'Ramani Ramanala Kalyanamu' written by Dasu Radhika
రచన : దాసు రాధిక
వీధితలుపు తెరుచుకొని ఒక అందమైన మహిళ లోపలికి చూస్తూ "భాగ్యలక్ష్మి గారు ఉన్నారా?" అనికేకేసింది.
చలపతి ఆమెను చూసి ఇంట్లోకి చూస్తూ, "చిట్టెమ్మా" నీ కోసం ఎవరో వచ్చారు" అన్నాడు. తిరిగి చూస్తే వచ్చినావిడ వెళ్లిపోతోంది.
"ఏవమ్మోయ్, ఒక్క నిమిషము ఉంటే వస్తుంది, పిలిచాను" అన్నాడు చలపతి.
" క్షమించండి పొరపాటున వచ్చాను, ఈ ఇల్లే అనుకోని" అని వచ్చినావిడ బదులిచ్చింది.
ఇంతలోకే చిట్టెమ్మ బయటకు వచ్చి "ఓహ్ మీరా, లోపలకి రండి గీత" అన్నది.
చలపతిని గీతకు పరిచయం చేస్తూ, "మా వారు" అని చలపతి తో గీతను చూపిస్తూ “వీళ్ళు మన పక్కింట్లోకి దిగారు” అన్నది.
"చిట్టెమ్మ అన్న పిలుపు విని మీ ఇల్లు కాదనుకొని వెళ్లిపోతున్నాను" అన్నది గీత.
"మీకు చెప్పాగా ఆ రోజూ, అదే మీరు పాలు పొంగించుకున్న రోోజు, మీ పక్క ఇల్లే మేముండేదని" అన్నది చిట్టెమ్మ నవ్వుతూ.
"మా ఆయన మా పెళ్ళైన కొత్తల్లోనే నా అస్సలు పేరు మార్చేసి చిట్టెమ్మ అనే పిలుపును ప్రారంభించారు", అంటూ కూర్చోమన్నది గీతను.
"ఎవరైనా పనిమనిషి దొరుకుతుందేమోననీ మీతో చెప్పి పోదామనొచ్చా" అన్నది గీత.
“రేపు మా పనిమనిషి మంగ పనికి వచ్చినప్పుడు మీరు పిలిచారని చెప్పి పంపిస్తాను" అన్నది చిట్టెమ్మ. "వస్తానండి , ఇంకా సామాన్లు సర్దుతున్నాము" అని వెళ్లి పోయింది గీత.
"చూసారా, నా కోసం వచ్చిన వాళ్ళు చిట్టెమ్మ అనే పిలుపు విని వెళ్లిపోతున్నారు” అని మూతి బిగించి, "అంతా మీ వల్లే" అని రుసరుస లాడింది చలపతి మీద.
" నీకెన్నో సార్లు చెప్పనుగా చిట్టెమ్మా, నాకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాటరీ నే గుర్తుకొస్తుంది, మన పెళ్ళైన కొత్తల్లో మరీ ఎక్కువుగా ఉండేది ప్రజలలో ఆ పిచ్చి. అందరి నోటా భాగ్యలక్ష్మి అనే మాటే ఉండేది. సరే కాని, ఇవాళ ఏం వంట చేస్తున్నావు చిట్టీ” అని ప్రేమ గా అడిగాడు చలపతి.
“కంది పచ్చడి, వంకాయ పులుసు పచ్చడి మీకు ఇష్టముగా, కాసిని వడియాలు వేయిస్తున్నాను" అని అంతే ప్రేమ గా జవాబిచ్చింది భాగ్యలక్ష్మి అలియాస్ చిట్టెమ్మ. "మరీ మీ కొత్త కథ పేరేంటి?" అని చలపతి ని అడిగింది. "మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అన్నాడు చలపతి. "పాత చింతకాయ పచ్చడి" అంది చిట్టెమ్మ.
“ఎంత మంది రాసి ఉండరు ఇప్పటికి ఇటువంటిది…” అన్నది ఎగతాళిగా చిట్టెమ్మ...
