కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Retirement' New Telugu Story Written By
Lakshmi Sarma B
రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)
“ఏమండీ… కాఫీ చల్లారిపోతుంది. ఏమిటాలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి, ఎంతసేపయింది మీకు కాఫీ ఇచ్చి. మర్చిపోయారా! ఏమిటో అంత పరధ్యానం” అంటూ తను ప్రక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ.
“అరే, మర్చిపోయాను” అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ, “అన్నపూర్ణ… నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తరువాత నన్ను అపార్థం చేసుకోవు కదా” అడిగాడు సాంబమూర్తి.
“ఏమండి… మీరు నన్నర్ధం చేసుకున్నది ఇంతేనా! ఇన్నాళ్ళ మన కాపురంలో నేనెప్పుడైనా మిమ్మల్ని తప్పుపట్టాన చెప్పండి? అయినా… అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు, తరువాత బాధపడడం ఎందుకు చెప్పండి, ” అంది అన్నపూర్ణ.
“అదికాదు పూర్ణా!…నిన్ను పెళ్ళి చేసుకున్ననాటి నుండి, నీతో ప్రేమగా మాట్లాడిందిగానీ, నిన్ను ఆప్యాయంగా చూసిందిగానీ లేదు. అయినా నువ్వు నిండుకుండలా అన్నింటికీ భూమాతలా సహనం వహించావు. ఏనాడూ నన్ను నిలదీసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది లేదు. నీలాంటి ఉత్తమురాలి మనసు బాధపెట్టానేగానీ, నిన్ను అర్థంచేసుకుని నీకు బాసటగా నిలబడలేకపోయాను. పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణా! నువ్వు నన్నడిగిన చిన్న కోరిక ఇప్పటివరకు తీర్చలేకపోయాను. అందుకే నీ క్షమాపణ పొందాలని వుంది” అన్నాడు సాంబమూర్తి.
“అబ్బబ్బా… ఏంటండీ గడిచిపోయిన జ్ఞాపకాలూ మీరూ! గతం గతః అన్నారు కదా పెద్దలు. ఇప్పుడవన్నీ కాదు మనం మాట్లాడుకునేది. ఇంకో వారంరోజుల్లో మీ రిటైర్డ్ మెంట్ వుంది. దాని గురించి మాట్లాడండి”అంది అన్నపూర్ణ .
అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా పెదవులకు ఆనించుకున్నాడు.
“పూర్ణా! అబ్బాయిలకు అమ్మాయిలకు రమ్మని ఉత్తరాలు రాస్తాను, వచ్చి నాలుగురోజులుండి పొమ్మంటాను. ఏదో చిన్న పండగలాగా చేసుకుందాము రిటైర్డ్ మెంట్. ఏమంటావు?” అడిగాడు సాంబమూర్తి.
“అంతేలెండి. పిల్లలు వచ్చారంటే అదే పెద్ద పండగ. మరి సరుకులు అవి తెచ్చుకోవాలి.
అవునండీ… మరి మీ రిటైర్డ్ మెంట్ కు డబ్బులు వస్తాయి కదా! పిల్లలకు ఏమైన ఇవ్వవలసి వుంటుందేమో ఆలోచించారా? వాళ్ళు అడగకుండానే మనమే మనకు వున్నదానిలో ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీరేమంటారు?” అంది అన్నపూర్ణ .
“పూర్ణా! వాళ్ళందరు మంచి వుద్యోగాలలో స్థిరపడ్డారు. వాళ్ళకు కావాలసినంత డబ్బుంది. మన డబ్బుకోసం వాళ్ళు ఎదురుచూడరు. అందుకని.. నీకు పెళ్ళినాడు చేయించిన నగలే తప్పా, వీసమెత్తు బంగారం కొనివ్వలేకపోయాను. నీకు ఏం కావాలో చెప్పు. అది తీసుకుందాము. సరేనా?” అడిగాడు సాంబమూర్తి.
