top of page

రమణీయం ఈ పున్నమి నాటి సంకీర్తనం!

Writer's picture: Pandranki SubramaniPandranki Subramani

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #రమణీయంఈపున్నమినాటిసంకీర్తనం, #RamaneeyamEePunnamiNatiSankeerthanam, #TeluguAdultStories, #తెలుగుశృంగార కథలు


Ramaneeyam Ee Punnami Nati Sankeerthanam - New Telugu Story Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 17/02/2025

రమణీయం ఈ పున్నమి నాటి సంకీర్తనం! - తెలుగు శృంగార కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


మిద్దెపైనున్న వాటర్ ట్యాంకు శుధ్ధి చేసి, పనిలో పనిగా దాని పరిసరాలలో ఉన్న చెత్తా చెదారాన్ని కూడా తీసివేసి తనకు తాను తృప్తిగా ఫీలవుతూ నిచ్చెన ద్వారా క్రిందకు దిగనారంభించాడు రమణ. ఇంటి యజమాని పాపారావుకి చెప్పిన పని దిగ్విజయంగా పూర్తిచేసినట్టు కబురందించాలి. అందినకాడ అందుకోవాలి. అతడలా తనలో తను ఆనందపడిపోతూ దిగాడో లేదో గట్టిగా గదమాయించే గొంతు వినిపించింది. 


సుందరి, పనిగత్తె మాచమ్మపైన ఆమె సహాయకురాలు సీతమ్మ పైన తిట్ల వర్షం కురిపిస్తూంది. సుందరిది అదుపులేని నాలిక. ఆమెకి అధికార దాహం యెక్కువ. పొడవైన విగ్రహం. బిగువైన అంగ సౌష్టవం. అదేమిటోమరి— ఎప్పుడెక్కడ యెవరితో మాట్లాడుతున్నా ఆమెకు తెలియకుండానే గుండ్రటి వక్షోజాలు ఆకాశం వేపు ఆరాటంతో యెగిసి పడుతుంటాయి. అంచేత మాట్లాడుతున్నవారు ఆమె వేపు చూసి మాట్లాడుతున్నారా లేక గుండెలోని గోపురాల వేపు చూసి మాట్లాడుతున్నారా అన్నది తేల్చుకోలేక సుందరి సహితం తరచూ తనలో తను సతమతమవు తుంటుంది. 


ఆమె నాలికలాగే అవి కూడా అదుపులో ఉండవు. నిప్పుకణికల్లా రాలిపడ్తూన్న తిట్లకు తట్టుకోలేక ఇద్దరు పని గత్తెలూ తలలు వంచుకుని నేలపైన బొటన వ్రేళ్ళతో రంగవళ్ళికలు దిద్దుతున్నారు. అప్పుడప్పుడు మౌనం బోడి గుండంత ఉత్తమం కదా! అది అందరికీ తెలిసిన విషయమే కదా! సుందరి మళ్ళీ అందుకుంది- “ఇదిగో! ఇదే ఆఖరి చాన్స్. మరొకసారి గాని ఇదే రీతిన బుగ్గన తాంబూలాలు బిగించుకుని నడుం ఆడించుకుంటూ ఆలస్యంగా అలక్ష్యంగా వచ్చారంటే రెండురోజుల పే- కట్ తో సరిపుచ్చను. ఏకంగా ఫైర్ చేయడమే—“


 ఇద్దరు భయంతో కెవ్వున అరచినంత పనిచేసారు- “ఫైర్ లో పడేస్తారా! ” అంటూ- 


సుందరి గదమాయించింది- “మీ ముఖం! ఫైర్ చేస్తానంటే ఫైర్ లో పడేయడం కాదు. డిస్మిస్ చేస్తానంటున్నాను. అర్థమైందా! “ 


