రైతు బిడ్డ
- Sabbani Lakshminarayana
- Jul 7, 2024
- 5 min read

'Raithu Bidda' - New Telugu Story Written By Lakshmi Narayana Sabbani
Published In manatelugukathalu.com On 07/07/2024
'రైతు బిడ్డ' తెలుగు కథ
రచన: లక్ష్మీ నారాయణ సబ్బని
"డాడీ, డైరీ ఫార్మ్ నడిపించడం కష్టంగా ఉంది, తీసివేస్తాం"
అన్నడు వంశి.
వంశి నా చిన్న కుమారుడు, వయసు ఇరవై ఎనిమిది, చదివింది బి. ఏ.
"ఎందుకు " అని ప్రశ్నించిన.
"లాభం లేదు డైరీ నడపడం, ఇరువై ముప్పయి సంవత్సరాలు నడపడం చాలా కష్టం. " అన్నడు
"చాలా ఇష్టపడి పెట్టుకున్నవు కదా, అంత కష్టమేమి అనిపించింది"
"అనుభవం లేక తెలియక పెట్టుకున్న, పెట్టుకున్న తరువాత తెలుస్తూ పోయింది, డైరీ నడపడం నాతోని కాదని"
"ఎందుకు నీ తోని కాదు, నీకు తెలిసిన వాళ్ళు నడుపుకుంటున్నరు కదా" అన్నాను.
విని, "వాళ్ళు వేరు నేను వేరు, డైరీ పెట్టుకొనే వాడికి పాలు పిండడం రావాలి ముఖ్యంగా, ఆ తరువాత గడ్డి కొయ్యడం కూడా రావాలి, నాకు ఇవన్నీ చేత కావడం లేదు. పాలు పిండేవాడికి పదిహేను వేలు, గడ్డి కోసే వాడికి పది వేలు నెలకు, మొత్తం ఇరువై ఐదు వేలు ఖర్చు. పశువుల దాణా ఖర్చు నెలకు పదివేల పైనే.
మనకున్న పశువులు ఎనిమిది, ఆరు ఆవులు, రెండు బర్లు. అవి ఈనినపుడు రోజుకు యాభయి లీటర్ల పాలు వచ్చేటివి. అప్పుడు నెలకు యాభై వేల వరకు డబ్బులు వచ్చేటివి పాలకు, ఆవులు ఈని ఏడెనిమిది నెలలు దాటింది ఇప్పుడు రోజుకు ముప్పయి లీటర్లకు మించి పాలు వస్తలేవు. ఇప్పడు ముప్పయి వేలే వస్తున్నయి నెలకు పాల డబ్బులు. పని వాళ్ళ ఖర్చులు వెళ్లుతున్నయి. దాణాకు మనమే పెడుతున్నం. ఇలా పెట్టుకుంటూ పొతే మనకు నెల నెలకు నష్టమే. అందుకే డైరీ తీసివేస్తము" అని చెప్పిండు.
"ఉన్న ఫళంగా డైరీ తీసివెయ్యలేం కదా! ఆవులు ఈనినంక అమ్మవచ్చు. మూడు ఆవులు కట్టినయి, ఇంక మూడు కట్టలేదు. రెండు బర్లు కూడా కట్టలేదు. ఓ యాడాది వరకు బర్లు, ఆవులు ఈనినంక వాటిని అమ్మేసుకోవచ్చు. అప్పటి వరకు చూద్దాంలే. పాల దిగుబడి పెరుగాలంటే కొత్తగా నాలుగైదు బర్లు గాని, ఆవులు గాని తెచ్చుకుందాం " అన్నాను.
"కొత్తగా పశువులు తెచ్చుకోవడం వద్దు ఇక, సమస్యలు ఇలానే ఉంటాయి ప్రతి ఏడు" అన్నడు.
"మార్కెట్ లో ఆవు పాలకు డిమాండ్ లేదు, బర్రె పాలకు డిమాండ్ ఉంది. బర్రె పాలు ఇంటింటికి అమ్ముకున్నాగాని, లేదా ఏదైనా స్వీట్ హౌస్ కు గాని పోస్తే కొద్దిగ నయం, లాభం వస్తుంది" అని చెప్పిన.
