#RaithuRaja, #రైతురాజా, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Raithu Raja - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 25/01/2025
రైతు రాజా - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అది జిల్లా అగ్రికల్చర్ కార్యాలయ ఆవరణం. ప్రముఖులు పలువురు, జిల్లా అగ్రికల్చర్ అధికారి, కలెక్టర్ గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు, ఇతర అధికారులు, రైతులు సమావేశమై యున్నారు.
ఆరోజు, ఆ సాయంత్రం, అధికారులు జిల్లాలోని ఉత్తమ రైతులను సన్మానించే సందర్భం.
వేదికపైన, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ప్రతాపశర్మ, జిలా మెజిస్ట్రేట్ ధనుంజయరావుగారు, ఫారమ్ అధికారి గోపాలకృష్ణ, ఎం.ఎల్.ఎ నిత్యానందం గారు సుఖాశీనులైయున్నారు. చాలామంది రైతులు, ఇతర జిల్లా ప్రముఖులు వేదిక దిగువ భాగంలో కుర్చీలలో కూర్చొని యున్నారు. సమయం సాయంత్రం ఆరున్నర. ఆవరణంలో వేదికపైన విద్యుత్ దీపాలు వెలిగాయి. సభా ప్రాంగణంలో కూర్చొని వున్నవారిలో కొందరు ఆడవారు ఉన్నారు. ఫారమ్ అధికారి గోపాలకృష్ణగారు మైక్‍ను సమీపించి వారి ప్రసంగాన్ని ప్రారంభించారు.
"ప్రియాతి ప్రియమైన రైతు సోదరులకు, జిల్లా ఇతర ప్రముఖులకు, వయో పెద్దలందరికీ నా నమస్కారములు. పిన్నలకు నా శుభాశీస్సులు... ఈనాడు ఈ కార్యక్రమం, జిల్లాలోని ఉత్తమ రైతు అన్నలను సన్మానించేదానికి ఏర్పాటు చేయబడింది. ఉత్తమ రైతులు అనగా ఎక్కువ పంటను తమ కృషితో పండించినవారికి, మన జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు ఎం.ఎల్.ఎ గారు సన్మానించ బోతున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ప్రతాప్ శర్మగారు ప్రసంగిస్తారు" గోపాలకృష్ణగారు వారి స్థానం వైపు నడిచారు. జిల్లా కలెక్టర్ గారు మైక్‍ను సమీపించారు.
"ప్రియ సోదరీ సోదరులకు నా నమస్కారములు. రైతన్నలందరికీ నా శుభాశిస్సులు. మనమంతా గర్వించదగిన విషయం మన రాష్ట్రంలో ఈ సంవత్సరం మన జిల్లా ఉత్తమ వ్యవసాయ క్ష్రేత్రంగా పరిగణింపబడింది. దానికి కారణం మన జిల్లా రైతన్నల కృషి, సాధన.... అత్యధిక దిగుబడిని సాధించి ప్రధమ శ్రేణి రైతులుగా నిలిచినవారు ఆరుగురు. వారి పేర్లు.... 1. కలిమిరాజా 2. బంగారు బాలయ్య 3. సరాగాల సాంబయ్య 4. మంతనాల మల్లేశు 5. చింతాకపొడి శీనయ్య 6. ఆవగాయల ఆంజనేయులు.
ఇందులో కలిమిరాజా, తండ్రి చంద్రన్నలు వారికి వున్న మూడు ఎకరాల భూమి నుండి 120 బస్తాల ధాన్యాన్ని మలగొలుకును పండించారు. మిగతావారు పది, ఐదు తక్కువ బస్తాలను పండించారు. కనుక ఉత్తమ రైతు బహుమతి రాజా, చంద్రన్నలకు ఇవ్వబోతున్నాము. రెండవ స్థానం సరాగాల సాంబయ్య గారిది. మూడవ స్థానం ఆవగాయల ఆంజనేయులు, నాల్గవ స్థానం బంగారు బాలయ్య, ఐదవ స్థానం మంతనాల మల్లేశు, ఆరవ స్థానం చింతాకు పొడి శీనయ్య గారిది.