“అయ్యో! అలాగంటే ఎలాగండి? ఆడపిల్లలు ఆశిస్తారు కదా! కన్నవారి నుండి తృణమో పణమో పెట్టినా మా తల్లిగారు పెట్టారు అని ఆనందపడతారు కదా! అయినా నాకిప్పుడు నగలెందుకు ? వున్నవే పెట్టుకునేందుకే ఓపికలేదు. అయినా… ఈ వయసులో పెట్టుకునేందుకు, నేనేమన్నా పాతిక వయసున్న దానినా ఏంటి? చక్కగా పిల్లలకు ఏమైనా పెట్టామంటే వాళ్ళు ఆనందపడతారు. ఒకప్పుడు వుండేది నాకు.. పక్కింటి పద్మను చూసి, నాకు అలా రెండుచేతులకు బంగారు మురుగులు వేసుకోవాలని, మెడలోకి ముత్యాలదండ రెండు వరసలది వేసుకోవాలని. కానీ ! మనకున్న పరిస్థితులకు ఇల్లుగడవడమే కష్టంగా వుండేది. ఇక అంత ధరపెట్టి అవి కొనగలమా చెప్పండి? ఇప్పుడు కొందామన్నా వేసుకోవాలనే కోరిక కూడాలేదు. పోనీ మీరే స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఒకటి”అంది అన్నపూర్ణ .
“నాకు ఎప్పటినుండో స్కూటర్ కొనాలని వుంది. నిన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని టౌన్ కు వెళ్ళి సినిమా చూడాలని వుండేది… ఈసారి కొందాము తప్పకుండా” అన్నాడు,
పకపకా నవ్వింది అన్నపూర్ణ . “భలేవారండి! నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని సినిమాకు వెళ్ళడానికి స్కూటర్ కొంటారా? అంతేగాని… మన అవసరాలకు ఉపయోగం అవుతుందని కాదా !” అంది నవ్వుతూ .
సాంబమూర్తి అన్నపూర్ణ దంపతులది పెద్దలు కుదిరించిన పెళ్ళి. చిన్నతనంలో చేసారు కాబట్టి ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని గుట్టుగా సంసారం నడిపించుకుంటున్నారు. సాంబమూర్తి వృత్తి రీత్యా గవర్నమెంటు ఉపాధ్యాయుడు కావడం వలన బదిలీలు వుండేవి. సాంబమూర్తి తల్లి తండ్రులు పెద్దవాళ్ళు. సాంబమూర్తికి అన్నపూర్ణలకు నలుగురు సంతానం. అందులో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. కుటుంబం పెద్దదవడం, చాలీచాలని జీతం వలన సాంబమూర్తి ఒక్కడే వేరే ఊరిలో వుండేవాడు. ఇక ఇంటి బాధ్యత, పిల్లల గురించి పెద్దవాళ్ళ బాగోగులు.. అంతా అన్నపూర్ణనే చూసుకునేది. సాంబమూర్తి వచ్చిన ఒకరోజు ఇల్లంతా హడావుడి.
“ఏయ్ పూర్ణా… అలా టౌన్ వరకు వెళ్ళి సినిమా చూసివద్దాము. తొందరగా తయారవు” అన్నాడు సాంబమూర్తి అన్నపూర్ణతో.
“ఏమండీ …సినిమాకు ఎలా వెళదాము అంటున్నారు? మరి పిల్లలను ఎవరి దగ్గర వదిలిపెడతాము? వద్దులెండి. కావాలంటే మీరు వెళ్ళిరండి, ” అంది అన్నపూర్ణ .
“అబ్బబ్బా… ఎప్పుడు నీకిదే గోల. ఎప్పుడడిగినా ఏదో సాకు చెబుతావు. నీకు నాతో సరదా గడపడమే ఇష్టముండదు. నేను వచ్చేది వారానికి ఒకసారి. మిగతా రోజులన్నీ వాళ్ళతోనే కదా గడుపుతావు? అయినా మా అమ్మ వుంది కదా.. చూసుకుంటుంది పద” అన్నాడు రుసరుసలాడుతూ.