"వద్దు డాడీ, లాభం లేదు, ఈ డైరీ ఫై ఇంకా నాలుగైదు లక్షలు వెచ్చించే బదులు, ఆ డబ్బులు ఇంకా ఏ బిజినెస్ ఫైన నైనా పెట్టుకుంటే ఈజీగా గడిపేయచ్చు కాలము. ఇది రిస్క్ ఎక్కువ ఉన్న ఫీల్డ్. హార్డెస్ట్ టాస్క్. పని ఎక్కువ ఫలితం తక్కువ. అందుకే చిన్నగా ఉన్నపుడే డైరీని ఎవరికైనా అప్పచెపుదాం, లీజ్ కు ఇద్దాం నెలకు ఇంత అని"
ఏమో, డైరీ పెట్టి పది నెలలే అవుతుంది, ఇంకా పూర్తిగా డైరీని పశువులతో నింపనే లేదు. కనీసం మంచి పాలు ఇచ్చే పది పన్నెండు పశువులు ఉండాలి, నెలకు వంద లీటర్లు పాలు పొయ్యాలి కనీసం. పదిహేను వేల జీతగాడు పదమూడు పశువుల వరకు పని చేస్తడు. అందుకే ఇంకా కొన్ని మంచి పాలు ఇచ్చే పశువులను తెచ్చి చూద్దాం అనిపించింది. అదే విషయం వంశితో చెప్పిన, "కనీసం ఒక అయిదారు నెలలు నడిపి చూద్దాం" అని.
"లేదు డాడీ. మామూలు పాడి రైతు బతుకడం చాలా కష్టం ఈ దేశంలో. లీటర్ మంచి నీళ్లను ఇరువై నుండి ఇరువై అయిదు రూపాయల వరకు అమ్ముతున్నారు మార్కెట్లో, ఎంతో కష్టపడే పాడి రైతుకు వచ్చేది, డైరీ ఫార్మ్ వాళ్ళు ఇచ్చేది పాలలో వెన్న శాతాన్ని బట్టి లీటరుకు ఇరువై అయిదు నుండి ముప్పయి వరకే. ఒక కిలో దాణా సరాసరి రేటు కిలోకి ఇరువై రూపాయలు. ఇక పాడి రైతుకు లాభం ఎలా వస్తుంది. వాడు ఎలా బతుకాలి, డైరీని ఎలా నడిపించాలె " అన్నడు.
వంశి చెప్పింది నిజమే అనిపించింది, లీటరు పాలకు కు ఇరువై అయిదు నుండి ముప్పై వరకు లీటరు నీళ్లకు ఇరువై అయిదే కదా ! ఎంత దారుణం రైతు బతుకు అనిపించింది. ఏ ప్రభుత్వం పాడి రైతులకు పాలకు మద్దతు ధరను ప్రకటిస్తుంది!
వంశీని అడిగిన "డైరీ ని తీసి వెయ్యడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా" అని.
"చాలా సమస్యలున్నాయి, ముఖ్యముగా పని వాళ్ళ సమస్య ఎనిమిది నెలల్లో నలుగురు పనివాళ్ళు వెళ్లిపోయారు, వాళ్ళు కోరిన జీతం ఇచ్చినప్పటికీ, ఒకోసారి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆవుల ఆరోగ్య సమస్యలు. విదేశీ సంకర జెర్సీ, హెచ్. ఎఫ్. ఆవులు ఇక్కడి వాతావరణానికి తట్టుకోవు. సరి అయిన వైద్య సదుపాయాలు ఉండవు. పశువుల మందుల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. డైరీ పరిశ్రమఫై దేశములో పెద్ద వ్యాపారం నడుస్తుంది అనిపిస్తుంది.
పశువుల ఇన్సూరెన్సు సదుపాయం, సలహా అందుబాటులో ఉండదు. దాణా ఖర్చు విపరీతం కిలో దాణాకు ఒకోసారి ఇరువై అయిదు రూపాయల వరకు కూడా ఉంటుంది. రైతులకు సరి అయిన శిక్షణ, నైవుణ్యం కూడా కరువు. పైగా స్వేచ్ఛగా తిరిగే పశువులను ఒకే దగ్గర ఇరువది నాలుగు గంటలు బందించి గడ్డి, దాణా పెట్టి పాలు పిండుకొని అమ్ముకోవడం దారుణం. ఇది ఒక రకమైన జీవ హింస లాంటిదే.
ప్రపంచంలో ఏ జంతువు పాలు ఆ జంతువే త్రాగుతుంది. బహుశా మనిషి ఒక్కడే ఆవు దూడల పాలను దొంగిలించి పిండుకొని త్రాగుచున్నాడు. ఇది పెద్ద వ్యాపారం అయి కూర్చుంది. ఇది నాకు నచ్చడం లేదు"
వంశి చెప్పిన విషయాలు నిజమే కదా అనిపించింది.
కాసేపటికి అన్నాడు, " డాడీ, రైతుకు ఏమి విలువ ఉంది ఈ దేశంలో. నీ కొడుకు డైరీ ఫార్మ్ నడుపుతున్నాడు అంటే, ఏ ఆడపిల్ల తండ్రి కూడా పిల్లను ఇవ్వడానికి ముందుకు రాడు, ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోదేమో రైతు బిడ్డను.. ఇంకా ఈ డైరీని ఎందుకు నడపాలి డాడీ " అని ప్రశ్నించాడు.
