'Raghupathi Raghava Rajaram Episode 5' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.
స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.
రాఘవ, సీతయ్య ల ఘర్షణలో అడ్డు వెళ్లిన రఘుపతికి గాయం అవుతుంది. రఘుపతి కోలుకుంటాడు. అతని కోరిక మీద రాఘవ ఎడ్ల పందాలలో పాల్గొని గెలుస్తాడు.
కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్.
ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 5 చదవండి..
అప్పటినుండి ఇద్దరిమధ్య అడపాతడపా ఫోన్ సంభాషణలు నడిచేవి. ‘మీరు’ నుండి ‘నువ్వు’ అని పిలుచుకునే చనువు ఏర్పడింది ఇద్దరిమధ్య. వదినకు కళ్యాణి గురించి ఆమె చేస్తున్న సోషల్ సర్వీస్ గురించి చెప్పాడు.
వారింటిలో ఉన్న స్మార్ట్ టీవి లో యుట్యూబ్ లో ఉన్న కళ్యాణి ఉపన్యాసాన్ని ఇంటిల్లిపాదికీ చూపించాడు. అందరూ అంత చిన్న వయసులో ఆమె చేస్తున్న కృషిని కొనియాడారు.
కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్ కోసం హైదరాబాదు వెళ్ళినప్పుడు కళ్యాణికి ఫోన్ చేసి యూనివర్సిటీకి వెళ్ళి కలిసాడు రాజా.
యూనివర్సిటీ నుంచి ఆ రోజు ఇద్దరూ కలసి బిర్లా మందిర్ కు వెళ్ళారు. దైవదర్శనం తరువాత జనసమ్మర్దం లేని చోట కూర్చున్నారు.
తన గురించి తన కుటుంబం గురించి రాజా కళ్యాణికి చెప్పాడు. కానీ కళ్యాణి తనగురించి ఎపుడూ చెప్పలేదు.
రెండు మూడు సార్లు ఫోన్ లో అడిగినా చెప్పకుండా దాటేసేది.
"కళ్యాణీ, ఎప్పుడడిగినా నీ గురించి ఏమీ చెప్పలేదు. నీ గురించి మా యింట్లో అందరకు తెలుసు. నీ స్పీచెస్ కూడా విన్నారు. ఈ రోజన్నా నీ సంగతులు చెప్పు" అడిగాడు రాజా.
ఒక నిమిషం మౌనం తరువాత నోరు విప్పింది కళ్యాణి.
"మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు.
అమ్మ పేరు సునంద. నన్ను, అక్కయ్య ఇందుమతిని అమ్మ అల్లారు ముద్దుగా పెంచింది. నాకూ, అక్కకు ఏడేళ్ల తేడా.
అక్క కూడా నేను చిన్నపిల్లనని నన్ను ముద్దుగా చూసేది. అమ్మ, అక్కయ్య ముద్దూ మురిపాలతో నా బాల్యం అంతా సరాదాగా గడచిపోయింది.
అమ్మ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేది. మాకు డబ్బుకు ఏమీ లోటు లేదు. మా నాన్న ఆస్తి మొత్తం మాకే వచ్చింది. అమ్మ ఇంట్లొ ఒక్కటే వుండలేక జాబ్ చేసేది.
చదువు అయ్యాక మా అక్కయ్య సాఫ్టు వేర్ జాబ్ లో ప్రవేశించింది. బెంగుళూర్ లో జాబ్.
రెండు మూడు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేది.
ఒకసారి వచ్చినప్పుడు జాబ్ చేసే చోట తనతో పనిచేసే మోహన్ ను ఇష్టపడుతున్నానని, అతన్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పింది.
అమ్మా, నేనూ పోయి మోహన్ ను చూసాము.
మనిషి చూడటానికి బాగానే వున్నాడు. కన్నడిగుడు. తెలుగు కొద్దికొద్దిగా వచ్చు. అతని తల్లీతండ్రీ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారట. ఇరువైపుల చుట్టాలు వారిని వెలివేశారు. ఈ మధ్యనే ఓ కారు ప్రమాదంలో తల్లీతండ్రీ మరణించారు.