“ఏమండీ! ఎందుకంత కోపంగా వున్నారు. నన్నేం చెయ్యమంటారు చెప్పండి? మీ అమ్మగారికి కర్ర పట్టుకుని నడవడమే కష్టం. ఇంకా పిల్లలనేం చూస్తుంది ఆవిడా! అవిడనుండి కాదు. పోని మామగారున్నారు కదా అంటే, ఆయన భాగవతం రామాయణం చదువుతూ వాటిలోనే మునిగిపోతారు. పిల్లలను చూస్తే చిన్నవాళ్ళు. మీరా వుండనే వుండరు. చుట్టపు చూపులాగా వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు. ఇన్ని బాధ్యతలు నేనొక్కదాన్నే మోస్తున్నాను కదా. మీరు అర్థం చేసుకోకుండా అలా అంటే ఎలాగండి, ” అంది అన్నపూర్ణ.
“సరేలే! ఎప్పుడు చెప్పే సోది పురాణమే గాని నేను అలా బయటకు వెళ్ళి వస్తా, ” అంటూ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు సాంబమూర్తి.
ఆయన వెళ్ళినవైపే చూస్తూ పాపం ఆయన అడిగిన ఏ కోరికా నెరవేర్చలేకపోతున్నాను. పాపం అక్కడ ఒక్కడే వుండి ఇక్కడకు వచ్చిననాడైనా నాతో సరదాగా గడుపుదామంటే, పెద్దకుటుంబం. కుదరడం లేదు. ఎంత బాధపడుతున్నారో ఏమో.. అని బాధపడసాగింది.
అలా తిరిగి తిరిగి రాత్రి వచ్చాడు సాంబమూర్తి. అపాటికే పిల్లలంతా తిని పడుకున్నారు. దగ్గర కూర్చోని సాంబమూర్తికి వడ్డించింది. ఆయన తిన్నాక తను తింటుంది.
“పూర్ణా… నువ్వు కూడా వడ్డించుకో, ” అన్నాడు సాంబమూర్తి ప్రేమగా. ఇద్దరు కలిసి భోజనాలు ముగించారు.
“పూర్ణా! నా షర్టు జేబులో మల్లెపూవ్వులున్నాయి తీసుకో” అన్నాడు.
అన్నపూర్ణ మనసు చివుక్కుమన్నది. ఇల్లు చూస్తే రెండు గదులు చిన్న వంట ఇల్లు. అందులో ఒక గది అత్తయ్య మామయ్యకు. ఇంకో గది పిల్లలకే సరిపోతుంది. వున్నది చిన్న హాలు, అక్కడే మామయ్య కూర్చొని పూజ అవి చేసుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. సాంబమూర్తి, అన్నపూర్ణలకు ఏకాంతమే దొరకడం లేదు. అందుకే సాంబమూర్తికి అన్నపూర్ణ మీద కోపం ఎక్కువ కాసాగింది. మల్లెలు తెచ్చి జడలో తురుముకుని చిన్నబోయిన మోముతో సాంబమూర్తి వైపు చూసింది.
“ఏమిటి పూర్ణా! అలానే నిలబడిపోయావు. మనము పడుకోవడానికి ఎక్కడా అని ఆలోచిస్తున్నావా? చూడు పూర్ణా! మనసుంటే మార్గాలుంటాయి. అన్నట్టు, వంట ఇంటిలో ఏర్పాటు చెయ్యి. తరువాత వచ్చి పిల్లల దగ్గర పడుకుందాము” అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు.
“ఏమోనండి! నాకు భయంగా వుంది, పిల్లలుగాని మామయ్యగాని లేచి వస్తారోమోనని” అంటూ నసిగింది.
“నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే వున్న పుణ్యకాలం కాస్తా ఇట్టే గడిచిపోతుంది. ఎవరూ లేవరు. పద..” అంటూ ఒక చాప, దిండు తీసుకుని అన్నపూర్ణను భుజం పట్టుకుని నడిపించుకుని వెళ్ళాడు.
