top of page
Writer's pictureSurekha Puli

రాజీ

#SurekhaPuli, #సురేఖ పులి, #Raji, #రాజీ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Raji - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 12/01/2025

రాజీ - తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



పువ్వులు చెట్టుకే అందం! పూజకు మాత్రం కొన్నిటిని కోసి మిగతా పూలను భద్రంగా కొమ్మలకే వుండాలిని మొండి పట్టు పట్టేదాన్ని; గారాబం కొద్ది ప్రతీసారి నా మాటే నెగ్గేది. 


“రాజేశ్వరి పెద్దమనిషయ్యింది, మీరు చాకలామెను, మంగలామెను పిలుచుకు రండి” నాన్న కృష్ణారావును తొందర చేసింది అమ్మ. 


గట్టిగా ఏడుపు మొదలు పెట్టాను. గాబరాపడి కారణం అడిగారు. చాలా సేపటికి చెప్పాను “ఈ వార్త ఎవ్వరికి చెప్పొద్దు, ఎందుకంటే అందరి ముందు నేను తలెత్తుకొని తిరగలేను, ఆడ-మగ, పెద్దా-చిన్నా వింతగా చూసి హేళన చేస్తారు”.


ఎంతో నచ్చచెప్పాలని ప్రయత్నించారు. నా స్నేహితురాళ్లకు జరిగిన అవమాన అనుభవాలను చెప్పి ఒప్పించాను. ఉన్నపాటున అంటే అప్పు చేయాల్సింది; మానుకున్నారు. 


నాన్నగారు కొత్త బట్టల తెచ్చారు, అదనంగా ఓణి కూడా వుంది. అమ్మ నాకు వేప నీటితో స్నానం చేయించి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి ముస్తాబు చేసి, ఇంట్లో పూసిన మల్లెపూలు అల్లి నా జడలో పెట్టింది. ‘మల్లెపూలు చెట్టుకే ఉండనీ అంటే వినలేదు. ’ 


“రాజీ, నీ మాట నేను విన్నాను, నువ్వు నా మాట వినాలి” నియమం పెట్టింది. అయిష్టంగానే ఒప్పుకున్నాను. విషయం గోప్యంగా మా వరకే పరిమితమైంది. ఆరోగ్యంగా పెరిగే నన్ను చూసి ఇరుగుపొరుగు, బంధుమిత్రులు ‘పేరంటం వేడుక’ చేయలేదమని మా ముగ్గుర్ని దెప్పి పొడిచే మాటలను పట్టించుకోలేదు. 


చదువు పూర్తి అయింది పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఎలాంటి అబ్బాయి కావాలని అడిగారు. “మీ ఇష్టమే నా ఇష్టం, కానీ పెళ్లి పేరిట చేసే ‘ఖర్చు’ నేను ఒప్పుకోను. ” 


ఇద్దరు అర్థం కాని ముఖాలు పెట్టారు, మళ్లీ వివరించాను: ‘గుళ్ళో గాని, సంతకాల పెళ్లి గాని.. ’ 

అమ్మ కోప్పడ్డది. 


‘తులసీ.. నువ్వు ఆగు’ అని నాన్నగారు నచ్చచెప్పాలని చూశారు. “ఒక్కగానొక్క కూతురి పెళ్లి వైభవంగా చేశామని మాకు తృప్తి, లోకుల నుండి ఒక మంచి ముద్ర! ఆశ పడితే తప్పా?”


నేను అవివాహిత గానే వుంటానని మొండికేశాను. నేను కోరినట్లు వారు ఎంపిక చేసిన చక్రధర్తో వివాహమైంది. మా వారు ప్రభుత్వ ఉద్యోగి కాదు, అందుకని నేను ఇంటికి దగ్గర్లో వున్న ఉద్యోగంలో చేరాను. బాబు పుట్టాడు. 


బాబు బారసాల ఇంట్లోనే ‘ఏదో’ అయిందనిపించి, మా ఇద్దరి నాన్నగార్ల పేరు వచ్చేలా ‘మోహన కృష్ణ’ అని పేరు పెట్టుకున్నాము. అమ్మ ఇచ్చిన డబ్బులు భద్రంగా వాడి భవిషత్తు కోసం దాచాను. అత్తగారు అలిగి చిన్న కొడుకు వద్దకు వెళ్లి పోయింది. ‘కృష్ణ’ పేరు ఎందుకని నసుగుడు. బాబు సంరక్షణకై ఇబ్బంది పడ్డాము. నేనైతే సర్దుకు పోయాను గాని చక్రధర్ వల్ల కాలేదు, తప్పదు మరి. 


