'Rani Ranemma' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 16/09/2024
'రాణీ రాణెమ్మ' తెలుగు కథ
రచన: పెనుమాక వసంత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అక్కా.. ! నా దగ్గరికి రా.. ! కొన్నాళ్ళు రెస్ట్ గా
వుందువు గానీ” అన్న సుమతో
"లేదే .. సుమ! ఇపుడు రాలేను నీ దగ్గరకు. కొన్నాళ్ళు కాశీలో ఉండి వస్తాను. ఇన్నాళ్లు దేవుడి పూజలు చేశా కాని తృప్తి లేదు. ఇపుడు ప్రశాంతముగా యాత్రలు చేసి టెన్షన్ లేకుండా తృప్తిగా పూజలు చేసుకోవాలి” అంది అక్క.
"ఏంటో అక్కా.. ! ఇప్పటిదాకా ఎక్కడ రెస్ట్ గా? ఉన్నావు. నువ్వు ఇక్కడి వస్తె.. కాస్త రిలీఫ్ గా వుండి వెల్దువు.. గాని. "
"ఇప్పడు రెస్ట్ గానే ఉన్నాలే, పిల్లలు జాగ్రత్త.
మరిది గారిని అడిగానని చెప్పు.. !" అంది రాణి.
"సరే అక్కా.. ! నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎపుడు
వెళ్తున్నావు కాశీకి? నీ ఫ్రెండ్స్ వస్తున్నారుగా నీతో.."
“ఆ వస్తున్నారు, మన ఊరి వాళ్ళే. అందరం ఒక ఆరునెలలు కాశీలో ఉండి వస్తాం. రేపు రాత్రికి బస్. అక్కడ ఒక గది రెంటుకి తీసుకున్నాము. "
"అక్కా.. ! డబ్బులు ఉన్నాయా? చేతిలో. "
"ఉన్నాయిలే. పొలం కౌలు ఇచ్చాడు రామయ్య. "
"ఏవన్నా డబ్బు కావాలంటే అడుగక్కా.. నన్ను,
మొహమాట పడకు. నీకు నన్నడిగే రైట్ ఉంది.
ప్లీజ్ అక్క.. !" అంది బతిమాలుతూ సుమ.
"లేదు సుమ, ఇప్పటికే నాకు ఎంతో హెల్ప్ చేశావు థాంక్స్. నీకు నేనేమి చేయలేదు. నన్ను ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యేట్లు చెయ్యకే.. !"
"అక్కా చెల్లెళ్ల మధ్య థాంక్స్ యేంటి? అక్కా.. !"
“డబ్బులు సరిపోతాయి సుమా.. !
పిచ్చి ప్రేమ నీది. నా దగ్గర లేకపోతే అడుగుతాలే..
వెంటనే అక్క డబ్బు తీసుకోలేదని నామీద అలగకు.
ఓకేనా.. సరే బై.. !" చెప్పింది నవ్వుతూ రాణి.
అక్క గురించి ఆలోచించింది కాసేపు సుమ.
అక్క నా కన్న ఆరేళ్ళు పెద్ద. అక్క నన్ను చాలా ప్రేమగా చూసేది. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేది.
అమ్మ నన్ను తిడితే "అమ్మా.. ! దాన్ని తిట్టకు దానికి నేను చెపుతానని నచ్చచెప్పేది. ఏదన్నా కావాలంటే అక్కనే అడిగేదాన్ని. అందుకే అక్క అంటే నాకు చాలా ఇష్టం.
మా నానమ్మ అంటుండేది. "పెద్ద పిల్ల
నిదానస్తురాలు. దాన్ని చూసి మంచివాళ్ళకి ఇవ్వాలి.
అది బాధపడుతుంది కానీ ఎదుటి వాళ్ళను ఇబ్బంది
పెట్టదు. చిన్నది గడుసుది ఇది ఎక్కడైనా
నెగ్గుకు వస్తుంది. ఇది ఎవరన్నా దాని జోలికి వస్తె వాళ్ల దుంప తెంచేదాక నిద్రపోదు. "
అక్క చిన్నప్పుడు ఏమన్నా సుఖపడిందేమో?
కాని పెళ్లి అయిన దగ్గరనుండి అన్ని కష్టాలే. మా ఇంట్లో
అబ్బాయి తర్వాత పుట్టిందని చాలా గారాబం చేశారు తనని. మళ్ళీ మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు అక్క అదృష్టం అమ్మ మగ పిల్లాడిని కంటే తెలుస్తుందని. కాని అమ్మ నన్ను కనటంతో అన్నయ్య ఒక్కడు కాబట్టి అన్నయ్య ముద్దు ఇంట్లో. అలా అని మమ్ములను తక్కువ చూసేవారు కాదు ఇంట్లో.