గువ్వపిట్టలా ఒదిగిపోయి తన్మయత్వంతో గట్టిగా వాటేసుకుంది అన్నపూర్ణ . గాలికూడా దూరనంతగా ఒకరినొకరు హత్తుకుపోయి ఆనందడోలికలో మునిగిపోయే సమయంలో,
“అమ్మా!” అంటూ ఏడుపు లంకించుకుంటూ వచ్చింది అన్నపూర్ణ చిన్నకూతురు. గబగబా లేచి వచ్చి కూతురును తీసుకొని వెళ్ళింది అన్నపూర్ణ . సాంబమూర్తికి కోపం నసాళానికి అంటింది. విసురుగా వచ్చి పిల్లలకు అటువైపుగా పడుకుండిపోయాడు, మనసులో తిట్టుకుంటూ ‘వెధవ బ్రతుకు.. సుఖం లేదు సంతోషం లేదు..’ అని .
పాపం అన్నపూర్ణ పరిస్తితి ఆడకత్తెరలో పోకచెక్క మాదిరి అయిపోయింది.
తను కూడా లోలోపల కుమిలిపోయింది, భర్త సాన్నిహిత్యంలో సేద దీరి ఎన్ని రోజులైందోనని. ఉదయం లేస్తూనే చకచకా తయారైయ్యాడు సాంబమూర్తి. సెలవులు అయిపోయాయి కాబట్టి. అన్నపూర్ణ క్షణాల్లో వంట తయారుచేసింది. మారు మాట్లాడకుండా భోజనం ముగించేశాడు. కదిలిస్తే విరుచుకు పడాలన్నంత కోపంగా వున్నాడని అన్నపూర్ణకు తెలుసు . ఇప్పుడు ఏది మాట్లాడించినా పెద్ద గొడవ జరుగుతుంది. పిల్లలముందు గొడవపడడం అన్నపూర్ణకు ఇష్టం లేదు. అందుకని ఏమీ మాట్లాడకుండా వూరుకుంది. వెళ్ళేముందు “వెళ్ళివస్తా” అని గోడకు చెప్పినట్టు చెప్పాడు.
“మళ్ళీ ఎప్పుడు వస్తారు?” అడిగింది అన్నపూర్ణ. భర్తను సుఖపెట్టలేకపోతున్నాను అనే బాధ ఆమెను కుంగదీస్తుంది.
“వచ్చి చేసే ఘనకార్యం ఏముంది గనుక? ఎక్కడున్నా ఒక్కటే. రెక్కలు కట్టుకుని ఇంత దూరం వస్తే, సంతోషమా ఏమన్నన్నానా… నువ్వు సంతోషంగా వుంటున్నావు కదా! నా సంతోషంతో నీకేంటి పని, ” అంటూ చెడామడ రెండు మాటలు దులిపి బయటపడ్డాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. మౌనంగా తనలో తానే కుమిలిపోయింది అన్నపూర్ణ .
అన్నపూర్ణ మీద కోపంతో ఇంటికి రావడం తగ్గించాడు. ఇరవైరోజులకోకసారి వస్తున్నాడు. అదేమంటే పిల్లలకు స్పెషల్ క్లాసులున్నాయి అంటాడు. అలా అలా పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. సాంబమూర్తికి బదిలీలు అవుతూనే వున్నాయి. ఆడపిల్లల పెళ్ళి చేసారు, మగపిల్లలకు కూడా సంబంధాలు చూస్తున్నారు. ఈ లోపల పెద్ద వాళ్ళు హరీ అన్నారు. ఇప్పుడు సాంబమూర్తికి భార్య పిల్లలున్న వూరికి బదిలీ అయింది. ఇంకో పది సంవత్సరాల సర్వీస్ వుంది కనుక స్వంతవూరికి వచ్చేసాడు. ఇద్దరబ్బాయిల పెళ్ళిళ్ళు చేసారు. అందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఉంటున్నది సాంబమూర్తి. అన్నపూర్ణ . పెళ్ళి అయిన ఇన్నాళ్ళకు కొత్త దంపతులలాగా ఇద్దరే వున్నారు. చూసేవాళ్ళు కూడా నవ దంపతులు అనే వారు. