top of page
Writer's pictureNallabati Raghavendra Rao

రామాపురంలో ఓ చిత్రం జరిగింది



'Ramapuramlo O Chitram Jarigindi' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 22/09/2024 

'రామాపురంలో ఓ చిత్రం జరిగిందితెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ గ్రామం పేరు రామాపురం. 


చక్కటి చల్లటి వాతావరణం.. అందమైన వీధులు. ఓ పక్క అతి పెద్ద రామాలయం. మరో పక్క ఇంకా పెద్ద శివాలయం. ఊరికి కొంచెం దూరాన బొడ్డు గారి దిబ్బ దాటాక.. పొలాలలో మధ్యగా వెలసిన గ్రామదేవత పోలేరమ్మ గుడి. ఊరి చుట్టూరు పంట పొలాలు.. ఆ పొలాలు ఆహ్లాద భరితంగా గుబురు గుబురుగా నిండు గర్భిణి లా ఊగుతూ ఉంటాయి వరి కంకులతో.. ఇక పిచ్చుకలు, పావురాలు చిలకలు, కొంగలు, బాతులు, కోడిపుంజులు, కోడి పెట్టలు, కుక్కపిల్లలు.. వీటన్నిటితో చెప్పనలవి కానంత సందడి ఎప్పుడూ ఉంటుంది.. ఆ రామాపురం గ్రామంలో. 


ప్రతి వీధి చివర.. అరటి చెట్లు, కొబ్బరిచెట్లు, రావి చెట్లు, మామిడి చెట్లు ఇంకా వేప చెట్లు ఇవన్నీ కాకుండా గ్రామంలో అందరి ఇళ్ల ముందర రకరకాల పూల చెట్లు. 


ఊరికి మధ్యలో కచేరి చావడి. దానిని ఆనుకొని ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర ఊరిలోకి వచ్చి జనాలను తీసుకువెళ్లే ఒకే ఒక బస్సు ఆగే స్థలం. 


అక్కడే గూడు రిక్షాబళ్ళు ఒక పది వరకు అలా నిలబడి ఉంటాయి బేరాల కోసం. రెండు మూడు గుర్రపు బళ్ళు.. ఒకటి రెండు డొక్కు ఆటోలు కూడా బేరాలు లేక అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. 


ఊరు నిండా పశువులు, పశువుల కొట్టాలు. రైతులు.. కూలి పనివాళ్ళు గడ్డిమోపులను మోసుకుంటూ అటు ఇటు తిరిగే హడావిడులు. 


ఈశాన్యం మూలన తూర్పు వైపున అతిపెద్ద నీటి చెరువులు.. అక్కడక్కడ నీటి ఊటబావులు. 


దూరంగా పెద్ద వంతెనతో పెద్ద కాలువ. 


ఏ పండుగ వచ్చినా ఊరంతా స్వర్గలోకం అయిపో తుంది. 


ఆ సరదాలు, సంబరాలు, కొత్తబట్టలు, కోలాహలాలు, పిల్లల ఆటలు, అమ్మలక్కల ఆనందాలు, 


ముసలి వాళ్ళ కబుర్లు, పిండి వంటల గుమగుమలు.. 


ఇక సంక్రాంతి పండుగ వస్తే చెప్పనవసరం లేదు. పండుగకు 15 రోజులు ముందు తర్వాత కూడా గ్రామం అంతా పరమానందభరితం అయిపోయి ఉంటుంది. 


కాటికి కాలు చాపిన ముదుసలి వాళ్లు కూడ.. ‘అమ్మో.. పది రోజుల్లో పండగ వచ్చేస్తుంది కదా పండగ సర దాలు అన్నీ చూసి పండగ వెళ్లాక తీరుబడిగా చద్దాం..’ అని చావును కూడా వాయిదా వేసుకుంటారు అన్న మాట. అంత ఆనంద పడిపోతారు సంక్రాంతి పండుగ అంటే ఆ గ్రామంలో.. 


ఆ గ్రామం పేరు రామాపురం.. మరిచిపోలేదు కదా మీరంతా.. 


సరే.. కథలోకి వెళ్దాం మరి. ఇంత వరకు చెప్పుకు న్నదంతా ఇప్పటి విషయం కాదండి బాబు.. 


ఇదంతా ఓ పది సంవత్సరాల క్రితం విషయం అండి బాబు. ఓ అయిదు ఆరు సంవత్సరాల క్రితం కూడా అంత కాకపోయినా ఓ మాదిరిగా కళకళలాడుతుం డేవి.. గ్రామాలు. 