వంశి చెప్పినవి అన్నీ వింటుంటే నిజమే కదా అనిపించింది. అవును నిజంగానే మా వాడి పెళ్లి చెయ్యాలి కదా, ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది రైతు బిడ్డని పెళ్లి చేసుకోవడానికి అని నేను కూడా ఆలోచనలో పడ్డాను!
***
లక్ష్మీ నారాయణ సబ్బని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: లక్ష్మీ నారాయణ సబ్బని
సబ్బని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామములో 1-4-1960 నాడు జన్మించారు. పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మూడు దశాబ్దాలు అధ్యాపక వృత్తిలో పని చేసి ఆంగ్ల ఉపన్యాసకులుగా 2015లో ఉద్యోగ విరమణ పొంది ఉన్నారు. M.A.( English); M.A. ( Hindi); M.Sc.(Psychology), M.A.(Astrology), M.Ed; PGDTE (CIEFL).
మొదలగు విద్యార్హతలు కలిగి ఉన్నారు . తెలుగులో వచన కవిత, కథ, నవల, వ్యాసం, సాహిత్య విమర్శ, సమీక్ష, జీవిత చరిత్ర, పద్యం, పేరడీ మొదలగు వివిధ ప్రక్రియలలో 40 వరకు సాహిత్య రచనలు ప్రచురించి ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాయగలరు. మూడు దశాబ్దాల విద్యా జీవితం మరియు నాలుగు దశాబ్దాల సాహిత్య సేవకు గుర్తింపుగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ మరియు జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులు మరియు సన్మానాలు అందుకున్నారు. సబ్బని పొందిన బహుమతులు, అవార్డులు మరియు సన్మానాలు :
1) "బెస్ట్ పోయెట్ ఆఫ్ ది ఇయర్ 2003 అవార్డు" "పోయెట్స్ ఇంటర్నేషనల్" వార్షిక అవార్డులు 2003, బెంగళూరు
2) "పులికంటి సాహితీ సత్కృతి" తిరుపతి కథా బహుమతి 2004, ఎ.పి.
3) "సాహితీ మిత్రులు" సిల్వర్ జూబ్లీ ఫెస్టివల్ అవార్డు, 2005, మచిలీ పట్నం. ఎ.పి.
4) "సమతా సాహితీ కరీంనగర్" పార్థివ ఉగాది సన్మానం 2005.
5) "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం" డాక్టర్ జైశెట్టి రమణయ్య ట్రస్ట్, జగిత్యాల 2005. తెలంగాణ
6) “సాహిత్య భూషణ్” అవార్డు, సారస్వత జ్యోతి మిత్ర మండలి, కరీంనగర్, 2005
7) “మే డే-2013” కవితల బహుమతి మరియు ‘ఉగాది కథ బహుమతి-2013” నేతి నిజం’ డైలీ హైదరాబాద్.
8) “సాహితీ కిరణం” మాసపత్రిక కథా బహుమతి -2013, హైదరాబాద్
9) జిల్లా నుండి "బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు". కలెక్టర్, కరీంనగర్-2010.
10) రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు”, ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్, 2013 కొరకు.
11) కలహంస పురస్కారం -2014, నెలవంక- నెమలీక పత్రిక, హైదరాబాద్.
12) మహాకవి శేషేంద్ర అవార్డు (హైదరాబాద్) - 2015.
13) ఉమ్మడిశెట్టి లిటరరీ ఎక్సలెన్స్ అవార్డు , అనంతపురం(A.P) – నవంబర్-2015
14) మళ్ళా జగన్నాధం స్మారక కవితా పురస్కారం, అనకాపల్లి (ఎ.పి.) -2015
15) అవార్డు “సాహిత్య శ్రీ”, కాఫ్లా అంతర్జాతీయ సంస్థ, చండీగఢ్, భారతదేశం .OCT. 2016.
16) “అద్దేపల్లి కవిత సృజన ప్రతిభా పురస్కారం” , విజయవాడ, A.P. నవంబర్.2016.
17) “నానో కవితా ప్రక్రియా పురస్కారం” , ఆంధ్ర సారస్వత సమితి గోల్డెన్ జూబ్లీ సమావేశాలు, మచిలీపట్నం -2016.
18) కవిత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం -2018.
19. D.Litt. సెయింట్ మదర్ తెరెసా వర్చువల్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ నుండి సాహిత్యంలో గౌరవ డాక్టరేట్. 2019 బెంగళూరు.
20. "నవ సృజన్ కళా ప్రవీణ్ అవార్డు" కాన్పూర్ , U.P. 2020
21. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశ్ భక్తి గీత్ రాష్ట్ర స్థాయి రెండవ బహుమతి (T.S.)-2022.
22.ఉత్తమ రచయిత అవార్డు.తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్- హైదరాబాద్, 2023.
కథ చాలా బావుంది.