top of page

రథంతరి



'Radhanthari' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 15/08/2024

'రథంతరి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


తను ఎన్నుకున్న విజ్ఞాన ప్రపంచ అంచులను తాకుతూ, ఆద్యాత్మిక ప్రపచంలో ఆహ్లాదంగా, నిస్వార్థంగా, నిర్మలంగ నివసించి పరవసించే ప్రతివారు మానవులకే కాదు, దేవతలకు కూడ ఆదర్శవంతంగా నిలుస్తారు. అలాంటి వారు దేవతలకు సహితం అప్పుడప్పుడు అవసర మవుతుంటారు. అలాంటి వారిని అసురులు కూడా తమ వశం చేసుకోవాలని చూస్తారు. అయితే వారు అసురులకు చిక్కరు. అలాగని వారు అసురులకు దూరంగానూ ఉండరు. వారు అత్యవసరం అనుకుంటే అసురులకు దగ్గరయ్యి అసురులలోని అసురత్వాన్ని అంత మొందించి ఆ అసురులను సురులుగ మలుస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు రథంతరి. 


ఇలను పవిత్రంగా ఉంచడానికి మహర్షులతో అనేక యాగాలు చేయించిన ఈలనుని కుమార్తె రథంతరి. ఈలనుని మహర్షులు అనేక పవిత్ర నామధేయాలతో పిలిచేవారు. కొందరు మహర్షులు ఈలనుని ‘దీప్తివంత’ అంటే మరికొందరు ‘సోమవంత’ అని, ఇంకొందరు ‘హోత’ అని పిలిచేవారు.. వేద ధర్మాలకు అనుగుణంగా ఈలనుడు ప్రకృతిని పరిరక్షించేవాడు. భూమి మీద పుట్టి, చెట్లలో పెరిగే అగ్నిని సంరక్షించేవాడు. చెట్టులోని అగ్ని తో సురయాగాలు చేయించేవాడు. 


 పుట్టుకతోనే సోమవంత తేజంతో ప్రకాసించిన తన కుమార్తెను చూసిన ఈలనుడు మహదానంద పడ్డాడు. వశిష్టాది మహర్షుల ఆదేశానుసారం ఈలనుడు తన కుమార్తెను చేతులలో ఉంచుకుని యాగాగ్ని నడుమ నిలబడి కుమార్తెకు "రథంతరి" అని నామకరణం చేసాడు. 


 రథంతరి కిలకిల నవ్వులను చూసి ప్రకృతి పరవసించిపోయేది. లేళ్ళు చెంగు చెంగున ఎగిరేవి. కుందేళ్ళు మహదానందంతో గంతులు వేసేవి. రథంతరి కిల కిల నవ్వులకు అనుగుణంగా యాగాగ్నులు ఎగసిపడేవి. పర్ణశాలల దగ్గర పచ్చదనం కళకళలాడేది. 


 రథంతరికి ఈలనుడు తనకు తెలిసిన విద్య లన్నిటిని నేర్పించాడు. "తండ్రి తనయుని లేదా తనయ ను చూచినట్లు యాగాగ్ని చూడాలి " అని ఈలనుడు రథంతరికి నూరిపోసాడు. అలాగే తనకు తెలిసిన మహర్షులు, బ్రహ్మర్షులందరిని పిలిపించాడు. వారందరి చేత నానా విధము లైన యాగములు చేయించాడు. 


ఆయా యాగాదులు చేసే విధానం అంతటిని తన కూతురు రంథంతరి ని దగ్గరుండి చూసి నేర్చుకోమన్నాడు. రథంతరి తండ్రి మాటలను అనుసరించి మహర్షులు, బ్రహ్మర్షులు చేసే యాగాదులన్నిటిని ప్రత్య క్షంగా చూచింది. ఆయా యాగాల అంతరార్థాలను ఔపాసన పట్టింది. యాగ నైవేద్యాదులను నిరుపేదలకు పెట్టి, వారి కడుపు నింపింది. వనంలో లభించే ఔషద మొక్కలతో నిరు పేదల గ్రామాలకు వెళ్ళి వారికి వైద్యం చేసింది. 