ఇద్దరు పరిచారికలూ తలలూపుతూ గాయపడ్డ సైనికుల్లా ఇంట్లోపలకు నడిచారు. రమణ ముఖం అదోలా పెట్టి చూసాడు. నిజానికి సుందరి ఇక్కడకు రాకముందునుంచే ఈ యిద్దరు పనిగత్తెలూ యింట్లో ఊడిగం చేస్తూ పాపారావు దంపతులిద్దరి మన్ననలకు పాత్రులవుతూ చక్కదిద్దు కుంటున్నారు. ఎక్కణ్ణించి యే ఊరునుంచి వచ్చిందో గాని ఈ సుందరి వచ్చిన దగ్గర్నించి ఇద్దరూ యెత్తి పొడుపులకు లోనవుతున్నారు. ముందొచ్చిన కొమ్ములకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడే కదా! 


ఆ మాటకు వస్తే సుందరి మండే చూపుల్లో మాచమ్మ సీతమ్మలు మాత్రమేనా-- తనూ తన తోటి ఇద్దరు సేవకులు, గజేంద్రుడు- సదమయ్య కూడా మండే మంటల్లో కాలిపోయే గడ్డి పురుగుల్లా కొట్టు మిట్టాడుతూనే ఉన్నారు. ఏదెలాగయితే నేమి, సుందరిని టేకల్ చేయడం యెలాగో ముగ్గురూ యెంతగా బుర్ర బ్రద్దలు గొట్టుకున్నా సమస్య కొలిక్కిరావడం లేదు. ఆమెను యిక్కణ్ణించి కదపడం ఆషామాషీ వ్యవహారం కాదని ముగ్గురికీ తెలుసు. 


ఇంటి యజమాని పాపారావుగారి దూరపు బంధువులమ్మాయి కదూ! ఆమె జోలికి వెళ్ళడమంటే కొరివితో తలగోక్కోవ డమే-- వాళ్ళముందు ఒకే ఒక మార్గం ఉంది. సైలెంట్ వ్యూహం ఉంది. మూడో కంటికి తెలియని విధంగా కిడ్నాప్ చేయడమే! కాని—ఇది అతి బీభత్సకర యెత్తుగడ- వాసన పసిగట్టే జాగిలాలకు గాని దొరికితే మూగ్గురి మనుగడా చినిగిన ఈతాకు చాపే! చెరిగిన జిపీయెఫ్ మ్యాపే-- 


ఆరోజు సాయంత్రం ముగ్గురూ మరొక యెత్తుగడ రచించడం కోసం తుమ్మ చెట్టు క్రిందకు చేరారు. పచ్చి జామకాయ కొరుక్కు తింటూ ముగ్గురూ చాయ్- పే- చర్చా ఆరంభించారు- “ ఆమె అలా అదుపూ ఆపూ లేకుండా పెట్రేగిపోవడానికి కారణం ఉంది. బుర్రకు పనిచ్చి చెప్పగలరా! “- గజేంద్రుడు అడిగాడు. సదమయ్యా రమణా తల అడ్డంగా ఆడించారు తెలియదన్నట్టు—“ఆమెలో వాడీ వేడీ అంత కంతకూ యెక్కువై పోతూంది. అలా ఎక్కువైపోతూన్నదానిని ఏదో ఒక విధంగా క్రిందకు దించే తీరాలిగా!”


ఇద్దరూ యేక కంఠంతో స్పందించారు- “కారణం ఉందని నువ్వేగా అన్నావు! పరిష్కారం కూడా నువ్వే చెప్పు మరి- ”


గజేంద్ర ఆగి అన్నాడు- “పరిణేత లేకపోవడం”


ఆ మాటకు రమణ ఒళ్ళు మండింది- “నీ తక్కిడి బిక్కిడి పదప్రయోగం మండిపోనూ! అదేదో అచ్చ తెలుగులో చెప్పవచ్చుగా!”


గజేంద్ర కను బొమ లెగరిసి చూసాడు- “అంత అసహనం యెప్పుడు అలనర్చుకున్నావోయ్! —పరిణేత అంటే మగడు” 


“సుందరి కోసం మగణ్ణి వెతకడం మన పనా! ” అంటూ సదమయ్య సగం తిన్న జామికాయను ప్రక్కన పడవేసి, లేచాడు. 