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది. ఒకరిని విడిచి ఒకరు వుండలేని పరిస్తితి అయింది. సగం జీవితం గడిచిపోయినా మిగిలిన జీవితంలోనైనా ఆనందాన్ని అనుభవిద్దాము అనే పాలసీ సాంబమూర్తిది. ఆయనకు అనుకూలంగానే మసలుకునే పరిపూర్ణత కలిగిన ఉత్తమ ఇల్లాలు అన్నపూర్ణ. సాంబమూర్తి పైకి సంతోషంగానే వుంటున్నాడు కానీ లోలోపల చాలా బాధపడుతుంటాడు, అన్నపూర్ణను పెళ్ళి చేసుకుని తనను సుఖపెట్టలేకపోయానని. బాధ్యతలన్నీ అమే మీదనే వదిలేసి ఏమి పట్టనట్టు తన దారిన తాను హాయిగా వేరే ఊరిలో ఉంటూ, నెలకొకసారి వచ్చి జీతం డబ్బులు ఇచ్చేసి నావంతు అయిపోయిందనట్టుగా ప్రవర్తించేవాడినని! పాపం ఇంత కుటుంబ భారాన్ని మోస్తూ, అత్తమామలను ఆప్యాయంగా చూసుకోవడమే కాక, పిల్లలను తీర్చిదిద్దింది. కుటుంబమంటే బండికి చక్రాల్లాగా భార్యాభర్తలు ఇద్దరు కష్టాలుగానీ, సుఖాలుగానీ పంచుకుని కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఆలోచననే రాలేదు నాకు.
నాలో సగమైన నిన్ను నిర్లక్ష్యం చేసాను. ఇన్నాళ్ళకు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసివచ్చింది. పూర్ణతో ఆ విషయాలన్నీ చెప్పి తన బరువు దించుకోవాలని, అన్నపూర్ణ తనను తప్పక క్షమిస్తుందని నమ్మకం. చాలా మార్లు చెప్పడానికి ప్రయత్నం చేసాడు. ఒకవేళ అన్నపూర్ణ తనను క్షమించకపోతే, తనను అసహ్యించుకుంటే తను భరించుకోగలడా?
‘ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చానా?’ అంటూ తనను హేళన చేస్తుందేమో అనే భయంతో ఇన్నాళ్ళు చెప్పలేకపోయాడు. ఇప్పుడు చెబుదామని ధైర్యం చేస్తే అన్నపూర్ణ గతాన్ని తవ్వుకుని బాధపడొద్దు అంది.
నాగురించి అంతా తెలుసు కదా! అందుకే అలా అని వుంటుంది. సరే కానియ్! నన్ను అర్ధం చేసుకుంది కాబోలు! ఇకనుండి నేనే అన్నపూర్ణను కంటికి రెప్పలాకాపాడుతాను. అలాగైనా నేను చేసిన పనికి కొంతనైనా తృప్తి మిగులుతుంది’ అనుకుని తృప్తిగా కళ్ళుమూసుకుని పడుకున్నాడు గతాన్నంతా నెమరువేసుకున్నాక.
అనుకున్నట్టుగానే రిటైర్డ్ మెంట్ రోజురానే వచ్చింది. పిల్లలెవరు రాలేదు. ఇద్దరి మనసులో దిగులుగా వుంది. వాళ్ళు వస్తారని సంబరంగా పండుగలాగా చేసుకోవాలని అనుకున్నారు.
“పూర్ణా… ఇంతవరకు పిల్లలు రాలేదు. ఏమైందంటావు? ఎందుకు రాలేదో ఏమిటో, టైం అవుతుంది. మరి మనం వెళదామా?, ” అడిగాడు సాంబమూర్తి బాధపడుతూ.