మోహన కృష్ణ చదువు పూర్తి చేసి నాయనమ్మ తెచ్చిన బంధువుల అమ్మాయితో తిరుపతిలో పెళ్లిజరిగింది. కొంచెం బీద స్థితిలో ఉన్నారేమో, ఇరువురికి పెద్దగా ఖర్చు కనబడలేదు. అమ్మాయి అందం, మంచి గుణం స్పష్టంగా కనబడ్డాయి. 


ఆస్తి గొడవల కారణంగా చక్రధర్ వాళ్ళ స్వస్థలానికి వెళితే చిల్లిగవ్వ కూడా ఇవ్వమని తూలనాడారు. కోర్టు వెళ్దాం అన్నాడు. ‘తోబుట్టువు’ అనే బంధాన్ని మర్చిపోతే ‘ఆస్తి’ ఒక లెక్కా?! అదొక దండుగ ఖర్చు వద్దన్నాను. 


అమ్మ స్వర్గస్తురాలైనది, నాన్నగారు మాతో పాటే వున్నారు. అమ్మ మళ్ళీ పుట్టింది, ‘తులసి’ నా ముద్దుల మనవరాలి బాధ్యత నా వంతు! ఉద్యోగరీత్యా కొడుకు కోడలు కొంత కాలం పాటు సింగపూర్ వెళ్లారు. 


తులసి పసితనం, అమాయకత చూస్తే 24 గంటల సమయం సరిపోలేదు; ఉద్యోగం చేసే రోజుల్లో నాకు వున్న వొళ్ళు నొప్పులు, విసుగు ఇప్పుడు లేవు. ఇక నాన్నగారు చేసే గారాబం అంతా ఇంతా కదూ! నాణ్యత గల బట్టలు, బొమ్మలు అవసరానికి మించి కొనేవారు. చక్రధర్ మూగగా ఏదో లోకంలో ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండేవారు. ఆస్తి రాలేదని మానసికంగా బాధ, డాక్టర్ వద్దకు రారు. నాకు తగిన మొండి మొగుడు. 


అమ్మకు వున్నట్టే నా మనవరాలికి ఒత్తయిన జుట్టు. జడలు వేసి పెరట్లో పూసిన పూలు రోజుకో రకం పెట్టేదాన్ని. ఏమిటో కొమ్మల నుండి వాడి రాలి పోయేకంటే చిన్నారి తులసి జడలో పువ్వులు అందంగా వున్నాయి. 


నాన్నగారు చెప్పే ముచ్చట్లు, కథలతో మురిసి పోయి ‘పెద్దతాత’ అని పిలుస్తూ తులసి ఆడుకునేది. చదువు కూడా నాన్న గారి సమక్షంలోనే బుద్దిగా నేర్చుకునేది. నాకసలు గ్రాండ్ పేరెంట్స్ తో ఆడుకున్న జ్ఞాపకాలు లేవు. ఆ విషయలో తులసి అదృష్టవంతురాలు. 


ఒకరోజు ఆట సాగలేదు, కథలు చెప్పలేక పోయారు. నా మనవరాలి చేత తులసితీర్థం తాగించాను. తులసి ఆకు నాలుక ముందు బాగానే అతుక్కు పోయింది. 


మోహన కృష్ణ కర్మ చేశాడు. “అమ్మా, ప్రతీ సంవత్సరం తాతగారి జ్ఞాపకార్ధం అన్నదానం; అమ్మమ్మ స్మారకంగా ఐదుగురు బీద అవివాహితులకు గుడిలో పెళ్లి జరిపిస్తాను, ఏమంటావ్?”


జవాబు రాలేదు. 


జవాబు రాలేదని మళ్లీ అడిగాడు“అమ్మా, యెంతో ‘ఖర్చు’ అవుతుందని ఆలోచిస్తున్నవా?” 

కళ్ళల్లో కన్నీటిని నియంత్రించాలని ప్రయత్నిస్తూ ‘లేదు, కాదు’ అని అడ్డంగా తల వూపాను. 



***** 





సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


48 views0 comments

コメント


bottom of page