ఆ ఆరుగురు ఉత్తమ రైతులకు శాలువా, షీల్డ్ లతో మన ఎం.ఎల్.ఎ నిత్యానందంగారు, జిల్లా మెజిస్ట్రేట్ ధనుంజయగారు సత్కరించబోతున్నారు. తిలకించండి.... ధన్యవాదములు.
తరువాత.....
జిల్లా అగ్రికల్చర్ అధికారి గోపాలకృష్ణ గారు మొదట రాజాను, తరువాత వరుసగా సరాగాల సాంబయ్యను, ఆవగాయ ఆంజనేయులును, బంగారు బాలయ్యను, మంతనాల మల్లేశును, చివరగా చింతాకుపొడి శీనయ్యను వేదికపైకి పిలిచారు.
జిల్లా మెజిస్ట్రేట్ ధనుంజయరావు గారు వారికి శాలువాలను కప్పారు. ఎం.ఎల్.ఎ నిత్యానందంగారు షీల్డ్ ను బహుకరించారు. పత్రికా విలేఖర్లు, టివి మీడియా ఛానల్స్ వారు వీడియో ఫొటోలను తీశారు. గోపాలకృష్ణగారి వందన సమర్పణతో సభా కార్యక్రమం ముగిసింది. చంద్రన్న అతని భార్య సుశీల ఎంతగానో సంతోషించారు. ఆ సభలో ఎం.ఎల్.ఎ గారి కుమార్తె సత్యాదేవి కూడా వుండి కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో తిలకించింది. వేగంగా రాజావైపు వెళ్ళి "కంగ్రాచ్యులేషన్స్" నవ్వుతూ కుడిచేతిని ముందుకు సాచింది.
చిరునవ్వుతో, రాజా చేతులు జోడించి "ధన్యవాదములు" చెప్పి తండ్రి చంద్రయ్య, తల్లితో కలిసి వేగంగా వెళ్ళిపోయాడు.
*
ఆరోజు భోజనానంతరం.... సత్యాదేవి మంచంపై వాలింది. గత స్పృతులు ఆమె మస్తిష్కంలో...
రాజా, సత్యాదేవీలు ఒకే కాలేజీలో చదువుకొనేవారు. చదువులో, అన్ని ఆటల్లో రాజా నెంబర్ వన్. పదుగురికి ఆదర్శప్రాయుడు. వ్యక్తి సౌమ్యుడు, సాటివారిని గౌరవించి, పేదవారు ధనవంతులనే బేధభావం లేకుండా, అందరినీ సమ దృష్టితో చూచేవాడు. ఆకారణం సత్యాదేవిని రాజా ఆకర్షించాడు. అతనితో ఆమె స్నేహం చేసింది. అభిమానించింది. గౌరవించింది. ప్రేమలో పడింది. ఇరువురూ అగ్రికల్చర్ బి.ఎస్సీ.
రాజా.... అందరితో వున్నట్లే సత్యతోనూ వుండేవారు. కొంతకాలానికి, సత్య... తనను పలకరించే తీరు, చూచే చూపులలో అతనికి అనుమానం కలిగింది. సత్య... ఎం.ఎల్.ఎ కూతురైనందున, రాజా అడిగిన దానికి సమాధానం చెబుతూ క్లుప్తంగా వుండేవాడు. కానీ... సత్య, అతనిపై ఆశలు పెంచుకొంది. తన మనోభావాలను సత్య, మర్మగర్భితంగా రాజాకు తెలియజేసింది.
అందం... చందం... వివేకం... ఐశ్వర్యం వున్న సత్యాదేవికి రాజా ఆకర్షితుడు కాక తప్పలేదు. ఆ వయస్సు అలాంటిది.
