top of page

రమ్యా! నువ్వు హ్యాపీగా ఉండాలి



'Ramya Nuvvu Happyga Undali ' - New Telugu Story Written By Penumaka Vasantha

'రమ్యా! నువ్వు హ్యాపీగా ఉండాలి' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

బస్టాండ్ లో బస్ ఎక్కి కూర్చొని నా పక్కన ఉన్న సీట్ లో ఉన్న ఆమె వైపు చూసా. తను నా చిన్నప్పటి ఫ్రెండ్ రమ్య లాగుందే అనుకుంటూ... "రమ్యా!” అన్నాను.

"అవును రమ్య నే. నువ్వు వాసవి కదా.!"


"అవును. ఎన్నాళ్ళకు కలిశాం రమ్యా! ఎలా ఉన్నావు, ఏమి చేస్తున్నావు.!?"

"ఇదిగో! ఇలా ఉన్నా" అన్న రమ్య మాటల్లో ఏదో దిగులు కనిపించింది.

'ఫస్ట్ టైమ్ నేను బావున్నా... రమ్య ముందు’ అనిపించింది, ఎందుకంటే రమ్య అందగత్తె కాబట్టి.


"రమ్యా! చెప్పు ఏంటి ఇంత చిక్కిపోయావు. కలర్ కూడా తగ్గావు. హెల్త్ బావుంది కదా!"

"ఏమి హెల్త్ లే! వాసవీ.. ఫీఫ్టీ దాటాం కదా!" అన్న రమ్య మాటల్లో ఏదో నిర్లిప్తత.

"లేదు రమ్యా! ఇపుడే... మనం మన హెల్త్ గూర్చి ఆలోచించాలి. ఇప్పటివరకు పిల్లలూ, వాళ్ల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు.. వాటితో బిజీ గా వుండి మనగూర్చి ఆలోచించం. ఇప్పుడు మన గూర్చి మనమే ఆలోచించుకోవాలి. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, పిల్లలతో బిజీ. అందుకని వాళ్ళు మనకు వచ్చి చేస్తారని అనుకోవడం తప్పు. ఎవరి మీద ఆధార పడకుండ ఉండటమే మంచిది. సరే కానీ, రమ్యా! నీకు ఎంతమంది పిల్లలు."

"ఇద్దరు.. బాబు, పాప. నీ సంగతి... ఎంతమంది పిల్లలు వాసవీ."

"రమ్యా! నాకు ఇద్దరు. ఒక పాప, బాబు. పాప కి పెళ్లయి అమెరికాలో ఉంటుంది. బాబుకి ఇంకా పెళ్లి కాలేదు. మరి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయా...!"

"బాబుకి పెళ్లి అయింది, పాప లవ్ మారేజ్ చేసుకుంది." అన్న రమ్య తో "పోన్లే అబ్బాయి ని వెతికే పని తప్పించింది నీకు" అన్నాను నేను.

"ఏమి తప్పించింది వాసవీ!? ఇంకా ఎక్కువైనాయి బాధలు. కొన్నాళ్ళు బావున్నారు. గొడవలయి... ఇపుడు నేను వెళ్లను అక్కడకి అనీ! మా యింట్లోనే ఉంది. ఇంట్లో ఉన్న కోడలికీ, దీనికీ పడక వాళ్ళు వేరే వెళ్లారు. మా ఆయన దానికి బుద్ది చెప్పక వంత పాడి ఇద్దరూ కలిసి నన్ను చంపకు తింటున్నారు. మళ్ళీ వాళ్ళు బావుంటారా! అంటే ఆహా... క్షణం పడదు ఇద్దరికి."

"అవును రమ్యా! బాగా ఉన్నవాళ్ళకి నిన్ను ఇచ్చి చేశారు కదా.. మరి ఇపుడు ఆ ఆస్తుందా!?" అని రమ్య మెడలో పసుపు తాడు చూసి అడిగా.

"అన్నీ పోయాయి. ఈయన పేకాట, జూదం తో, ఆస్థి పోయింది. ఇల్లుంది. అది పిల్లాడి కి రాశాం. కొంత డబ్బు బ్యాంకులో ఉంటే... దాని వడ్డీ తెచ్చి తింటున్నాం.

"పాప ఏమన్నా చదివిందా!?" అన్నాను.

"ఆ.. బిటెక్ మధ్య లో మానింది. ఇపుడు చదవమంటే చదవననీ గోల" అంది రమ్య.


"అవును వాసవీ! నువ్వు జాబ్ చేస్తున్నావా."

