'Rajula Sambandham' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 05/08/2024
'రాజుల సంబంధం' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
సర్వోత్తమరావు ఆ గ్రామ సర్పంచి. పరమ స్వార్థపరుడు. వీరి ఇల్లాలు రాజేశ్వరి ఎంతో సాత్వికురాలు. రావుగారి దగ్గరికి ఎవరు వచ్చి ఏది కోరినా ’నాకేమిస్తావ్?’ అని నిర్భయంగా అడుగుతాడు. భర్త ఈ తత్త్వాన్ని గిట్టని రాజేశ్వరి భక్తితో.... ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతామాతలను ప్రతిదినం దీక్షగా పూజించి నివేదనలను అర్పించి... "మాతాపితలారా! మావారు స్వార్థబుద్ధిని దహించండి. సత్ బుద్ధిని ప్రసాదించండి’ ఎంతో భక్తితో వేడుకొనేది.
సర్వోత్తమరావు దృష్టిలో ’పైసాయే పరమాత్మ’ అనే గాఢ విశ్వాసం. అర్థాంగి చేసే పూజలు, పునస్కారాలు అతనికి నచ్చవు. వారి ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడు. అతను అనుభవించే ఆస్థిపాస్తులు అన్నీ రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమెకు ఇచ్చినవే. ఆ కారణంగా సర్వోత్తమరావు భార్య చేసే కార్యకలాపాలను ఆక్షేపించలేకపోయాడు.
యదార్థానికి ఏ యింటి యజమాని నిర్గుణవంతుడుగా, స్వార్థపరుడుగా వుంటాడో, ఆ ఇంటి ఇల్లాలు మహాసాద్విగా సద్గుణ సంపన్నురాలుగా వుంటుంది. ఆమెలోని ఆ మంచితనం... ఆ ఇంటి యజమానికి కవచం శ్రీరామరక్ష అవుతుంది.
ఈ దంపతులకు ఒక కుమారుడు. పేరు రాజకుమార్. కొడుకంటే తల్లితండ్రికి ఎంతో ఇష్టం. లా పూర్తిచేసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. డబ్బు విషయంలో రాజకుమార్‍ది తండ్రి పోలికే.
వీరి దూరపు బంధువు సత్యమూర్తి రాజు. ఒకనాడు ప్రఖ్యాత రంగస్థల నటుడు.... తెలుగు పండిట్.... వారి అర్థాంగి వనజ. ఆమె స్కూలు రోజుల్లో ఆనాటి ఆమె తెలుగు పండిట్ గోపాలశర్మ గారి ఆధ్వర్యంలో నాటకాలు ప్రదర్శించిందే. కాళిదాసు రాయభారం, కృష్ణ తులాభారం నాటకాల్లో, కాళిదాసుగా, శ్రీకృష్ణుడుగా అద్వితీయంగా పాడి అద్భుతంగా నటించిన మేటి నటీమణి.
సత్యమూర్తిగారు దుర్వోధనుడు, కంసుడు, కీచకుడు, రావణుని పాత్రలను ’సరిలేరు నీకెవ్వరు’ అనే స్థాయిలో నటించేవాడు. ప్రస్తుతం ఆ దంపతుల మధ్య వయస్సు అరవై ఐదు, యాభై. వారికి భారతి అనే కుమార్తె, భాస్కర్ అనే కుమారుడు వున్నారు. భారతి స్టేట్ ఫస్టులో బి.కాం పాసయ్యింది. భాస్కర్ ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా మంచి కుటుంబం. పిల్లలిరువురూ తల్లిదండ్రులను ఎంతగానో గౌరవిస్తారు. అభిమానిస్తారు. ఆ పెద్దలమాటను అక్కాతమ్ముడు జవదాటరు. భాస్కర్‍కి తన అక్క భారతి అంటే పంచప్రాణాలు.
ఒకే వూరువారైనందున సర్వోత్తమరావు, సత్యమూర్తులకు బాగా పరిచయం. ఒకరిని గురించి మరొకరు బాగా ఎరిగినవారు. సత్యమూర్తిరాజు వయస్సు అరవై ఐదు. సర్వోత్తమరావు వయస్సు యాభై ఐదు. రాజేశ్వరికి భారతి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. బి.కాం పరీక్ష స్టేట్ ఫస్టున పాసైన భారతి ఫొటోను పేపర్లో చూచింది రాజేశ్వరి. ఆమెను తన కోడలిగా చేసుకొంటే బాగుంటుంది అనే ఆలోచన మనస్సున ఏర్పడింది. కొడుకును పిలిచింది రాజేశ్వరి.
"ఏమ్మా!..." అడిగాడు రాజకుమార్.