కానీ... సత్యకు తనకు తన తల్లితండ్రి సమ్మతితో, సత్య తల్లిదండ్రుల అంగీకారంతోనే, వారి వివాహం జరగాలన్నది అతని ఆశయం.
ఒకరోజు సత్య....
"రాజా!... ఐ లవ్ యూ, ఐ వాంట్ యు, మ్యారీ యు నీకు సమ్మతమేనా!" అడిగింది సత్య.
"మీ నాన్నగారు వచ్చి మా అమ్మానాన్నలతో, మన వివాహ విషయం సంప్రదించాలి. వారి సమ్మతితోనే మన వివాహం జరిగేది" అన్నాడు రాజా.
"ఓకే, మా నాన్నగారిని ఒప్పించి మీ గ్రామానికి మా నాన్నతో వస్తాను సరేనా!"
"అలాగే!... ఒక్కమాట... మేము పేదవారమని, మీ నాన్నగారు మా తల్లితండ్రులను కించపరచకూడదు. మా వారితో మీ నాన్నగారు అభిమానం, ఆత్మీయతతో మాట్లాడాలి!" అన్నారు రాజా.
"ఓకే!..." అంది సత్య.
ఇరువురూ బై చెప్పుకొని వారి వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
*
సత్య రాజాను గురించి అతని పట్ల తనకున్న అభిప్రాయాన్ని గురించి తన తల్లితండ్రులకు చెప్పింది. వారు తొలుత ఆశ్చర్యపోయారు.
వారికి సత్య ఒకే అమ్మాయి.
ఏకాంతంలో ఎం.ఎల్.ఎ నిత్యానందంగారు, వారి సతీమణి సౌందర్య గారు, సత్య నిర్ణయాన్ని గురించి చర్చించుకొన్నారు.
"సౌందర్యా!.... అమ్మాయి నిర్ణయం నాకు నచ్చలేదు. ఆ రాజా మట్టిపిసుక్కునే పేద చంద్రయ్య కొడుకు. మన అమ్మాయి కోట్లకు అధిపతి. గొప్ప గొప్ప, మన స్థాయికి తగిన సంబంధాలు నేను ఊ అన్నానంటే వస్తాయి. మన అంతస్థుకు తగిన వారితో మనం వియ్యమందడం, మనకు అమ్మాయికి గౌరవం కాదా!" అనునయంగా చెప్పాడు సత్యానందం.
"కాదు!" అంది సౌందర్య.
"ఏది కాదు?"
"మీరు వూహించే మన స్థాయి సంబంధం!..." నిర్భయంగా చెప్పింది సౌందర్య.
క్షణం తర్వాత....
"చూడండి... ఎవరికైనా ఆస్థిపాస్థులు శాశ్వతం కాదు. మమతానురాగాలు ముఖ్యం. డబ్బు శాశ్వతం కాదు. సంబంధ బాంధవ్యాలకు మంచి మనస్సులు ముఖ్యం. సత్య, రాజాలు ప్రేమించుకొన్నారు. వారి ప్రేమను మీరు ఆమోదించి, వారి వివాహాన్ని జరిపినట్లయితే, ఆ ఇరువురూ జీవితాంతం ఆనందంగా బ్రతుకుతారు. ఇక మీ విషయానికి వస్తే, సమాజంలో మీరు తీసుకొన్న మీ కుమార్తె వివాహ విషయం, నిర్ణయం ఎందరికో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కీర్తి పదిమంది చేతా కొనియాడబడుతుంది. కారణం... ఎం.ఎల్.ఎ నిత్యానందం, కోటీశ్వరుడై వుండి కూడా తన కుమార్తెను, ఒక పేదవానికి ఆమె ఇష్టానుసారంగా ఇచ్చి వివాహం చేసిన ఆదర్శవాది, అని మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తారు, గౌరవిస్తారు.
