top of page
Undavilli M

రహస్య స్నేహితుడు!



'Rahasya Snehithudu' - New Telugu Story Written By Undavilli M

Published In manatelugukathalu.com On 27/02/2024

'రహస్య స్నేహితుడు' తెలుగు కథ

రచన: ఉండవిల్లి.ఎమ్



నది ఒడ్డున నేను౼

 నన్ను చూడగానే నది ఉరకలేస్తూ పరుగెడుతూ ఒడ్డుకంటా వచ్చి నా కాళ్ళను తడిమి తడిమి నిమురుతుంది. నామీద దీనికెందుకింత పిచ్చి ప్రేమ, గల గలా నవ్వుతూ తరగలు తరగలుగా కదలి మెదిలి ఏదో చెప్పాలని చూస్తుంటుంది. 


నేను నది ఒడ్డున నడుస్తూ వెళుతుంటాను. ఏదో ఒక అలికిడి చేస్తూ, పరవళ్లు తొక్కుతూ నాతోపాటే వస్తుంది. నడుస్తూ నడుస్తూ నేనెళ్లిపోతాను. నా ఆనవాళ్లు కూడా కన్పించవు. మరెప్పటికీ తిరిగి రావేమో! 


అప్పుడు ఇదేం చేస్తుంది?నా జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ నిరీక్షణలతో, ఆ జన్మాఅంతం ఎదురుచూస్తుందా? జీవితకాలం నిలబడలేని అనుబంధాల్ని చూసి గుడ్డిగా కేరింతలు కొట్టడం.. నాకు నదిని చూసి జాలేసింది. మెయిల్ లోని ఈ మెసేజ్ చూసాక నాకు మనస్సంతా అదోలా అయిపోయింది. అసలు ఎప్పటికీ అర్ధం కాడు విశ్వం. ఎవరెస్టు శిఖరం లాంటి వాడతను. అతడొక స్పందన, ఇన్స్పిరేషన్. నిజంగానే! మాయం అయిపోయాడు. అతన్నుండి మెయిల్స్ రావడం మానేసాయి. మరేవిధమైన క్లూస్ లేవు. 


వెబ్ సైటులో మొదట పరిచయమైనపుడు నీ గురించి చెప్పు అన్నప్పుడు "నాపేరు విశ్వం, నాదొక ప్రైవేట్ కంపెనీ, పెళ్లయింది, పిల్లలు. అప్పుడప్పుడు ఏమీ తోచక గదిలో ఒంటరిగా వెబ్ సైటులోకి వస్తాను. చాటింగ్ చేస్తుంటాను. ఈరోజు నీతో చేస్తున్నట్లు" అన్నాడు. 


"నీకు పెళ్ళయిందా?"ఆశ్చర్యంగా అడిగాను. 


 "అయింది. అయితే ఫ్రెండ్షిప్ చేయవా? అయినా షార్ట్ టర్మ్ చేయాలనా, లాంగ్ టర్మ్ చేయాలనా? చాలా మంది ఇలాగ అడుగుతుంటారు. అందుకే నేనూ అడిగాను" అన్నాడు విశ్వం. 


"అలా అనికాదు. నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నాకు ఇంటెలిజెంట్ కావాలి" అన్నాను. 


"అయితే నన్నొదిలేయ్, నేను ఇంటెలిజెంట్ కాదు" అన్నాడు.   ◆ ◆ ◆కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే మెయిల్ చేసాను. 

ఈలోపు విశ్వం నుంచి ఏమీ రాలేదు. సహజంగా ఈలోపు అబ్బాయిలు, అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాలుగా మెసేజెస్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇతను అలా అన్పించలేదు. కంటిన్యూ చేసి చూడాలని అన్పించింది. 


చాలా సెంటిమెంటల్ అతను. సామాజిక దృక్పధం ఉన్న మనిషిలా అన్పించాడు. రాను రాను చాలా విషయాల్లో నాలెడ్జి ఉన్న మనిషిలా కన్పించాడు. 


ఒకరోజు నేనడిగాను"లైఫ్ లో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?ఎవర్నైనా ప్రేమించావా?" అని. 


"నా లైఫ్ అన్ని దిశలకి స్ప్రెడ్ అయిపోయింది. నేనెరని ప్రేమించలేదు. సమయం లేదు. ఎవర్నైనా ప్రేమించాలని అనుకున్నా ఒకలాంటి భయం. ఎవర్నీ ప్రేమించలేకపోయాను. ఇప్పుడు ప్రేమించలేనంత బిజీబిజీగా జీవితం పరుగెడుతోంది. " అన్నాడు. 


"అయితే నీకు పెళ్లి కాలేదన్నమాట" అని అడిగాను. 


"అయింది"


"ఎవర్నీ ప్రేమించలేకపోతున్నానన్నావు?"అన్నాను. 


