top of page

రామ బాణం

#RamaBanam, #రామబాణం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Rama Banam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 19/02/2025

రామ బాణం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


మొబైల్ ఫోన్ రింగయింది. 


బాత్రూంకి బయలుదేరుతున్న 'రామబాణం' కలం పేరుతో సాహిత్య రచనలు 

చేస్తున్న రాంబాబు వెనక్కి వచ్చి టేబుల్ మీదున్న మొబైల్ అందుకుని

 " హలో ! " అన్నాడు. 


 " హలో, ' రామబాణం ' పేరుతో రాసే సాహిత్య రచయిత రాంబాబు గారా? "

 అటునుంచి ఒక పురుష కంఠం అడుగుతోంది. 


 " ఔనండీ! రామబాణం, రాంబాబునే మాట్లాడుతున్నాను. మీరెవరు ? "


 " నమస్తే సార్! నా పేరు మతలబు రావు, శ్రీకాకుళం జిల్లా మందసా నుంచి

 మాట్లాడుతున్నా. " వినయంగా జవాబు వచ్చింది. 


 "మీరు క్రిష్టియనా ? " రామబాణం ప్రశ్న. 


 " లేదండీ, పదహారణాల హిందువుని " మళ్లా వినయంగా జవాబు. 


 "మరి, పేరేంటి విచిత్రంగా ఉంది " సంశయ ప్రశ్న. 


 "అదాండీ, నేను చిన్నగా ఉండేటప్పుడు మా నాన్న 'భజగోవిందం' పేరుతో చిట్ ఫండ్

 నడిపపేవాడట. చిట్టీలు బాగా పెరిగి లక్షలు జమవగానే నాన్న, మా అమ్మని ఒగ్గేసి 

 మా ఊర్లో బట్టలుకుట్టే టైలర్ సాయిబు కూతుర్ని తీసుకుని మద్రాస్ పారిపోయాడట. 

అప్పటి నుంచి మా అమ్మే టీ దుకాణం పెట్టుకుని నన్ను పెంచి పెద్ద చేసినాది. మా నాన్న

 పేరు ముత్యాల రావట. నన్ను మతలబు అని ముద్దుగా పిలిచేవాడట. అప్పట్నుంచి 

 నా పేరు మతలబుగానే ఉండిపోయింది. "


 "భలే ఇంటరెస్టింగుగా ఉంది మీ స్టోరీ వింటుంటే, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసారు ? " 

 రచయిత గారి ప్రశ్న. 


 " ఆ.. అక్కడికే వస్తున్నా, నేను ఇక్కడ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా జాబ్ చేస్తున్నాను. 

 ఎక్కువగా తెలుగు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. మా అపార్ట్మెంట్లో చాలమంది సార్లు

సాహిత్య మాసపత్రికలు, వార పత్రికలు తెప్పించుకుంటారు. వారు చదివేసిన తర్వాత

నా దగ్గర పడేస్తారు. అవి చదువుతు కాలక్షేపం చేస్తుంటాను. వాటిలో బాలబాట, సాహితీ

కిరణం, భావతరంగిణి, విశాఖసంస్క్రతి, జాగృతి, రమ్యభారతి, భక్తి సమాచారం వంటి

తెలుగు సాహిత్య పత్రికలు ఉంటాయి. 


 మీలాంటి ఎందరో చెయ్యి తిరిగిన రచయితల కవితలు, కథలు చదివే అవకాశం ఉంటోంది. 

పోయిన నెల సాహితీ కిరణం మాసపత్రికలో మీరు రాసిన 'నాన్నా, నీ మనసే వెన్న' కవిత

చదివి మా నాన్న గుర్తుకు వచ్చాడు. చాలా చక్కగా హృదయానికి హత్తుకునేలా రాసారు. 

రామబాణం కలం పేరుతో మీరు రాసే రచనలు చదువుతు మీ జీవిత చరిత్ర తెలుసుకుని

మీ అభిమానినైపోయాను. మీకలం పేరు చూడగానే ముందుగా మీ రచనలనే చదువుతాను. 

మీలాంటి వారి కృషి ఫలితంగానె తెలుగు సాహిత్యం నిలబడింది. " గాలి కొడుతున్నాడు

మస్కా మతలబురావు. 


 రాంబాణం గారికి టాయిలెట్ జోరు ఎక్కువగా ఉన్నా అభిమాని పొగడ్తలకు తబ్బిబై

 " అంతా మీ పాఠకుల అభిమానం " అన్నాడు ఆనందంగా. 


 " లేదు సార్! నేను నిజమే చెబుతున్నాను. చాల రోజుల్నుంచి మీకు ఫోన్ చేసి మీతో

మాట్లాడాలనుకుంటె ఇప్పటికి వీలుకుదిరింది. 


