top of page

రక్తానికి కులమేది?

Writer's picture: Parupalli Ajay KumarParupalli Ajay Kumar

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #రక్తానికికులమేది, #RakthanikiKulamedi, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Rakthaniki Kulamedi - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 04/12/2024

రక్తానికి కులమేది - తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ICU లో వున్న ప్రసాదరావు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కూతురు సంహిత కనిపించింది. వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు.


“నాన్నా, నేను రావడం నువ్వు ఇష్టపడవని తెలుసు. కానీ నీకు ప్రమాదం జరిగిన ఈ సమయంలో రాక తప్పలేదు. యాక్సిడెంట్ లో నీ తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. హాస్పిటల్ కు తీసుకు రాగానే బ్లడ్ ఎక్కించారు. తలను CT scan చేశారు. అంతా నార్మల్ గా ఉంది. ఇక ఏ విధమైన ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. రేపు నిన్ను రూంకు షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వస్తాను. ప్రశాంతంగా రెస్టు తీసుకో.” అంది సంహిత.


“నువ్వు మళ్ళీ ఇక్కడికి రానవసరం లేదు.” కూతురు ముఖం చూడకుండానే అన్నాడు ప్రసాదరావు.


సంహిత ఏం మాట్లాడకుండా ICU నుండి బయటకు వచ్చేసింది.


సంవత్సరం క్రిందట జరిగింది గుర్తుకు వచ్చింది ప్రసాదరావుకు.


“చిన్నూ, నీ చదువు పూర్తయి ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు. ఇక నీ పెళ్ళి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. పెళ్ళి అంటే మామూలు విషయం కాదుగా. ఎన్నో చూడాలి. పెళ్లికి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. సంబంధాలు చూసేటప్పుడు పెళ్ళికొడుకు అందచందాలు, ఉద్యోగ జీతాలు గురించి చూసుకుంటే చాలదు. అతని గుణ గణాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకుని అవన్నీ నిజమో కాదో అన్వేషించి నిర్ణయాలు తీసుకోవాలి.” అన్నాడు ప్రసాదరావు కూతురుతో.


“ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ముఖ్యం కాదు నాన్నా. పెళ్ళి అనేది రెండు మనసులు నూరేళ్ళు కలసి జీవించేలా చేసే బంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరూ కలసి మెలసి ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలి. నన్ను నన్నుగా ఇష్టపడిన వ్యక్తిని నేను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను.” సంహిత తండ్రిని చూస్తూ అంది.


కూతురు మాటలతో ప్రసాదరావు ముఖంలో రంగులు మారాయి.


“ఎవరతను?” అడిగాడు.


“మా కంపెనీలో నాతో పాటు పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు. నెమ్మదైన వాడు. నా మనసుకు నచ్చిన వాడు. నన్ను మెచ్చిన వాడు. మా ప్రాజెక్ట్ హెడ్ విక్టర్. నువ్వు కూడా అతన్ని ఒకసారి మా ఆఫీసులో చూసావు. మా యిద్దరి అభిప్రాయాలు కలిశాయి. నేను విక్టర్ ను ఇష్టపడుతున్నా. ప్రేమిస్తున్నా. అతనూ నన్ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరం

పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం.”


ప్రసాదరావు కూతురి వంక ఆశ్చర్యంగా చూశాడు. కూతురి కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఒక్క క్షణం. ఆమె కళ్ళల్లో ఏ మాత్రం బెదురు గానీ, భయం గానీ కనపడలేదు.


“అతని పేరు విక్టరా? అతన్ని ప్రేమించావా? అతన్ని పెళ్ళి చేసుకుంటావా? పేరును బట్టే అర్థమవుతోంది అతనేమిటో! మన కులం కాదు. మన మతం కాదు. ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు?” కోపంగా అన్నాడు ప్రసాదరావు.