"నేను కథ రాసాక అది పాత చింతకాయో లేక కొత్తావకాయో నీకే తెలుస్తుంది” అన్నాడు చలపతి...
ఉల్లిపాయలు తరుగుతూ కళ్లనీళ్లు తుడుచుకుంటూ ముక్కులు ఎగపీలుస్తూ, "ఆ కోత్తదనమేంటో నాతో చెప్పరూ" అన్నది చిట్టెమ్మ.
"కథలో ఉత్కంఠత లేకుండా చెప్పేస్తే ఇంకేముంటుంది, కొంచెం ఓపిక పట్టు" అన్నాడు చలపతి.
"అయిదేళ్లయింది మీరు ఉద్యోగ విరమణ చేసి. మొదట్లో నాలుగయిదు వీక్లీలకు సంవత్సరము లో అరడజను మార్లు కథలు, వ్యాసాలు పంపిస్తే చాలా ఎక్కువ… క్రమేణ మీకు పని పెరిగింది, ఇప్పుడు ఒక యాడాది నుండి నెలవారి ఒక వార పత్రిక కు మీరు కథలు వ్రాస్తున్నారు. ఇన్నాళ్లు నాకు కూడా నా బాధ్యతలతో, అమ్మాయిల పెళ్లిళ్ళు, పురుళ్ళ తో సరిపోయిందిగా... ఈ మాత్రము తీరికగా మనము మాట్లాడుకుంది ఎప్పుడు? అందుకే ఏదో మీరు రాస్తున్న కథ గురించి ప్రస్తావించాను" పచ్చడి నూరుతూ సంభాషిస్తోంది చిట్టెమ్మ.
"మరే... ఏదో నాకొస్తోన్న ప్రభుత్వ భరణమూ, ఈ వ్రాతలమీద వచ్చే కొద్ధి పాటి ఆదాయము తో మన అవసరాలు తీరిపోయి జీవితము వెళ్ళిపోతే చాలు చిట్టెమ్మా..." అని చలపతి అన్నాడు.
“నా కథను పుస్తకము లో అచ్చు వేశాక నువ్వు కూడా అందరు పాఠకుల తో పాటు చదువు. మీ ఆడవాళ్లు అసలే ఏమి మనసు లో దాచుకోలేరు... పొద్దున్నే వాకింగ్ కు వెళ్లినప్పుడు నీ స్నేహితులతో లేదా నీ దగ్గర కుట్లు అల్లికలు నేర్చుకుంటున్న నీ విద్యార్థినిమణులకు నా కథ, అందులోని పాత్రలను బహిర్గతం చేశావనుకో.. మొత్తానికే మోసం వస్తుంది... మన ఇంట్లో పని చేసే మంగకు తెలిస్తే ఇంక ఈ సారి దాని పుణ్యమా అని నా కధ చదవడం కోసం వీక్లీ కొనే ఖర్చు ఈ ఊళ్లో జనానికి తప్పుతుంది" అని వాపోయాడు చలపతి.
"దేవుడి దయ వల్ల మన అమ్మాయిలు పెద్దింటి కోడళ్ళయ్యారు. ఇద్దరికీ పిల్లలు వెంటవెంటనే పుట్టారు. కొంచెమైనా వాళ్ళ హోదా కు తగ్గట్లు వేడుకలు జరపాలి కదా! ఎంత కోరి చేసుకున్నా వాళ్ళు మన పిల్లలను... రెండు సంబంధాలు అదృష్టవశాత్తు
వచ్చినవే...
నాయనమ్మ అందమంతా ఇద్దరూ పంచుకున్నారుగా...
వింటున్నారా... మీతోనే మాట్లాడాను" అని అలా వంట పూర్తయ్యే వరకు చిట్టెమ్మ మాట్లాడుతూనే ఉంది ...
