#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #RakumariVaraPariksha, #రాకుమారివరపరీక్ష, #పిల్లలకథలు, #TeluguChildrenStories
'Rakumari Vara Pariksha' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 25/10/2024
'రాకుమారి వర పరీక్ష' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పూర్వం సూరసేన రాజ్యంలో చంద్రావతి అనే పేరు గల యువరాణి ఉండేది. అపూర్వమైన సౌందర్యం ఆమె సొంతం. అన్ని విద్యలలో ఆరితేరిన వీరుడే కాక గొప్ప తెలివైన వాడిని వివాహం చేసుకోవాలన్నది ఆమె బలమైన కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించింది.
మంత్రిని పిలిపించి తన ప్రణాళికను వివరించి అమలుపరచమని కోరింది రాకుమారి. మంత్రి రాకుమారి అభిష్టం మేరకు ఈ కింది విధంగా చాటింపు వేయించాడు.
"సూరసేన దేశపు రాకుమారి చంద్రావతిని వివాహం చేసుకోవాలనుకునే వీరులు ఎవరైనా వీరుడై ఉండడమే కాకుండా అతడు గొప్ప తెలివైనవాడై ఉండాలి. ఆమె తెమ్మన్న మూడు వస్తువులైన 'రాతి మెదడు, లేత చెవులు, నెలవంకలు' తన తెలివిని ఉపయోగించి తెచ్చినవాడిని యువరాణి చంద్రావతి వివాహమాడుతుంది" అని దేశమంతటా దండోరా వేయించాడు మంత్రి.
ఈ ప్రకటన విన్న ఎందరెందరో గొప్ప తెలివైన వారు తమ తెలివి తేటల ఉపయోగించి ఏవేవో వస్తువులు తెచ్చి రాకుమారికి ఇయ్యబోయారు. రాకుమారి ఇవి కావని తిరస్కరించింది.
ఇది ఇట్లుండగా చాటింపు విని దేశ రాజధానికి సుదూరంలో వున్న ఒక గొల్లబోయడు రాకుమారిని పెండ్లి చేసుకోవాలనే తీవ్రమైన కాంక్షతో తన దగ్గర ఉన్న వంద గొర్రెలను అమ్మేసి, ఆ అమ్మగా వచ్చిన సొమ్మును తీసుకుని, ఒక లేత మేకను చంపి దాని చెవులు కోసుకుని, ఆదే మేక మెదడు తీసుకుని. వంకకుబోయి ఒక పాత్ర నిండా నీళ్ళు తీసుకొని రాజధానికి బాయలుదేరిపోయాడు గొల్లబోయడు. మూడింటిని రాకూమారి చంద్రావతికి ఇచ్చాడు.
రాకుమారి చంద్రావతి అమాయకుడైన గొల్లబోయడు తెచ్చిన మూడింటిని చూసి నవ్వుకొని "ఓయీ గొల్లబోయీ! నేను తెమ్మన్న వస్తువులు ఇవి కాదు. కాబట్టి నీవెళ్ళిపోవచ్చు! భటులారా! ఇతడిని కోట బయటికి పంపండి". అని ఆజ్ఞాపించింది.
దానితో భటులు గొల్లబోయిని మెడ బట్టి బయటికి గెంటేశారు. గొల్లబోయి వచ్చిన పని కాక, గొర్రెలు పోగొట్టుకుని ఉసూరుమంటూ చేల దారి బట్టి దుఃఖిస్తూ పోతున్నాడు. అలా దుఃఖపడి పోతున్న గొల్లబోయిని చూసి దారి పక్కన చేనులోని మంచేపై వున్న మహేంద్రుడు అను యువకుడు
" ఓ గొల్లబోయి! ఎందుకు దుఃఖిస్తూ పోతున్నావు! అభ్యంతరం లేకపోతే నాకు చెప్పుతావా! " అడిగాడు మహేంద్రుడు.
"అయ్యా! రైతన్నా! మనదేశపు రాకుమారి చాటింపు విని రాజధానికి చాల దూరంలో ఉన్న నేను నా వంద గొర్రెలను అమ్మి రాకుమారి తెమ్మన్న మూడు వస్తువులు లేత చెవులు, రాతి మెదడు, నెలవంకలు, అంటే నేను మేకచేవులు, మేకమెదడు, వంకనీళ్ళు తీసుకుని రాకుమారికి ఇయ్యబోయాను. ఇవి కాదు పొమ్మన్నది. రాజభటులు నన్ను మెడ బట్టి కోట బయటికి తోసేశారు" అని మహేంద్రుడికి చెప్పాడు దుఃఖస్వరముతో గొల్లబోయుడు.
"ఓహో! అలాగా! ఈసారి నేను చెప్పినవి తీసుకుని పోయి రాకుమారికి చూపించు! నీ పని అవుతుంది. లేతచెవులకు బదులు తమలపాకులు, రాతి మెదడుకు బదులు సున్నము, నెలవంకలుకు బదులు వక్కులు తీసుకునిఫోయి రాకుమారికి ఇవ్వు. ఈ దఫా ఒప్పుకుంటుంది" చెప్పాడు మహేంద్రుడు.