"రాజా! నేను ఒకటి అడుగుతాను. నిజం చెప్పాలి సుమా!...." అంది.
"అడుగమ్మా...."
"నీ వివాహాన్ని చూడాలని వుందిరా!" చిరునవ్వుతో చెప్పింది రాజేశ్వరి.
"అమ్మా!..... నాన్నతో మాట్లాడావా!....."
"ముందు మనమిద్దరం ఒక నిర్ణయానికి వస్తే వారిని నేను ఒప్పిస్తాను రా" అనునయంగా చెప్పింది రాజేశ్వరి.’
"అవును... నీవు నాకు పిల్లని చూచావా?"
"ఆ.... చూచాను. ఇప్పుడే కాదు ఆ అమ్మాయిని చిన్న వయస్సు నుంచి చూస్తూనే వున్నాను. చాలా చాలా మంచిది."
"అలాగా!....."
"ఇంతకూ ఎవరమ్మా ఆ అమ్మాయి!"
పేపర్లోని భారతి ఫొటోను చూపించి "ఈ భారతిరా!" ఆనందంగా నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి.
"ఓ... ఈ పిల్లా!...."
"అవును... ఏరా! అంత తేలిగ్గా, నిర్లక్ష్యంగా అనేశావ్?"
"అమ్మా!... నీకు నచ్చింది సరే.... నాన్నకు నచ్చిందా?"
"ముందు నీ ఉద్దేశ్యాన్ని చెప్పరా."
"అమ్మా! నాన్న ఓకే అంటే నాకు సమ్మతమే."చిరునవ్వుతో చెప్పాడు రాజ్‍కుమార్.
అప్పుడే హాల్లోకి ప్రవేశించిన సర్వోత్తమరావు కొడుకు మాటలను విన్నాడు.
"ఆఁ.... విషయం ఏందిరా రాజా! నా ఇష్టమే.... నీ ఇష్టం అన్నావ్?" అడిగాడు సర్వోత్తమరావు.
నవ్వుతూ భర్తను సమీపించి పేపర్లో భారతి ఫోటోను రావుగారికి చూపించింది రాజేశ్వరి.
"నాకాబోయే కోడలు." అంది.
"ఆఁ...."
"అవునండి. నాకు ఈ పిల్ల తన చిన్న వయస్సు నుంచీ తెలుసు మీకూ తెలుసుగా!..."
"ఆ....ఆ... తెలుసు అయితే....!" ఆశ్చర్యంగా చూచాడు భార్య ముఖంలోనికి సర్వోత్తమరావు.
"మీరు ఈ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఈమెను మన ఇంటి కోడలిగా చెయ్యాలి"
సర్వోత్తమరావు కొన్ని క్షణాలు ఆలోచించాడు.
"ఏరా! రాజా!.... నీకు నచ్చిందా!" అడిగాడు.
"మీ ఇష్టమే నా ఇష్టం నాన్నా!" రాజకుమార్ స్కూటర్ పై కోర్టుకు వెళ్ళాడు.
ఆ ఆలుమగలు రాజకుమార్ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించేంత వరకూ అతన్నే చూచారు.
"ఏమండీ!...." గోమూగా పిలిచింది రాజేశ్వరి.
"ఆ.....ఆ.... అర్థం అయ్యింది. ప్రయత్నిస్తాను." తన గదికి వెళ్ళిపోయాడు సర్వోత్తమరావు. తన మిత్రుడు మిరియాల మాలకొండయ్యకు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు.
ఆ మాటలను విన్న రాజేశ్వరి వదనంలో పండువెన్నెల విరిసింది.
*
"అయ్యా!.... నట సార్వభౌమా! సత్యమూర్తిరాజు గారూ!... ప్రణామాలు" చేతులు జోడించాడు మిరియాల మాలకొండయ్య. ఇతనూ హాస్యనటుడు.
"యం.యం మాలకొండయ్యగారూ! ఏమిటి ఈ ఆకస్మిక రాక?"
మిరియాల మాలకొండయ్యకు బాగా తెలుసు. సత్యమూర్తిరాజు రాజభాషనే మాట్లాడతాడని.
అందువల్లనే ఆ రీతి సంబోధనను చేశాడు.
"అయ్యా!.... ఓ సందేశము?"
"ఏమిటయ్యది?"
"మన అమ్మాయి వివాహా విషయం...."
"ఎం. ఎం. మాలకొండయ్య గారూ!...."
"అయ్యా!...."
"ఆ విషయమును గురించి మేము మీతో ఎన్నడూ చర్చించలేదే!" ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు సత్యమూర్తిరాజు.
"నేను మీతో ప్రస్తావించ వచ్చితిని మహాశయా!"
"ఓ....! ప్రస్తావించుడు..."