"చేస్తున్నా! మొన్నటి వరకు మా పిల్లల స్కూల్లో టీచర్ గా చేసేదాన్ని. ఈ మధ్యనే పీజీ సైకాలజీ చేసి హాస్పిటల్ లో జాబ్ చేస్తున్నా. మా వారు జాబ్ చేస్తున్నారు”


“పిల్లాడు, మీవారు జాబ్ చేస్తే, నీ కెందుకే జాబ్! హాయిగా తిని కూర్చోకా...!"

"లేదు రమ్యా ! మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే జాబ్ చేయాలి."

"సరే రమ్యా.. నువ్వు ఏం చేస్తున్నావు.!?. "

"ఏమి చేయటం లేదు ఖాళీ గానే ఉన్నా" అంది రమ్య

"డిగ్రీ చేశావుగా! ఏదన్నా... జాబ్ చేయాల్సింది రమ్యా!" అన్నాను.

"సరేలే! మా ఇంట్లో ఒప్పుకోరు. ఆడది పని చేస్తే మగాడు తినాలా! అని తగాదాలు. ఎందుకులే!? అని చేయలేదు. ఇంకా నేను అలా చేస్తే మా అత్తా వాళ్ళు, బయటకు నెట్టే వాళ్ళు."

"అదే తప్పు చేసావు! ఇప్పుడైనా చెప్పు, జాబ్ చేద్దువు గానీ. అన్నట్లు నీవు బాగా జాకెట్లు కుట్టేదానివి అప్పట్లో."

"లేదే.. ఇపుడు దేని మీద ఇష్టం లేదు" అంది రమ్య.

"లేదు. ఇపుడు మళ్ళీ కుట్టుమిషన్ తీసి ట్రై చెయ్యి. నీ ఫోన్ నంబర్ ఇవ్వు. మనం టచ్ లో ఉందాం" అన్నాను. రమ్య ఫోన్ నంబర్ ఇచ్చింది.

"రమ్యా! ఇంటికి రావే ఒకసారి !" అని పిలిచాను.

ఇంటికి వచ్చినా రమ్య ని గూర్చి ఆలోచిస్తూ...ఉన్నా. మా కాలేజ్ డేస్ లో రమ్య చాలా అందం గా ఉండేది. పెద్ద కళ్లు, పెద్ద జడ, కలర్ తో బావుండేది. తను ఫస్ట్ బెంచ్ లో కూర్చునేది. నేను సెకండ్ బెంచ్ లో కూర్చునేదాన్ని. కలసి కాలేజ్ కి వెళ్ళే వాళ్ళం. నేను ఏదో నార్మల్ గా ఉండేదాన్ని. తను డబ్బు, అందం, ఉందన్న పొగరు తో ఉండేది. నేను తన పక్కన వెళ్తున్నా, అందరి కళ్ళు తన వైపే. నన్ను చూడరు... అని దానికి నా మీద చులకన భావం.


కాలేజ్ వరకు కలసి వెళ్లినా క్లాసులో తను డబ్బున్న వాళ్లతోనే స్నేహం గా ఉండేది. మాది లేని కుటుంబం అవ్వటం వల్ల రమ్య టెస్టుబుక్స్ తెచ్చుకుని రాసుకునేదాన్ని. వాళ్ల అమ్మ, నాన్నగారు చాలా మంచి వాళ్ళు. నాకాలేజ్ ఫీస్ రమ్య నాన్న రామారావు గారు కట్టేవారు. డబ్బు ఇవ్వబోయినా ‘వద్దమ్మా!.. మా రమ్య ను కాస్త చదివిస్తే చాలు’ అనేవారు.

అలా రమ్య నేను కలసి వాళ్ళింట్లో చదువుకునే వాళ్ళం. డిగ్రీ పూర్తి చేశాం ఇద్దరం. నేను బీఎడ్ కి వెళ్ళాను. రమ్యకి పెళ్లి చేశారు. మా క్లాసులో సురేష్ రమ్యని ప్రేమించాడు. రమ్య వాళ్లకి ఆస్తి లేదని, పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత సురేష్ గ్రూప్స్ కి సెలెక్ట్ అయి జాబ్ సంపాదించి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు.

చక్కనివాడు, డబ్బు పొలాలున్నాయని సుబ్బారావు ని చేసుకుంది రమ్య. నేను బ్యాంక్ ఉద్యోగిని చేసుకుని హైదరాబాద్ వెళ్ళాను. ఎప్పుడన్నా ఊరికి వెళ్తే రమ్య కబురులు తెలిసేవి. రమ్య మొగుడు పంటలు పండక తాగుడికి, అలవాటయ్యి అప్పుల పాలవ్వటం చూసిన రామారావు గారు దిగులు పడ్డారు. ఉన్న ఒక్క పిల్లా అలా అవ్వటం తో మంచం పాలయ్యి కన్ను మూశారు. తర్వాత రమ్య, అమ్మగారు వాళ్ల కొడుకు దగ్గరకి సిటీ వెళ్లి పోయారు. వాళ్ల విషయాలు అంతకు మించి తెలియదు. మా వారికి రమ్య వున్న వూరికి దగ్గరలో బదిలీ అయింది.