ఉన్నవాళ్లని బావకు అక్కను ఇచ్చి చేశారు
మా అమ్మానాన్న వాళ్ళు. మనీ ఉన్న వాళ్ళే కాని
మనసున్న వాళ్ళు కాదని అక్క పెళ్లి అయిన
మొదటి రోజే గమినించిందట. అక్క చాలా
అల్ప సంతోషి, చిన్న వాటికే హ్యాపీగా ఫీల్ అవ్వటం వున్నదాంట్లో సంతోషంగా ఉండటం అక్క నైజం.
చాలా మొహమాటం ఎదుటి వాళ్ళు
ఏది చెపితే అది చేయటం అక్క వీక్నేస్.
చేయకపోతే ఏమన్నా అనుకుంటారని పనులు చేసేది.
ఈ వీక్నస్ ను ఆధారం చేసుకొని వాళ్ల అత్తగారు దానితో అన్ని పనులు చేయించుకునే వారు. ఎపుడు వాళ్ల ఇద్దరు ఆడపడుచులు పుట్టింట్లోనే ఉండేవారు. కొంచం పోగిడితే చాలు నా అంతటి వాళ్ళు లేరనుకుని మొత్తం
పనులు చేసేది అక్క.. !
పని అయిపోగానే ఇక అక్కను.. పట్టించుకునే
వాళ్ళు కాదు. మా బావ అమ్మ, అక్కలు చెప్పింది విని
అక్కను తిడుతూ వుండేవాడు. వాళ్లపుడు చాలా
ఆనందపడే వాళ్ళు. పుట్టింటికి వచ్చినపుడే
హ్యాపీగా ఉండేది అక్క.
దీనికి తోడు బావకు ఇంకో ఆమెతో సంభందం వుంది.
ఇది అక్కకు తెలియదు. అత్తగారు వాళ్ళకి తెలుసు.
అయినా బావను ఏమి అనేవాళ్లు కాదు. పొలం
వెళ్ళినపుడు, కాపలాగా వుండే గౌస్ భార్య ఫాతిమా
తో వుండేవాడు. గౌస్ పాము కరిచి పోయాడు.
ఫాతిమా ఇంటికి వచ్చి పన్లు అన్నీ చేసి వెళ్లేది.
చాలా బావుండేది, ఒక పిల్లాడు ఉన్నాడు.
చుట్టుపక్కల వాళ్ళు "ఏంటి? ఫాతిమా వచ్చింది
ఇంటికి" అని నవ్వుతుండేవారు. మా అక్కకు తెలియక
"చాలా మంచిది ఫాతిమా ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళింది.. !"
అనేది.
"వాళ్ళు మీ ఆయనకు మసాజు చేసి వెళ్ళలా?”
అంటే "అవును, మసాజు చేసి తలంటు పోసి వెళ్ళింది మా ఆయనకు ఫాతిమా" అని చెప్పేది.
ఫాతిమా ముందు మా అక్కను వాళ్ళత్త గారు "నీలాగా ఏమి పనులు రావు మా కోడలికి" అని ఎగతాళి చేసేవారు.
అక్కకి ఇద్దరూ అమ్మాయిలే పుట్టటంతో ఇంకా
అత్తామామ, మొగుడు చాలా హీనంగా చూసేవాళ్లు అక్కను.
ఫాతిమాతో మా బావ విషయం అక్కకు ఎపుడో గానీ తెలియలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు తనను చూసి నవ్వుతుంది. అపుడు గానీ తెలియలేదు అక్కకు.
వాళ్ళాయనను అడిగింది అక్క "ఏంటి మీరు చేసే పని" అని.
"ఏం.. నీకు బాధగా వుంటే మీ పుట్టింటికి పో. ఇంట్లో తెచ్చి పెడతా ఫాతిమాను ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే.. !" అన్నాడు మా బావ.
మా నాన్న వెళ్ళి అక్క అత్తామామను అడిగితే,
"మీ అమ్మాయిని, చూస్తున్నాడా? లేదా అది చూడండి.