ప్రతి మనిషికి సంఘంలో కావలసింది గౌరవ మర్యాదలు. ఇరవై సంవత్సరాల క్రిందట మనమూ పేదవారమేగా!... అమ్మాయి పుట్టాక బాగా కలిసి వచ్చింది. మీరు రాజకీయాల్లో ఎదిగారు. మీకు అభిమానులు మీ మంచితనం వలన మంచిపేరు, మూడవసారి ఎదురులేని ఎం.ఎల్.ఎగా గొప్ప మెజారిటీతో గెలిపించారు. మనిషి గతాన్ని ఎన్నటికీ మరువకూడదు. నేను మరువలేదు. మరువను. మీరు మీ మనస్సున వికారపు ఆలోచనలు మాని, రాజా వాళ్ళ వూరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి.
మన అమ్మాయికి, ఆ రాజాకు వివాహం జరిపిద్దాం. మరోమాట రాజా చాలా మంచివాడు. నీతిపరుడు, తెలివైనవాడు, కష్టజీవి. అలాంటివాడు భర్త అయితే నా బిడ్డ సదా ఆనందంగా వుంటుంది. మన బిడ్డ ఆనందం కన్నా మనకు ఏం కావాలండీ!... ఒక్కగానొక్కతే!..." ఎంతో అనునయంగా చెప్పింది సౌందర్య.
అర్థాంగి మాటలలోని యదార్థం... నిత్యానందాన్ని నోరు తెరువనీయలేదు. కొన్ని క్షణాల ఆలోచన... తర్వాత....
"సౌందర్యా!... రేపు నేను రాజా వాళ్ళ వూరికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడుతాను. అమ్మాయి కోర్కెను తీరుస్తాను" చిరునవ్వుతో చెప్పాడు నిత్యానందం.
సౌందర్య వదనంలో పండువెన్నెల.
*
చంద్రయ్యకు ఉండేది రెండు ఎద్దులు. తొలకరి వానలు కురిశాయి. పొలాన్ని దున్నాలి. ఒక ఎద్దుకు ప్రేగులకు సంబంధించిన ’హెమరేజిక్ ఓవెల్ సిండ్రోమ్’ అను వ్యాధి వచ్చి, సరైన ట్రీట్ మెంటు జరుగక చనిపోయింది. ఆ ఎద్దు ఐదారు సంవత్సరాలు చంద్రయ్య రాజాలకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ ఇంటివారంతా ఆ ఎద్దు మరణం కారణంగా ఎంతగానో బాధపడ్డారు. గుంటతీసి ఉప్పును పోసి, ఆ ఎద్దును పాతిపెట్టారు చంద్రయ్య, రాజాలు.
నేల తడిగా వున్నప్పుడు దిక్కి చేయడం సులభం. చంద్రయ్య మరో ఎద్దుకోసం గ్రామంలో చాలామందిని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదు. ఎవరి పనులు వారికి మిన్న.
రాజా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తండ్రితో...
"నాన్నా!... మనం రేపు దుక్కిని ప్రారంభిద్దాం" అన్నాడు.
"ఒక ఎద్దుతో దుక్కి ఎలాగయ్యా చేసేది!" విచారంగా అడిగాడు చంద్రయ్య.
"కాడికి ఒకవైన నేను!" అన్నాడు రాజా.
"నాయనా!... ఎంట్రానివ్వనేది!" ఆశ్చర్యంతో అడిగాడు చంద్రయ్య.
"అవును నాన్నా!... చనిపోయిన రాము ఎద్దు స్థానంలో నేనుంటాను. మీరు నాగలి పట్టుకోండి. దుక్కిని దున్నేద్దాం" తన నిశ్చితాభిప్రాయాన్ని తండ్రికి చెప్పాడు రాజా.
"చదువుకొన్నోడివి!... నీవేందయ్యా ఎద్దులా దుక్కిదున్నడం?" ఆశ్చర్యంగా కన్నీటితో అడిగాడు చంద్రయ్య.