“ఈ పెళ్ళికి నువ్వు ఇష్టపడవని తెలుసు నాన్నా. మా పెళ్ళి చేయమని నిన్ను అడగటం లేదు. మేము పెళ్ళి చేసుకుంటామనే విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను. పరువు కోసం, ప్రతిష్ఠ కోసం జరిగే హత్యలను నిత్యం పేపర్లలో, మీడియాలో చూస్తునే వున్నాం.


కేవలం తన కులం గానీ అబ్బాయితో మాట్లాడినందుకే ఒక తండ్రి తన

కూతురుని గొంతు కోసి చంపాడు. కులం కంటే కన్నకూతురి జీవితం గొప్పదని అనుకోలేకపోయాడు ఆ తండ్రి.


కూతురు దళిత యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు అతన్ని హత్య చేయించాడు మరో తండ్రి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి సుఖం, సంతోషం కంటే కులం ముఖ్యం కాదని తెలుసుకోలేక పోయాడు ఆ తండ్రి.


వేరే కులం, వేరే మతం వారిని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవడం వల్ల పరువుపోవడం, అలా చేసిన వారిని హత్య చేస్తే పరువు నిలబడటం జరుగుతుందా నాన్నా? అలా పరువు హత్యలు చేసిన వారు, చేయించిన వారు చాలామంది నేడు కటకటాల వెనుక మగ్గిపోతున్నారు. నువ్వు అలా చేయవనే అనుకుంటున్నాను. మా మానాన మమ్మల్ని వదిలేయ్.” అని సంహిత కిచెన్ లోకి వెళ్ళింది.


ప్రసాదరావు కోపంతో రగిలిపోయాడు.

“వాడిని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు.” పెద్దగా అరిచాడు కూతురికి వినపడేలా.


సంహిత లంచ్ బాక్స్ తీసుకుని కిచెన్ లో నుండి బయటకు వచ్చి తండ్రిని చూస్తూ మందహాసం చేసింది.


కూతురు నవ్వును చూస్తూ మరింతగా రగిలిపోయాడు ప్రసాదరావు.


“నీకు నవ్వులాటగా వుందా? నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది అమలుచేసి తీరుతాను. నేను చూసిన వాడినే నువ్వు పెళ్ళి చేసుకోవాలి. లేదంటే నా ఆస్తి మొత్తం ఏ వృద్ధాశ్రమానికో రాసేస్తాను.” బింకంగా హుంకరించాడు.


“చాలా మంచి నిర్ణయం నాన్నా. దానివల్ల ఓ పదిమంది వృద్ధులకు మేలు జరుగుతుంది. నాకు ఆఫీసుకు టైమ్ అయింది. నేను వెళుతున్నాను. ఇదుగో ఈ పుస్తకంలో ఒక ఆర్టికల్ వుంది. చదువుకో.” అని ఒక పుస్తకాన్ని తండ్రి చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోయింది సంహిత.

అన్య మనస్కంగానే కూతురు ఇచ్చిన పుస్తకంలోని ఆర్టికల్ చూసాడు.


‘వంశప్రతిష్ఠ అనే ముసుగులోనో, కుటుంబ మర్యాద అనే మిషతోనో, కులగౌరవం అనే సాకుతోనో, ఇలా కారణం ఏదైతేనేం ఏటా వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ఆత్మహత్యలు అయితే మరికొన్ని హత్యలు. కుటుంబ పరువు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమంటూ కుటుంబ సభ్యులే హత్యలకు పాల్పడుతున్నారు.


ఇష్టపడిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం వల్ల కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఆ కళంకాన్ని తుడిచి పెట్టడానికి వారిని చంపుతున్నారు. వేరే కులం వ్యక్తులను ప్రేమించటం పాపమా? వేరే మతం వ్యక్తిని ఇష్టపడటం నేరమా? మనుషులను చంపేయాల్సినంతటి ఘోర నేరాలా అవి? పరువు ప్రతిష్ఠల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం? హంతక కుటుంబంగా మారడం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ఠ?