సాయంత్రం రమణకు మేడ పైనుండి కబురొచ్చింది. ఈసారి అతడికి రమ్మనమని పిలిచింది యింటి యజమానురాలు వనజాక్షమ్మ. ఎక్కడో తోటమాలికి మొక్కలు ట్రిమ్ చేయడంలో చేయందిస్తూ నిల్చున్న రమణ రివ్వున గాలి తెమ్మరలా దూసు కు వచ్చాడు. ఓలింపిక్స్ రన్నర్ లా మేడ మెట్లెక్కాడు. ఆ వేగంలో క్రిందకు కూనిరాగం తీస్తూ దిగుతూన్న సుందరిని చూడలేదు. చూడకుండా దూసుకు వెళితే యేమవుతుందో అదే అయింది. రమణ ఆమెను గుండెలకెదురుగా ఢీ- కొట్టాడు. 


“అబ్బా! ”అంటూ జారి పడబోతున్న సుందరిని రెండు చేతులతో పొదవి పట్టుకున్నాడు. 


“బేవార్స్ అడ్డగాడిదా! నన్ను ఢీ కొట్టడ మే కాకుండా రెండు చేతులతో ఒళ్ళంతా తడుముతావా! ఎంత ధైర్యం నీకు? ”


 “దీనికి ధైర్యం యెందుకండీ! వీరం యెందుకండీ! పట్టు తప్పి పడిపోతూన్న ఆడదానిని ఆదరించి ఆదుకోవడానికి మనసుండాలే గాని—” 


ఆమాటకామె చిర్రుమంది- “నోర్మూస్తావా లేదా! చేయకూడనిది చేసేసి నాగభుషణంలా లెక్చర్ దంచుతావా! ఇప్పుడు నిటారుగా నిల్చుని చెప్పు. కావాలనే కదూ నన్ను ఢీ కొట్టావు? ” 


అప్పుడు చెదరని ముఖ భావంతో బదులిచ్చాడు “నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా! ” 

“ఎంతటి గుండెనిబ్బరం! తోట రాముడి డైలాగా చెప్తున్నావు? నిజమే చెప్పు! నిజం చెప్పే ముందు క్షమాపణ చెప్పు”


“చెప్పను. మైకంలో మునిగిపోవడం వల్ల అలా తానుగా జరిగిపోయింది”


అతడి సంజాయిషీ ఆమె స్వీకరించలేదు కోపంగా అడిగిందామె- “తాగావా! పూటుగా తాగొచ్చావా? ” 


“తాగానంటే ఆ తాగడం కాదు. నిజం చెప్పమన్నావుగా— నిజమే చెప్తున్నాను. నీ చీర వెనుక- టైట్ గా ఫిట్ గా వేసుకున్న రవికె లో దాగున్న నీ బిగి యవ్వనాన్ని చూసి మైకంలో మునిగాను. మునిగి అదిరిన గుండెతో అదుముకున్నాను, మనసార” 


“ఏంవిట్రోయ్ యేదేదో మాట్లాడేస్తున్నావు. ఎలాగుంది? ” హుంకరించిందామె. 


రమణ మత్తుగా చూస్తూ అన్నాడు- “బాగుంది. ఇంకా కావాలనుంది” 


సుందరి కన్నెర్ర చేసింది- “జాగ్రత్త! పులితో చెలగాటమాడుతున్నావు. రేపు ఉదయం లోపల నువ్వేమిటి? నీ స్థాయేమిటో తెలిసిపోతుంది” అని విసురుగా మెట్లు దిగివెళ్ళిపోయింది. 