"నాన్నా! నా నిర్ణయం మారదు. రేపు మనం దుక్కిని ప్రారంభిస్తున్నాము" చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాజా.
మరుదినం ఉదయం భుజాన నాగలి కాడె ఒక చేత ఒక ఎద్దు పగ్గంతో రాజా తన భూమి వైపుకు బయలుదేరాడు.
విచారవదనంతో చంద్రయ్య, రాజాను అనుసరించాడు. భూమిలో ప్రవేశించి నాగలికి కాడెను కట్టి, ఒకవైపు ఎద్దు మెడకు దారాన్ని బిగించి, రెండవ వైపుకు కాడెను తన మోచేతులపై వుంచుకొని...
"నాన్నా!... దుక్కిని సాగించు!" అన్నాడు రాజా.
చంద్రయ్య నాగలిని పట్టుకొని దుక్కిని ప్రారంభించాడు. రాజా జోరుగా నడుస్తున్నాడు. ప్రక్కన వున్న ఎద్దు, చంద్రయ్యలు అదే వేగంతో నడవసాగారు. కొండ్ర వేసి దుక్కిని సవ్యంగా దున్నసాగాడు చంద్రయ్య.
కొడుకు పడుతున్న కష్టానికి చంద్రయ్య మనస్సున ఆవేదన...
రైతు బిడ్డగా పుట్టినందుకు రాజా మనస్సున గర్వం. పట్టుదల...
అది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం....
ఎం.ఎల్.ఎ సత్యానందం, వారి భార్య సౌందర్యల కారు చంద్రయ్య ఇంటిముందు ఆగింది.
కారు హారన్ విని చంద్రయ్య భార్య సుశీల వాకిట్లో పవిటను సరిచేసుకొంటూ వచ్చింది.
డ్రైవర్ సోము "చంద్రయ్యగారు వున్నారా!" అడిగాడు.
"చేలో దుక్కి దున్నుతున్నారు" సుశీల జవాబు.
"చేను ఎక్కడ?" డ్రైవర్ ప్రశ్న.
"ఇక్కడి నుండి మా ఇంటి వెనుక అరకిలో మీటరు!" సుశీల జవాబు.
ఆ విషయాన్ని సోము సత్యానందంగారికి చెప్పాడు.
డ్రైవర్ సోము, సుశీలమ్మ చూపిన దారివైపుకు కారును మళ్ళించాడు. మూడు నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరారు.
’వారు ఎవరు, ఎందుకు వచ్చారా!...’ అనే ఆందోళనతో సుశీల అడ్డదారిన వారి చేను వైపుకు నడిచింది.
డ్రైవర్ సోము కారు ఆపి, అక్కడికి మూడువందల మీటర్లలో దుక్కి దున్నుతున్న చంద్రయ్య, రాజాలను సత్యానందంగారికి చూపించాడు.
సత్యానందం, భార్య సౌందర్య కారు దిగి చంద్రయ్య పొలాన్ని సమీపించారు.
ఏకాగ్రతతో దుక్కి పనిలో వున్న ఆ తండ్రి కొడుకులను చూచారు. ఎద్దు స్థానంలో ఉండి మోచేతులపై కాడిని వుంచుకొని భూమిని దున్నుతున్న రాజాను చూచి వారు ఆశ్చర్యపోయారు. సుశీల భర్తను, కొడుకును సమీపించింది. ఆ భార్యా భర్తలు వారిని సమీపించారు. రాజా పడుతున్న శ్రమకు ఆ భార్యా భర్తల మనస్సున ఆవేదన.
"అయ్యా!... చంద్రయ్యగారు!... నమస్కారం... మీకు సాటిమీరే.... నా కూతురు సత్యను మీ కోడలిగా చేసుకొవాలని కోరుతున్నాను" చేతులు జోడించాడు సత్యానందం.