"కానీ, ఒకామె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ మాట పెళ్లయ్యాక చెప్పింది. బంధువుల అమ్మాయే. " అన్నాడు. 


"ఓహ్.. నువ్వు ఆశ్చర్యంగా ఉన్నావే" అని, మళ్ళీ నేనే చెప్పాను. "నేనొక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా జీనియస్, పాటలు బాగా పాడేవాడు. ఆల్బమ్ రిలీజ్ చేసాడు. కంప్యూటర్స్ లో టాప్. నన్ను బాగా ప్రేమించేవాడు. " అన్నాను. 


"అయితే, నాతో చాటింగులెందుకు?" అతనడిగాడు. 


"అతను చనిపోయి మూడు సంవత్సరాలైంది. అలాంటి వ్యక్తి కోసమే వెబ్ సైట్ లలో వెదుకుతున్నాను. ఎవరూ కన్పించడం లేదు. " అని చెప్పా. 


"చూడు నీల, ఈ ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది. కళల్లో రాణించిన వాడు డబ్బు సంపాదించలేడు, కీర్తి వస్తుంది. డబ్బు సంపాదించే వాడు కళల్లో రాణించలేడు. ఎక్కడైనా రేర్ గా జరుగుతుంది ఎవరైనా ఒకరి విషయంలో.. "


"అవును నిజమే, నేను కూడా చాలా మందిని చూసాను. నీ మాటల్ని ఒప్పుకుంటున్నాను"అన్నాను. 


"నువ్వు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావు విశ్వం?"అని మరోసారి అడిగాను. 


"డబ్బు సంపాదిస్తూ పోవడం నాకిష్టం లేదు. పబ్లిక్ లోకి పూర్తిగా వెళ్ళిపోయి సేవ చేయాలనేది నా జీవితపు లక్ష్యం. ఏమవుతుందో తెలియదు.   ◆ ◆ ◆చాలా రోజుల తర్వాత.. 

"నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు. నేనేమో ఎలా సంపాదించాలో తెలియక చదివిన సైన్సు డిగ్రీలు ఉద్యోగానికి తప్ప జీవితంలో కావాల్సినంత ధనం సమకూరడానికి ఉపయోగం లేకుండా పోయింది. ఏదైనా ఉపాయం చెప్పు" అన్నాను. 


"ఒక సంపన్న కుటుంబం లోంచి అట్టడుగు స్థాయికి దిగజారిపోయి ఒంటరిగా నేను ఒక్కోమెట్టు ఎక్కుతూ పోరాటం చేస్తూ పైకొస్తున్నవాడిని, నేనెప్పుడూ జీవితాన్ని పోరాటం చేసే గెలవమని చెప్తాను. పోరాడి పోరాడి గెలవడమే నా లక్ష్యం. నీ తెలివితేటలు చాటింగులో కాదు, నీ జీవితంలో ఉపయోగించు" అన్నాడు. 


అతని మాటలు నచ్చేవి నాకు. ఏ విషయం లోనైనా కమర్షియల్ గా అతను ఆలోచించలేడు. అన్నిట్లోనూ మానవతావాదం చొచ్చుకుపోయి ఉంటుంది. 


"ఏమిటి నిన్న మెయిల్ చేయలేదు. ఏం చేస్తున్నావు?"అని అడిగాను. 


"పుస్తకం చదువుతున్నాను" అన్నాడు. 


" ఏ పుస్తకం?"


"హస్తరేఖలు"


"ఓహ్.. నువ్వు అస్త్రాలజీ చెప్తావా! ?"

"చెప్పను, చదువుతాను నాలెడ్జి కోసం"


 "ప్లీజ్ నాకోసం చెప్పవా?"అని అడిగాను. 


"నాకు డీప్ గా తెలీదు" అన్నాడు. 


"నీకు తెలిసినంతే చెప్పు" అన్నాను. 


బతిమాలాక"నీ ఎడమ అరచేయి ప్రింటు పంపించు" అన్నాడు. మూడు ప్రింట్లు పంపించాను. 


"నీ చేతిలో రవిరేఖ, ఆయుస్సురేఖ మీద నుండి పైవరకు వెళ్ళింది. ఏవైనా కళలో గొప్పగా రాణిస్తావు. నువ్వు ఎక్కడ పనిచేసినా నీ మాటే పైనుంటుంది. ఎడ్యుకేషన్ బావుంటుంది"అన్నాడు. 


"నీ నక్షత్రం ఏమిటి?" అని అడిగాడు.


"చిత్త" అని చెప్పాను. 


"అయితే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత బావుంటుంది. చేతిలో రవిరేఖ కూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నీ డెవెలప్మెంట్ చూపిస్తుంది. నీ దాంపత్య జీవితం సరిగా ఉండదు. నిత్యం దైవాన్ని ఆరాధించే వారికి ఏవిధమైన దోషాలు ఉండవు. నీది గుండ్రటి ముఖం" అన్నాడు. 