ఇదంతా అల్లంత దూరాన నిల్చుని చూస్తూన్న గజేంద్ర, సదమయ్య ఉలిక్కిపడ్డారు. వార్- రొమాంటిక్ వార్ స్టార్టడ్-- 


ఆరోజు మునిమాపు వేళ మరొకసారి ముగ్గురూ తోటలో గుమికూడారు చెరొక మామిడి కాయ తింటూ-- ఎప్పటిలాగే గజేంద్ర సంభాషణ ఆరంభించాడు- “ఏదో సుందరిని నయాన భయాన నచ్చచెప్పి ఒక కొలిక్కి తీసుకు వచ్చి మాపైన చాడీలు చెప్పకుండా చేస్తావనుకున్నాం గాని యిలా ఒక్కసారిగా స్థాయి మరచి ప్రవరిస్తావనుకోలేదు”


రమణ చిరాగ్గా చూసి బదులిచ్చా డు- “ఇంతకీ నేనేమి చేసానంటావు?”


ఈసారి గజేంద్రుడు అందుకున్నాడు- “మరీ స్వీడుగా దూసుకు వెళ్తున్నట్టున్నావు. కోర్కెల గుర్రానికి కళ్ళెం పట్టి లాగమంటున్నాను” 


“ఔను దూకుడుగానే వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? ”


ఇద్దరూ తలలెత్తి ఎందుకన్నట్టు షార్పుగా చూసారు. 


“సుందరికెదురుగా ఆ స్వీడు అవసరమే. పొంగిపోతూన్న యెసరులోకి నీళ్ళు పోయాలి. లేకపోతే పొంగి పొర్లిపోతుంది. వృధాగా మిగిలిపోతుంది. ఉత్కృష్టమైన కార్యం సాధించాలంటే కాస్తంత తెగువ చూపించే తీరాలి” 


ఇద్దరూ యేక కంఠంతో రియాక్టయారు- “ఆ తెగువేమిటో నువ్వే చూపించు, మమ్మల్ని మాత్రం రచ్చబండ వద్దకు లాగకు. ” అంటూ లేచి వెళ్ళిపోయారిద్దరూ—


మరునాడు ఉదయం పొడవైన స్టూలుపైన నిల్చుని సుందరి పూల పందిరిని సరి చూసి యెండు టాకుల్ని త్రుంచుతూ ట్రిమ్ చేస్తూంది. అల్లంత దూరాన సదమయ్య కూర్చుని, ప్లాస్టిక్ వాటర్ పైపుని సరిచేస్తున్నాడు. మరొక దిక్కున గజేంద్ర నిల్చుని కర్రల్ని చెక్కుతున్నాడు. అప్పుడక్కడకు ములం కాడలు తెంచుకుని వస్తూన్న రమణ అరచినంత పని చేసాడు- “సుందరీ పడిపోతావు! క్రిందకు దిగు. త్వరగా--”


చిరు కోపంతో చూసిందామె. “ఏమీ కాదు. నన్ను నేను యెలా నిలద్రోక్కుకోవాలో నాకు బాగానే తెలుసు. నక్కజిత్తులమారి తనం మాని, అడగని సహాయానికి పూనుకోకుండా అటు యెడంగా జరుగు” ఆదేశించిందామె. 


అతడూరుకోలేదు. తగ్గలేదు. “అవ్వ! అలా అనకు సుందరీ! పొరపాటున జారిపడ్డావనుకో! కాలో చెయ్యో విరిగిందనుకో—నేను భరించలేను. నాది అసలే జారుడు గుండె- సారీ జాలిగుండె. కదలకుండా చెదర కుండా అలాగే నిల్చో—పుల్ల కూడా తగలనీ యకుండా దించేస్తాను“ అంటూ వెనుకనుంచి వాటేసుకున్నాడు. 


“విడిచి పెట్టు- విడిచి పెట్టు. జారిపడిపోతాను! ” 


అతను పంటిబి గువన నవ్వుని ఆపుకుంటూ అనుకున్నాడు- ‘నువ్వు పడాలనే కదే వయ్యారి భామినీ ఇంద్రలోక కామినీ- నేనిదంతా చేస్తున్నదీ!’ అని మనసున అనుకుంటూ ఆమెను ఉన్నపళాన రెండు చేతుల్లోకి తీసుకుని ఆమెతో బాటు ప్రక్కకు ఒరిగిపోతూ మెత్తని గడ్డిపైన పడ్డాడు. పడ్డ తరవాత అతడు సుందరిని విడిచి వెళ్ళనివ్వ లేదు. అమాంతం తనపైకి లాక్కుని మెడపైనా గుండెల దివ్వెల పైనా దొండ పండులాంటి పెదవుల పైనా గాఢంగా ముద్దుల వర్షం కురిపించ సాగాడు. 