అంతే కానీ ఇలా పరువును బజారున వేసుకుంటే, మీకే నష్టం. పైగా ఇద్దరమ్మాయిలుపుట్టారు. మీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటారా? లక్షణంగా తీసుకెళ్ళి చూసుకోండి. కానీ ఆస్తిలో భాగము ఇవ్వ”మని కొడుకునే సమర్ధించారు.
“మా పిల్లాడికి బోలెడు సంబంధాలు వస్తాయి. మళ్ళీ పెళ్ళి చేస్తాము” అన్నారు.
మా అక్క "వద్దు నాన్న.. ! మీరు వెళ్ళండి, అసలే ఇద్దరూ ఆడపిల్లలు, తండ్రి అండ లేకపోతే కష్టమని రా”నంది పుట్టింటికి.
అక్కడే వుండి పిల్లలను చదివించి పెద్ద చేసింది/
మా అక్క కష్టాలు చూసి ‘సరైన సంబంధం
చేయలేక పోయాను ఇలాంటి పెళ్లి చేసా’మని దిగులుతో
మా నాన్న కన్ను మూశాడు. మా అన్నయ్యతో,
‘సుమ ఎలా అయిన నెగ్గుకు రాగలదు. అక్కను బాగా చూడా’లని చెప్పేవాడు నాన్న. ఆ మాటకు తగ్గట్లే
అన్నయ్య, అక్కను కనిపెట్టుకుని వుండేవాడు.
ఇక అక్క పుట్టింటికి రావటం తగ్గించింది.
పిల్లలతోనే దాని లోకం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.
పెద్ద పిల్లకు పెళ్లి చేసారు. జాగ్రత్తగా చూసి సంబంధం
చేసింది. అక్కా. ఆస్తి లేకపోయినా పర్లేదు. ఉద్యోగం
వున్న వాడని మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేసింది.
ఇంతలో బావకు కిడ్నీలు పాడయ్యాయి.
ఫాతిమా ఇక ఇంటికి రావటం తగ్గించింది.
హాస్పిటల్సుకు తిప్పటం, అన్ని అక్కే.. ! చేసేది.
నేను ఒకసారి మండిపోయి అన్నాను
"ఫాతిమా ఇపుడొచ్చి చేయవచ్చుగా.. ! మీ ఆయనకు సేవ" అన్నాను.
“పాపం ఫాతిమా మంచిదేనే.. ! ఆడవాళ్ళు ఏ పనైనా చేసారంటే అది కేవలం పిల్లల కోసం అయ్యుంటుంది.
పొట్ట కూటి కోసం ఏదో తిప్పలు పడుతుంది. మా ఇంట్లోకూడా నానా చాకిరీ చేస్తుంది. నా కన్నా కష్టాలు పడే వాళ్ళు.. ఎంత మంది లేరు” అనేది.
“ఇలా సర్డుకుంటేనే కాపురాలు. లేకుంటే ఇండియా కూడా ఎపుడో అమెరికా అయ్యేది. నేను ఇలా వుంటేనే మీరు గౌరవిస్తారు. అదే నేను పుట్టింటికి వచ్చి కూర్చుంటే
ఏమి గౌరవం నాకు వుంటుంది. మనిషికో కష్టం పెడతాడు
దేవుడు. వాటిని తట్టుకుని నిలవాలి” అనేది అక్క.
రెండో పిల్ల అమెరికాకు వెళ్ళింది ఎంఎస్ చదవటానికి.
మూడేళ్లు హాస్పిటల్స్ చుట్టూ డయాలిసిస్ కోసం తిప్పింది. ఉన్నట్లుండి షుగర్ ఎక్కువై, పోయాడు.
అక్క మూడేళ్లు నిద్రాహారాలు మాని సేవ చేసింది. ఇపుడే అక్క రెస్ట్ గా ఉంది. యాబైయేళ్ళకే అక్క డెబ్బై యేళ్ల దానిలాగా అయింది.
‘అక్కను నా దగ్గర కొన్నాళ్ళు.. వుంచుకుని మామూలు మనిషిని చేయాలి. ఈలోపు కాశీ వెళ్లి రానిలే.. !' అనుకుంది సుమ. ‘కాస్త ఫ్రెండ్సుతో గడిపితే ఇన్నాళ్లు పడిన కష్టాలను మర్చిపోతుందిలే అక్క.. !’
అక్క జ్ఞాపకాల నుండి బయట పడింది సుమ.