"సర్వోత్తమరావుగారు తమరికి దూరపు బంధువే కదయ్యా!...."
"అగును...."
"వారి కుమారులుంగారికి, తమరి కుమార్తెకు వివాహ విషయముగా ముచ్చటించ నన్ను వారు పంపినారు..."
"వారూ అనగా....."
"సర్వోత్తములుంగారు!" చిరునవ్వుతో చెప్పాడు యం. యం.కొండయ్య. ఆశగా దీక్షగా సత్యమూర్తి రాజు ముఖంలోకి చూచాడు.
"ఆఁ..... బాగు బాగు. సంధాతగా వచ్చినావా?"
"అవును మహాశయా!"
"అబ్బాయి నామధేయమేమి?"
"రాజకుమార్ ఆర్యా"
"ఓహో! మంచిపేరు..." క్షణమాగి "ప్రస్తుత వృత్తి?" అడిగాడు సత్యమూర్తి రాజు.
"న్యాయవాది"
"ధర్మరక్షణ చేయువాడన్నమాట"
"యదార్థము అయ్యదే!"
"వారి తండ్రి..." ఆగిపోయాడు సత్యమూర్తి.
"తమరికి విధితమే కదా స్వామీ"
"బాగు... బాగు... కన్యను చూచుటలకు ఎప్పుడు వేంచేయుదురు?"
"తమరు సెలవిచ్చినప్పుడు" ప్రశ్నార్థకంగా సత్యమూర్తిరాజు ముఖంలోకి చూచాడు యం.యం. కొండయ్య.
"యం.యం కొండయ్య దూతగారూ..."
"స్వామీ!..."
"ఈ దినము బహుళ ఏకాదళి"
"అవును ఆర్యా! రేపు ద్వాదశి"
"మరుదినము త్రయోదశి..... మార్గశిరమాసం... జ్యేష్టానక్షత్రం"
"అవును.... ఆర్యా!"
"ఆ దినమున ఉదయం తొమ్మిది నలభై తరువాత వారిని మా యింటికి మా కన్యను చూడ రావలసినదిగా విన్నవించుడు."
"సంతసము స్వామీ శలవు" చేతులు జోడించి యం.యం. కొండయ్య ఆనందంగా బయలుదేరాడు.
సత్యమూర్తి, యం.యం. కొండయ్య వచ్చి తనకు చెప్పి విషయాన్ని అర్థాంగి వనజ, కుమార్తె భారతి, కుమారుడు భాస్కర్‍లతో చర్చించాడు.
పర్యవసానం... భారతికి రాజకుమార్ నచ్చలేదు. నిర్భయంగా చెప్పింది.
ఆ రోజు రాజకుమార్ పెండ్లి చూపులు....
సర్వోత్తమరావు, రాజేశ్వరి, రాజకుమార్, యం.యం. కొండయ్యలు సత్యమూర్తిరాజు గారి ఇంటికి వధువును చూడవచ్చారు.
"స్వాగతం!.... సుస్వాగతం!...." సర్వోత్తమరావుగారి కుటుంబానికి చిరునవ్వుతో చెప్పాడు సత్యమూర్తిరాజు.
"సత్యమూర్తిరాజా! థాంక్యూ." నవ్వుతూ చెప్పాడు సర్వోత్తమరావు.
"ఆసనముల గ్రహించుడు." అన్నాడు సత్యమూర్తిరాజు.
"నమస్సుమాంజలి." వచ్చిన వారినందరినీ చూచి సత్యమూర్తిరాజు అర్థాంగి వనజ చేతులు జోడించింది.
వారి సంబోధనను విన్న రాజకుమార్, వారి తల్లి రాజేశ్వరి ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు.
"అల్పాహారమును సేవించుటకు అభ్యంతరంబు లేదు కదా!..." అడిగాడు సత్యమూర్తి రాజు.
"గతికితే అతకదంటారుగా ఏమీ వద్దు. అమ్మాయిని పిలవండి" చిరునవ్వుతో చెప్పాడు సర్వోత్తమరావు.
"అవునవును." అంది రాజేశ్వరి.
"నాకా పటింపులేవు." అన్నాడు రాజకుమార్.
తల్లితండ్రి అతని ముఖంలోకి తీక్షణంగా చూచారు.
"రాజకుమార్! అమ్మానాన్నలు అనుభవజ్ఞులు కదా." చిరునవ్వుతో చెప్పాడు యం.యం. కొండయ్య.
"బాలుడు ఆశపడుతున్నట్లున్నారు తెచ్చెదము." నవ్వుతూ చెప్పింది వనజ.
"వద్దు వనజ మా నమ్మకాలు మావి!" అంది రాజేశ్వరి.
