top of page

రాముడిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి?

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #రాముడినిఆదర్శంగాఎందుకుతీసుకోవాలి, #RamudiniAdarsamgaEndukuTisukovali, #SriramaNavami

Ramudini Adarsamga Enduku Tisukovali - New Telugu Story Written By R C Kumar

Published In manatelugukathalu.com On 06/04/2025

రాముడిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి? - తెలుగు కథ

రచన: ఆర్ సి కుమార్

 

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరాముడు మనకు ఆరాధ్య దైవం. ఐనా ఎక్కడా దైవత్వాన్ని ఆపాదించుకోకుండా మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి ఆయన. శ్రీరాముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి. సామాజికంగా, కుటుంబ పరంగా నైతిక విలువలు కలిగిన శ్రీరామచంద్రుని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మానవ జాతికి ఒక గొప్ప సంపదను రామాయణం రూపంలో ఆదికావ్యంగా అందచేసిన ఆదికవి వాల్మీకి మహర్షి పూజ్యనీయుడు. రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అనే దానికి కోకొల్లలుగా ఉన్న జవాబుల్లో ముఖ్యమైన కొన్నింటిని ఈ శ్రీరామ నవమి సందర్భంగా గుర్తు తెచ్చుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. 


✓త్యాగం, ధర్మం, దయ, ప్రేమ, పరాక్రమం రాముడి గొప్ప లక్షణాలు. మనమంతా వీటిని ఆచరించి జీవితాలను ధన్యం చేసుకోమని చెప్పేదే రామాయణం, రాముడి ఆయనం


✓ఎంతో గొప్పదైన సూర్య వంశంలో జన్మించి ఆ వంశానికే వన్నె తెచ్చిన వారిలో ఉత్తమోత్తముడు. సత్యధర్మవర్తనుడిగా, ప్రజలను తమ పిల్లలుగా భావించి, జనరంజకంగా పరిపాలన చేసాడు. 


✓ఒక ఉత్తమ కొడుకుగా, ఉత్తమ ప్రజా సేవకుడిగా, రాజుగా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరునిగా, ఉత్తమ శిష్యునిగా రాణించి మన్ననలు పొందిన సకల గుణాభిరాముడు. 


✓ లోకమంతా తనని దేవుడిగా భావించి కీర్తించినా తాను మాత్రం విస్పష్టంగా 'అహం దశరథాత్మజః - నేను దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించుకున్నాడు. 


✓అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. జీవితంలో ఎన్నెన్నో జరగరాని సంఘటనలు జరిగినా, సామాన్య మానవుడిలా ఎదుర్కొని కష్ట నష్టాలను సునాయాసంగా భరించాడు. 


✓ఇచ్చిన మాట కోసం పదవులను తృణ ప్రాయంగా త్యజించి, కట్టుబట్టలతో అరణ్యవాసానికి బయలుదేరి పితృ వాక్య పరిపాలన చేసిన ఆదర్శప్రాయుడు. 


✓పినతల్లి స్వార్థానికి బలై అడవులు పాలై తండ్రిని పోగొట్టుకున్నా, పల్లెత్తు మాట అనకుండా ఆవిడ క్షేమాన్నే కోరుకున్నాడు. 


✓ ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించి ధర్మమూర్తిగా నిలిచాడు. ధర్మానికి ఒక రూపానిస్తే రాముడి రూపమే వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. 


✓దక్కవలసిన సింహాసనం దక్కకపోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యాన్ని తిరిగి అప్పగించినా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, ప్రతి సందర్భంలో ధర్మమార్గాన్నే అనుసరించాడు. లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు. 


✓ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య వంటి గొప్ప లక్షణాలు గల మర్యాదరాముడు 


✓పక్షిజాతిలో చిలుక ఒక భాగస్వామితోనే సహచర్యం చేస్తుందే తప్ప ఎటువంటి పరిస్థితులలోనూ మరొక పక్షి జోలికి వెళ్లదు. శ్రీరాముడు కూడా ఒకే భార్యగల ఏకపత్నీ వ్రతుడు కాబట్టే చిలుక జాతికి రామచిలుకలు అనే పేరు వచ్చింది. 


✓ "రామో విగ్రహవాన్ ధర్మః'', సాధుస్సత్యపరాక్రమః'' అంటూ రాముణ్ణి రాక్షస జాతికి చెందిన మారీచుడే తన ప్రభువు రావణాసురుడు ముందు నిర్భయంగా ప్రశంసించాడు. శతృవు చేత కూడా కీర్తించబడే పురుషోత్తముడు శ్రీరాముడు. 


✓ స్నేహానికి ప్రతిరూపంగా హనుమంతుడు, సుగ్రీవుడు లాంటి వారిపై రాముడు చూపిన అచంచలమైన స్నేహభావం, విధేయత అపూర్వం. ‌


✓ఆటవిక రాజైన గుహునితో, ఆత్మసఖుడా అని సంబోధించి శ్రీరాముడు తన హృదయానికి హత్తుకున్నాడు, జాతి, కులం, రంగు, విద్య, ఆర్థిక స్తోమత చూడకుండా వివక్ష లేని సమానతను పాటించి సౌశీల్యవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. 


✓తాటకి అనే స్త్రీని చంపడం అధర్మంగా భావించిన రాముడికి ప్రజా సంరక్షణలో, క్షత్రియధర్మంలో భాగంగా ఒక రాక్షస స్త్రీని చంపడం పాపము, క్రూరము, అధర్మమని కాదని విశ్వామిత్రుడు బోధించిన పాపరహిత సనాతన ధర్మాన్ని పాటించి వధించాడు. 


✓సీతను రక్షించే ప్రయత్నంలో భాగంగా చేసిన పోరాటంలో రావణుడి చేతిలో మరణించిన జటాయువుకి రాముడే స్వయంగా ఉత్తరక్రియలు చేసి పుణ్యగతులు కల్పించాడు. మరణించింది పక్షి అయినప్పటికీ ఆ కార్యాన్ని నెరవేర్చి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడు ఆ మహనీయుడు. 


✓వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టి రాముడు చెట్టుచాటున దాగి, దుర్మార్గుడైన వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు. 


✓రాజ్య బహిష్కరణ పొందిన విభీషణుడు రాముణ్ణి ఆశ్రయిస్తే, విభీషణుడే కాదు చివరకు రావణుడే తనను ఆశ్రయించినా అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన శత్రువులకైనా రక్షణ కల్పించడానికి ఉపక్రమించడంలో క్షాత్ర ధర్మాన్ని, దయాధర్మాన్ని కోదండ రాముడు విడిచిపెట్టలేదు. 


✓ యుద్ధంలో రావణ సంహారం తర్వాత అతని మృతదేహాన్ని విభీషణుడికి అప్పగిస్తూ శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే అంటాడు. అది రాముడి ధర్మ ప్రవర్తన. 


✓పురజనులు ఇలా అనుకుంటున్నారు అని తెలుసుకున్న శ్రీరామచంద్ర ప్రభువు భేషజాలకు పోకుండా తన రాజ్యంలోని సామాన్య పౌరుడికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అంతటి ప్రజాస్వామ్యాన్ని పాటించి పరిపూర్ణత్వాన్ని ప్రదర్శించాడు. అదీ రాముడి ఆయనం. 


ధన్యవాదాలు ��

జైశ్రీరామ్ 

ఆర్ సి కుమార్


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comentários


bottom of page