ఎపుడైనా రమ్య గుర్తొచ్చి దాని దగ్గరకు వెళ్దాం అనే లోపు లక్కీ గా అదే కలిసింది. వాళ్ల నాన్న గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఎలాగైనా రమ్య కి హెల్ప్ చేయాలి అనుకుంటూ నిద్ర లోకి జారాను.

తర్వాత రమ్య కి మా వారిని అడిగి బ్యాంక్ లోన్ ఇప్పించి జూట్ బ్యాగ్స్ కుట్టే సంస్థ ను పెట్టించాను.

తర్వాత రమ్య నా దగ్గరికి వచ్చింది. ఇపుడు దాని మొహం లో కొద్దిగా కళ వచ్చింది. "వాసవి.. ఛాలా థాంక్స్" అన్నప్పుడు దానికళ్ళలో కన్నీటి జీర.

"నో రమ్యా! నువ్వు ఏడవకు, ఇప్పటి నుండి మన కాలేజ్ డేసప్పటి రమ్యవి అవ్వాలి నువ్వు."

కాసేపు మా చిన్నప్పటి కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశాం. ఇప్పటి నుండి నీరసాన్ని వీడి ధైర్యంగా ఉండాలన్నాను రమ్యను.

"అలాగేనే! నువ్వు ఒకసారి మా ఇంటికి రా" అని చెప్పి వెళ్ళింది. తర్వాత ఒకసారి దాని ఇంటికి వెళ్ళా. వాకిట్లో రమ్య భర్త సిగిరెట్ తాగుతూ, పేపర్ చదువుతూ కనిపించాడు.

నేను "రమ్య ఉందా!" అన్న దానికి చిరాకుగా "లోపలుంది" అన్నాడు. నేను లోపలికి వెళ్ళగానే రమ్య "వాసవి.. దా లోపలకి" అంటూ వంట గది లోకి తీసుకెళ్ళింది.

వాళ్ల ఇల్లు చూపించింది. పాత కాలపు డాబా ఇల్లు అక్కడక్కడ సిమెంట్ పెచ్చులు రాలుతున్నాయి. బయట వరండాలో ఉన్న వాళ్లయనకి నన్ను పరిచయం చేసింది.

"ఏమండీ! వాసవని చెప్తానే తను" అని చెప్పింది రమ్య. నేను "నమస్తే" అని చెప్పగానే "ఆ...నమస్తే" అన్నాడు.


ఆ కళ్ళల్లో ఇపుడు ఈమె యెందుకు వచ్చింది అన్నట్లు చూసి "సరే! కప్ కాఫీ పంపు" అన్నాడు.

ఇద్దరం లోపలికి వచ్చి కబుర్లలో పడ్డాం. "ఇదిగో నేను బయటకు వెళుతున్నా" అని చెప్పి రమ్యా వాళ్ల ఆయన వెళ్ళాడు.

"ఎక్కడికే అంటే!?"

"పనేమిలేక... ఇపుడు చదివిన పేపర్ లో న్యూస్ అక్కడి జనాలకు చెప్పటానికి ఆనక వచ్చి... తిని తోంగోటం ఇవి ఈయన పనులు."

"సరే! ఏది మీ అమ్మాయి."

"దాని రూంలో సెల్ లో ఏదో సీరియల్ చూస్తూ ఉంటుంది పిలుస్తా... ఉండూ, కావ్యా!" అంటూ పిలిచింది రమ్యా.

“అబ్బ! ఏంటమ్మా! పిలిచావు" రమ్యా పని ఏమన్నా చెప్తుందేమోనని, విసుగ్గా వచ్చింది కావ్య.

చూడీదార్ లో ఉన్న కావ్య అచ్చు వాళ్ల నాన్న పోలికలతో వుంది.


"కావ్యా, వాసవి అని చెప్తాను కదా! ఆ ఆంటీ నే ఈమె" అంది రమ్య.


"ఓ, హాయి ఆంటీ!" అంది కావ్య.

నేను "హాయి కావ్య" అనగానే,


"ఆంటీ ఇపుడే వస్తా" అంటూ లోపలికి వెళ్ళింది.


