కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Rentiki Cheddaa' New Telugu Story
Written By Siriprasad
రచన: శిరిప్రసాద్
వేగంగా వెళుతోంది రవి ప్రయాణిస్తున్న కారు. వెనక సీట్లో తలపట్టుకుని కూర్చున్న రవి తీవ్ర ఆలోచన లో వున్నాడు. అతని గుండె లో మంటలు భగ్గుమంటున్నాయి. దానికి విరుద్ధంగా కళ్ళనించి కన్నీరు కారుతోంది.
రామాపురం ప్రయాణాన్ని విరమించుకుని తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పోతున్నాడు.
'నాన్నా రవీ!... యేమైందిరా ? అంత త్వరగా అంత మంచి పొజిషన్ లోకి వెళ్ళి, ఆ తప్పు చేశావెందుకురా?... అంత మంచి జాబ్ కి రిజైన్ చేసావు!... ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?... ' తండ్రి ఆరా.
'ఈ రోజు మన వూళ్ళో మీటింగ్ వుంది అన్నావుగా!... అందుకే ముంబయి నించి వస్తున్నాను... అక్కడికి వచ్చాక అన్నీ విషయాలు చెప్తాను నాన్నా!'
'ఇంకెక్కడి మీటింగ్ రా!... క్యాన్సల్ చేసారు . ఏ బీ సీ కంపెనీ లో డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగావు. ఈ వూరి యువతకి స్ఫూర్తి కలిగించావు. నువ్విచ్చిన స్పూర్తితో ఐదుగురు యువకులు మంచి చదువులు చదువుకుని జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. ఇంకా ఎంతోమంది అదే ప్రేరణ తో చదువుకుంటున్నారు. ఊరి జనం అంతా నిన్ను సన్మానించుకోవాలన్నారు. నువ్వు నన్ను అడగకుండా బయల్దేరావేంట్రా?...
నువ్వు షేర్ మార్కెట్ లో మోసం చేసి విచారణ ఎదుర్కుంటున్నావని, వుద్యోగానికి రాజీనామా చేసావని చెప్పుకుంటున్నారు. అందుకే నీ సన్మాన సభని క్యాన్సల్ చేసార్రా !... ఇప్పుడు యిక్కడికి రావడం మంచిది కాదురా. నేను, అమ్మా ముంబై కి వస్తున్నాం. ఎల్లుండికి రిజర్వేషన్ అయింది...'
'సరే... నాన్నా...' గద్గద స్వరంతో అన్నాడు రవి. ఇంకా అంతకు మించి మాట పెగల్లేదు. కష్టంగా, ఆన్నాడు 'మీరు ముంబై రండి... ఏం జరిగిందీ ..... అక్కడ చెప్తాను...'
***
రామాపురం హైదరాబాద్ కి దగ్గిరలో వొక కుగ్రామం. అక్కడ సరైన స్కూల్, పీ హెచ్ సి, రక్షిత నీటి సరఫరా యిలాంటి కనీస సౌకర్యాలు యేవీ లేవు. శిధిలావస్థలో వున్న పంచాయితీ స్కూల్లోనే పిల్లలు చదువుకునే వారు. టీచర్లు సీనియర్స్ కావడం వల్ల చదువు మీద ఆసక్తి వున్నవాళ్లు బాగా చదువుకునే వాళ్ళు.
రవి తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తన చిన్నతనంలో పట్నంలో తాత దగ్గిర వుండి పీ యూ సీ వరకు చదువుకున్నాడు. వర్షాధారిత వ్యవసాయం వల్ల వుపయోగం లేదని, తన పిల్లలు బాగా చదువుకుని మంచి వుద్యోగాలు చేసుకు బ్రతకాలని అనుకున్నాడు.
అందుకే పిల్లలు నలుగురికీ చదువు చెప్పించాడు. ఇద్దరమ్మాయిలు గ్రాడ్యుయేషన్ వరకు దగ్గిర వూళ్ళో చదువుకున్నారు. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసాడు.
పెద్ద కొడుకు ఎం ఏ చేసి వరంగల్ లో లెక్చరర్ గా స్థిరపడ్డాడు. రెండో కొడుకు, రవి, రామాపురం స్కూల్ లోనే టెన్త్ వరకు చదివి రాష్ట్రంలో మూడో టాప్ రాంక్ లో ఉత్తీర్ణుడయ్యాడు. అతని రిజల్ట్, ర్యాంక్ చూసి వూరంతా పులకించి పోయింది. తర్వాత ఇంటర్ లోనూ ర్యాంక్ తో పాస్ అయ్యాడు. ఐ ఐ టీ లో సీట్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఐ ఐ ఎం లో పీ జీ చేసి మూడు లక్షల జీతంతో గుజరాత్ లో ఒక మంచి కంపెనీ లో చేరాడు. ఐదేళ్లలో అంచలంచెలుగా ఎదిగాడు. తర్వాత మూడు కంపెనీలు మారి, ఏ బీ సీ కంపెనీ లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు.