రాణి కాశి నుండి రావటంతో సుమ ఫోను చేసింది
"అక్కా.. ! నీకు వచ్చే నెల ముంబై రావటానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను సర్డుకో అన్ని. నాకు ఏమి తేవద్దు అన్ని దొరుకుతాయి ఇక్కడ. త్వరగా రా అక్కా.. !" అంది సుమ.
"ఎందుకే సుమా.. ! ట్రైన్ టికెట్ బుక్ చేయలేకపోయావా?”
“లేదులే అక్కా.. ! ఎపుడు నువ్వు ఫ్లైట్ ఎక్కలేదుగా.
అదీను తొందరగా వచ్చేస్తావు సరేనా.. !"
"అలాగే సుమ కాశీలో హాయిగా గడిచిందే రోజులు ఎలా దొర్లాయో తెలియలేదు. సరే వుంటా.. ! ఇల్లు బాగు చేసుకుని కాస్త షాపింగ్ చేసుకుని వస్తా నీ దగ్గరకు.. !" అంది రాణీ.
రాణి, సుమ పిల్లలతో చిన్నపిల్లగా కలిసిపోయి ఆడుకుంటుంది. సుమ పిల్లలు కూడా ‘పెద్దమ్మ. ఈ సినిమా చూడు. పేకాట ఆడదామా? అంటు వాళ్లు రాణితో కలిసారు. వాళ్ల చేత హిందీ సినిమాలు పెట్టించుకుని చూసేది.
రాణికి షిరిడి సాయి ఇష్టం అని షిరిడి తీసుకెళ్ళింది సుమ. ముంబై జూహు బీచ్ కి వినాయక టెంపుల్ కూడా చూపించింది సుమ.
"అక్కా ఫాతిమా ఎలా వుంది?" అడిగింది సుమ.
"బానే వుంది, ఇల్లు పడిపోయింది అంటే, మా ఇంట్లో ముందున్న రేకుల షెడ్ బాగు చేయించి ఇచ్చాను
వుండటానికి అందులో వుంటుంది” అంది రాణి.
"ఎందుకు అలా చేసావు?” అంటే,
“పోనీలే సుమా.. ! పిల్లాడు సిటీలో ఉద్యోగం చేసుకుంటాడు. అలవాటైన వూరు వెళ్ళలేక వూళ్ళోనే వుంటుంది. పిల్లాడు ఇల్లు కట్టే దాకా మా ఇంట్లోనే వుంటుంది” అంది రాణి.
"అతి మంచితనంకు పోతే ఫాతిమా నీకు తాటాకులు కడుతుంది అక్కా.. !" అంది సుమ.
“మా వాళ్ల కన్నా ఫాతిమానే మంచిది. లేచానా? లేవలేదా అని చూస్తుంది. " అన్న అక్క రాణిని చూసి నిట్టూర్చింది సుమ.
"దేవుడా మా అక్కను నువ్వే కాపాడు" అంటూ
దేవుణ్ణి వేడుకుంది.
రాణి పిల్లలు "ఎపుడు వస్తావు? అమ్మా.. !"
అని కాల్ చేస్తున్నారు.
వెంటనే సుమ ఫోన్ లాక్కుని "వస్తుంది లేవే.. ! మీ అమ్మ ఇపుడేగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంది" అంది సుమ.
"అలాగే పిన్ని.. ! నీ ప్రేమలో అమ్మ మమ్ములను ఎక్కడ మర్చిపోతుందేమోనని మాకు బెంగగా ఉంది. "
"అయితే మీరు కూడా రండి" అంది సుమ నవ్వుతూ.
ఇక రాణికి ఇంటిమీద గాలి మళ్లింది. "సుమ ఇంటికి వెళ్తానే.. పెద్దది కడుపుతో ఉంది. పురిటికి తేవాలి. చిన్నది అమెరికా
నుండి వస్తుంది. దానికి ఉద్యోగం వస్తె పెళ్లి చేయాలి. ఈసారి వేసవి సెలవులకు పిల్లలు, నువ్వు, నాదగ్గరికి తప్పక రండి" అని వెళ్తున్న అక్కను
"సరే నువ్వు జాగ్రత్త.. !"అని చెప్పి పంపింది సుమ.
పిల్లలు "ఇంకొన్నాళ్లు వుండొచ్చుగా.. పెద్దమ్మా.. !" అంటే రాణి "మీరు వస్తారుగా.. ! నా దగ్గరికి.. అపుడు ఎంజాయ్ చేద్దాం, బై బంగారాలు.. !" అంటు తన ఊరికి ప్రయాణం అయింది రాణి.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comentarios