 నా వల్ల మీకేమీ డిస్ట్రబ్ అవడం లేదు కదా ! " మరింత పంపు కొడుతున్నాడు 

మతలబురావు. 


 వెనక జోరు ఎక్కువైనా ఆపుకుంటు " అబ్బే, అదేం లేదు. మీ సాహిత్యాభిమానానికి, 

రచయితల పట్ల గౌరవానికి అభినందిస్తున్నాను. " తన ఆనందం తెలియచేసాడు రామబాణం. 


 " సార్, ఒక రిక్వెస్ట్ " అభిమాని వినయంగా అడిగాడు. 


 " ఏమిటి ? అడగండి " రామబాణం గారి ఆదరణ స్వరం. 


 " మీ దగ్గర ఏవైన పాత పత్రికలు, సాహిత్య పుస్తకాలు ఉంటే నాకు పంపండి. ఈమద్య కరోనా

కారణంగా చాల పత్రికలు, మేగజైన్లు అందుబాటులో ఉండటం లేదు. " మనసులో మాట

మెల్లగా చెప్పాడు అభిమాని. 


 అతని నిజాయితీ, సాహిత్యం పట్ల ఉన్న అభిమానానికి ముగ్ధుడయాడు రామబాణం గారు. 


 " అలాగే, రెండు మూడు రోజుల్లో నా దగ్గరున్న పాత పత్రికలు, మేగజైన్, పుస్తకాలు మీ అడ్రసుకి

పోస్టు చేస్తాను " అంటూ ఆపుకోలేక బాత్రూం వైపు పరుగు తీసాడు రచయిత రాంబాణం


 "మీ అభిమానానికి థేంక్యు, సార్! " తన పాచిక పారినందుకు ఫోన్ కట్ చేసాడు మతలబురావు. 


 తీరిక చేసుకుని తన రచనల పట్ల అభిమానం చూపుతున్న ఆ తెలుగు సాహిత్యాభిమాని కోరిక

తీర్చడం తన ధర్మమని తన రచనలే కాకుండా సహచర రచయితల పుస్తకాలు కూడా వెతికి

అభిమాని ఇచ్చిన పోస్టల్ అడ్రసుకు చక్కగా పేక్ చేసి పార్సెల్ చేసాడు రామబాణం గారు. 

  *


 " పది కేజీలు ఉన్నాయి. కె. జి పది రూపాయల చొప్పున వంద రూపాయలు వస్తాయి. ఇంద, తీస్కో"

అని పార్సెల్ విప్పి తూకం వేసి వంద రూపాయలు మతలబు చేతిలో పెట్టాడు పాత పేపర్లు కొనే అప్పలస్వామి. 


 " అవును, నాకు తెలవక అడుగుతున్నా, కరోనా వచ్చి పుస్తకాలు, పేపర్లు, మేగజైన్లు అమ్మేవోళ్లు

 గిరాకీల కోసం ఈదులంట తిరుగుతుంటె నీకు పుస్తకాల పేకెట్లు ఎట్టా వత్తున్నాయని "

మనసులో అనుమానం బయటపెట్టాడు అప్పలస్వామి. 


 మతలబురావు నవ్వుతు " దానికి ఒక చిట్కా ఉపయోగించేనులే. తెలుగు మాసపత్రికలు, , 

వారపత్రికలకు కథలు, కవితలు, గేయాలు రాసే రచయితల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఎడ్రసులు

నోట్ చేసుకుని ఒక్కొక్కరి ఫోన్ నెంబర్లకు వారి రచనల్లో కొన్నిటిని ఎంచుకుని పొగడ్తలతో గేస్

కొడతాను. కొంతమంది పొంగిపోయి నేను చెప్పిన ఎడ్రసుకు పుస్తకాలు, మేగజైన్లు పోష్టులో

పంపుతారు. నేను చదివేది చేసేదీ ఏమి లేదు. పెద్ద పార్సెల్ ఐతే బరువు ఎక్కువ తూగి

పైసలు మస్తుగా వస్తాయి. ఈ కరువు రోజుల్లో సైడ్ బిజినెస్ గా ఉపయోగపడుతోంది "

అని చిదంంబర రహస్యం బయట పెట్టాడు సాహిత్యాభిమాని మస్కా మతలబురావు. 

 కడుపు కోసం కోటి విద్యల్లో ఇదొకటి కాబోసు అనుకున్నాడు అమాయక అప్పలస్వామి. 


 సమాప్తం

 ( మిత్రుడు జి. యస్. కె. సాయిబాబాకు ధన్యవాదాలు )


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


28 views0 comments

Comments


bottom of page