గతం గతః ఆ గత కాలంలో నుంచి.. ఆ మధురమైన ఆనందసవ్వడిలోంచి నెమ్మదిగా ప్రస్తుతం లోకి వచ్చే ద్దాం.. అంటే ప్రస్తుత లోకంలో.. అదే రామాపురం గ్రామంలో.. ప్రస్తుతం జరుగుతున్న కథ వింటున్నాం అన్నమాట. 


ఇప్పుడు రామాపురం గ్రామం కాదు రూపురేఖలు మారిపోయి.. బుల్లి టౌన్ లా మారిపోతూ మారిపోతూ గత కాల సాంప్రదాయాలకు, అందాలకుఆనందాలకు.. అలా అలా దూరమైపోతూ ఉన్నదన్నమాట. 


  *** 


అదిగో.. అదిగదిగో ఆ కనిపిస్తుంది చూడండి.. లావు పాటి కర్ర స్తంభాలతో, పెద్ద పెద్ద మెట్లుతో రోడ్డుకు అటు వైపున కనిపిస్తోంది చూడండి ఆ వాడపల్లి పెంకుల ఇల్లే సూర్యకాంతమ్మ గారిది. 


సూర్యకాంతమ్మ గారి మనవళ్ళు, మనవరాళ్లు సంక్రాంతి పండుగకు వచ్చారు. దూర ప్రాంతంలో టౌన్ల నుంచి, సిటీల నుంచి. ముఖ్యంగా అమెరికా నుండి సూర్య కాంతమ్మ గారి మూడవ మనవడు రాంపండు ఆరు ఏళ్ల తర్వాత మొదటగా రెండు రోజుల క్రితమే వచ్చాడు.. అమెరికా కుర్రవాళ్ళకి ప్రతి సంవత్సరం రావడానికి కుదరదు కదా. అందుకనే ఇప్పటివరకు ప్రతి సంవత్సరం రాలేకపోయాడు. అయితే అతను వచ్చింది మాత్రం అందరితో పండుగ ఆనందంగా గడపడానికి.. సరదాగా ఆడుకోడానికి షికార్లు తిరగడానికి అని కాకుండా.. సంవత్సరం నుండి కోమాలో కొట్టు మిట్టాడుతున్న తన నానమ్మను చూడాలి అన్న ప్రేమ తో.. వచ్చాడు. రాంపండుఇప్పుడిప్పుడే పెళ్లీడుకు అడుగుపెట్టిన కుర్రాడు.. మంచి బుద్ధిమంతుడు. 


 *** ***


సంక్రాంతి పండుగ ఆరోజే.. 


సంక్రాంతి పండుగ రోజు తెల్లవారి నుండి వీధిలో కోలాహలం మొదలైపోయింది. కాస్త వెలుగు రాబోతుండగా.. హరిదాసు వస్తున్న హడావిడి ప్రారంభం అయింది. 


రాంపండు.. నానమ్మ పక్కలోనే పక్కగా మంచం మీద కూర్చుని ఉన్నాడు. 


''శ్రీమద్రమారమణ గోవిందో హరి.. రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ.. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా.. " అంటూ హరిదాసు వీధిలో నుండి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. 


"నానమ్మా.. చూడవే.. అడిగోనే హరిదాసు ఎంతో అందం గా తయారై వెళ్తున్నాడో చూడు. మెడలో దండ, చేతి లో చిడతలు, నెత్తి మీద రంగురంగుల కలశపాత్ర.. ప్రతి గుమ్మం దగ్గర కూర్చుంటూ.. 


కలశపాత్రతో బియ్యం డబ్బులు కూడా వేయించు కుంటున్నాడు.. అబ్బా చూడవే నానమ్మా".. 


అంటూ ఆమెకు హరిదాసు ని చూపించే ప్రయత్నం చేశాడు మనవడు రాంపండు. అబ్బే సూర్య కాంతమ్మ గారు కొంచెం కూడా అర్థం చేసుకుని వినే స్థితిలో లేరు. 


మరో ఐదు నిమిషాలు గడిచాక.. 


" అమ్మ.. తల్లి.. లక్ష్మక్క.. సుబ్బాయమ్మక్క.. పడి పోతున్నానమ్మోయ్.. పప్పుదాక లో పడిపోతున్నానమ్మో.. "

.. కొమ్మదాసరి వీధిలో హడావుడి చేస్తూ వెళ్తున్నాడు. 