గొల్లబోయుడు మహేంద్రుడు చెప్పినట్లే తమలపాకులు వక్కలు సున్నం తీసుకొని రాకుమారి దగ్గరకు పోయి తాను తెచ్చిన వాటిని చూపించాడు. గొల్లబోయుడు తెచ్చిన వాటిని చూసి రాకుమారి అంతులేని ఆశ్చర్యానికి గురైంది.
"గొల్లబోయుడూ! ఇవి తీసుకొని పొమ్మని నీకు ఎవరు చెప్పారు? నిజం చెప్పు! నీకు జీవితాంతం బతికే బహుమానం ఇస్తాను" అన్నది రాకుమారి.
"ఎవరూ చెప్పలేదు. నేనే బాగా ఆలోచించి తెచ్చాను" అని బుకాయించాడు గొల్లబోయుడు
"నీవు అమాయకుడవు. నీవు తేలేవని మాకు తెలుసు. నీకు ఎవరు చెప్పారో నిజం చెప్పు! లేదంటే మా భటులు నీతో కఠినంగా వ్యవహరించి నిజం కక్కిస్తారు. జాగ్రత్త! " హూంకరించింది యువరాణి రాకుమారి.
దానితో గొల్లబోయుడు భయపడిపోయి నిజం చెప్పాడు.
"మీరన్నది నిజమే రాజకుమారీ! ఇవి నా తెలివితేటలు కాదు. ఊరి వెలుపల ఒక చేలో మంచెపై ఉన్న యువ రైతు మహేంద్రుడు చెప్పాడు. అతడు గొప్ప అందగాడు, అతనికి అద్భుతమైన తెలివితేటలతో పాటు మహా వీరుడిలా కనపడ్డాడు" అని రాకుమారికి విశదీకరించి చెప్పాడు గొల్లబోయుడు.
గొల్లబోయుడు చెప్పిన ప్రకారం రాకుమారి చంద్రావతి మహేంద్రుడని వెతుక్కుంటూ పోయి మహేంద్రుడు ఉన్న చేను చేరింది. మహేంద్రుడు చేలో మంచేపై ఉండడం చూసి చేలో దిగి అతడి దగ్గరికి పోబోయింది చంద్రావతి.
"హేయ్! అమ్మాయి! దక్షిణం వైపు నుండి వస్తే నీ కుచ్చిళ్ళు తగిలి పైరు శుంగు రాలిపోతుంది. జాగ్రత్త!" రాకుమారిని హెచ్చరించాడు. రాకుమారి తన దగ్గరకి వస్తుందని ముందే ఊహించిన మహేంద్రుడు.
పడమర వైపు నుండి చేలో దిగి రాబోయింది రాకుమారి.
"పడమర నుండి వస్తే పైట తగిలి పైరు వంగిపోతాది, జాగ్రత్త!" అన్నాడు మహేంద్రుడు.
ఉత్తరం నుండి నడవబోయింది చంద్రావతి.
"ఉత్తరం నుండి వస్తే నీ పాదాలు తగిలి పైరు పడిపోతుంది!" జాగ్రత్త చెప్పాడు మహేంద్రుడు.
ఇక తూర్పు వైపు నుండి పైరులో దిగి మహేంద్రుడిని సమీపించబోయింది రాకుమార్తె.
"హేయ్ పిల్లా! నీవు తూర్పు దిక్కు నుండి వస్తే కంక్కుళ్ళోని గింజలు రాలి కింద పడిపోతాయి" మహేంద్రుడు గద్దించాడు.
" మీకు నమస్కారము చేస్తాను నన్ను మీదగ్గరకి రానియండి స్వామి" అని వేడుకుంది మహేంద్రున్ని యువరాణి.
గెనుంపై నడుచుకుంటూ రామ్మని సమ్మతించాడు యువకుడు. చంద్రావతి గెనెం మీద కదిలిపోయి మహేంద్రున్ని చేరుకుంది.
"మహావీరా! గొల్లబోయుడు తెచ్చిన వస్తువులు చూశాను. అతని ద్వారానే మీ విషయం తెలిసింది. మీ అమోఘమైన తెలివితేటలు తెలిసినవి. ప్రకటనను అనుసరించి మీరు నన్ను వివాహమాడండి స్వామి" వినయంగా విన్నవించింది చంద్రావతి.
"నీతో నాకు వివాహం జరగాలంటే గొల్లబోయినికి నష్టపరిహారం చెల్లించాలి " అన్నాడు నిష్కర్షగా మహేంద్రుడు.
"అతనికి జీవితాంతం జీవించేంత సొమ్మును ఇస్తాము. అతడు మనయిద్దరిని కలిపిన అనుసంధానకర్త. కాబట్టి అతను మనకు పూజనీయుడు. కావున మహావీరా! నన్ను పెళ్లాడి మన శూరసేన రాజ్యాన్ని ఏలుకోమని కోరుతున్నాను" అని పలికింది యువరాణి చంద్రావతి.
"తప్పకుండా వివాహం చేసుకుందాం! ప్రజాసంక్షేమ ఆదర్శ రాజ్యాన్ని స్థాపిస్తాం!" అంగీకరించాడు మహేంద్రుడు.
పరవశంతో మహేంద్రుడి గుండెలపై వాలిపోయింది చంద్రావతి.
--------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.---------
@TNA-g8r
• 9 hours ago
బాగుంది