రామాపురం లో యింటిని పడగొట్టి పక్కా యిల్లు కట్టించాడు. తండ్రికి, తన అన్నకి, అక్కలకి చేదోడు వాదోడు గా వుంటూ, పల్లెలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి తన వంతు సాయం అందించాడు. స్కూల్ బిల్డింగ్ కొత్తది కట్టించాలనేది రవి కోరిక. ఆ స్కూల్ తను చదువుకున్నదే కాక, ప్రతి తరగతి లోనూ యిన్నేళ్ళుగా అతని విజయాల్ని అనధికార సిలబస్ గా టీచర్లు పిల్లలకి చెప్తూనే వున్నారు.
ఆ స్పూర్తితో ఐదారుగురు ర్యాంక్ లు తెచ్చుకోవడమే కాక, తనలాగే వున్నత విద్య నభ్యసించి జీవితం లో బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు, వూరిజనం, పంచాయితీ వాళ్ళు రవిని సన్మానించాలని నిశ్చయించుకున్నారు. అందరికీ సౌకర్యంగా వొక తేదీని నిర్ణయించి రవిని ఆహ్వానించారు.
***
ఏ బీ సీ కంపెనీ గత పదేళ్ళుగా నష్టాలలో నడుస్తోంది. రిజర్వు నిధులన్నీ దాదాపు కరిగిపోయాయి. ఆ సమయంలో రవి ని కంపెనీ జనరల్ మేనేజర్ గా రిక్రూట్ చేసుకుంది. రవి జాయిన్ అయిన సంవత్సరం లోపే కంపెనీ ని మళ్ళీ గాడిలో పెట్టాడు. పెద్ద ఆర్డర్ లు తీసుకొచ్చి నష్టాల నించి లాభాల బాట పట్టించాడు. కంపెనీ బోర్డు రవిని అభినందించి డిప్యూటీ మానేజింగ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేసింది. స్టాక్ మార్కెట్ లో కంపెనీ షేర్ ముఖ విలువ కంటే తక్కువగా ట్రేడ్ అయ్యేదల్లా ముఖ విలువకి వచ్చేసింది. మార్కెట్ లో రవి పేరు మారుమోగింది.
తర్వాతి సంవత్సరం మరో పెద్ద కంపెనీ తో ఒప్పందం చేసుకునేలా ప్రయత్నాలు చేసాడు. నడుస్తున్న సంవత్సరం లాభాలెలా వుంటాయో అంచనా వేస్తున్నారు ప్రొడక్షన్, ఫైనాన్స్ అధికారులు. లెక్కలన్నీ చూస్తుంటే యీ యేడాది బంపర్ ప్రాఫిట్ రావడం తధ్యమని ఫైనాన్స్ డిపార్టుమెంటు తేల్చింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవిని పొగడ్తలతో ముంచెత్తారు.
మరో రెండు రోజుల్లో పద్దులు తయారౌతాయి. నాలుగు రోజులు ఆడిట్ కి కేటాయించినా వారం రోజుల్లో మార్కెట్ లో కంపెనీ వార్షిక ఫలితాలు సంచలనం సృష్టిస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఎం డీ రిటైర్ అవుతాడు. తర్వాత ఆ పోస్ట్ తననే వరిస్తుంది అని మనసులో అంచనాలు వేసుకుంటున్నాడు రవి.
'రవి గారూ! కంగ్రాట్యులేషన్స్!... ' అంటూ జనరల్ మేనేజర్ నవీన్ రవి క్యాబిన్ లోకి వచ్చాడు.
'థాంక్యూ నవీన్!... కూర్చోండి!'
నవీన్ కూర్చున్నాడు. కంపెనీ వార్షిక ఫలితాల గురించి యిద్దరూ కాసేపు చర్చించుకున్నారు.
'రవి గారూ, మీరు మీ విలేజ్ లో స్కూల్ ని పునర్నిర్మాణం చేయించాలనుకుంటున్నట్టు చెప్పారు కదా!... దానికి యాభయ్ లక్షలు అవసరం పడుతుందని అన్నారు కదా!...'