" అబ్బా.. చూడవే అడుగోనే మన కొమ్మదాసరి. వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు.. నెత్తిన కుచ్చు టోపితో చేతిలో చిన్న జూకతో వచ్చేసాడు.. మన వీధి పిల్ల లంతా అతని చుట్టూనే తిరుగుతున్నారు చూడవే.. ! నానమ్మా.. కళ్ళు తెరిచే ఉన్నాయి.. అయినా నవ్వవు.. మాట్లాడవు.. గిల్లిన కదలవు.. చీమ కుట్టిన నీకు తెలియదు.. ఏమిటే నానమ్మా నీకు ఈ పరిస్థితి..


డాక్టర్ ఇది.. "కోమా స్థితి" అన్నాడు.. అయితే మాత్రం రాకరాక చాలా సంవత్సరాల తర్వాత అమెరికా నుండి వచ్చిన ఈ మనవడి కోసం ఒక్క మాట మాట్లాడలేవా.. ? సరే.. ఎన్నాళ్ళు ఇలా పడి ఉంటావు??"


 అంటూ తన నానమ్మ సూర్యకాంతమ్మ గారిని కదిలించి ఆ విశేషాలు చూపించాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు.. రాంపండు. 


ఇంకాసేపటికి.. 


"హరహర మహాదేవ శంభోశంకర.. హరహర మహా దేవ శంభోశంకర.. " జంగందేవర పెద్ద పెద్ద అడుగులు వేసు కుంటూ శంఖం ఊదుకుంటూ వీధిలో వెళ్తున్నాడు. 


"ఇలా చూడవే.. అడుగో జంగందేవర!! మన ఊరి వాడే.. సుబ్బయ్యదేవర! నా చిన్నప్పుడు వాళ్ళ అబ్బా యి నేను కలిసి చదువుకున్నాం కూడా. భలే భలే మేకప్! చేతిలో పెద్దగంట మోతతో సూపర్గా ఉన్నాడు. ఈ కిటికీ దగ్గర నీకు ఈ ప్రత్యేక మంచంవేసి ఈపండగ పూట వచ్చే వీళ్ళందర్నీ.. నువ్వు కళ్ళారా గతంలో లాగే.. చూసి ఆనందించేలా తెగ సంతోషపడేలా.. నీ మనసు ఆనందంతో గతంలో లాగే.. ఊగిపోయేలా ఏర్పాటు చేశాను కదా! చూడవే చూడవే నానమ్మ అందరూ వచ్చేశారు.. కొంచెం నవ్వవే.. ఒక్క మాట మాట్లాడవే.. " 


రాంపండు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.. తన నానమ్మను కోమాలోంచి లేపి మంచం మీద కూర్చో బెట్టి ఆ సంక్రాంతి విశేషాలన్నీ చూపించాలని.. తెగ ఆరాట పడుతూ ప్రయత్నిస్తున్నాడు. 


అయినా కొంచెం ఫలితం కూడా కనిపించటం లేదు. 


మరి కాసేపు గడిచాక.. 


"అంబ పలుకు జగదాంబ పలుకు.. అమ్మ పలుకు గూట్లో చిలకమ్మ పలుకు.. గోదాట్లో చేపమ్మపలుకు.. అంబ పలుకు జగదాంబ పలుకు" 


అనుకుంటూ హడావిడి చేసుకుంటూ బుడబుక్కల వేషధారి రంగురంగుల బట్టలు ధరించి తన చేతి డమరుకం తో పెద్ద శబ్దం చేసుకుంటూ.. వెళ్తున్నాడు ఆ వీధి గుండా. 


"హమ్మయ్య.. మన బుడబుక్కల నరసయ్య.. 


ఇతను కూడా వచ్చేసాడు. పెద్దతలపాగా, భయంకరమైన మూతి మీసాలు, డమరుకం, అమ్మో.. చొక్కా మీద చొక్కా.. దానిమీద ఇంకో చొక్కా.. దాని మీద మరో చొక్కా.. ఎన్ని బట్టలు వేసేసుకు న్నాడో.. !!! నీ పాత చీర ఇచ్చేస్తాను. మొలకు చుట్టుకొంటాడు. ఊరంతా సందడి.. నానమ్మా.. కొంచెం చూసి నవ్వవే.. 