 అనంతరం బ్రహ్మర్షులు రథంతరిని బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని ప్రోత్స హించారు. రథంతరి బ్రహ్మర్షుల మాటలను అనుసరించి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసింది. రథంతరి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేస్తుందని తెలుసుకున్న నిరుపేదలు రథంతరి తపస్సు విజయవంతం కావాలి అని వారు కూడా వారికి తెలిసిన పూజలు చేసారు. 


 బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరు కోమని రథంతరిని అడిగాడు. అప్పుడు రథంతరి, "ఆరోగ్యమే మహాభాగ్యము. అనారోగ్యమే పలు సమస్యలకు నిలయం.. కావున పదుగురి అనారోగ్యాన్ని తగ్గించే సామర్థ్యం నాకు ప్రసాదించు బ్రహ్మ దేవ. " అని వరం కోరు కుంది. 


 రథంతరి కోరికను విన్న బ్రహ్మ దేవుడు మిక్కిలి సంతోషించాడు. , "రథంతరి, నువ్వు మానవుల ఆరోగ్యాన్నే కాదు, దేవతల ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తావు. " అని రథంతరిని ఆశీర్వదించి బ్రహ్మ దేవుడు అంతర్థానమైపోయాడు. రథంతరి ఆనంద హృదయ సంద్రాన తేలియాడింది

.................... 

 త్రస మహారాజు తన కుమారుడు ఇలినుడుని తన తర్వాత రాజుగ ప్రకటించాడు. అందకు సామంత రాజులందరు సంతోషించారు. ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహారాజు మిక్కిలి సంతోషించాడు. తరంతర మహారాజు సామంత రాజులు ఇలినుడుకి గొప్ప గొప్ప బహుమతులను అందించారు. 


 సామంత రాజుల సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని ఇలినుడు గుర్తించాడు. అంత సామంత రాజులతో ఇలినుడు "సామంత రాజులారా! మీ సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని నేను గమనించాను. మా జననీజనకులు కాళింద త్రసల సాక్షిగా చెబుతున్నాను. మీ కించిత్ ఖేదమేమిటో అర్థం చేసుకు న్నాను. మన మన రాజ్యాలలో అంటు రోగాల బెడద, మూర్చ రోగాల బెడద కొంచెం ఎక్కువగానే ఉంది. దీనిని రూపు మాపడానికి మా జననీజనకులు బాగానే కృషి చే సారు. అయితే ఫలితం మాత్రం స్వల్పంగా దక్కింది. నేను ఆ సమస్యల మీదనే ఎక్కువ గా దృష్టి పెడతాను అని మీకు మాట ఇస్తున్నాను. 


 ముఖ్యంగా తురుడు, జఢుడు వంటి మన శ త్రు రాజులు పదిమంది వరకు ఉన్నారు. వారు మా తండ్రిగారు త్రస మహా రాజు గారిని, మా తాతగారు, త్రస మహారాజు తండ్రి గారైన మతినారు మహారాజు గారిని సమర రంగాన ఎదుర్కొనలేక వారి వారి కుటిల మనస్తత్వం గల మనుషులను మన రాజ్యాలకు పంపి మన తటాకములను, చెరువులను, కాలువలను, బావులను జలమున్న ప్రతి ప్రాంతాన్ని రసాయన లేపనాలతో కలుషితం చేస్తున్నారు. ఆ జలాన్ని తాగిన మన జనం చనిపోవడం లేదు కానీ రకరకాల అంటురోగాలకు గుర వుతున్నారు. 


 శత్రు రాజులు కొంతమంది మహా తెలివిగా ప్రవర్తి స్తున్నారు. వారికి మన ప్రజల శక్తి సామర్థ్యాల మీద, మన ప్రజల జ్ఞానం మీద ముఖ్యంగా మన ప్రజల అదృష్ట దీపికల మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే వారు ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తున్నారు కానీ వారిని చంపే ప్రయత్నాలు చేయడం లేదు. 