బంధువుల వివరాలు ఇతనికి తెలియవు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. ఒక రకంగా అనాధ అని చెప్పవచ్చు.
అమ్మకు ఈ సంబంధం పూర్తిగా నచ్చకపోయినా అక్క బలవంతం తో పెళ్ళికి వప్పుకుంది. పెళ్ళి బెంగుళూరు లోనే చేసాము. పెళ్ళి తరువాత ఒక నెలరోజులకు మేము తిరిగి వచ్చేసాము.
అప్పుడే అమ్మ వున్న ఆస్తులన్నీ ఆమ్మి నాపేరా, అక్కపేరు మీదుగా వివిధ బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసుకుంది. కొంత సొమ్ము సేవింగ్స్ లో వేసింది.
అక్క డెలివరీ కి అమ్మ బెంగుళూరు వెళ్ళింది. అక్కకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. బాబు పేరుఅనిరుద్, పాప పేరు అలేఖ్య. నేనప్పుడు ఇంటర్ చదువుతున్నాను.
అమ్మ బెంగుళూరు నుండి తిరిగి వచ్చాక ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు తీసుకువెళ్లినప్పుడు దారుణమైన వార్త చెప్పారు- అమ్మకు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్ప వేరు మార్గం లేదన్నారు. నేను వెంటనే నా కిడ్నీ ఇవ్వటానికి సిద్ధమయ్యాను.
దురదృష్టవశాత్తు నాది అమ్మకు మాచ్ కాలేదు.
అక్కా, బావా బెంగుళూర్ నుండి వచ్చారు. అక్క కిడ్నీ ఇవ్వటానికి బావ ఒప్పుకోలేదు. నేనూ, అక్క ఎంత బ్రతిమిలాడినా బావ ససేమిరా వీల్లేదు అన్నాడు.
హాస్పిటల్ వారికి చెప్పాను. డోనార్ ను చూడమని, డబ్బులు ఎంత అయినా ఇస్తానని చెప్పాను. నాలుగు రోజులు చూసినా సరియైన దాత దొరకలేదు. అమ్మ నరకయాతన అనుభవించి వారం రోజుల తరువాత కనుమూసింది.
నేనే అమ్మకు తలకొరివి పెట్టాను. కర్మకాండల విషయంలో బావ పెద్దగా కల్పించుకోలేదు. కార్యక్రమాలు ముగిశాక అక్కా, బావా బెంగుళూరు వెళ్లిపోయారు. అమ్మ మరణం నన్ను చాలా కాలం వెంటాడింది. వయసు అయిపోయి వచ్చిన సహజ మరణం కాదు. కేవలం ఒక సరియైన కిడ్నీ దొరక్క చనిపోయింది. ఇక్కడ డబ్బుల సమస్య లేదు.
కానీ కిడ్నీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. అక్క కిడ్నీ మ్యాచ్ అయ్యేదో లేదో తెలియదు, బావ ఒప్పుకోలేదు. బావని కాదని అక్క ముందుకు రాలేక పోయింది.
అమ్మ కోసం కిడ్నీ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు, అక్కడ వందలాది మంది కిడ్నీ పేషెంట్లను చూశాను. ఇక్కడే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అని నాకు భయం వేసింది. అదే ఆసుపత్రిలో ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరాడు.
అయితే, కిడ్నీ దాత లేకపోవడంతో అతడు చనిపోయాడు. అది నన్ను విపరీతంగా చలింపచేసింది. ఒక కిడ్నీని దానం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆ పిల్లవాడికి కిడ్నీ దొరకలేదు? అనే అనుమానం వచ్చింది. దీనిపై డాక్టర్లతో మాట్లాడాను.
'కిడ్నీలు ఇచ్చేవారు మన దేశంలో ఎవరుంటారమ్మా?' అని అన్నారు.
అంటే దీనిపై అవగాహన లేకే ఎవరు ముందుకు రావడం లేదని గ్రహించాను. దీనిపై ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆరు నెలల పాటు ఎంతో సమాచారం సేకరించాను.