" ఏదో వేడి నీళ్లకు చన్నీళ్ళు ...నేను కుట్టు పని మొదలు పెట్టి ఇంతో అంతో ఆ వచ్చే దాన్ని ఇంటికి వాడుతున్నాను... జాకెట్లతో మొదలై ఇప్పుడు తెలిసిన వాళ్లకు మగ్గం పని కూడా చేస్తున్నాను. నెలకి అయిదు వందలు వచ్చేది ఒకప్పుడు, అదే అయిదు వేల నుండి పది వేలొస్తోంది ఇప్పుడు"...
ఈ విధముగా ఒక పక్కన సంభాషణ జరుగుతోంది, మరో పక్కన చలపతి లోని కథకుడు తన కథ లోని పాత్రల నామధేయము, వాటిని ఎలా మలచాలో తీవ్రముగా ఆలోచించి మనసు లో కథను అల్లేస్తున్నాడు.
సాయంత్రం నాలుగింటికి కుట్లు అల్లికల తరగతి కి విద్యార్థినులు వచ్చి ఒక గంట నేర్చుకొని వెళ్లారు. రోజూ అదే సమయానికి చలపతి కలము కాగితము మీద పెట్టి తన పాత్రలకు జీవము పోస్తాడు... ఈ తన కథా ప్రపంచము లో నుండి మళ్ళీ రాత్రి భోజనం వేళ్టికి, అంటే సరిగ్గా 8 గంటలకు వాస్తవిక లోకములోకి మరల తిరిగొస్తాడు...
రమణి, జననీ లు అక్క చెల్లెళ్లు. దురదృష్టవశాత్తు తల్లి తండ్రులను ఒక రైలు ప్రమాదంలో కోల్పోయారు. అప్పటికి జననీ కాలేజి చదువు పూర్తి చేసి రకరకాల ప్రభుత్వము నిర్వహించే పోటీ పరీక్షలు రాసేందుకు తయారవుతోంది. చెల్లి రమణి ఇంటర్ కొచ్చింది. ఇద్దరూ చెప్పుకోతగ్గ పిల్లలు. వాళ్ల మేనమామ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇద్దరూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఆ వచ్చిన ఆదాయము లో కొద్దిగా సొంత ఖర్చులకు ఉంచుకొని మిగిలింది ఇంట్లో వారి తిండి ఖర్చు కింద ఇచ్చేవారు.
వాళ్ళ అమ్మా నాన్న ల డబ్బు ను వాళ్ళ పెళ్ళిళ్ళ కోసము దాచిపెట్టాడు మేనమామ.
తల్లితండ్రుల స్వాభిమానమే పిల్లలక్కూడా వచ్చిందని అందరూ అనుకునేవారు. జననీ కు దూరపు బంధువులలో నే చక్కగా చదువుకొని స్థిర పడ్డ సూర్యానికిచ్చి వివాహం చేసాడు వాళ్ళ మేనమామ, తన అక్క కోరిక మేరకు. జననీ తన ఉద్యోగ ప్రయత్నాలు విరమించి పెళ్లికి సరేనన్నది
.. జననీ తల్లిదండ్రులు బ్రతికున్న రోజుల్లోనే ఈ సంబంధము ఇరువురు వర్గాలు సమ్మతించి ఖాయపర్చుకొన్నారు… సూర్యం కూడా జననీ మీద మనసు పారేసుకున్నాడు... ఆ రోజుల్లో బ్యాంక్ ఉద్యోగమంటే చాలా గొప్ప. ఒక్కడే తమ్ముడతనికి, ఇంజినీరింగ్ చదువుతున్న రమణ.