మగవాళ్ల రక్షణలోనే మహిళలు ఉండాలన్న పితృస్వామిక భావజాలం మగవారిలో పాతుకుపోవడం అందుకు కారణం. తమ చెప్పుచేతల్లో మహిళలు నడుచుకోకపోవడాన్ని కుటుంబప్రతిష్ఠతో ముడిపెడుతూ, దాన్ని కాపాడటం కోసమంటూ మహిళల్ని హతమార్చడం అమానుషం. అత్యంత హేయం.


ఇలా కుటుంబ గౌరవ ప్రతిష్ఠల పేరిట హత్యలకు ఒడిగట్టడం అనాగరికమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకుల్ని హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. వివాహాలు ఆమోదయోగ్యం కాని పక్షంలో తల్లిదండ్రులు చేయగలిగింది తమ పిల్లలతో సామాజికంగా తెగతెంపులు చేసుకోవడమే. అంతేతప్ప వారిని వేధించడానికి వీలులేదు అని స్పష్టం చేసింది. ఇచ్ఛాపూర్వకంగా కులాంతర, లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తుల్ని కుటుంబగౌరవ పరిరక్షణ పేరిట బంధువులు హతమార్చడం, క్రూరత్వానికి, ఫ్యూడల్ మనస్తత్వానికి దృష్టాంతమనీ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది………’


చదువుతున్న ప్రసాదరావు పిచ్చి కోపంతో ఆ పుస్తకాన్ని చింపి పోగులు పెట్టాడు. అయినా కసి తీరలేదు. సెగలు కక్కే కోపంతో సిగరెట్ లైటర్ తో ఆ కాగితాలను అంటించాడు. ఉవ్వెత్తున ఎగిసిన మంటలో ఆ కాగితాలు కాలి బూడిద అయ్యాయి. కానీ ప్రసాదరావు గుండెల్లో రేగిన మంటలు చల్లారలేదు.


ఆ సాయంత్రమే సంహిత తండ్రితో చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.

నెల తరువాత వచ్చిన పెండ్లి శుభలేఖ ను ముక్కలు ముక్కలుగా చింపి పారేశాడు ప్రసాదరావు.


  **********************


రూంకు షిఫ్ట్ చేశాక ప్రసాదరావు సెల్లుకు మేసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూశాడు.


‘నాన్నా, మీ ఆరోగ్యం బాగానే వుందని డాక్టర్ చెప్పారు. నేను వచ్చి మిమ్ములను పదేపదే డిస్ట్రబ్ చేయదలుచుకోలేదు. మీరు పూర్తిగా కోలుకున్నాక వచ్చి చూస్తాను. అదీ మీకు సమ్మతమైతేనే.

మీకు కారు ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది జనం చూశారు. నీ తల డివైడర్ కు కొట్టుకుని రక్తం కారుతుంటే సెల్ ఫోన్ల లో ఫోటోలు తీసుకున్నారే గానీ ఎవరూ స్పందించలేదు. అటుగా వెళ్తున్న విక్టర్ నిన్ను చూసి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్ లో చేర్చి నాకు కబురు చేశాడు. నేను పెదనాన్నకు, బాబాయికి ఫోన్ చేసి, ఆసుపత్రికి వచ్చాను.


నీకు చాలా రక్తం పోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలన్నారు. మీ గ్రూప్ రక్తం ఆసుపత్రి లో స్టాక్ లేదు. నువ్వు ఎంతో అభిమానించే పెద్ద నాన్న, బాబాయి, వారి కొడుకులు డాక్టరు చెప్పింది విన్నారే గానీ ఏ రకమైన స్పందన వారి నుండి రాలేదు. వారెవ్వరూ రక్తాన్ని ఇస్తామని ముందుకు రాలేదు. నీకు వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణాపాయం వుందని డాక్టర్లు చెప్పారు.

నీ గ్రూప్ రక్తంతో నా రక్తం మ్యాచ్ కాలేదు.