చాలా కరెక్టుగా చెప్పాడు. 

"ఇంకా చెప్పు" అన్నాను. 


"అంత డీప్ గా నాకు తెలీదు" అన్నాడు. 

అతని మీద నాకు గురి కుదిరింది. నాకొక ఇల్లు కావాలని వెతుకుతుంటే నాకొక మంచి సలహా ఇచ్చి సేవ్ చేసాడు. బ్యాంకింగ్ గురించి చాల విషయాలు చెప్పాడు. అర్ధమవుతున్న కొద్దీ అతనొక నిధిలా కన్పించాడు. అన్ని విషయాల్లోనూ అతని సలహాలు తీసుకోవడం అలవాటైంది. సైకాలజీని అతను పూర్తిగా రీసెర్చ్ చేసిన వాడిలా మాట్లాడేవాడు. 


"ఎప్పుడూ ఇలాంటి విషయాలేనా ముద్ధపప్పులాగా?ఇంకా ఏమైనా హాట్ గా చెప్పు" అన్నానోకసారి. 


"మీరున్న ఇంటికి నైరుతి మూల ద్వారం ఉన్నట్లు అన్పిస్తుంది. ముందు అది చెప్పు! " అన్నాడు. 


"అవునని" చెప్పాను. 


ఈఇంట్లోకి మీరు వచ్చిన దగ్గర్నుండీ, నీకు ఇలా చాటింగులు చేసి మగవాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది అవునా?" అన్నాడు.

 

"అవును నిజమే " అన్నాను. 


ఈ ఇంటికి వచ్చి తొమ్మిది నెలలు అయింది. అంతక ముందు ఇలా చాటింగులు చేయాలనిపించేది కాదు. ఇలాంటి ఆలోచన్లు కూడా చిరాగ్గా ఉండేవి. ఇక్కడికొచ్చాక ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని చెప్పాను అతనితో. 


అతను ఇల్లు మారిపొమ్మన్నాడు. నాకు మనసు శాంతిగా ఉండటం లేదంటే నిత్యం ఆచరించుకునే చిన్న చిన్న చిట్కాలు, పూజలు చెప్పాడు. క్రమక్రమంగా అతను నా జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాడు. మొదట్లో ఒకసారి అడిగినప్పుడు చెప్పాను. 


నీతో షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని, కానీ లాంగ్ టర్మ్ చేయాలనిపిస్తుంది. నాకు అతని మీద ధైర్యం వచ్చింది. నా సెల్ నంబరు చెప్పి కాల్ చేయమన్నాను. అతను కాల్ చేసాడు. 


మాటలు కలిశాక అతని మీద ఇంకా గురి ఏర్పడింది. మెల్ల మెల్లగా నా విషయాలు ఒక్కొక్కటీ చెప్పడం మొదలు పెట్టాను. 


'నా దాంపత్య జీవితం సరిగా లేదని, నీతో పిల్లల్ని కని, వాళ్ళని చూసుకుంటూ, పెంచుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తానని', దయచేసి ఏమీ అనుకోకుండా అతని అభిప్రాయం చెప్పమని, అడిగాను. 


అతను నిర్ఘాంతపోయాడు. 


ఇన్ని రోజులు సెర్చింగ్ దేనికో అర్ధమైంది అతనికి. నాతో ఎలా చెప్పాలో కన్ఫ్యూజ్ అయినట్టుంది. 

 చాలా దీర్ఘంగా, దానివల్ల సమస్యలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కొక్కటీ వివరణగా చెబుతూ జీవితాన్ని ఎలా మలచుకోవాలో నాకు నూరిపోసాడు. 


అప్పటివరకూ ఇలాంటి ఆలోచన్లతో ఉన్న నాలో క్రమేపి మార్పు కనిపించి ఎలా లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలో తెలియడం మొదలైంది. 


"అయితే నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు జీవితకాలం స్నేహితుడుగా నువ్వుండి పొగలవా! ?" అని అడిగాను. 


"నీలో మార్పు రావడం వరకే నా అవసరం నీకుంటుంది. తరువాత నేను కనుమరుగైపోతాను"అనేవాడు.   ◆ ◆ ◆ఒకరోజు మా అత్తగారి పోరు, ఇంట్లో గొడవలు అన్నీ ఎక్కువై నాకు చనిపోవాలనిపించింది. మధ్యాహ్నం రెండింటికి ముహూర్తం పెట్టుకున్నాను. 


అతన్ని కాల్ చేయవద్దని చెప్పాను. మెయిల్స్ రాయవద్దని మెసేజ్ ఇచ్చాను. 


అతన్నుండి స్ట్రాంగ్ మెయిల్ వచ్చింది. ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావకూడదో విపులంగా, స్ఫూర్తిదాయకంగా ఉందది. 