"బావా! సర్వోత్తమా! తమరి నిర్ణయంబేమి?" అడిగాడు సత్యమూర్తిరాజు.
"వద్దులే బావా!.... అమ్మాయి....." సర్వోత్తమరావు పూర్తిచేయకముందే...."దేవీ!...."
"ఆర్యా!...."
"మన కుమారిని తీసుకొని...."
"ఆ.....ఆ..... అటులనే" వనజ వేగంగా లోనికి వెళ్ళింది.
రాజకుమార్ తల్లిదండ్రుల ముఖంలోనికి దిగాలుపడి చూచాడు. తన ప్రక్కన కూర్చొని వున్న కొండయ్య చెవి దగ్గరకు తలను చేర్చి....
"కొండన్నా! ఏంది వీరి భాష.... వికారంగా వుంది" మెల్లగా అడిగాడు.
సమాధానంగా యం.యం. కొండన్న.
"రాజకుమారా! వారి భాష అంతే! రాజభాష"
"మరి పెండ్లి కూతురు భాష?"
"ఆమె భాషా అదే తీరు.... మీరు చెప్పి మాన్పించుకోవాలి." మెల్లగా చెప్పాడు యం.యం కొండయ్య.
"ఆఁ....." ఆశ్చర్యపోయాడు రాజకుమార్.
వనజ భారతిని తీసుకొని వచ్చింది. రాజకుమార్ ఎదురుగా వున్న కుర్చీలో భారతి కూర్చుంది.
రాజకుమార్ ఆత్రంగా భారతి ముఖంలోకి చూచాడు. భారతి తలను దించుకొంది.
రాజేశ్వరి కళ్ళల్లో ఎంతో ఆనందం.
"రాజా! అమ్మాయిని ఏమైనా అడగాలనుకొంటే అడుగు." అన్నాడు యం.యం. కొండయ్య.
రాజా సిగ్గుతో చిరునవ్వు నవ్వాడు.
"అడగరా!" అంది రాజేశ్వరి.
"నీవెందుకురా సిగ్గుపడుతావ్. నిర్భయంగా అడుగు." అన్నాడు సర్వోత్తమరావు.
"మీ పేరు?" మెల్లగా అడిగాడు రాజకుమార్.
"మదీయ నామము భారతి" భారతి జవాబు.
రాజకుమార్ ఉలిక్కిపడ్డాడు. ’ఏందిరా ఈ భాష?....’ అనుకొన్నాడు.
"రాజకుమారా! మరేదైనా ప్రశ్న అడగదలచితిరా!..." అడిగింది వనజ చిరునవ్వుతో.
"పెండ్లి కుమారా! నిర్భయముగా మా పుత్రికారత్నమును మీరు ప్రశ్నింపవచ్చును." చెప్పాడు సత్యమూర్తిరాజు.
"బావలుంగారూ! మా సోదరీమణిని నిర్భయముగా అడుగుడు." నవ్వుతూ చెప్పాడు భారతి సోదరుడు భాస్కర్.
భారతి ఓరకంట చిరునవ్వుతో రాజకుమార్ ముఖంలోకి చూస్తూ వుంది.
రాజకుమార్ ఒంటికి చెమట పట్టింది. కుర్చీలో కూర్చోలేక పోయాడు. లేచి వేగంగా ఇంట్లోనుంచి బయటికి నడిచాడు. వెనకాలే యం.యం. కొండయ్య, అతని వెనకాల సర్వోత్తమరావు, మరియు రాజేశ్వరి నడిచారు.
రాజకుమార్ జేబునుండీ కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకొన్నాడు. మనస్సున ఆవేదన, అవమానం.
"ఏం రాజా! లేచి వచ్చేశావు?" అతన్ని సమీపించి యం.యం. కొండయ్య అడిగాడు.
"కొండయ్య మామా! ఈ ’రాజుల సంబంధం’నాకొద్దు. నీకు ఆ పిల్లకి నా దండాలు." చేతులు జోడించి వేగంగా వీధివైపుకు నడిచాడు రాజకుమార్.
సర్వోత్తమరావు, రాజేశ్వరి రాజకుమార్ మాటలను విన్నారు. దిగాలు పడి ఒకరి ముఖాలు ఒకరి చూచుకొన్నారు.
తల వేలాడేసుకొని యం.యం. కొండయ్య వారిని సమీపించాడు.
ముందు సర్వోత్తమరావు, వెనుక రాజేశ్వరి, ప్రక్కన యం.యం కోటయ్య విచారవదనాలతో వారి వారి ఇండ్లవైపుకు నడిచారు.
సంబంధం తప్పిపోయినందుకు సత్యమూర్తిరాజు, కుమార్తె భారతి, కుటుంబ సభ్యులు సంతసించారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Kommentarer