top of page

రాగద్వేషాలు

Writer: Dr. C S G KrishnamacharyuluDr. C S G Krishnamacharyulu

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #Ragadveshalu, #రాగద్వేషాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Ragadveshalu - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 22/03/2025 

రాగద్వేషాలు - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అరుణుని పసిడి కిరణాల తాకిడికి మంచు తెరలు కరిగిపోతున్నాయి. నిద్రాదేవి కౌగిలి సడలించుకుని, మెల్లగా కనులు తెరచిన రామకృష్ణ, కిటికీలోంచి దర్శనమిస్తున్న గులాబీ పూవుల సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అయితే ఆ వెనువెంటనే, ముళ్ళు గుర్తుకు వచ్చి అతని మనసు అప్రసన్నమైంది. పై నుంచి చూస్తే పువ్వు, క్రింద నుంచి చూస్తే ముళ్ళు. అతడి మదిలో ఎన్నో ఆలోచనలు, పరుగులు తీసాయి. 


ప్రకృతి మనకి కొన్ని పాఠాలు చెప్పకనే చెప్తుంది. సృష్టి అందాలు ఏక ప్రవృత్తిలో లభ్యం కావు. రాత్రీపగలు, జననం, మరణం, ఆకర్షణ వికర్షణలు, రాగ ద్వేషాలు, అలా అన్ని ద్వందాలే. 

@@@


రామకృష్ణ చిన్న తనం నుంచి ధర్మాధర్మ పరిశీలనకు సంబంధించిన చర్చలను వింటూ పెరిగాడు. 

ఆ కారణంగా అతను ధార్మిక జీవితానికి అనువైన విద్యారంగాన్ని యెంచుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర, విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో, అసొసీయేట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు. 


అతనూహించినట్లే జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతోంది. ఇంక వివాహం చేసుకోవడమే మిగిలింది. ఇది అనుకున్నంత సులభమైన విషయం కాదని అతనికి తొందరలోనే అర్ధమైంది. సమాజం బాగా మారిపోయింది. ఈ నాటి ఆడపిల్లలని, కుటుంబం కావాలనే వారు, కుటుంబం వద్దనుకునే వారు, అని రెండు రకాలుగా విభజించవచ్చు. 

కుటుంబం కావాలనే వారిలో కొందరు, నీ అమ్మానాన్నల బాధ్యత నీది, మా అమ్మానాన్నల బాధ్యత నాది అని పెళ్ళికి ముందే చెప్పేస్తున్నారు. బహుకొద్దిమంది మాత్రం సంపాదన, కుటుంబ బాధ్యత మనది అని చెప్తున్నారు. ఈ బహు కొద్ది మందిలో, తనకు నచ్చేఆమ్మాయి కోసం, అతను చేసిన ప్రయత్నాలు, ఇంత వరకు ఫలితాన్నివ్వలేదు. రానున్న రోజుల్లో, తన ప్రయత్నానికి సానుకూల ఫలితం వస్తుందని అతడు యెదురుచూస్తున్నాడు. 


ఆ తరుణంలో, ఒక రోజు, “స్నేహితులందరం బెంగళూరులో కలుస్తున్నాం. నేరుగా నా యింటికి వచ్చెయ్యి, ” అని అతని స్నేహితుడు వినోద్, ఫోన్ చేసి చెప్పాడు. 

@@@

రామకృష్ణని సాదరంగా ఆహ్వానించాడు వినోద్. తన భార్య శ్యామలని, చెల్లెలు అనూరాధని, పరిచయం చేసాడు.


శ్యామల కరచాలనం చేస్తూ, "మా యింటికి వచ్చినందుకు సంతోషం" అని ఆదరపూర్వకంగా చెప్పి లోనికి వెళ్ళిపోయింది. 


అనూరాధ అతని కేసి చూడకుండా టాబ్ చూడడంలో నిమగ్నమైంది. ఆమె తన పసిడి మేని చాయను, మరింత మెరిపించే, నల్లరంగు చీరా, జాకెట్ ధరించింది. ఆమె సోగ కళ్ళు, తీరైన నాసిక, ఆమె అందానికి వన్నె తెస్తున్నాయి. మెరిసేదంతా బంగారం కాదు. అందం వున్న చోట అహంకారానికే గాని, సభ్యతకు తావుండదని రామకృష్ణ అనుకున్నాడు. 


అనూరాధ నిర్లక్ష్యం వినోద్ కి నచ్చలేదు. 