అనారోగ్యం తో మన ప్రజలు ఎవరైనా వారి వారి రాజ్యాలకు వెళితే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రజల శక్తి యుక్తులను, అదృష్ట దీపికలను వారు తమకు అనుకూలంగా వినియోగించు కుంటున్నారు. అయితే మన ప్రజలు అధిక శాతం మంది అనారోగ్యానికి గురైనప్పటికీ రాజ్యాన్ని వదలడం లేదు. వారి దేశభక్తి నిజంగ అద్భుతం. అమోఘం. అనిర్వచనీయం. 


 ఇక మీదట శత్రు రాజుల మనుషులు మన రాజ్యాలలోకి రాకుండా మనం మరిన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. మన ప్రజలను మనం మరింత జాగ్రత్తగా కాపా డుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల విషయం లో నేను ముందుంటాను అని మీకు మాట ఇస్తున్నాను. అలాగే తురు సంహారం త్వరలోనే జరుగుతుంది అని మీకు మాట ఇస్తున్నా ను. 


ఇక మా తండ్రి గారైన త్రస మహారాజు గారి మాటలను అనుసరించి అర్హులకు తగినట్లుగా ధనమిస్తాను. యాచకులను నిరాశ పరచను. రాజసభలో మనసుకు ప్రీతి కలిగించేది, మేలైనది, ఉచితమైనది, సత్యమైనది, తీయనిది, విస్తృతం కానిది ధర్మంగా ఉండే మాటలే మాట్లాడతాను.. అలాంటి మాటలు మాట్లాడే సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాను. " అని అన్నాడు. 



 ఇలినుడి మాటలను విన్న సామంత రాజు లు, "దండితాహితవీర ! సూరినిధాన ! దానవినోద !" అని ఇలినుడిని రకరకాలుగా ప్రస్తుతిస్తూ మనఃపూర్వకము గా మహదానందం పొందారు

........... 

 రథంతరి తన ప్రాణ స్నేహితురాళ్ళు తినిస, వేదస, రథద్రువు మొదలైన వారందరితో కలిసి సోమ వనమును పెంచసాగింది. ఆకులు లేకుండా ఆకు పచ్చని సన్నని కాండంతో ఏపుగ పెరుగుతున్న సోమ వనమును చూచి రథంతరి మిక్కిలి సంతోషించింది. 


 రథంతరి " స ఓమ సోమ" అంటూ సోమ మొక్కల గురించి పరిపూర్ణంగ పరిశోధన చేయసాగింది. సుషోమ, అర్జికీయ అనే ప్రాంతములలో సోమ అధికం గా దొరుకుతుంది అని తెలుసుకుంది. చెలికత్తెలతో రథంతరి సుషోమ, అర్జికీయలకు వెళ్ళింది. అక్కడి సోమ మొక్కల సువాసనకు రథంతరి తనువు మైమరచిపోయింది. ఆమెకు తన ఆయుష్షు మరో నాలుగు సంవత్స రాలు పెరిగిందా? అని అనిపించింది.


 రథంతరి సోమ తీగల నుండి వచ్చే తెల్లని పా లను చూసింది. అలాగే సోమ తీగలకు ఉన్న తెల్లని పువ్వులను, ఆకు పచ్చని పువ్వులను చూచింది. అంత చెలికత్తెలతో, "చెలికత్తెలారా! ఈ సోమ రసం అంటు వ్యాధులను పోగొడుతుంది. మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది. మంచి నిద్రను కలిగిస్తుంది. శరీరం మీద ముడుతలను తగ్గిస్తుంది. యౌవన శోభను పెంచుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులను నిరోధిస్తుంది. ఈ సోమ రసం ను మరి కొన్ని ఔషదాలతో కలిపితే అది మరిన్ని వ్యాధులను తగ్గిస్తుంది. మానవుని మాధవునిగ మలుస్తుంది. ఇలాంటి పవిత్ర ఔషద సంపదను మనం ముందు యుగాలవారికి అందించాలి. " అని అంది. 