“ మీరేం దిగులుపడకండి… వాళ్ళు సమయానికి అక్కడికే వస్తారేమో.. పదండి. మనం వెళదాము” అంది. ఆమెకు మనసులో కంగారుగా వుంది. చాలామంది తమ తండ్రి రిటైర్డ్ మెంట్ ఫంక్షన్ కు వచ్చి చాలా గొప్పగా చేస్తారు. టపాసులు కాలుస్తూ చప్పుళ్ళతోటి ఇంటికి తీసుకవచ్చి పెద్ద పండుగ లాగా చేస్తారు. మరి వీళ్ళేమో ఇంతవరకు రాలేదు. అంత హడావుడి వద్దనే అనుకున్నాము. ‘కనీసం ఆయన తృప్తి కోసమైనా. పదిమంది చూడడానికైనా వస్తే బాగుండేది’ అని మదనపడసాగింది. పైకి మాత్రం గంభీరంగా వుంది, భర్త బాధపడడం ఇష్టంలేక.
టీచర్లందరు కలసి చిన్న పార్టీ ఇచ్చారు. మెడలో పూలమాల వేసి, శాలువ కప్పి ఒక బహుమతి ప్రదానం చేసారు. తోటి టీచర్లు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఇంటివరకు వచ్చారు. ఇంటిముందుకు వచ్చేసరికి పెద్ద బాణ సంచాలు మ్రోగాయి . కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి పెద్ద పూలమాల తెచ్చి తల్లితండ్రులకు మెడలో వేసారు. మనవలు, మనవరాళ్ళ కేరింతలతో ఉప్పొంగిపోయారు సాంబమూర్తి అన్నపూర్ణ.
“ఏరా బాబు … ఇంతలేటుగా వచ్చారు? ముందుగా వచ్చి వుంటే మీ సొమ్మేం పోయేది? పాపం ఆయన ఎంత కంగారుపడ్డారో తెలుసా?, ” అంది అన్నపూర్ణ పిల్లలను మందలిస్తూ.
“ అయ్యో నాన్నమ్మా! మేమందరం అప్పుడే వచ్చాము. మిమ్మల్నీ సర్ ప్రైజ్ చెయ్యాలని మీకొక పెద్ద గిప్ట్ తెచ్చారు నాన్నవాళ్ళందరు” చెప్పాడు నోటమాట ఆగని అయిదేళ్ళ బుడతడు.
“ఒరేయ్ ఆగరా! మేము చెబుతాము కదా.. కాసేపు ఆగలేవా, ” అంటూ కోప్పడ్డాడు సాంబమూర్తి పెద్దబ్బాయి.
“పోనీలేరా! వాడు చూడు ఎలా చిన్నబోయాడో..” అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నాడు సాంబమూర్తి.
“ముందు ఇంటిలోకి నడవండిరా. బయటే నిలుచుని మాట్లాడుతున్నాము. టీచర్లందరిని అలానే నిలబెట్టాము, ” అంటూ తలుపుతెరవబోయింది అన్నపూర్ణ.
“అమ్మా… ఇప్పుడు ఇంటిలోకి కాదు, మిమ్మల్ని ఒకచోటకు తీసుకవెళతాను రండి. అందరం అక్కడే పార్టీ చేసుకుందాము. అక్కడ మనవావాళ్ళు చాలా మంది మన కోసం ఎదురు చూస్తున్నారు” అంటూ కారు డోరు తెరచి తల్లిని తండ్రిని కూర్చోబెట్టారు.
ఏమీ అర్ధం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సాంబమూర్తి, అన్నపూర్ణ .
సరాసరి కార్లన్నీ వెళ్ళి పెద్ద భవనం ముందు ఆగాయి, తల్లితండ్రులను చేతులుపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి, “నాన్నా! ఇక నుండి ఈ ఇల్లు మనది. మీరు ఇందులోనే వుంటున్నారు” అని చెప్పారు పిల్లలు.
అయోమయంగా చూసారు సాంబమూర్తి దంపతులు.