 అతడు రామకృష్ణని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి, "ఇది నీ గది. స్నానం చేసిరా. కలిసి పలహారం చేద్దాం" అని చెప్పి వెళ్ళ బోతున్న వాడు, ఆగి " నా చెల్లెలు ప్రవర్తనకి నొచ్చుకోవద్దు. అది విడాకుల గొడవ వల్ల అలా వుంది. " అన్నాడు. 


"సారీ రా! ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, ” అని బదులిచ్చాడు రామకృష్ణ. 


@@@


మూడు రోజుల పాటు స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు రామకృష్ణ. బెంగళూరు పరిసర ప్రాంతాలలో వున్న ప్రముఖ విహార స్థలాలు దర్శించాడు. నాలుగో రోజు ఉదయం, అతని స్నేహితులు ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు. రామకృష్ణ బన్నేర్ ఘట్ట జూ పార్కు, చూడాలని ఆగిపోయాడు. జూ అనగానే వినోద్, శ్యామల వెనకడుగు వేసారు. 


"ఇప్పటికే నాలుగు సార్లు చూసాము. మరోసారి అంటే బోరుగా వుంటుంది. ఏదైనా మూవీకైతే వస్తాము" అంది శ్యామల. 


వినోద్ ఆమె మాట బలపర్చాడు. రామకృష్ణకి జూలంటే యిష్టం. అందుకే అతడు, "పర్వాలేదు. నేను ఒక్కడినే వెళ్ళి చూసి వస్తాను. మీరు వర్క్ కి వెళ్ళిపోండి" అని వారిని సమాధాన పరిచాడు. 


అప్పుడే అక్కడకు వచ్చిన అనూరాధ, " మీకు అభ్యంతరం లేక పోతే నేనూ వస్తాను. ఈ మనుష్యులని చూసి బోర్ కొడుతోంది. ఆ జంతువుల మధ్య రోజంతా గడిపితే బాగుంటుంది" అంది. 


ఆమె మాటలు విని శ్యామల, రామకృష్ణతో, " అనూకు జూ అంటే ప్రాణం. మీకు అక్కడ అన్నీ చూపిస్తుంది. ఫోటోలు కూడా బాగా తీస్తుంది" అని వుత్సాహంగా చెప్పింది.


రామకృష్ణ కాదనలేక పోయాడు. వినోద తన కారు కీ అనూరాధకిచ్చి, "జాగ్రత్త. ట్రాఫిక్ ఎక్కువగా వుంటుంది" అని చెప్పాడు. ఆమె మౌనంగా కీ తీసుకుంది. 


@@@


జూ పార్కు చేరే వరకు మౌనంగా కారు నడిపింది అనూరాధ. పార్కు చేరుకున్నాక, "కారు పార్క్ చేసి వస్తాను. ఈ లోగా టికెట్స్ తీసుకోండి" అంది. 


రామకృష్ణ ఆమె చెప్పినట్లే చేసాడు. కొద్ది సేపటిలో ఆమె వచ్చింది. ఆమె తన సంచీలోంచి, రెండు టోపీలు తీసింది. ఒకటి అతని కిస్తూ, " ఇక్కడ ఎండ దారుణంగా వుంటుంది" అని నవ్వుతూ అంది. 


ఆమె ప్రసన్న వదనం, ముందు జాగ్రత్త చూసిన రామకృష్ణ మనసు కుదుటబడింది. ఆమె ముందుకు నడుస్తూ, "మనం మాప్ ప్రకారం చూస్తూనే, ముందుగా సఫారి పూర్తి చేద్దాం. అదే మీకు చాలా సంతోషాన్నిస్తుంది" అంది. 


రామకృష్ణ, "అలాగే” అంటూ ఆమె వెనుక నడిచాడు. 


జంతువులని చూస్తూ, ముందుకు సాగుతున్న అనూరాధలో గాంభీర్యం మెల్లగా మాయమైంది. ఆమె బాలికగా మారిపోయింది. జంతువుల చేష్టలను చూసి, ఆమె రామకృష్ణ భుజం మీద చేయివేసి, "అదిగో చూడండి. ఇలా రండి, బాగా కనబడుతుంది" అని అంటూంటే, ఆమె గురించి శ్యామల నిజమే చెప్పిందని రామకృష్ణకి అర్ధమైంది. 

ఫోటోలు తీయడంలో అనూరాధ వుత్సాహం, సామర్ధ్యం, రామకృష్ణకి ముచ్చటగొలిపాయి. ఇంతవరకు ఏ పర్యాటక ప్రాంతంలో దిగనన్ని ఫోటోలని అతడు, ఆమె ప్రోద్బలంతో దిగాడు. అలాగే ఆమెను తీసాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో, అతనికి ఆకలి వేసింది. ఆమె తన చేతి సంచీలోంచి రెండు బాక్సులు తీసి, ఒకటి అతని కిచ్చి మరొకటి తను తీసుకుంది. ఇక్కడ హోటల్లో మంచి భోజనం దొరకదు” అని అంది. 