'అవును ...'
'ఇదే మంచి అవకాశం అనుకుంటున్నాను ...'
ఒక క్షణం ఆలోచించి అన్నాడు రవి, 'నా కర్ధం కాలేదు బ్రదర్...'
తలా అటూ యిటూ తిప్పుతూ ఆలోచిస్తున్నాడు నవీన్. రవి మళ్ళీ అడిగాడు.
'మార్కెట్ లో మన షేర్ యిప్పుడు పది రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. మన యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసాక మన షేర్ స్యూర్ గా నలభై, యాభై రూపాయలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యుల పేరుమీద ఒక లక్ష షేర్లు కొన్నారనుకోండి. నెల రోజుల్లో ఈజీ గా నలభై యాభై లక్షలు అవుతుంది. కొద్ది కొద్ది గా అమ్ముతూ ఆ స్కూల్ నిర్మాణం పూర్తి చేయచ్చు. ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్... '
'అది తప్పు కదా!...'
'ఒక మంచిపని కోసం ఒక తప్పు కాని తప్పు చేస్తే ఏముంది?... ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు...'
నవీన్ కళ్ళల్లోకి చూసాడు రవి. ఆ కళ్ళల్లో చిత్తశుద్ధి కనిపించింది. కానీ తన ట్రాక్ రికార్డు చాలా మంచిది. ఎవ్వరూ వేలెత్తి చూపేలా లేదు. ఇప్పుడు యిలాంటి పని చేస్తే యింత కాలంగా కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు ఉఫ్ అన్నట్టుగా పోతుంది. కానీ నవీన్ అన్నట్టు యిది సువర్ణావకాశం. పొతే మళ్ళీ దొరకదు. తన సేవింగ్స్ నించి ఖర్చు పెట్టాలనుకున్న యాభయ్ లక్షలు యీ వొక్క ఐడియా తో సేవ్ అవుతాయి.
'చూద్దాం నవీన్. చాలా కోణాల్లో ఆలోచించాలి ...' అంటూ ఆ సంభాషణకి స్వస్తి పలికాడు రవి.
నవీన్ కేబిన్ లోంచి బయటికెళ్ళాక సెక్రటరీ కి ఇంటర్ కామ్ లో యెవర్నీ లోపలికి పంపద్దని, ఫోన్లు కనెక్ట్ చేయద్దని చెప్పాడు. తర్వాత భార్యకి ఫోన్ చేసి నవీన్ యిచ్చిన సలహా గురించి చెప్పాడు. స్కూల్ బిల్డింగ్ కోసం యాభై లక్షలు ఖర్చు పెట్టే విషయంలో భార్యా భర్త లిద్దరికీ చాలా సార్లు వాదోపవాదాలు జరిగాయి. ఇప్పుడు యీ ప్రతిపాదనకి రవి భార్య యెగిరి గంతేసింది. తన సిస్టర్స్, బ్రదర్ పేర్ల మీద షేర్లు కొందామని సలహా యిచ్చింది.
భార్య బంధువుల డీమ్యాట్ అకౌంట్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకున్నారు. తన అకౌంట్ నించి ఆ ముగ్గురి అకౌంట్స్ కి పది లక్షలు బదిలీ చేసాడు రవి. భార్య కల్పించుకుని షేర్ బ్రోకర్స్ కి ఫోన్ చేసి మొత్తంగా తొంభై తొమ్మిది వేల ఏ బీ సీ కంపెనీ షేర్లు కొనడానికి ఆర్డర్ పెట్టించింది.
మూడు రోజుల్లో తొంభైతొమ్మిది వేల షేర్లు కొన్నారు. షేర్ సగటున పది రూపాయల యాభై పైసలు పడింది.
ఒక్కసారిగా ఆర్ధిక సంస్థల నించి, మదుపరుల నించి ఏ బీ సీ కంపెనీ షేర్లు యింత పెద్ద యెత్తున కొనడంతో నెమ్మదిగా కంపెనీ షేర్ రేట్ పెరిగి పదమూడుకి చేరింది. పెద్ద బ్రోకర్లు యీ కంపెనీ షేర్ కొనమని సిఫారస్ చేయడం మొదలెట్టారు.
పది రోజుల తర్వాత కంపెనీ వార్షిక ఫలితాలు ప్రకటించే నాటికి షేర్ యిరవై కి చేరింది. ఫలితాలు అద్భుతంగా వుండడం, పదేళ్ళ తర్వాత బోర్డు కొద్దిగానైనా డివిడెండ్ ప్రకటించడం తో ఏ బీ సీ కంపెనీ షేర్ మార్కెట్లో సంచలనం సృష్టించింది.