సూర్యం జననీలకు ఇద్దరు ఆడపిల్లలు కవలలు పుట్టారు. తల్లితండ్రిని మైమరపించే అత్తమామలు, అన్యోన్యమైన దాంపత్యం, ఇద్దరు పిల్లలు, చూస్తూ చూస్తూ ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి జననీ జీవితంలో. రమణి తన అక్క ఇంటికి పండుగలకు, పబ్బాలకు వెళ్తూ వస్తూ ఉంది...అప్పుడప్పుడు మేనమామ కుటుంబము ఏదైనా ఊరు వెళ్లినా అక్క దగ్గర ఉండి వచ్చేది. అక్క పిల్లల తో హాయిగా గడిచిపోయేది రమణికు. డిగ్రీ అయిపోయి పై చదువు చదవాలా లేక వృత్తి నైపుణ్యతను అభివృద్ధి పరుచుకొని ఉద్యోగం చేసుకోవాలా అనుకుంటున్న తరుణంలో రమణ రమణికి ప్రేమ లేఖ అందించి వివాహ ప్రస్తావన తీసుకొచ్చాడు. రమణికి ఇంకా ఏదో సాధించాలని బలమైన కోరిక. విదేశాలకు వెళ్ళాలి, తన కలలు పండించుకోవాలని, ఇలా ఆ వయసు ఆడపిల్లల కోరికలు గుర్రాలైనట్లు ఊహా ప్రపంచము లో విహరిస్తూ ఉండేది.
మేనమామక్కూడా ఇష్టము లేకపోయింది. ఒకే ఇంట్లో అక్కచెల్లెళ్లనిస్తే ఎవరో ఒకరే బావుంటారు అన్నది పెద్దల విశ్వాసము.
రెండు ఏళ్ళు గడిచిపోయాయి... రమణికి వచ్చిన ఉద్యోగ అవకాశాలు కొన్ని వదులుకోవల్సి వచ్చింది. మేనమామ భార్యకు కాలాంతకమైన జబ్బు చేసి అవస్థ పడుతున్నది. మావయ్య, పిల్లలు, ఇంటి పనులు, ఆసుపత్రి తిరుగుళ్లు ఇలా రమణికి ఎప్పుడు తెల్లవారుతోందో ఎప్పుడు పొద్దుగూకుతోందో కూడా తెలియకుండా గడిచిపోయింది. మేనమామ పిల్లలిద్దరూ వారికి వివాహమైన చాలా ఏళ్ల తర్వాత కలగటంవల్ల చిన్న వాళ్ళింకా. అత్తయ్యకు
పుట్టింటి ఆస్తి వచ్చింది. అందువల్ల ఈ కష్టకాలం జరిగిపోతోంది...
రమణి మనసు వెన్న. వాళ్ళ కుటుంబం పట్ల తనకున్న కృతజ్ఞతా భావన వల్ల తన కలలను పక్కకు తోసేసింది. ఇంకా చెప్పాలంటే వాళ్లలోనే తల్లిదండ్రులను చూసుకుంటోంది.
రమణకు సూర్యము సంబంధాలు చూస్తున్నాడు. మనసు లో రమణిని పెట్టుకొని చూసేసరికి ఏ అమ్మాయి నచ్చట్లేదతనికి. ఒక ఏడాది గడిచిపోయింది. ప్రశాంతంగా ఉండే రమణ తల్లి కూడా తన ఆవేదన కొడుక్కి చెప్పుకుంది..."నీ పెళ్లి చూసి పోవాలనుందిరా, చేస్కోరా త్వరగా" అన్నది.
ఆ రోజుల్లోనే ఒక సంబంధము విశాఖపట్నం నుండి వచ్చింది. అమ్మాయి సీత చాలా అందంగా ఉంది. చదువుకుంది. మొత్తానికి రమణ తల్లి కోరికను మన్నించి పెళ్ళికొప్పుకున్నాడు. సీత వైపు నుండి ఏ కబురు రాలేదు. అప్పుడు సూర్యము కనుక్కుంటే సీత తల్లితండ్రులకు మొహం చెల్లలేదు. సీత పెళ్ళికి నిరాకరించింది. రమణ కు అది చాలా పెద్ద దెబ్బ. ఇలా రెండోసారి జరగటం తో రమణ మనసు గాయపడింది...