రథంతరి మాటలను విన్న తినిస, " చెలీ రథంతరి, ముం దు యుగాలవారు ఇలాంటి ఔషదాలు ఉన్నాయంటే అసలు నమ్ముతారా?" అని అడిగింది. 


" నమ్మకపోవచ్చు. అయితే వారు పరిశోధనలు చేసి చివరికి ఈ మొక్కల దగ్గరకే వస్తారు. కంటికి కనపడే దానిని ఎవరైనా సరే నమ్మి తీరాల్సిందే. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా వైద్య పరిశోధనలు చేసే వారిని సతతం ప్రశంసించాల్సిందే.. 


మాయ మాటలతో, మాయ మందులతో మనుషులను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. గంధర్వులు ఈ సోమ రసం గురించి అధికంగా ప్రచారం చేస్తుంటారు. వారికి మనలాంటి వారు కూడా తోడుంటే వైద్య పరంగా మానవాళికి మనం చేయగలిగిన ఉపకారం మనం చేసినట్లవుతుంది. " తినిసతో రథంతరి అంది. 


 పసుపు రంగు కాండం తో ఉన్న సోమ మొక్కలు గురించి రథంతరి ఎక్కువగా పరిశోధనలు చేసింది. ఆమె పెంచే సోమవన సంరక్షకులుగా రథగుప్తి, రథన కుడ్యలు వంటి వారు ఉన్నారు. వారంతా ఆమె తండ్రి ఈలనుని ఆంతరింగికులు. 


 రథంతరి పవిత్రమైన సోమ మొక్కలు మరి కొన్ని కావాలని బ్రహ్మ దేవుని కోరింది. సుర డేగల ద్వారా బ్రహ్మ దేవుడు రథంతరికి సోమ మొక్కలు పంపాడు. 


 రథంతరి తన వనంలో పెరిగిన సోమ మొక్కల కాండములను పరిశీలించింది. చంద్ర కిరణాలతో ఊపిరి పోసుకున్న హిమరాయితో వాటిని చంద్రశిల మీద నూరింది. అంత ఆ లేపనములో శ్రేష్టమైన మేకపాలను కలిపింది. ఆ ద్రవాన్ని నల్లమట్టితో తయారు చేసిన కుండ లో ఉంచింది. ఆ కుండను హోమాగ్ని నడుమనున్న త్రిభుజాకార తిన్నె మీద ఉంచింది. కుండలోని ద్రవం గట్టి పడింది. ఆ ద్రవాన్ని మూర్చ పోయిన మేక మీద ప్రయో గించింది. 


లేపన ప్రభావంతో నాలుగు నిమిషాలలో మేక మూర్చ తగ్గిపోయింది. ఆపై మనిషి మీద ప్రయోగించింది. కొందరు మూర్చ పోయిన మనుషులకు ఆ లేపనం పని చేసింది కానీ అందరికీ పని చేయలేదు. అంత రథంతరి లేపనములో మరికొన్ని మూలికలను కలిపింది. 


 రథంతరి తినిస, వేదసల సహాయంతో సోమ వనంలో చిన్న సరసును ఏర్పాటు చేసింది. పున్నమి వెన్నెలలో కొన్ని సోమ మొక్కలనుండి స్రవించే సోమ రసం సరసు లోని జలములో ప్రవహించేటట్లు చేసింది. ఆ సరసులో జలకాలాడేవారి చర్మవ్యాధులు సమస్తం పోసాగాయి. పాలరాతీతో నిర్మించిన ఆ సరసును రథంతరి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించేది. రథంతరి తయారు చేసిన సోమ లేపనము మూ ర్చరోగులకు బాగా పని చేయసాగింది.