నానమ్మ.. ఊరంతా సంక్రాంతి సందడి. ఆనందం, పిల్లల సరదా ఆటలు.. పెద్దల కొత్తబట్టలు.. అమలక్కల ముగ్గు లు హడావుడిలు.. ప్రతి ఇంట్లో ఆడపడుచులు నోములు నోచే సరదా హడావిడులు.. అబ్బా అబ్బా.. నీకు ఇవి అన్ని చాలా ఇష్టం కదా.. పోని.. మాట్లాడక పోయినా పర్వాలేదు.. ఒక్క చిన్ని బుల్లి నవ్వు నవ్వు!!! చూడవే.. అటు చూసి.. నవ్వు.. అవిగో అవిగో ఈ కిటికీలోంచి చూస్తే.. నీకు మొత్తం అంతా కనిపిస్తుంది.. మన కుటుంబ సభ్యులందరితో రాత్రి మాట్లాడి నువ్వు ఇదంతా చూడాలని.. నీకు ఆనందం కలగాలని నీకు ఇక్కడ మంచం వేసి ఏర్పాటు చేయించాను. 


అదిగదిగో ఇంకా ఆ పైన చూడు.. ఎన్నెన్ని రంగుల గాలిపటాలో.. నాకు చిన్నప్పుడు నువ్వే గాలిపటం తయారు చేసి ఇచ్చావ్.. నాకు జ్ఞాపకం ఉందిలే మరి నీకు.. జ్ఞాపకం ఉందా లేదా???"


ఇలా ఇలా.. రాంపండు శతవిధాల కాదు సహస్ర శతవిధాల ప్రయత్నించిన.. గెలవలేకపోతున్నాడు. 


ఆ ఇంటిలోని మిగిలిన సభ్యులందరూ రాంపండు చేష్టల్ని చిత్రంగా చూస్తూ.. వాళ్లు ముసి ముసగా నవ్వుకుంటూ ఇంట్లోకి బయటకు అటు ఇటు వాళ్ల పనిలో వాళ్ళు తిరుగుతున్నారు. 


అంతలో.. బోరా ఊదుకుంటూ గంగిరెద్దుల నరసయ్య.. తన అనుచరులతో హడావిడి చేస్తూ వచ్చాడు. ప్రతి ఇంటి ముందు రకరకాల విన్యాసాలు చేస్తుంది ఆ గంగిరెద్దు. కొంతమంది పాత బట్టలు ఇస్తున్నారు.. అదంతా ఆ కిటికీలోంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 


"అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. తల్లి.. సౌభాగ్యలహరి.. నీకు 12 మంది పిల్లలు పుడతారు అమ్మ.. ఒకడు కలకటేరు, రెండో వాడు సినీ యాక్టర్, మూడోవాడు పెధానమంత్రి.. మిగిలిన అందరూ రాజులు.. రారాజులు.. తారా జువ్వలు.. అమ్మ.. అమ్మాయి మా గోవిందమ్మ.. నీ కొడుక్కి బెంగుళూరులో ఉద్యోగం వస్తది అమ్మ.. నేను వచ్చినప్పుడు.. వచ్చేఏడు.. బంగారపు గొలుసు పెట్టాలమ్మ.. సరేనా.. ".. అది గంగిరెద్దుల వాని హడావుడి. 


"చూడవే గంగిరెద్దుల వాడు నానమ్మా.. ఎంతో ముచ్చ టగా బోరా ఊదుతూ.. తన ఎద్దు ని ఆడిస్తున్నాడు.. అది కూర్చుని దండంపెడుతూ చుట్టూతిరుగుతూ డాన్సు కడుతుంది.. 


నానమ్మా.. నువ్వు పైకి లెగకపోతే.. నేనిక్కడ ఉండను.. మళ్లీ ఇప్పుడే అమెరికా వెళ్ళిపోతాను. నీ గురించే పని గట్టుకు వచ్చాను కదా.. చూస్తావు కానీ చిన్న బుల్లి నవ్వు నవ్వవు.. మాట్లాడవు.. అరిగో.. నక్కల వాళ్ళు కూడా వచ్చేసారు.. ఇదిగో కోతిని ఆడించు కుంటూ మన ఊరు రాములమ్మ.. ఇంకా మన ఊరి రామాలయం దగ్గర.. చెక్కభజన కూడా మొదలైపో యింది నానమ్మ.. నీకు ఈ పెద్ద కిటికీలోనుంచి చూస్తే అన్నీ బాగా కనిపిస్తాయి. అందరూ బాగా కనపడ తారు.. నువ్వు అసలు తల తిప్పవు, చిన్న నవ్వు నవ్వి.. చూడవు, బుల్లి మాట మాట్లాడవు.. 