అటు రమణికి ముమ్మరంగా సంబంధాలు చూస్తున్నాడు మేనమామ, తన భార్య కొంచెం కొలుకోగానే...ఈ భాగ్యం ఎన్నాళ్ళో తెలీదు... భార్య ఆ మాత్రము ఉండగానే రమణి పెళ్ళి చెయ్యలనుకొన్నాడు. అనుకోకుండా రమణి తండ్రి వైపు నుండి మంచి సంబంధము వచ్చింది. అబ్బాయి రఘు అన్ని విధాలా యోగ్యుడు, అందగాడు. రమణి ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. రమణి తండ్రి మీదున్న అభిమానం వల్ల రఘు తల్లిదండ్రులు బాగా ఆస్తి పరులైనా కూడా రమణిని కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండువారాలైనా కూడా రఘు మౌనముగా ఉండేసరికి విషయము అడిగారు తల్లిదండ్రులు. అప్పుడే విశాఖపట్నం నుండి ఎవరో సీత ఫోను చేసింది రఘు కోసం. సంగతి అర్థమై నిర్ఘాంతపోయారు రఘు అమ్మా నాన్న. సీతా రఘులు ప్రేమించుకున్నారు చదువుకొనే రోజుల్లో. ఇంట్లో తెలియకుండా ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నారు. రఘు పిరికివాడని గ్రహించి ధైర్యముగా ఇంట్లో చెప్పి, ఏకంగా రఘు ఇంటికి సీత ఫోను చేసింది... ఆటో ఇటో పెళ్లి గురించి తేల్చుకోవాలని... రఘు సీత లు పెద్దలనుమతించకపోయినా పెళ్ళి చేసుకున్నారు...
సీత ఎవరో కాదు, రమణ చేసుకోక చేసుకోక చేసుకుందామనుకున్న పిల్లే...
మరి రమణి రమణుల మాటేంటి??
పాత రోజుల్లో పెళ్లి సంబంధము చూస్తుండగానే పెళ్లైపోయినట్లు బంధువులు, ఇరుగు పొరుగు అందరూ మాట్లాడుకునేవారు...
రమణి రమణుల విషయం లో కూడా అదే జరిగింది...
అందరూ నవ్వులాటకు రమణీ మొగుడికీ, రమణ పెళ్లానికీ పెళ్ళని చెప్పుకున్నారు... అదే రఘు సీతల పెళ్లి...
ఒక సంవత్సరం తర్వాత రమణను ఇష్టపడి చేసుకుంది శారద, ఆ తర్వాత సంవత్సరం రమణీ శరత్ ల వివాహమైంది... ఎక్కడ ఎవరితో రాసి పెడ్తే వాళ్ళతోనే అవుతాయి పెళ్లిళ్లు... అందుకే "మ్యారేజెస్.....హెవెన్"
తర్వాత వారము సంచిక లో "మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హెవెన్" కథను ప్రచురించారు. చాలా ఆదరణ పొందింది.
చలపతి వ్రాసిన కథ చదివి చిట్టెమ్మ కు కోపము వచ్చింది. పాత్రలతో ఆడుకుంటూ వాళ్ళను ఎడిపించి జంటలను అటు ఇటు మార్చేస్తే ఎమోస్తుంది మీకు?
కొత్తావకాయంటే ఇదా?"
"నువ్వు వంట చెయ్యాలి, నేను కథలు వ్రాయాలి చిట్టెమ్మ" అన్నాడు చలపతి
"బయటికి రండి, రకరకాలుగా చెప్పుకుంటున్నారు అందరూ మీ కథ గురించి" అని కారాలు మిరియాలు నూరుతోంది చిట్టెమ్మ... మొన్న కిరాణా కొట్టుకు వెళ్తే, శెట్టి అన్నాడు " మీ ఆయన భలే చెడుగుడు ఆడాడు గా కథలోని పాత్రలతో...
మన ఎదురింటి గాయత్రి రేపేప్పుడో దీని మీద ఒక చర్చా గోష్ఠి పెడుతోందిట, నెలకోసారి చీటి పాడుతారుగా వాళ్ళింట్లో...అందరూ చేరుతారు"...
"చిట్టి, అంత మాత్రాన వాళ్లకు నచ్చలేదని కాదే, పై పెచ్చు బాగా నచ్చిందనుకోవాలి.." అన్నాడు చలపతి.