ఒక్కసారిగా షేర్ పెరగడం మొదలైంది. మరో వారం రోజుల్లో షేర్ యాభై కి పైన ట్రేడ్ అవ్వడం మొదలైంది. టార్గెట్ ప్రైస్ రావడంతో రవి ఆ షేర్లని అమ్మడం మొదలెట్టాడు. ఒక్కసారిగా అమ్మకుండా కొద్ది కొద్ది గా అమ్ముతున్నాడు.
ఇంతలో మార్కెట్ లో ఒక పుకారు మొదలైంది. కంపెనీ తో వొప్పందం చేసుకున్న పెద్ద కస్టమర్ వెనక్కి పోయారన్నట్టు ఆ రూమర్ పరిగెత్తింది. అది నిజం కాదంటూ కంపెనీ ప్రకటన చేసింది. అయినా ఆ పుకారు ఆగలేదు.
కంపెనీ షేర్ యాభై అయిదునించి యిరవైకి పడింది. రవి తను కొన్న షేర్లన్నింటినీ అమ్మేశాడు. యాభై లక్షలు రావాల్సింది పాతిక లక్షల లాభమే వచ్చింది. అసంతృప్తితో రవికి నిద్రపట్టలేదు. కంపెనీ గురించి పుకార్లు సృష్టించింది యెవరు అనే విషయంలో విచారణ జరిగింది.
విచారణలో యీ అసత్య పుకార్ని వొక పెద్ద బ్రోకింగ్ ఫర్మ్ కి తెలియచేసింది నవీన్ అని బయటపడింది. కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, బోర్డు మెంబర్లందరూ నవీన్ ని పిలిచి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కంపెనీ నించి అతణ్ణి వొక నెల శాలరీ యిచ్చి తొలగించేసారు. ఈ విషయం లో రవి మౌనం వహించడం కంటే యేమీ చేయలేక పోయాడు. తనకి మంచి సలహా యిచ్చిన నవీన్ యింత దుర్మార్గానికి యెందుకు పాల్పడ్డాడో రవికి అర్ధం కాలేదు. అతను చేసిన పని కంపెనీ కి వెన్ను పోటు తో సమానం. అందుకే నిర్లిప్తంగా వుండిపోయాడు.
రవి భార్య అక్క చెల్లెళ్ళ, అన్న ఖాతాలనించి టాక్స్, బ్రోకరేజ్, వాళ్ళకి బహుమతిగా ఒక్కో లక్ష వుంచి మిగిలిన సుమారు పంథొమ్మిది లక్షలు తన బ్యాంకు ఖాతాకి బదిలీ చేయించుకున్నాడు. ఆ సంఖ్యని చూసి విచారంగా నిట్టూర్చాడు రవి. యాభై లక్షలనుకుంటే పంథొమ్మిది వచ్చింది. ఈ మొత్తం సరిపోదు. ఇరవైకి పడిపోయిన కంపెనీ షేర్లు మళ్ళీ కొనాలని నిర్ణయించుకున్నాడు. నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ యాభైకో, అరవైకో వెళ్తుంది, అనుకున్నాడు. ఈ సారి భార్య అకౌంట్ నించి పాతిక వేల షేర్లు కొన్నాడు.
ఒక రోజు వుదయమే ఎండీ రవిని తన క్యాబిన్ కి పిలిచాడు.
'రవీ, సెబీ నించి నీకు షో కాజ్ నోటీసు వచ్చింది. ఒకసారి చదువండి' అంటూ రవికి నోటీసు యిచ్చాడు. వణుకుతున్న చేతుల్తో తీసుకున్నాడు రవి. చట్ట విరుద్ధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డందుకు చర్యలు యెందుకు తీసుకో కూడదో వివరించమని వుంది. ఋజువైతే శిక్షార్హం అనే హెచ్చరిక కూడా వుంది. నోటీసు ని చదివి టేబుల్ మీద పెట్టి ఎం డీ కళ్ళల్లోకి చూసాడు.
'ఏం జరిగింది రవీ?' ఎండీ ప్రశ్నించాడు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు రవి. ఎండీ ముఖంలో విచారం కనిపించింది.