నాకు ఏడుపు వచ్చేస్తుందే నానమ్మా.. ?''.. అంటూ రాంపండు చివరికి ఏడుపు ముఖం పెట్టాడు. 


కాసేపు బాధపడి తమాయించుకుని మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు.. 


''ఆ.. అదన్నమాట విషయం నాకు అర్థమైందిలే.. గబుక్కున నువ్వు మాట్లాడేసినా, నవ్వేసిన ఆరోగ్యం కుదుట పడిందని నువ్వు.. బాగానే ఉన్నావ్.. అని.. నేను నీ దగ్గర ఉండకుండా ఈ రోజే అమెరికా వెళ్ళిపోతానని.. నువ్వు నవ్వకుండా.. నాటకం ఆడుతున్నావు కదా.. అర్థమైంది నానమ్మా.. నిజమే కదా. 


ఛీ.. నేను ఎంత గింజుకున్నా.. కొంచెం కూడా నీకు నా మీద అభిమానం లేదా.. 


అమ్మో అమ్మో.. మన ఇంట్లో వండకపోయినా ఊరంతా పిండివంటల సువాసన.. అదిరిపోతుందే నానమ్మ.. సున్నుండలు అరిసెలు జంతికలు బొబ్బట్లు గారెలు బూరెలు పులిహార దద్దోజనం గజ్జి కాయలు.. అబ్బ ఎంత సువాసన వస్తున్నాయో ఊరంతా. అవన్నీ నీకు బాగా ఇష్టం కదా నువ్వే కదా అవన్నీ చేసి మా అందరికీ పెట్టి దానివి.. ''


 అంటూ రాంపండు చాలా బాధపడుతూ నాన్నమ్మ కాళ్ళు నొక్కుతూ.. తలకు మందురాస్తూ.. అక్కడే కూర్చుండి పోయాడు.. నీరసంగా నిస్సత్తువగా తర్వాత ఏం చేయాలో అర్థం కాక. 


 ****


కాసేపటికి.. 


వీధిలో నుండి అప్పుడే రాంపండు తండ్రి శంకరయ్య వచ్చాడు. 


"ఒరేయ్ రాంపండు.. ఎందుకురా మీ నానమ్మ ను అలా బాధ పెడతావు. ?? కోమాలో ఏడాది నుండి అది కొట్టుకుంటుంది.. కాకినాడ లో పెద్ద డాక్టర్ గారు.. ఇక ఇంటి దగ్గరే ఉంచండి అన్నాడు కదా.. అందుకనే మురళి డాక్టర్ గారు చేతిలో పెట్టి రోజు జాగ్రత్తగా చూస్తున్నాము.. మన మురళి డాక్టర్ గారు.. ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. ఆయన ఈ రోజు ఏమన్నాడు.. నీకు తెలుసు కదా ఈ రాత్రి కి కానీ రేపు రాత్రి కి కానీ.. అది బాల్చి తన్నేయడం ఖాయమని చెప్పారు కదా..


నువ్వు విన్నావు కదా.. మా అమ్మ ఈ పండుగ రోజుల్లో చచ్చిపోతే చాలా మంచిదని నేను చూస్తున్నానురా.. స్వర్గం హాయిగా చేరి పోతుంది.. 90 ఏళ్ళు బ్రతికింది.. చాలా పుణ్యాత్మురాలు రా.. ఇకమీదట బ్రతకడం ఇక చాలా కష్టమని.. నాకు అని పిస్తుంది రా.. అయినా అన్ని ఏళ్ళు మనం బ్రతక లేము.. అదే ఆవిడ చేసుకున్న పుణ్యం. 

అదృష్టవంతురాలు.. ఇక ఆశలేదు రా.. నీ పని చూసుకో.. "

అంటూ రాంపండు తండ్రి శంకరయ్య తన నానమ్మ ను చూసి బాధ పడుతున్న తన కొడుకుని సముదాయిస్తూ ఓదారుస్తున్నట్టు మాట్లాడాడు. 