......... 

 ఇలినుడు తురు రాజు మీద యుద్దం ప్రకటించాడు. తురు రాజు, అతని సైన్యం తమ రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెరువులలో శత్రువుల నిమిత్తం రకరకాల విషపూరిత మత్స్యముల వస్త్ర ధారణతో తిరగ సాగారు. తురురాజు వ్యూహాన్ని గమనించిన ఇలినుడు చేపలు పట్టు గాలపు ముల్లుల వస్త్ర ధారణ తో తన సైన్యాన్ని చెరువులలోకి దింపాడు. తను పెద్ద గాలపు ముల్లు వస్త్రాన్ని ధరించి, వలతో చెరువులోకి దూకాడు. 


ఇలినుడు రూపాన్నిచూచి తురు హడలిపోయాడు. చెరువుల్లో సమరం భయంకరంగా జరిగింది. కడకు తురు సైన్యంలో ఎక్కువ భాగం చనిపోయింది. కొనవూపిరితో ఉన్న సైన్యం గాలాలకు చిక్కింది. కొనవూపిరితో తురు రాజు ఇలినుడు వలలో పడ్డాడు. ఇలినుడు వలను చెరువు గట్టు మీదకు విసిరాడు. వలలోనే తురు రాజు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇలా తన శత్రువులైన అయిదు మంది రాజులను ఇలినుడు సంహరించాడు. 


 ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహా రాజు ఇలినుడి విజయాలను ప్రశంసించడానికి ఇలినుడి రాజమందిరానికి వచ్చాడు. తరంతర మహారాజును తగిన విధంగా ఇలినుడు ఆహ్వానించాడు.


 తరంతర మహారాజు ద్వారా రథంతరి సోమ వన మొక్కల గురించి, ఆమె వైద్యం గురించి ఇలినుడికి తెలిసింది. రథంతరిని ప్రత్యేకంగా కలవాలని ఇలినుడు తరంతర మహారాజు తో అన్నాడు. 


 ఒకనాడు బృహస్పతి రథము నీతి ఘోషము రథంతరి పర్ణశాల ముందుకు వచ్చి ఆగింది. అందులో బృహస్పతి శిష్యులు ఉన్నారు. వారంతా మూర్చరోగులని గ్రహించిన రథంతరి వారందరికి మంచి లేపనమును అందించి వారిని రోగ విముక్తులను చేసింది. అలాగే విష్ణువు రథము శతానందం మీద కొందరు మూర్చ రోగులు రథంతరి పర్ణశాలకు వచ్చి వారు రోగ విముక్తులు అయ్యారు. 


 రథంతరి దేవతలకు సహితం వైద్యురాలు అయ్యిందని తెలిసిన అసురగణం, " రథంతరిని మచ్చిక చేసుకుని ఆమె వైద్యం మనకు ఉపయోగపడేటట్లు చెయ్యమని" అసురి అనే రాక్షసిని రథంతరి దగ్గరకు పంపింది. అసురి రథంతరి దగ్గరకు వచ్చింది. తన మంత్ర తంత్ర విద్యలన్నిటిని రథంతరి ముందు ప్రదర్శించింది. తను వచ్చిన పనిని తెలియచేసింది. 


అప్పుడు రథంతరి, " చూడు అసురి.. వైద్యమనేది ఓ మహత్తరమైన కళ. దానిని స్వార్థ చిత్తంతో చేస్తే సరైన ప్రయోజనం దక్కదు. 


ఇక సోమ రస వైద్యం పదుగురికి ఉపయోగపడే వారికే ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ముందుగా అసురత్వాన్ని వదులుకో " అని అంది. 


 రథంతరి మాటలను అసురి పట్టించుకోకుండా, రథంతరి దగ్గర ఉన్న కొంత సోమ రసాన్ని తన వంటి మీదన ఉన్న పుండుల మీద పోసుకుంది. వెంటనే అ సురి దేహం మీదన ఉన్న పుండ్లునుండి అగ్ని పుట్టింది. ఆ మంటలను తట్టుకోలేక అసురి తనని రక్షించమని రథంతరి కాళ్ళ మీద పడింది.