అత్యవసర పరిస్థితులలో అదే గ్రూప్ రక్తం కలిగిన విక్టర్ రక్తాన్ని మీకు ఎక్కించాల్సి వచ్చింది. విక్టర్ తన రక్తాన్ని ఇచ్చి మీకు ప్రాణదానం చేశాడు. ఈ విషయాన్ని తను నీకు చెప్పవద్దని అన్నాడు. కానీ నేనే అసలు విషయం నీకు తెలియాలని చెపుతున్నాను.


కులాలు, మతాలు మనుషులుగా పుట్టిన మనం ఏర్పర్చుకున్నవే. మొదట్లో వృత్తులను బట్టి ఏర్పడిన కులాలు రాను రాను వికృత రూపం దాల్చి మనుషుల మధ్య విభేదాలను సృష్టించాయి. కొంతమంది మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని పెంచి పోషిస్తున్నారు.


కానీ మనలో వుండే రక్తానికి ఏ కులము, మతము వుండవని గ్రహించు నాన్నా. నిజం నాన్నా! రక్తానికి ప్రాంతీయ విభేదాలు లేవు. కులమత బేధాలు లేవు. బ్లడ్ బ్యాంకులో దొరికే రక్తం మీద కూడా గ్రూప్ పేరు రాసి వుంటుంది కానీ, ఆ రక్తం ఏ కులం వాడిది అని రాసి వుండదు. ఇప్పుడు మీ శరీరంలో విక్టర్ రక్తం, మీ రక్తంతో కలసిపోయి ప్రవహిస్తున్నది. మీ రక్తంలో కలసిన విక్టర్ రక్తాన్ని వేరుచేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు మీ ఇద్దరిదీ విడదీయలేని రక్త బంధం... ఇది ఎవరూ కాదనలేని సత్యం...

  — సంహిత.’


ఆ మెసేజ్ చదివి ప్రసాదరావు ఒక్క క్షణం నివ్వెరపోయాడు. కూతురు పంపిన

ఆ మెసేజ్ మనసును కల్లోలపరచగా, కనులు మూసుకుని ఆలోచనల అంతర్మధనములో మునిగిపోయాడు.


 ***************************** 


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



 
 
 

1 комментарий


mk kumar
mk kumar
04 дек. 2024 г.

"రక్తానికి కులమేది?" పారుపల్లి అజయ్ కుమార్ గారి ఒక ఆలోచనాత్మక తెలుగు కథ. ఈ కథ కుల వివక్ష, ప్రేమ, కుటుంబ బంధాల మీద ఒక సమాజంలో ఉన్న అడ్డంకుల గురించి చెప్తుంది. ఈ కథలో ప్రసాదరావు అనే తండ్రి తన కుమార్తె సంహిత పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని ఆమోదించడానికి ఓ పెద్ద ఇబ్బంది ఎదుర్కొంటాడు. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విక్టర్ అనే యువకుడు వేరే కులం వాడనేకారణంతో తండ్రికి ఆ నిర్ణయం అంగీకరించలేదు.


కానీ కథ ముగిసే సమయానికి, తన తల్లిదండ్రుల మధ్య ఉన్న కుల భేదం ఎంత వృథా అన్నది స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రసాదరావు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, విక్టర్ తగిన సమయంలో రక్తం ఇచ్చి అతని ప్రాణాన్ని కాపాడినట్లు చెప్పడం ద్వారా వారి మధ్య ఉన్న కులం, మతం తేడాలు మారిపోతాయి. సంహిత తన తండ్రికి పంపిన సందేశం ద్వారా, మనిషి రక్తానికి కులం ఉండదని, కుటుంబ పరిపాలనా గౌరవం కంటే మనుషుల జీవితం ముఖ్యం అని స్పష్టం చేస్తుంది.


ఈ కథ మనకు కుల, మత భేదాలను తగ్గించి, సమాజంలో ఉండే అసమానతలను అర్థం చేసుకునేలా…


Лайк
bottom of page