"అదేంటి నాన్నా.. నా ప్రయత్నం నన్ను చెయ్యినియ్యి.. ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రాణం పొయ్యగలడు కానీ.. ప్రాణం పోయే సమయం ఖచ్చితంగా చెప్పలేడు.. కోమాలో పదిహేనేళ్లు ఉన్నవాళ్లు బ్రతికి బట్ట కట్టారని చాలా కథలు విన్నాం కదా.. చదివాం కదా.. నువ్వు ఆశ ఎందుకు వదులుకున్నావు.. నాకై తే నానమ్మ కచ్చితంగా బ్రతికి బట్ట కడుతుందన్న ఆశ ఉంది. 90 సంవ త్సరాలు మాత్రమే నానమ్మ బ్రతకాల ని రాసిపెట్టి ఉందా నాన్నా. 100 సంవత్సరాలు బ్రత కవచ్చు కదా".. అన్నాడు రాంపండు తన తండ్రి కళ్ళ ల్లోకి సూటిగా చూస్తూ. 


శంకరయ్య పకపకా నవ్వేశాడు. కొడుకు రాంపండును పిచ్చివాడిని చూసినట్టు చూసాడు. 


"నీ ముఖం.. ఈ సంక్రాంతి సంబరాలన్ని దానికి చూపిస్తే.. బ్రతికేస్తుంది అంటావా??? అలా ప్రాణం పోసేయ గలవా??? ఇలాగైతే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ డాక్టర్లు ఎందుకురా.. ? ఇప్పుడు ఈ వీధుల్లో తిరుగుతున్న వేషగాళ్ళు అందరూ వీళ్లంతా.. చాలా సంవత్సరాల నుండి వాళ్ల పండుగ వేషాల్లో ఆదరణ కోల్పోయి.. వేరు వేరు వృత్తుల్లో పడిపోయేరు.. 


రాంపండు.. పాపం ఆరు ఏళ్ళు గా వీళ్ళు ఎవరూ మన ఊర్లో కనపడలేదు.. సరే.. ఈ ప్రాచీన సాంప్ర దాయాలు అన్నీ "హుష్ కాకి".. అయిపోతున్నా యని.. మీ నానమ్మ తెగ బాధపడిపోతూ ఉండేది ఈ ఆరు ఏళ్ల నుండి.. ఊరందరిని పిలిచి కూర్చో బెట్టి వాళ్లందరికీ చెప్పి చెప్పి బెంగపడి పోతున్నట్టు అయిపోతుండేది.. మేమంతా సర్ది చెప్పేవాళ్ళం. 


వచ్చే సంవత్సరం అందరూ వస్తారు లే నువ్వు లేచి భోజనం చేయి అంటూ అంటుండేవాళ్ళం.. మాయ మాటలు చెప్పేవాళ్లం. ఇంకో సంవత్సరం అలాగే ఆశగా రోజు రోజు లెక్కపెట్టు కుంటూ.. గడిపేది. మళ్లీ సంవత్సరం ఊరంతా ఏ సరదా లేకుండా నిరాశగా నిస్పృహగా ఉండేది.. 


అప్పుడు కూడా.. వస్తారులే.. అని ఆశ పెట్టి మభ్య పెట్టి మళ్లీ అలాగే చెప్పేవాళ్ళం.. 'మేము చెప్పేదంతా అబద్ధం అని.. ఇక ఇక.. ఆ సంక్రాంతి సంబరాలు మాయం.. అయిపోయాయని.. ఆ ఆనందాలు ఇక ఉండవని.. బతుకంతా.. ఇలా ఏ సరదా సంతోషం లేకుండా గడపాలి.. '.. అని మనసులో ఊహించే సుకొని.. అలా అలా మా ఎవరితో మాట్లాడకుండా.. ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటూ మూగదానిలా ఉండి పోయేది.. ఎన్ని సంవత్సరాలు అలా అలా బెంగపె ట్టుకుని తిండి మానేసి ఇలా అయిపోయిందిరా. 


రోజులు మారుతున్నాయి.. చాలా సాంప్రదాయాలు పోయాయి.. చాలా సరదాలు, సంబరాలు.. సంతో షాలు.. ఇక మనం మర్చిపోవాలి అని.. ధైర్యంగా ఉండమని చెబుతుండేవాళ్ళం. అయినా వినలేదు. వినేది కాదు.. చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండేది.. దాంతో ఇలా తయారయిందిరా.. సంవత్సరం నుండి. 


సరే.. నువ్వు ఇన్ని సంవత్సరాలు రాలేకపోయినా ఈ సంవత్సరం నువ్వు మమ్మల్ని అందర్నీ ముఖ్యంగా నానమ్మని చూడడానికి.. అమెరికా నుండి కుదరక పోయినా వచ్చేశావు. 