 రథంతరి త్రికరణ శుద్ధిగా భగవంతుని ధ్యానించి సోమ రసం ను అసురి మీద చల్లింది. అసురి శరీరం మీద ఉన్న మంటలు తగ్గాయి. పుండులు తగ్గలేదు.


 అసురి రథంతరి మాటలను అనుసరించి వేదా భ్యాసం చేసింది. నిరుపేదలకు శ్రమదానం చేసింది. పరోపకార గుణంతో మెదలసాగింది. అప్పుడు రథంతరి అసురి దేహం మీద ఉన్న పుండ్లుకు సరైన సోమ రసం ఇచ్చింది. అసురి శరీరం తేజోవంతంగా మారింది. ఆపై అసురి రథంతరి స్నేహితురాలిగా ఉండిపోయింది. 


 తరంతర మహారాజు ఆధ్వర్యంలో శ్వావ్యాస మహర్షి ప్రజా క్షేమ యాగాలకు శ్రీకారం చుట్టాడు. ఆ యాగాలను రథంతరి నేతృత్వంలో జరిపిస్తే బాగుంటుంది అని తరంతర రాజు శ్వావ్యాస మహర్షి తో అన్నాడు. అందుకు శ్వావ్యాస మహర్షి అంగీక రించాడు. 


 తరంతర రాజు రథంతరిని ప్రత్యేకంగా కలిసాడు. శ్వావ్యాస మహర్షి యాగాల సంగతిని రథంతరికి చెప్పా డు. రథంతరిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. రథంతరికి ప్రత్యేకంగా పద్మ యాగ రథాన్ని ఏర్పాటు చేసాడు. అదే సమయంలో తరంతర మహారాజు ఇలినుడు గురించి కూడా రథంతరికి చెప్పాడు. ఆపై ఇలినుడిని సాదరంగా ఆహ్వానించి తీసుకురండి అని తరంతర మహారాజు ఆంతరంగిక సచివుని పంపాడు. 


 యాగానికి రథంతరితో పాటు అనేకమంది మహర్షులు, రాజులు వచ్చారు. తరంతర మహారాజు అందరిని సాదరంగా ఆహ్వానించాడు. తరంతర మహా రాజు ఇలినుడుకు రథంతరిని పరిచయం చేసాడు. 


 ఇలినుడు రథంతరి విజ్ఞానం గురించి రథంతరి ని అడిగి తెలుసుకున్నాడు. ఆపై తన రాజ్యంలో ఉన్న మూర్చ రోగాలగురించి, జల కాలుష్యం గురించి రథంతరికి చెప్పాడు. రథంతరి ముందుగా జలంలో కలపాల్సిన సుగంధ దినుసులు గురించి చెప్పింది. ఆపై సరోవరాల సమీపాన చేయవలసిన యాగాల గురించి చెప్పింది. 


 ఆ యాగానికి ఇలినుడి రాజ్యం నుండి రథవీతి  మహర్షి తన కూతురు తో సహా వచ్చాడు. అలాగే దేవేంద్రాదులు కూడా వచ్చారు. యాగ సమయంలో స్వల్ప అనారోగ్య సమస్య వలన దేవేంద్రుడు మూర్చ పోయా డు. అప్పుడు వశిష్ఠుని కోరిక మేర రథంతరి దేవేంద్రుని మూర్చకు మందు ఇచ్చింది. దేవేంద్రుడు యథాస్థితికి వచ్చాడు. 


 రథవీతి కుమార్తెకు చాలా కాలం నుండి వివాహం కావడం లేదని అక్కడివారందరికి తెలుసు. అందుకు కారణం మూర్చరోగం. రథవీతి కుమార్తె ను చూచిన శ్వావ్యాస మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. అందుకు రథవీతి మహర్షి తనను కుమార్తె మూర్చ రోగం గురించి చెప్పి, తన కుమార్తె ను వాంఛించవద్దని శ్వావ్యాస మహర్షి కి చెప్పాడు. 