వారు భోజనం చేస్తున్న సమయంలో ఆకాశం మేఘావృతమైంది. రామకృష్ణ త్వరత్వరగా తింటూ, "వాన పడేలా వుంది" అని అన్నాడు. 


"భయపడకండి. ఇక్కడ గొడుగులు అద్దెకిస్తారు. మీరు మెల్లగా తినండి. ఇదిగో ఈ రెండు అరటిపళ్ళు కూడా తినండి." అని ఆమె అరటి పళ్ళు అతని చేతికిచ్చి ప్రధాన ద్వారం దగ్గర వున్నఆఫీసు వైపు వెళ్ళింది. 


రామకృష్ణ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, "ప్రతి స్త్రీలో అమ్మ వుంటుంది. ఎంత ఆప్యాయంగా తినిపిస్తోంది" అని అనుకున్నాడు.

 

వాన జల్లులు ప్రారంభమవుతున్న తరుణంలో ఆమె ఒక పెద్ద గొడుగుతో వచ్చింది. "ఈ గాలిలో దీన్ని నేనెలాగూ పట్టుకోలేను. అందుకని ఒక్కటే తీసుకొచ్చాను." అంటూ ఆమె గొడుగు అతని చేతి కిచ్చి, తన సంచీలో బాక్సులు సర్దింది. 


వారు గొడుగులో మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న పక్షులను చూసి, ముందుకు సాగారు. "స్వేచ్చను హరించడంలో మానవులకు ఎంత ఆనందమో.. అందులో మగవారికి" అని ఆమె వినీ వినబడనట్లు అంది. ఆ తర్వాత వరుస పాములది. అవి చూస్తూనే, "నా చుట్టూ వున్న పాములు చాలు. ఇవి నేను చూడలేను. మీరు చూసి రండి" అని ఆమె ముందుకు కదిలింది. 


రామకృష్ణ, "నాకు కూడా యిష్టముండదు. పదండి." అని ఆమెతో నడిచాడు. 


ఒక అర్ధ గంట తర్వాత, వారు జూ బయటికి వచ్చి, సీతాకోక చిలుకల పార్కుకి వెళ్ళారు. 


అక్కడ సీతాకోక చిలుకలను చూస్తూ, "చిన్నప్పుడు, రివ్వున యెగురుతాయని. రంగుల సీతాకోక చిలుకలంటే యిష్టం. కాస్త పెద్దయ్యాక, పువ్వు పువ్వు మీద వాలే సీతకోక చిలుక లాంటి వాడు మగవాడన్న వర్ణన విన్నాక, అనిష్టం యేర్పడింది. ఇప్పుడు అనుభవం వల్ల ద్వేషమే కలుగుతోంది” అని అంది. 


 రామకృష్ణకి యేమనాలో తెలియలేదు. అతనికి సూచనప్రాయంగా, ఆమె పెళ్ళి పెటాకులవడానికి కారణం అర్ధమైంది. రేపు వెళ్ళిపోయే వాడిని, ఆమె కథ నాకెందుకని అతడు మౌనం వహించాడు. 


ఆమె తిరుగు ప్రయాణంలో యిలా అంది, "నా గురించి మీరు యేమనుకుంటున్నారో నాకు తెలియదు. మన మధ్య యేర్పడిన స్నేహం వల్ల ఒక్క మాట చెబుతున్నాను. నేను అభిమానవతినే గాని, అహంకారిని కాను.” 


ఆ మాట చెప్పాక, అమె మౌనంగా వుండిపోయింది. సహజంగా మితభాషియైన రామకృష్ణ కి, యేమనాలో తెలియక, నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు. 


@@@


ఇంటికి వచ్చాక రామకృష్ణకి, అనూరాధ కనబడలేదు. భోజనాలయ్యాక, వినోద్ పని వుందంటూ బయటికి వెళ్ళాడు. శ్యామల అది అవకాశంగా తీసుకుని రామకృష్ణతో యిలా అంది. 


"అనూ చాలా మంచి పిల్ల. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్న వినోద్. పెద్దయ్యాక, ఒక రోజు ఆస్తుల పంపకం గురించి తండ్రితో గొడవపడ్డాడు. అనూకి పెళ్ళి చేసి పంపడం వరకు మన బాధ్యత, ఆస్తులూ, నగలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. నాకు ఆస్తి వద్దని అనూ చెప్పడం కూడా వినోద్ కి నచ్చలేదు. స్వార్దం, అహంకారం అతన్ని ఒక ద్వేషిగా మార్చివేసాయి. అన్న అనురాగం, ద్వేషంగా మారడం అనూని యెంతో బాధించింది.”