'నాన్న.. నాన్నమ్మను బతికిస్తాను'.. అని.. ఫోన్ లోనే నాాతో పందెం కట్టి.. ఇక్కడికి వచ్చాక చుట్టుపక్కల ఊరులు అన్ని తిరిగి ఈ వేషగాళ్ళు అందరిని కూడ గట్టి పోగేసి.. వాళ్లకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి.. వాళ్ల చేత మరిచి పోయిన వేషాలన్నీ మళ్లీ కట్టించి.. నీ దగ్గర డబ్బులు 50 వేలు ఖర్చు పెట్టి.. వాళ్లందరికీ రెండు మూడు నెలలకు సరిపడా జీతాలు కూడా ఇచ్చేసి.. వాళ్లలో ఉత్సాహం నింపి.. మన ఊరిని ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం సంక్రాంతి కళతో శోభతో.. సంతోషాలతో ఆనందాలతో ఇదిగో ఇలా నింపేశావు.. 


మేము కూడా ఈ ఆనందాలు సరదాలు సంబరాలు చూసి ఆరేళ్ల అయిపోయింది. మాకు కూడా ఇప్పుడు చాలా ఆనందంగా సరదాగా ఉంది రా. సరే ఇదంతా చూసి మన కుటుంబంలో అందరూ ఆనందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. దీంతోనే మీ నానమ్మ బతికేస్తుంది అనుకోవడం.. ఇదంతా చూసి ప్రాణం వచ్చేసి ఎగిరి గంతులేస్తుంది అనుకోవడం.. నీ పిచ్చి.. నీ వెర్రి.. నీ అనవసరపు వృధా ప్రయాస ప్రయత్నం!!! ఆరు ఏళ్ల నుంచి మానేసిన భోగి మంటలు కూడా పెద్ద ఖర్చు పెట్టివేయించావు ఘటికుడువె..


 సరే నీ పిచ్చి నీది.. నేను ఎందుకు వద్దు అనాలి అని.. ఊరు కున్నాను. మా అమ్మ బ్రతికితే నాకు సంతోషమే.. మహాసంతోషం.. కానీ బ్రతకదురా. 


ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను.. ఆ ముసలావిడ ప్రాణంపోతే చేయవలసిన ఏర్పాట్ల గురించి.. ముందుగానే కొంత మందికి చెప్పి.. వాళ్లను పిలిచిన వెంటనే రమ్మని సిద్ధంచేసి ఉంచాలిగా.. అసలే పండగ రోజులు.. అనుమానాలు ఎక్కువ.. ఎవరు రారు. 


నీకు పూర్తిగా అర్థం అయింది అనుకుంటాను.. సరే ఇక నేను వెళుతున్నాను.. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. మీ నానమ్మ కు ఏమి జరిగినా.. నాకు మన పాలేరు రమణ చేత కబురు పెట్టు.. నేను మోసే వాళ్లను తీసుకు రావాలిగా.. 


వచ్చేటప్పుడు వాళ్లను వెంట పెట్టుకుని వస్తాను.. చెప్పాకదా.. పండుగరోజులు.. బ్రతిమాలాతే గానీ రారు. ".. అంటూ.. బయటకు వెళ్ళబోయాడు.. రాంపండు తండ్రి శంకరయ్య. 


అంతే.. ఇంకా బయటకు వెళ్లలేదు.. ఆ మంచం దగ్గర ఉంటుండగానే.. విను తిరిగి వీధిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుండగానే ఒక చెయ్యి.. తన చెయ్యిని గట్టిగా పట్టుకున్నట్లనిపించింది. ఆశ్చర్యపోయాడు శంకరయ్య. 


"ఒరేయ్ అడ్డ గాడిద.. ఆగరా ఎక్కడికి వెళుతున్నావు.. నా శవాన్ని మోయడానికి మనుషులను తీసుకు రావడానికా.. నేనింకా చావను రా????" అన్నట్టుగా ఒక శబ్దం వినబడింది శంకరయ్య కు. 


.. ఆ కంఠం.. శబ్దం.. తన తల్లి దే.. సూర్యకాంతమ్మ ది. ఆశ్చర్యంతో గిల్లి చూసుకున్నాడు నిజమే అబద్ధం కాదు


ఆగిపోయాడు శంకరయ్య. 