లాస్టులో"నా నంబరు నాది కాదు, అది వైజాగ్ రైల్వే స్టేషన్లో దొరికిన సిమ్. దాన్ని రీఛార్జి చేసి వాడుకుంటున్నాను. ఆ నంబర్ ఎవరిదో తెలియదు. ఆ సిమ్ పట్టుకుంటే నేను దొరకను" అని చెప్పాడు. 


నేను ఆశ్చర్యపోయాను! ! ! చాటింగ్ చేస్తూ అన్నీ వివరంగా, విపులంగా చెబుతూ ప్రమాద పరిస్థితుల్లో దొరక్కుండా అతను పాటించే టెక్నిక్స్, పైగా మోసం చేయాలనుకుంటే ఎప్పుడో నన్ను మోసం చేయవచ్చు. కానీ అలాంటివాడు కాదతను.   ◆ ◆ ◆చాలా రోజులు గడిచిపోయాయి. ఎన్ని మెయిల్స్ చేసినా అతన్నుండి రిప్లై రాలేదు. చాలా బతిమాలాను. కాళ్ళు పట్టుకుంటానన్నాను. పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటానన్నాను. 


ఎంతగా ఏడ్చానో తెలియదు. అలా రాసి రాసి రిప్లై రాదనుకునే సమయంలో అతన్నుండి మెయిల్ వచ్చింది. 


“నది గురించి నేను రాసిన మెసేజ్ చదువుకో, ఎప్పుడైనా అదే జరుగుతుంది. ఈ సమాజంలో నువ్వు ఒకరితో, నేనొకరితోనూ ఫిక్స్ అయిఉంటున్నాం. వేరు వేరుగా మనిద్దరం ఇలా చేసినా సమాజం ఒప్పుకోదు. దురదృష్టవశాత్తు మనిద్దరం ఇలా కలిసాం. మరోరకంగా కలిసుంటే మున్ముందుకు స్నేహం సాగిపోయేదేమో తెలియదు. 


రోజుల తరబడి, గంటల తరబడి నీ తెలివితేటల్ని ఇలా వృధాగా పోనీయకు. నువ్వొక గుర్తింపుగా, ఆదర్శంగా ముందుకు సాగిపో. అన్యాయం అయిపోతున్న ఇలాంటి ఆడవాళ్లకి అండగా నిలబడి అవసరమైతే చైతన్యపరచు.. "


దీని తర్వాత మళ్ళీ మెయిల్స్ రాలేదు. దాని ముందు మాత్రం'కెమెరామెన్ గంగతో రాంబాబు'సినిమాలో తమన్నా డ్రింకింగ్ గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చాడు. అతన్నుండి కమ్యూనికేషన్ కట్ అయింది.  

◆ ◆ ◆

నెల రోజుల తర్వాత అతన్నుండి మెయిల్ వచ్చింది. 


"ఏమీ అనుకోకు నీలా, ఇదే ఆఖరి మెయిల్. మరెప్పుడూ మెయిల్స్ చేయకు. నన్ను వెదకాలని చూడకు. నీకో నిజం చెప్పి నిష్క్రమించాలని ఈ మెయిల్ చేస్తున్నాను. నిజానికి నేను మగవాడ్ని కాదు. మగ గొంతుకతో మొబైల్ లో వాయిస్ మార్చి మాట్లాడిన ఆడదాన్ని, నీలాగే చాటింగ్ చేసి మోసపోయి, జీవితంలో ఓ గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నదాన్ని, నన్ను క్షమించు. నీలాంటి వాళ్ళని కొంత మందినైనా చైతన్య పరచాలనే కాంక్షతోనే నేను ఈ పని చేసాను. ఇక ఉంటా". 


మెయిల్ చదివి నేను షాకయ్యాను. నేను ఊహించలేదు. ఏ మాత్రం అనుమానం రాకుండా చివరికంటా తీసుకువచ్చింది. 


 గ్రేట్ అనిపించింది. 


తెరలు తెరలుగా నా ఆలోచనలన్నిటికీ ఆకృతి ఏర్పడి జవాబులుగా విడిపోవడం మొదలు పెట్టాయి. ఏదొక వ్యామోహంలో పడి చాటింగులమ్మట నేను చేస్తున్న సమయాలు, చాలా రోజులుగా నా తీరు చూసుకుంటే భయమేసింది. మరెప్పుడూ టైమ్ వృధా చేసుకుంటూ, చాటింగ్ ల జోలికి పోలేదు..  


◆ ◆ ◆ఆగని చైతన్యంతో విశ్వం మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుపోతున్నాడు.  

సమాప్తం. 

 ౼౼౼౼౼

ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


86 views1 comment

1 comentário


కథ బావుంది.

Curtir
bottom of page