ఇతర దేశాల్లో ఏలా ఉంది? మన దేశంలో అవయవ, శరీర దానాలపై పరిస్థితి ఏంటి? అనే వివరాలు సేకరించాను. ఒక సంవత్సరం పాటు నేను రీసెర్చ్ చేసినట్లుగా క్షుణ్ణంగా అన్ని విషయాలు అవగాహన చేసుకుని రంగం లోకి దూకాను.
డిగ్రీలో వుండగా 19 సంవత్సరాల వయసు లోనే ముందుగా నేను చదువుతున్న కాలేజీలోనే నా మొదటి స్పీచ్ ఇచ్చాను. అది పేపర్ లో వచ్చి వేరే కాలేజీ వారు పిలిచారు.
అదిమొదలు ఇప్పటిదాకా ఎన్ని కాలేజీల్లో, ఎన్ని చోట్ల చెప్పానో లెక్కేలేదు. డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాద్ వచ్చి పీజీ లో చేరాను. NOTTO తో రెగ్యులర్ గా కాంటాక్ట్ పెట్టుకున్నాను. అవయవ దానం గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నదే నా లక్ష్యం.
ప్రతీసారి ఉపన్యాసం విన్నప్పుడు వున్న ఉత్సాహం తరువాత వుండదు. మీ కాలేజీలో దాదాపు వంద మంది దాకా పేర్లు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సమయానికి పది మంది కన్నా ఎక్కువ మంది రారు.
అయినా పది మంది అయినా ముందుకు వచ్చారు కదా అని సంతోషపడి పోతుంటాను.
నాలుగు నెలల క్రితం అక్క ఒక ప్రమాదంలో చనిపోయింది. అక్క పిల్లలు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. బావ పిల్లలను పెంచలేక అవస్థలు పడుతుంటే నేను పిల్లలను నా దగ్గర వుంచమన్నాను. బావ సంతోషంగా పిల్లలను ఇక్కడ వదిలి వెళ్ళాడు. మూడునెలల కాలంలో రెండుసార్లు వచ్చి వెళ్ళాడు.
మొన్న వచ్చినప్పుడు నన్ను పెళ్ళి చేసుకోవాలని అభిప్రాయం వెలిబుచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్పాను తనను చేసుకోనని. ముఖం చిన్న బుచ్చుకొని వెళ్లిపోయాడు. నేను ఈ కార్యక్రమాల కోసం అటూ ఇటూ వెలుతుంటానని ఒక నమ్మకమైన పని మనిషిని ఇంట్లోనే ఎప్పుడూ వుండేలా ఏర్పాటు చేసాను.
నా జీవితం గురించి నాకు ఎప్పుడూ చింత లేదు. అక్క పిల్లల గురించే నా బాధ. బావ మనస్తత్వం అర్థమవుతూనే వుంది. పిల్లల బాధ్యత స్వీకరించడానికి అతను రడీగా లేదు. మరో పెళ్ళి చేసుకునే ఆలోచనలో వున్నాడు. అక్క పిల్లలను ఎట్టి పరిస్తితులలో కూడా నేను వదులు కోలేను. చూద్దాం ! ముందు ముందు ఏం జరుగుతుందో?"
సుదీర్ఘంగా చెప్పిన కళ్యాణి మాటలు రాజాను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఎన్నికష్టాలు, ఎన్ని బాధలు కళ్యాణి జీవితంలో. ఇన్నివున్నా కుడా తన ఆశయసాధన కోసం వెనుకడుగు వేయలేదు. మనసులోనే ఆమెకు జేజేలు పలికాడు.
"కళ్యాణి.. ఇకనుండి నీకు తోడుగా నేనుంటాను. ఇది నిజం. ఇష్టం, ప్రేమ లాంటి మాటలు చెప్పను, కానీ నీ ఆశయం, నువ్వు ఎన్నుకున్న మార్గం నాకు నచ్చాయి. నీకు ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా నాకు ఫోన్ చేయి. సంక్రాంతి సెలవులకు పిల్లలను తీసుకుని మా ఊరు రా.
మా వదిన నీ స్పీచ్ విని నిన్ను చూడాలంది. నీ స్నేహితుడిగా ఎప్పుడూ నీవెంటే ఉంటా" అన్నాడు రాజా.
కళ్యాణి చిరునవ్వుతో తలాడించింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comments