"వాసవి.. దీన్ని ఎలా దారిలోకి తేవాలో అర్థం కావటం లేదు. ఏమన్నా అందామంటే!? ఈయన అంతెత్తు లేస్తాడు. పిచ్చి ఎక్కుతుందే వీళ్ల తో" అంది రమ్య

"సర్లే! ఈసారి మా ఇంటికి పంపు కావ్యను. నే మాట్లాడుతా" అన్నా.

ఒక వారం తర్వాత రమ్య ఫోన్ లో "కావ్య సిటీ కి వస్తుంది, నీ కిష్టమని అరిసెలు పంపుతున్నా!" అంది.

"వావ్! భలే గుర్తు పెట్టుకున్నావే, నాకు అరిసెలు ఇష్టమని, సరే పంపు."

కావ్య వచ్చి "ఇదిగో ఆంటీ ! అమ్మ మీకు ఇచ్చింది" అంటూ అరిసెలు ఇచ్చింది.

"థాంక్స్" అంటూ ఒక అరిసే తిని కావ్య ఇష్టా, ఇష్టాలు కనుకున్నా.

కొంచం తండ్రి లాగా ఈగోయిస్ట్ గా తోచింది. ఇపుడే కావ్య కు క్లాస్ లు తీస్తే బాగోదు అని కొంచం ఫ్రెండ్లీ గా మాట్లాడి పంపాను.

తర్వాత ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చింది కావ్య. తనతో "అసలు ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసావు!? కావ్యా” అంటే, "అదే ఏమి చేయాలో!? తెలియటం లేదు ఆంటీ" అంది.

"ముందు జాబ్ చేసి నీ కాళ్ల మీద నిలబడి ఫస్ట్ నీ బీటెక్, డిగ్రీ చేతికి తెచ్చుకో. నాకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్ జాబుంది చేస్తావా."

కొంచం ఆలోచించి “డబ్బులకోసం నాన్న ను అడగాలంటే సిగ్గుగా వుంది. ముందు జాయిన్ అవుతాను. ఓకే ఆంటీ" అంది కావ్య.

అలా కావ్య జాబ్ లో జాయిన్ అయింది. "కావ్య జాబ్ లో చేరటం హాపీగా గా ఉందే" అని రమ్య ఫోన్లో మాట్లాడుతూ అంది.

ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కావ్య కి కాల్ చేశా. "జాబ్ ఎలా ఉంది నాకు పార్టీ ఎపుడు."


"ఆంటీ రేపు ఈవెనింగ్, మీరు ఖాళీ కదా" అంది కావ్య.

పార్టీ ఇచ్చినపుడు "కావ్య జాబ్ వచ్చింది కదా! ఎపుడు మీ ఆయన దగ్గరకు వెళ్తావు.!" అన్నాను నేను.

"నో వే... ఆంటీ! రవి నన్ను చేసుకుందీ ఏవో ఆస్తులు ఉ న్నాయనిట. కాని మాకు ఆస్తుల కన్నా అప్పులు ఉన్నాయని తెలిసి నేను వద్దుట. బంధాలు, డబ్బుతో ముడిపడితే, నిలవవు ఆంటీ."

"మరి నువ్వు జాబ్ లో చేరావని చెప్పావా."

“చెప్పా! అయినా మీ ఇల్లు నీకు ఇస్తే... అప్పుడు ఇక్కడికి రా..”అన్నాడు.

"మరి ఏమి చేద్దామనుకుంటున్నావు" అనగానే

"నో ఆంటీ! నేను ముందు డిగ్రీ తెచ్చుకొని మంచి జాబ్ చేద్దామనుకుంటున్నా."

"గుడ్ ముందు ఇవన్నీ అమ్మ తో మాట్లాడు"

"లేదు ఆంటీ! నేను ఏమన్నా చెప్దామంటే అది కాదు ఇది అంటుంది. మీరు ఇంత చక్కగా, మాట్లాడుతున్నారు. అమ్మ అలా చెప్పదు."

"నో కావ్యా! ఈ కాలపు పిల్లలకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. మీ అమ్మ పది మాటల్లో నీ మాటే ఉంటుంది. లోకం లో తల్లి కి మించిన గొప్ప గైడ్ ఎవరూ ఉండరు. నువ్వు నీ పెళ్లి కి ముందు మీ అమ్మను అడిగితే మంచి సలహా ఇచ్చేది. సొంతింటి వైద్యం మనకి పనికి రాదు, ఎప్పుడూ. మీ అమ్మ కాలేజ్ డేస్ లో ఎంత ఆక్టివ్ గా ఉండేదో తెలుసా.! అది స్పోర్ట్స్, ఎస్సే రైటింగ్ అన్నిటిలో ఫస్ట్.