"నాన్నా.. నాన్నోయ్.. నాన్నోయ్.. నానమ్మ లేచి కూర్చుంది.".. మహదానందంతో ఎగిరి గంతేసినట్లు తండ్రికి చెప్పాడు రాంపండు. అంతేకాదు.. ఆనందంగా తన్మయత్వంలో గట్టిగా అరిచాడు. 


"మాట్లాడేస్తుంది.. నాకుచాలా ఆనందంగా ఉంది చూడు నాన్నా. " మళ్లీ గట్టిగా కేకలు పెట్టినట్టు అరిచేశాడు రాంపండు. ఎగిరి గంతులు కూడా వేశాడు. కుటుంబ సభ్యులందరూ పోగు పడిపోయారు ఆ గదిలోకి. 


" రోడ్డు మీదకు తర్వాత వెల్ది గానీ.. ఇలా రా బండ మొహం వెధవా.. ".. అది మంచం మీద తనంత తానే లేచి కూర్చున్న సూర్యకాంతమ్మగారి కంఠం. 


తల్లి పిలుపుకు.. ఆశ్చర్యపోయాడు మళ్లీ శంకరయ్య. 


గభాలున వెనుతిరిగి తల్లి దగ్గరకు వెళ్లి.. " అమ్మ నువ్వేనా.. బకెట్టు తంతావు అనుకున్నానే.. ఇదేంటి విచిత్రంగా.. లేచి కూర్చున్నావ్ ?? ఇది మాయ మంత్రమా??" అంటూ ఆశ్చపోయాడు శంకరయ్య. 


" ఛీ.. నోరుముయ్యిరా.. చింతపిక్కల కళ్ళువెధవ.. కావాలంటే మళ్లీ గిల్లి చూసుకో తిక్క వెధవ.. అసలు నువ్వు ఏం చేసావు.. బస్తాలు బస్తాలు టాబ్లెట్లు మింగించావు.. సూది మీద సూదులు లారీడు సూదులు పొడిపించావు.. ఒకరా ఇద్దరా.. 70 మంది డాక్టర్లకు చూపించావు. లక్షలు ఖర్చు పెట్టావు.. ఎంత కోమాలో ఉన్నా నాకు అన్నీ తెలుస్తున్నాయిరా. 


కానీ.. నేను బ్రతకాలంటే ఏం కావాలో ఒక్కసారైనా మనసుపెట్టి ఆలోచించావా.. బొడ్డు వెధవ.. నా అమెరికా మనవడు రాంపండు ఏం చేశాడు.. బాగా ఆలోచించి నాకు నువ్వు చేయిస్తున్న వైద్యం సరైనది కాదు అని గ్రహించి.. నాకు కావలసిన మానసిక వైద్యంచేసి నాకు ప్రాణం పోసాడురా. 


ఉండరా ఉండు.. ఆ రంగు రంగుల ముగ్గులు.. గొబ్బెమ్మల సందళ్ళు.. అమ్మలక్కల పేరంటాలు.. అబ్బో.. ఓ పక్క కర్రసాములు.. ఈ పక్క గారడీ వాళ్ళు.. అమ్మో నా ఊరికి మళ్ళీ ప్రాణం వచ్చేసింది.. కళకళ లాడిపోతోంది.. ఇదన్నమాట రామాపురం అంటే! 


ఈ కర్ర సాయంతో.. నా మనవడి సాయంతో.. ఒక్కసారి భోగి మంటల దగ్గరకు వెళ్లి.. అట్లాగే ఊరంతా తిరిగి తిరిగి సంబరమంతా చూస్తానురా.. అన్నీ చూసి వస్తా ను. నీపని చూసుకోరా చిల్లర వెధవ.. దద్దమ్మ.. గాడిద" 


అనుకుంటూ.. మనవడితో సరదాగా బయటకు వెళ్ళి పోయింది సంవత్సరం పాటు మంచం మీద "కోమా" లో ఉండి ఇప్పుడే లేచిన తొంభయ్యేళ్ల సూర్యకాంత మ్మగారు. 


అంతే.. అంతే.. !!!


ఆమె కొడుకు శంకరయ్యకు ఈ పరిస్థితి అర్థం కాక అదే మంచం మీద వెల్లకిలా పడిపోయి తను కోమాస్థితిలోకి వెళ్లిపోయినట్టు అయపోయాడు. !


***************

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






30 views0 comments

Comments


bottom of page