అది చూసిన సదమయ్యా గజేంద్రా- “శ్రుతి మించి రాగాన పడుతుందిరోయ్! ” అనుకుంటూ ముఖాలు వెనక్కి తిప్పుకున్నారు.


రేపు యింటి యజమానీ యజమానురాలూ అప్పుడక్కడేమి జరిగిందో యెలా జరిగిందో చెప్పమని నిలదీస్తే తామిద్దరూ అదేమీ చూడలేదని చెప్పొద్దూ! 


 సుందరి రమణ పట్టునుండి విడిపించుకుని ఆవేశంతో కోపంతో కళ్ళు విప్పార్చింది- “నేనెంత హెచ్చరించినా నువ్వు తగ్గడం లేదు కదూ! అనుకున్నది సాధించే తీరాలన్న కసితో ఉడికెత్తి పోతున్నావన్నమాట! ”


అతడు చేతులు కట్టుకుని తొలగి నిల్చున్నాడు. “అలా అవటానికి కారణం ఉంది హృదయ నారీ! విషయానికి వస్తాను. నిజం చెప్పేదా అబధ్ధం చెప్పేదా! ” 


సుందరి కళ్ళనుండి నిప్పులు కురిపించింది- “చాలామందికి లోలోన గంపెడాశ ఉన్నా అందరూ తోట రాముడు కాలేరు. గడబిడ మాటలు కట్టిపెట్టి నిజమే చెప్పు వజ్రనాభా!” 


“నువ్వు ఊగుతూ నడిస్తే వయ్యారం వెల్లివిరుస్తుంది. నీ అడుగులు గాని తడబడితే నడుము జానపద నాట్యం చేస్తుంది. నువ్వు నవ్వితే కడప రాళ్ళు ఫెళ్ళున మెరుస్తాయి. అందుకే--”


సుందరి నిల్చోలేదు. “పైలా పచ్చీస్”- అంటూ రివ్వున వెళ్ళిపోయింది. అతడంతటితో ఊరుకోలేదు—పెదవుల మధ్య పద్య పఠనం గావించాడు- నెయ్యెడ మేలె చూతురు. గణింపరు జాణులు జారుబాటులన్-- 


ఆరోజు సాయంత్రం మిత్రులు ముగ్గురూ తోటలోని పచ్చి మాఁవిడి కాయ ముక్కలు కోసుకుని ఉప్పూ కారం తగిలించుకుని తింటున్నారు. అప్పుడు యెదురు చూడని విధంగా గేటు కీపర్ గోవిందం వాళ్ళ మధ్యకు వచ్చి నిల్చున్నాడు. 


“నోరూరిందా!” గోవిందం చేతిలో మాఁవిడి ముక్కను పెట్టబోయాడు గజేంద్ర. 


“నేను మీతో పంచుకు తినడానికి రాలేదు. అయ్యగారూ అమ్మగారూ నిన్ను వెంటనే రమ్మంటున్నారు” అంటూ రమణ చేయి పట్టుకున్నాడు.


 గజేంద్రకూ సదమయ్యకూ గతుక్కు మంది. వెనుక నుండి చప్పుడు లేకుండా తోటలోకి జారుకున్నారు. రమణ మరుమాట లేకుండా గోవిందుని వెంబడించాడు; ఈరోజుతో తన విధి మూడిందేమో అనుకుంటూ—


 అతడనుకున్నట్టే అక్కడ సుందరి, దంపతులిద్దరీ మధ్యా నిల్చుని ఉంది. రమణను చూసిన వెంటనే పాపారావు గద్దించాడు- “రాత్రి యేం చేసావు ? ” 


రమణ రెండు చేతులూ విప్పార్చి చూపిస్తూ యేమీ చేయలేదన్నాడు. 