"మీరు మొదట్నుంచీ చాలా తేడాగా ఉన్నారు లెండి. అందుకే నా పేరు భాగ్యలక్ష్మి అయితే మీకు మటుకు లాటరీ గుర్తుకొచ్చింది."
"ఇది మటుకు నిజం చెప్పావు చిట్టెమ్మా. కవులు, రచయితలు కొంచెం తేడాగానే ఉంటారు" నవ్వాడు చలపతి.
"రమణి రమణుల పెళ్ళి తిన్నగా చేసేస్తే మీ సొమ్మేంపోయేదిట" అని చిట్టెమ్మ ఇంకా వాదిస్తోంది.
"అప్పుడు కథ కంచికి, ఇంకేముంటుంది.."అన్నాడు చలపతి.
" అలా కాకుండా పులుసు పెడ్తున్నారు మీరు"... అని మూతి ముప్పైమూడు వంకరలు తిప్పింది చిట్టెమ్మ.
" నువ్వు వెయ్యవూ కూర లో కూర పొడి, అది వేస్తే రుచి వస్తుంది, ఉత్త కూర కంటే, లేదా కొబ్బరేస్తావు... అలాగే కథలో పులుసు పెడ్తేనే రసపట్టుగా ఉంటుంది మరి"... అన్నాడు చలపతి.
అదే సమయంలో పక్కింటి గీత చలపతిని కలవాలని ఆ వార పత్రిక తో సహా వచ్చింది.
'వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు ఎలా రాయగలిగారు మీరు? మీకు మా ఆయన తెలుసా?" అని ప్రశ్నించింది. చిట్టెమ్మ చలపతులకు ఏమి అర్ధం కాలేదు…
"అస్సలు ఈ ప్రాంతానికి దగ్గర లో కూడా మేము ఇదివరకు వచ్చి ఉండలేదు. కానీ మా కథను మీరు మీ కథగా వ్రాసారు” అన్నది గీత…
“పెద్దల ఆశీర్వాదం దక్కని వాళ్ళము... మీరే మమ్మల్ని దీవించాలి ... మా ఇంటికి భోజనానికి రావాలి మీరు" అన్నది గీత...
"సరేనమ్మా, వీలు చేసుకొని వస్తాము" అన్నాడు గీత తో చలపతి.
"వస్తానండి" అని ఇంకా కూర్చోకుండా గీత వెళ్ళిపోయింది.
"మీరు నకలు చేశారా?అదే అనుకున్నా” అన్నది చిట్టెమ్మ చలపతి వైపు కొరకొరా చూస్తూ...
"అస్సలు గీతా వాళ్ల కథ మీకెలా తెలుసు?నాకే ఇంకా ఏమీ తెలీదు"... అని దుఃఖమొచ్చింది చిట్టెమ్మ కు.
చలపతి కథలోని రఘు సీతలు నిజ జీవితము లో గీతా మనోహరులు... వాళ్ళది సరిగ్గా అటువంటి ప్రేమ వివాహమే...
"కథలు వాస్తవికతను పోలి ఉంటాయి కానీ తన కల్పనాశక్తి తో ఎంత జీవము పోసిన పాత్రైతే మాత్రము, ఇలా పాత్రలు సరాసరి ఇంటికే నడిచొచ్చి తమ రచయిత తో మాట్లాడ్తాయా" అని దిగ్భ్రాంతి చెందాడు చలపతి....
"నా బాధను కూడా పట్టించుకోరు" అని చిట్టెమ్మ గారాలు పోతే, ఆలోచనలలో నుండి బయటకు వచ్చి పగలుబడి నవ్వుతూ "ఎంత అమాయకపు పక్షివే నువ్వు నా చిట్టి భాగ్యం" అని దగ్గరకు తీసుకున్నాడు చలపతి.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం
పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక
వయసు: 52 సం.
నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)
స్వస్థలం: తెనాలి
చదువు: BA English Litt., B.Ed
వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.
ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం
పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.
స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.
కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.
ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.
Comments