 ఆస్తుల వల్ల కుటుంబ సభ్యులు, శత్రువులుగా మారిన సంఘటనలు రామకృష్ణ ప్రత్యక్షంగా చూసి వున్నాడు. 


అనూ పట్ల అతనికి జాలి కలిగింది. "పెళ్ళి కూడా ఆమెకు బాధనే మిగిల్చిందా?" ఆని లోగొంతులో అడిగాడు. 


“అవును. అది వినోద్ స్వార్ధం వల్ల జరిగింది. అమెరికా సంబంధమైతే అనూరాధ, దూరంగా వెళ్ళిపోతుందని, తల్లిదండ్రులు వద్దన్నా, అనూని ఒప్పించి పెళ్ళి చేసాడు. కానీ వినోద్ వూహించని విధంగా, పెళ్ళయ్యాక ఆ కుర్రాడు, వాడి తల్లి కలిసి, ఆస్తిలో సగ భాగం ఇవ్వకపోతే, అనూని కాపురానికి తీసుకెళ్ళమని కూర్చున్నారు. అనూ కోపంతో వాడికి విడాకులిచ్చింది. వాళ్ళు అనూని అహంకారి, పొగరుబోతని, ప్రచారం చేసారు." 


"పాపం! తప్పు చేయని అనూరాధకి చెడ్డ పేరు, వేదన" అని సానుభూతి ప్రకటించాడు రామకృష్ణ. 

"నువ్వు వచ్చేదాకా నీ సంగతి నాకు తెలియదు. ఇలా అంటున్నానని వేరేలా అనుకోవద్దు. నీకు అనూ సంగతి చెప్పాను. నీకిష్టమైతే, అనూతో చెప్తాను. డేటింగ్ చేసి, ఒకరి నొకరు అర్ధం చేసుకోండి" 


ఎప్పుడు వచ్చిందో అనూరాధ. శ్యామలతో వెటకారంగా యిలా అంది. 

"ఆయన కూడా మగవాడే కదా! మకరందం జుర్రుకుపోయే వాళ్ళకు నాలాంటి అహంకారిని అంటగట్టి మరో విషాదానికి తెర తీయకు. " 


ఆ మాటలని ఆమె వెళ్ళిపోయింది. 


శ్యామలతో రామకృష్ణ, ఓదార్పుగా యిలా అన్నాడు. 

"మనసు గాయపడ్డాక మాట సున్నితంగా యెలా వుంటుంది? ఆమె రాగద్వేషాల మధ్య నలిగిపోతోంది. ఎంతగానో ప్రేమించే అన్న, ఒక్క సారి ద్వేషిగా మారి, జీవితాన్ని అతలాకుతలం చేసినా, అతడి పట్ల తనకున్నఅనురాగాన్ని, అలాగే పదిలపరిచే ప్రయత్నంలో, ఆమె సతమత మవుతోంది. ముందు ఆమె మనసు స్థిమితపడనివ్వు. ” 


@@@


మరునాడు రామకృష్ణ బయలుదేరే ముందు, అనూరాధని కలిసాడు. 


“రాగద్వేషాలు, బంధం అనే నాణానికి, రెండు ముఖాలు. ఇవాళ మనవైపు, ఒక ముఖం వుంటే, కాలం దాన్ని మరో వైపుకి మారుస్తుంది. అంత వరకు వేచి వుండాలి. మరో మాట, మీ స్నేహం నాకెంతో విలువైనది. నిన్న మీలో ఒక ఆనందించే బాలికను, బాధ్యత గల స్నేహితురాలిని, ఆప్యాయత గల అమ్మను చూసాను. ”

అనూరాధ ముఖంలో కాంతి. ఆమె చిరు దరహాసంతో, "థాంక్స్" అంది. 


"నేను వెడుతున్నాను. మీకు ఒక జూ పార్క్ చూపించి మీ ఋణం తీర్చుకోవాలనుకుంటున్నాను. గుజరాత్ లోని వాంటారా జూ త్వరలో తెరుస్తారు. ఇంకా టైముంది. నా ప్రతిపాదన నచ్చితే, తెలియచేయండి. " 


ఆమె బదులుగా చిన్న నవ్వు నవ్వింది. 


రామ కృష్ణ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె సమాధానం కోసం ఓపికగా యెదురుచూస్తున్నాడు.

 

@@@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

 
 
 

Comments


bottom of page