“ఆశ్చర్యపోతున్నారా నాన్నా… మన వూరిలో మీకు తెలియకుండా ఇంత పెద్ద ఇల్లు మనది అంటున్నారనీ.. అదే నాన్నా! ఇందాక చిన్నోడు చెబుతుంటే వద్దన్నాము కదా! మీకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇదే. మీకు తెలియనివ్వకుండా బిల్డర్ తో మాట్లాడాము. మీరు పడిన కష్టాలకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము? మీరెలాగు ఇప్పుడప్పుడే ఈ వూరు విడిచి మా దగ్గరకు రారు. అందుకని తమ్ముడు, చెల్లాయిలు, బావలు.. అందరం కలసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇక నుండి మీరు దేనికీ ఇబ్బంది పడకూడదు. ఇదిగో ఇంటి తాళాలు. అంతే కాదు. మీరు ఎన్నో సంవత్సరాలనుండి కొనాలనుకుంటున్న మీకు నచ్చిన స్కూటర్ తాళాలు..” అంటూ తండ్రి చేతిలో పెట్టారు.
“అమ్మా… ఇదిగో నీకు మనసులో వుండిపోయిన రెండు చేతులకు వేసుకునే మురుగులు, మెడలో వేసుకోవడాని ముత్యాలదండ.. రెండు వరసలది, ” అంటూ కూతుర్లు కోడళ్ళు కలిసి అన్నపూర్ణకు ఇచ్చారు. ఆనందంతో నోటమాట రాక ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. కన్నతల్లి తండ్రులను ఇంతబాగా అర్ధం చేసుకున్న కన్నపిల్లలను చూసి మురిసిపోయారు.
వచ్చిన చుట్టాలు, టీచర్లు అందరూ వీళ్ళ అదృష్టానికి వేయినోళ్ళ పొగిడారు. తల్లి తండ్రి మనసు తెలుసుకొని, వాళ్ళ సంతోషాన్ని పంచుకునే పిల్లలను చూసి ఆనందపడిపోయారు.
రిటైర్డ్ మెంట్ పండుగ ముగిసి, ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక, అన్నపూర్ణ సాంబమూర్తి కూర్చొని మనసుదీరా మాట్లాడుకున్నారు.
“పూర్ణా… మన పిల్లలకు నేను స్కూటర్ కొనుక్కోవాలని వుందని ఏనాడూ చెప్పలేదు. మరి వాళ్ళెలా కనిపెట్టారంటావు?” అడిగాడు అమాయకంగా.
“ఆహా …ఏమి తెలియని అమాయకులు పాపం! ఏం?.. నాగురించి మీరు వాళ్ళకు చెప్పలేదు? ‘ఒరేయ్! మీ అమ్మకు చేతికి మురుగులు, మెడలో ముత్యాలదండ వేసుకోవాలని వుంది, నేను కొనిపెడతాను అంటే వద్దంటుం’దని మీరు ఉత్తరం వ్రాసారు కదా! అది చూసి నాకు ఏమీ వద్దు. మీ నాన్నకు ఎప్పటి నుండో స్కూటర్ కొనుక్కోవాలని వుందని నేను ఉత్తరం వ్రాసాను. వాళ్ళేమో మనిద్దరికి వున్న కోరికలు తీర్చారు” అంది గలగలా నవ్వుతూ.
“కానీ పూర్ణా! మన వూరిలో మనకు తెలియకుండానే ఇంత పెద్ద భవనం కట్టించారు. నిజంగా మనమంటే వాళ్ళకు ఎంతప్రేమ కదా! ఇదంతా నువ్వు పెంచిన పెంపకం పూర్ణా!” అంటూ ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్నాడు.
ఆనంభాష్పాలు రాలగా లతలాగా సాంబమూర్తిని పెనవేసుకుంది అన్నపూర్ణ.
॥॥శుభం॥॥
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
Uma Gayatri • 9 hours ago
Chaala baagundi. Kathalo nerchukovalasiana sunnitamina vishayalu chaala baaga chepparu. Oka Adarsamina kutumbam katha. Abhinandalu Lakshmi garu👌👌💐
Kp J • 22 hours ago
Nice
uma rani • 22 hours ago
Hi Laxmi 🙏 it's a moralSuperb story n the person who is giving explanation voice is good 👌But now Genaration is very,.....!!!!!!
Swamy VLN • 10 hours ago
👏👏👍👌excellent
Ramadevi Ramadugu • 12 hours ago
👏👏 చాలా బాగుంది