'రవీ, యీ నోటీసు రాగానే నేను సెబీ లో నా ఫ్రెండ్ కి ఫోన్ చేసాను. ఆతను చెప్పాడు. అది రహస్యమైన సమాచారం. నవీన్ సెబీ కి రైటింగ్ లో ఫిర్యాదు చేసాడు. కొన్ని వివరాలు యిచ్చాట్ట. సెబీ ప్రాధమిక విచారణ చేసి, ఆ ఫిర్యాదులో యెంతో కొంత నిజం వుందనే అభిప్రాయానికి వచ్చింది. ఇప్పుడేం చేస్తావ్?'
'ఇదే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు. ఒప్పుకుంటే హుందాగా వుంటుంది, అనుకుంటున్నాను...'
'ఒప్పుకుంటే తర్వాతి పరిణామాలు తీవ్రంగా వుంటాయి. చట్టం ప్రకారం జరిమానా పదిలక్షల నించి పాతిక కోట్ల వరకు వుండచ్చు. జైలు శిక్ష పదేళ్ళ వరకు పడచ్చు ...'
రవి మౌనంగా వుండిపోయాడు.
'మీ భార్య బంధువులు కదా ట్రేడింగ్ చేసింది?'
'ఇలాంటి కేసుల్లో నేరాన్ని ఋజువు చేయడం సులువు. మీకు తెలియంది కాదు. బ్యాంకు అకౌంట్లు మాట్లాడుతాయి. ఒప్పేసుకుంటానండీ. ఒప్పుకుంటే కొంచం జాలి చూపిస్తారేమో!...'
'ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ లోంచి మీ వూళ్ళో స్కూల్ నిర్మాణానికి కంపెనీ యే డొనేట్ చేసేది కదా!'
'నవీన్ మాయలో పడిపోయాను... అంతే '
'ఓకే. ఈ నోటీసు కి సమాధానం రాసి నాకు చూపించు,'
అన్నాడు ఎం డీ . నిస్పృహ తో క్యాబిన్ నించి బయటికి నడిచాడు రవి.
సెబీ యిచ్చిన నోటీసు కి నేరాన్ని వొప్పుకుంటూ సమాధానం యిచ్చాడు రవి. సెబీ కమిటీ ముందు కూర్చుని అన్నీ వివరించాడు రవి. కమిటీ రవి పట్ల సానుభూతి చూపించింది. అదే రోజు కంపెనీ లో జాబ్ కి రాజీనామా యిస్తున్నట్టు కూడా చెప్పాడు.
మరో నెల తర్వాత సెబీ రవికి చాలా తక్కువ శిక్ష విధించింది. తన వుద్యోగానికి రాజీనామా చేయడంతో, వార్నింగ్ తో రవిని వదిలేసింది. భవిష్యత్తులో మళ్ళీ యిలాంటి తప్పు చేస్తే శిక్ష చాలా యెక్కువగా వుంటుందని కూడా హెచ్చరించింది. తనని కాపాడినందుకు దేవుడికి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.
'నీ ఫ్యూచర్ ప్లాన్స్ యేమిటి రవీ? కంపెనీ నీకు చాలా ఋణపడివుంటుంది రవీ! బెస్ట్ ఆఫ్ లక్!' చైర్మన్ రవిని హగ్ చేసుకుని, కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాడు.
రవి కి సెబీ వేసిన శిక్ష, కంపెనీ నించి రాజీనామా చేసిన వార్తా అన్నీ దినపత్రికల్లో వివరంగా వచ్చింది. రామాపురం జనం రవి కి చేయాలనుకున్న సన్మానం రద్దు చేశారు. ఇంతకాలం ఒక ఆదర్శ వ్యక్తిగా విద్యార్థుల ముందు నిలబడ్డ రవి యీ సంఘటనతో నేరస్తుడిగా మిగిలిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు మాత్రం రవి పట్ల సానుభూతి చూపించి, ధైర్యం చెప్పారు.
'ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?' రవిని ప్రశ్నించాడు తండ్రి.
'నేను కొనుక్కున్న పొలం లో వ్యవసాయం చేసుకుంటా నాన్నా! నా ఫామిలీ హైదరాబాద్ లో వుంటారు. అప్పుడప్పుడు కలుస్తుంటాం.'
'అందరూ నిన్ను ద్వేషిస్తున్న వూరు కదరా?'
'మళ్ళీ అందరి ప్రేమని పొందుతాను ' ఆత్మ విస్వాసంతో అన్నాడు రవి.
[సమాప్తం]
శిరిప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
అందరికీవందనాలు.
చిన్నతనంనించి కథలురాయడం నా హాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.
'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.
ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.
Kommentarer