 రథంతరి రథవీతి కుమార్తె గురించి తెలుసుకుంది. ఆమెకు "స ఓమ సోమ.. సోమ సోమ ప్రభావే సర్వ సూక్ష్మ క్రిమి సంహార..” అంటూ చక్కని మందు ఇచ్చింది. 


 అనంతరం రథంతరి కోరిక మీద రథవీతి మహర్షి తన కుమార్తె ను శ్వావ్యాస మహర్షి కి ఇచ్చి వివాహం చేసాడు. తన రాజ్యంలోని రథవీతి కుమార్తె కు వివాహం అయినందుకు ఇలినుడు మిక్కిలి సంతోషించాడు. అందుకు ప్రధాన కారణం అయిన రథంతరిని పలు రీతుల్లో స్తుతించాడు. 

 

 తన రాజ్యంలో గోసంపదను జఢు సైన్యం తమ రాజ్యానికి మళ్ళిస్తుంది అని ఇలినుడికి తెలిసిం ది. ఇలినుడు వెంటనే గో సంరక్షణకు బయలు దేరాడు. అప్పుడు రథంతరి " ఇలిన మహారాజ! అమానుషంగా, అక్రమంగా, ఆహవనీతి రహితంగ వ్యవహరించేవారికి ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెబితే బాగుంటుంది. గోటితో తీసివేయడానికి అనుకూలంగా ఉన్న శత్రు సైన్యానికి గొడ్డలిని ఉపయోగించవలసిన పనిలేదు. మీ రాజ్యంలో యజుర్వేద తేజంతో ప్రకాశించే మేకలు అనేకం ఉన్నాయి కదా? అవే మీ గో సంపదను రక్షిస్తాయి. మీ మేకలను ఒకచోటకు చేర్చండి. " అని అంది రథంతరి. 


 తన రాజ్యంలో ఉన్న మేకలన్నిటిని ఒక చోటకు తీసుకురమ్మని ఇలినుడు సైనికులను ఆజ్ఞాపించాడు. వారు ఇలినుడు చెప్పింది చేసారు. 


 రథంతరి యజుర్వేద మంత్రాలను చదువుతూ మేకలన్నింటికీ సోమ రసం పట్టించింది. మేకలన్నీ జఢు సైన్యం మీద దాడి చేసాయి. ఎడమ చేత కర్ర పట్టుకుని మేక ముఖంతో ఉన్న యజుర్వేద పురుషుడు సమర రంగాన ఆవిర్భవించాడు. 


 రథంతరి మహర్షులతో కలిసి యజుర్వేద మంత్రాలను ఆలపించసాగింది. పసుపు రంగు తేజస్సుతో మేకలన్నీ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాయి. అలాగే మేక ముఖంతో ఉన్న దక్ష ప్రజాపతి యజుర్వేద పురుషునికి నమస్కరిస్తూ సమర రంగంలో నిలబడి శత్రువులను చీల్చి చెండాడాడు. 


రథంతరి కోరిక మేర అసురి జఢు సైన్యం లో ఉన్న అసురులందరిని మట్టి కరిపించింది. 


 జఢుడు సమర రంగాన మరణించాడు. జఢు సైన్యం భయంతో సమర రంగాన్ని వదిలింది. రథంతరి ఇలినుడు యజుర్వేద పురుషునికి, దక్ష ప్రజాపతి కి సాష్టాంగ పడి నమస్కరించారు. 


 అనంతరం పెద్దల మునుల కోరికను అనుసరించి ఇలినుడు రథంతరి వివాహం చేసుకున్నారు. 


ఆ వివాహానికి యజుర్వేద పురుషుడు, దక్ష ప్రజాపతి కూడా వచ్చారు. దక్ష ప్రజాపతి అక్కడి వారందరికి తన కుమార్తె సతీదేవి వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసాడు. 