చంద్రయ్య, సుశీల, రాజా వారి చెవులను వారే నమ్మలేకపోయారు.
"మీ కొడుకు రాజా వట్టి రాజా కాదు అసలు సిసలైన రైతు రాజా..." నవ్వుతూ అంది సౌందర్య.
"మీ మాటలు నాకు ఏమీ అర్థం కావడం లేదండీ!..." దీనంగా చెప్పాడు చంద్రయ్య.
"దుక్కి ఆపి ఇంటికి పదండి, అన్ని విషయాలూ మాట్లాడుకొందాం" నవ్వుతూ చెప్పాడు ఎం.ఎల్.ఎ సత్యానందం.
అందరూ చంద్రయ్య ఇంటికి చేరారు. రాజా, సత్యల వివాహ విషయాన్ని మాట్లాడుకొన్నారు.
సత్యానందం, సౌందర్యలు వెళ్ళిపోయారు.
రాజా మనస్సున పరమానందం.
మరుదినం... పదిగంటలకు సోము (EICHER) ఇచ్చర్ ట్రాక్టర్‍తో చంద్రయ్య ఇంటి ముందు నిలిచాడు. ట్రాక్టరును చూచి చంద్రయ్య ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ సోము తాళాన్ని రాజాకు అందించాడు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రైతు రాజా. Ch. సి. ఎస్. శర్మ
Excellent. ఈ రోజుల్లో చాలా స్ఫూర్తి వంతం.
పాత పల్లె సినిమాలు గుర్తుకు తెచ్చాయి. ఓ విషయం. రైతుల పిల్లలు కూడా ఈ రోజుల్లో కాలేజీ లకు వెళ్తున్నారు. అగ్రికల్చర్ బి. ఎస్. సి. ఎంపిక ఉందని గుర్తుంచు కోవాలి. ఆఫ్రికా మరియు చాలా దేశాల్లో ... కరువు లో కూడా తక్కువ నీరు తో లాభ సాటి వ్యవసాయం, వరదల్లో కూడా లాభ సాటి వ్యవసాయం చేస్తున్నారు. వారి వద్ద అవి ఏవి? ఎలా? ఏ పద్ధతులు? ఆధునిక సాంకేతికత, వాన నీరు కోసం ఇంకుడు గుంతలు, ఆధునిక సాంకేతికత బీజాలు ... ఇతరత్రా ... తెలుసుకొని ... అవగాహన పెంచుకొని ... ఆచరించి ... వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి.
పి.వి. పద్మావతి మధు నివ్రితి
"రైతు రాజా" అనే కథలో రైతు రాజా, మంచి అహంకారం లేని, సమాజానికి సేవ చేసే వ్యక్తిగా గౌరవింపబడుతున్నాడు. రాజా, సత్యాదేవిని ప్రేమిస్తాడు. కానీ తన నమ్మకాల ప్రకారం, ఒక పరిమితి ఉన్న పేద కుటుంబానికి చెందిన రాజా, తన కుటుంబం, సత్యదేవి తల్లిదండ్రుల అంగీకారంతోనే వివాహం జరగాలని కోరుకుంటాడు. ఆతర్వాత, రాజా తన తండ్రితో కలిసి వారి వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు, ఎం.ఎల్.ఎ. నిత్యానందం, అతని భార్య సౌందర్య రాజా కుటుంబంతో పరిచయం చేసుకుంటారు, ఎవరూ కూడా రాజాకు గౌరవం మరియు ఆదర్శ ప్రేరణగా భావిస్తారు.
ఈ కథలో ఆదర్శమైన వ్యక్తిత్వం, ప్రేమ, కుటుంబ విలువలు హైలైట్ చేస్తూ, రాజా, సత్యాదేవి ఒకరికొకరు బాగా అంగీకరించిన పద్ధతిలో జీవితం గడుపుతారు.
కథ బాగుండది