ఆస్తి ఉన్న అందగాడనీ మీ నాన్న ను చేసుకుంది. మీనాన్న మీ అమ్మ కు ఏమీ తెలియదు!? అనే ముద్ర వేయటం వల్ల అది అలాగే! మబ్బదిబ్బగా ఉంది. మీరూ ఆమెను అదే ధోరణి లో చూశారు. ఏదో డిగ్రీ చెప్పించి మీ నాన్న పెళ్లి చేద్దామంటే మీ అమ్మ బిటెక్ చేయించి నీ కాళ్ళ మీద నిన్ను నిలబెడదాం అనుకుంది. మొన్న మాటల్లో చెప్పింది, మా ఆయన చెప్పినట్లు డిగ్రీ చెప్పించి పెళ్లి చేస్తే పోయేదని.


ఇప్పటికీ మీ నాన్న సతాయిస్తాడుగా! మీ అమ్మను, ఆయన చెప్పినట్లు చేయకుండా నిన్ను ఇంజనీరింగ్ లో చేర్చిందని. మీ అమ్మ కు జాబ్ లేకపోయి, డబ్బులకు అవస్థ పడటం వల్ల, నిన్ను డిగ్రీ కాక, బీటెక్ చదివించాలని నువ్వు గొప్పగా స్థిరపడాలని, నిన్ను దానిలో చేర్పించింది.

"ఇవాళ వచ్చిన జీతం ముందు, మీ అమ్మకు ఇచ్చి సరదాగా మాట్లాడి చెప్పు రేపు నాకు ఏమందో!"

"ఓకే ఆంటీ వస్తా."

ఇంటికి వెళ్ళి కావ్య "అమ్మ నా మొదటి నెల జీతం ఇదిగో" అని ఇచ్చింది రమ్యకు.

రమ్య అవి తీసుకుని సంతోషం గా దేముడి దగ్గర పెట్టింది. "ముందు ఈ డబ్బులతో ఫీస్ కట్టి బీటెక్ పూర్తి చేయీ!” కావ్య చేతిలో డబ్బు పెట్టింది. “ఇపుడు కొంచం నాకు హాయిగా ఉందం”టూ కావ్యను దగ్గరకు తీసుకొని "నువ్వు బావుండాలే, అదే నా కోరిక!" అంటూ కన్నీరు పెట్టింది.

"ఛా.. ఇన్నాళ్లు అమ్మను అర్థం చేసుకోక కష్ట పెట్టాను అనుకుంటూ "అమ్మా! దిగులు పడకు, నువ్వు చెప్పినట్లే బీటెక్ పూర్తి చేస్తా" అంది కావ్య.

వెంటనే ఫోన్లో "ఆంటీ మీరు కరక్ట్. ఇపుడు నాకు ఫ్యూచర్ మీద క్లారిటీ వచ్చింది." అంది కావ్య.

"గుడ్! కావ్యా, ఇక ఎక్కడా ఆగకు గమ్యం, చేరేవరకు నో రెస్ట్ సరేనా."

“ఓకే ఆంటీ!"

"ఫోన్ ఒకసారి మీఅమ్మకివ్వూ!, ”


“ఏం రమ్యా! నువ్వు హాపీ కదా!" అన్న దానికి "అవునే! ఇపుడే నాకు బ్రతుకు మీద తీపి పుట్టిందే."


"ఇంక తీపే! చేదు... వుండదుకానీ నీ బిజినెస్ ఎలా ఉంది" అన్నాను నేను.

"పర్లేదు, వాసవి.. నీకు థాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు” అంది రమ్య.

"మనలో మనకు థాంక్స్ ఏంటి. మీ నాన్న అనేవారు ‘నువ్వు రమ్య నాకు ఇద్దరు కూతుళ్ళు’ అని. నీకు కష్టం వస్తే నాకు వచ్చినట్లే. ఇక కావ్య దారిలో పడిందిగా. దిగులు పడక హాపీ గా... ఉండవే."

"అలాగే లే కానీ వాసవి ఒక సారి ఇంటికి రా."

"ఓకే వస్తా లే" ఫోన్ పెట్టి అమ్మయ్య! అంటూ వూపిరి పీల్చుకున్నా.!

'కావ్యా! నిన్ను దారిలోకి తేవటం నా పని. మీ అమ్మ, రమ్య ఎపుడూ హాపీ గా ఉండాలి. దాని కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నా…’ అని మనసులో అనుకున్నా.

***


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు




Comments


bottom of page