 భర్త మాటలను అనుసరించి రథంతరి కాలుష్యమైన పురిష్టీ నదిని పరిశుభ్రం చేసింది. శృతకవన, వృద్ద, దహ్య అను పేర్లు కలవారు పురుష్టీ నదిలో స్నా నం చేసి తమ అంటు రోగాలను పోగొట్టుకున్నారు. రథంతరి పురుష్టీ నదిలోని నీటిని సోమ రసంతో ప్రతి రోజూ పరిశుభ్రంయించేది. 


పదిరోజులకు ఒక పర్యాయం నదిలోని నీటిని మార్పించేది. రాజ్యంలోని సమస్త నదీ తటాకాదులలోని జలాన్ని రథంతరి పరిశుభ్రం చేయించింది. రథంతరి కృత్రిమ మరుత్తుల సృష్టి చేసింది. అందుకు ఆమెకు తోడుగా అసురి, వేదస, తినిస వంటి ఆమె స్నేహితురాళ్ళు ఉన్నారు. దానితో ఇలినుని రాజ్యంలో వాయు కాలుష్యము తగ్గింది. ఇలా ఇలిన ధ ర్మపత్నిగా రథంతరి మరింత పేరు ప్రతిష్టలను తెచ్చుకుంది. 


 రథంతరి మాటలను అనుసరించి ఇలినుడు తన రాజ్యంలోని దేవాలయాల దగ్గర సోమరస గానుగలను ఏర్పాటు చేయించాడు. సోమ రసం మానవుని మాధవునిగా మలుస్తుందని ప్రచారం చేయించాడు. తన రాజ్యంలోని వారందరిచేత ఋగ్వేదం లోని ఏడవ మండలాన్ని వల్లెవేయించాడు. 


 జఢుని సోదరుడు ఇలినుడు రాజ్యం మీదకు అసుర పక్షులను పంపాడు. అది గమనించిన రథంతరి అసుర పక్షులకు అడ్డంగ పెద్ద పెద్ద దుంగలను అసురి చేత అడ్డు పెట్టించింది. ఆ దుంగలను చీల్చుకు వెళ్ళే విషసూదులను సైన్యం తో ప్రయోగింప చేసింది. 


ఆ సూదులు దుంగలను చీల్చుకుంటూ వెళ్ళి అసురపక్షులను జఢుని సోదరుని చంపేసాయి. శత్రు రాజులందరు మరణించినందకు ఇలినుడు మహదానందపడ్డాడు. అలాంటి రథంతరి ఇలినుడుల కుమారుడే దుష్యంతుడు. ఈ పుణ్య దంపతులకు దుష్యంతునితో పాటు సూర, ప్రస వ, భీమ, వసు అనే సంతానం కూడ ఉన్నారు. 


 దుష్యంతుడు సోమ మొక్కల పెంపకం విషయంలో ఎక్కువ శాతం తల్లి రథంతరితోనే గడిపే వాడు. రథంతరి కుమారునితో, " నాయన దుష్యంత! నిరంతరం జ్ఞానం కలవారి చరితలను అభ్యసించాలి. సజ్జన సాంగత్యం తో కదలకుండా ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరిచిపోకుండా క్రమం తప్పకుండా అనుసరించాలి. సద్గుణాలున్న సోదరులను, బంధువులను అభిమానించాలి. " అని అనేక ధర్మా ధర్మాల తారతమ్యాలను తెలియచేసేది. 


 దుష్యంతుడు చిన్న తనం నుంచే అడవులలో పులుల ను సింహాలను వేటాడి పట్టుకునే వాడు. వాటిని మచ్చిక చేసుకునే వాడు. గాయపడ్డ వాటికి మందులు ఇచ్చేవాడు. ఆపై సమస్త విద్యలను అభ్యసించి రాజయ్యాడు.


సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

 


35 views0 comments

Comments


bottom of page