తవ్పుకుంటున్నామంటూ—ఒక మాట జోడించారు- “శాంతి లేని చోట సంతోషం ఎక్కడుంటుంది? ”స్వార్ధం కుప్పగా ప్రోగయిన చోట దేశం కోసం ఆలోచించే తీరిక యెక్కడుంటుందని? పోయిన తరం వారు, ముఖ్యంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న త్యాగుమూర్తులు ఇంకా ఇంకా మీ కోసం త్యాగం చేస్తూ ఉండాలని మీరు యెదురు చూడకూడదు కదా! ”
ఇక తదుపరి అంశం- మనం చదువుకుంటూన్న సిలబస్ లకు మనం ఇస్తున్నామనుకుంటూన్న ఫీజు నిజానికి మనం పూర్తిగా ఇచ్చుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే—మన చదువులకు అయ్యే మొత్తం ఖర్చులో పదవ భాగం కూడా మనం
ఇచ్చుకోవడం లేదు. మిగతాదంతా సర్కారు వారిది- అంటే ప్రజాధనం. దీనికి ప్రత్యుపకారంగా మనం ప్రజల బాగోగుల గురించి
ఆలోచించడం లేదన్నారాయన. మనల్ని అద్దరి దాటించిన తెప్పల గురించి ఆలోచించకుండా గట్లు దాటిపోయేందుకు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద తప్పిదం అంటారాయన. ఇది కన్న తల్లిని మర చి పోయినంత నేరమట. చివరిగా ఒక మాట చెప్పారు. ఇది విన్న తరవాతనే నన్నునేను మార్చుకోవాలని తీర్మానించాను”అని చెప్పడం ఆపాడు అవినాశ్.
లాస్ట్ పంచ్ కోసం నేస్తాలందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు.
“ప్రభుత్వ ఖర్చుతో ఇంత బాగా చదు వుకున్న అబ్బాయిల్ని పలుచోట్ల అడిగాను- ‘రేపు ఏమి చేయబోతున్నారు? అని.
అప్పుడెప్పుడో అడగడమే కాదు. ఇప్పుడూ ఇక్కడ అదే అడిగాను. దీనికి చాలామంది చాలా విషయాలే చెప్పారు- కొందరు—సి ఈ వో లయి తమ సత్తా చూపుతామన్నా రు. ఇంకొందరు- భారీ పరిశ్రమలకు అధిపతి అవుతామన్నారు. ఇంకొందరు- రాజ్యాధినేత కావాలన్నారు- మిగతా వారేమో ఐ ఏ ఎస్ లేక ఫారన్ సర్వీసు- ఇలా ఇలా-- ’కాని ఒక్కరు కూడా నా ఉపాధి కోసం నేను పాటు పడుతూనే దేశం కోసం ఆలోచిస్తానన లేదు.
దేశంలోని అనాధుల కోసం అభాగ్యుల కోసం ఏదైనా ఒకటి చేసి చూపిస్తానన లేదు. ఇదీ ఇప్పటి చదువులకున్న విలువ! ”అని ఆపేసారాయన. దానితో నా మనసు కదలింది. గుండె ఘోషించింది. దేశ స్వాతంత్ర్యం కోసం అప్పటి పెద్దలు పుణ్య పురుషులు ప్రాణ త్యాగాలు చేసారు. ఏండ్ల తరబడి చెరసాలల్లో మగ్గి నశించారు. మరి మనమేం చేయబోతున్నాం?
అంతా మన కోసం సంపాదిస్తూ మన కోసం ఆలోచిస్తూ అంగలార్చుతూ అందినకాడికి అన్నిటినీ అల్లుకోవడానికి ప్రయిత్నించడమేనా! ఎందుకో అప్పుడు నా పైన నాకే వెగుటు కలిగింది. నేను ఇక్కడే ఉండి తోటి భారతీయుల మధ్య మనుగడ చేస్తూ చంద్రుడికో నూలు ప్రోగులా సేవ యెందుకు చేయకూడదు? ఇదీ నాలో ప్రజ్వరిల్లిన మనోభావం. నా దృక్పథం కొందరికి ప్రాక్టికల్ గా తోచకపోవచ్చు. దానికి నేను చేసేదేమీ లేదు. ముందే చెప్పాగా- ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధమైన మనస్తత్వం ఉంటుందని-- ఇక ఇంతే సంగతులు! ఇక విడ మర్చి చెప్పడానికి ఏమీలేదని పిస్తూంది. మీదారిన మీరు వెళ్ళండి. నా దారిన నేను వెళ్తాను. అందరి దారులూ ఒకేలా ఉండాలన్న నియమమేదీ లేదుగా! గుడ్ బై! ” అంటూ లేచి అవినాశ్ నడుచుకుంటూ హైవేకి వచ్చా డు.
ఇక తిరిగి చూడకుండా- ఆగకుండా ముందుకు సాగిపోయాడు ఒంటరిగా—నిబ్బరంగా---
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Commentaires