వనజాక్షి గద్దించింది- “చేసావు! నువ్వేమి చేసావో మాకు తెలుసు. ఇప్పుడు చెప్పు- పొద్దుపోయిన తరవాత సుందరి గదిలోకి యెందుకు వెళ్ళావు? ” 


“వెళ్ళిన మాట వాస్తవమే గాని నేనేమి చేయలేదు” 


వనజాక్షమ్మ ఊరుకోలేదు. “నీ బోడి మాటలు కట్టి పెట్టు. అసలు దాని గది లోకి యెందుకు వెళ్ళావట?” 

మాటలు వెతుక్కుంటూ సరళంగా బదులిచ్చాడతను- “మస్కిటో కోయల్ వెలిగించడానికి వెళ్ళాను బాబుగారూ! ”


పాపారావు కోపంగా చూసాడు. “సుందరి నిన్నడిగిందా దోమల మందు కావాలని?”


రమణ తల అడ్డంగా ఆడించి బదులిచ్చాడు- “మాచమ్మ వచ్చి నాతో చెప్పింది యింటి నలువైపులా దోమలు కోరస్ గా గీతాలాపన చేస్తున్నాయని. అందుకే సుందరి గదిలోకి వెళ్ళి కోయల్ వెలిగించాను”

ఈసారి వనజాక్షి అందుకుంది- “వెలిగించావే అనుకో! ఆ తరవాత యేమి చేసావు? ” 


“నిజానికి నేనుగా యేమీ చేయలేదు. నన్ను చూసి అకారణంగా భయపడిపోయి కెవ్వున అరవబోయింది. అప్పుడు సుందరికి ధైర్యం చెప్పాను అరవకని-”


అప్పుడు పాపారావు కలుగచేసుకుని అడిగాడు- “ ధైర్యం యెలా చెప్పావు?” 


“మామూలుగానే చెప్పానయ్యా! ఎక్కడో ఉరిమిన మేఘానికి భయకంపితురాలైన సుందరిని గుండెలకు హత్తుకున్నాను” 


“దానికి సుందరేమి చేసింది? అరిచింది కదూ! ”


తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడతను- “లేదు. ఏమీ అనలేదు. నన్ను మరింత గట్టిగా హత్తుకుంది”


ఈసారి భార్యాభర్తలిద్దరూ “అర్థమైంది!” అని యేక కంఠంతో అన్నారు.


అక్కడ మూలన నిల్చున్న మాచమ్మ వేపు చూపు సారించి చూసారిద్దరూ. ఆమె వెంటనే గది బయటకు పరుగున వెళ్ళి మధ్య వయస్కుడైన అయ్యవారిని తీసుకు వచ్చింది. అతడి చేతిలో జాతకాలు తదితర పసుపు పూసిన పుస్తకాలు దొంతరగా ఉన్నాయి.


“ఇతనెవరో తెలుసు కదూ!” 


తెలుసన్నట్టు తలూపాడు రమణ. 


“వారం రోజుల్లోపల మీకిద్దరికీ పెళ్ళి. తిథి- నక్షత్రం గట్రా అయ్యవారు చెప్తారు. పెండ్లి పీటలపైన కూర్చున్నంత వరకూ ఒకరినొకరు చూసుకోరు. పలకరించుకోరు. సరేనా!”


రమణ నవ్వుతూ తలూపాడు సుందరి వేపు ఓర చూపులు చూస్తూ. సుందరి బుగ్గలనిండా సిగ్గుల్ని నింపుకుని తలదించుకుంది. పొంగారే యవ్వన కాలమది! ఆకాశమంతటా వ్యాపించే మల్లెల సమయమది! ఆశల తోటలో పరిమళించే యవ్వన సుగంధమది-- 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






 
 
 

Comments


bottom of page