#PittaGopi, #పిట్టగోపి, #RightPerson, #TeluguKathalu, #తెలుగుకథలు, ##TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Right Person - New Telugu Story Written By - Pitta Gopi
Published In manatelugukathalu.com On 07/01/2025
రైట్ పర్సన్ - తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఒక వయస్సు వచ్చినా.. కొందరికి జీవితంలో సెటిల్ అవ్వాలని, పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలు ఇంకొకరిని చూస్తే కానీ రావు.
కవిత తనకు కూడా పెళ్ళి వయస్సు వచ్చినా.. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తనతోటి వారందరికీ పెళ్ళి అయి పిల్లలు కూడా ఉన్నారు. ఏడదిన్నర క్రితం తన మేనమామ ఇంట్లో ఒక శుభకార్యానికి అక్కడకి వెళ్ళి తిరిగి వచ్చాక తనకు ‘ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావ్.. ?ఎప్పుడు తల్లి అవుతావు, పప్పన్నం ఎప్పుడు పెడతావ్’ లాంటి మాటలు ఎక్కువైయ్యాయి.
కవిత మేనమామ ఇంటికి వెళ్ళకముందు నుండే తన పెళ్లి పై అనేక కలలు కనేది. ఈ నూతన సమాజంలో, వేగిన కలియుగంలో తనకు మంచి వ్యక్తిత్వం గల రైట్ పర్సెన్ దొరికే వరకు వెయిట్ చేద్దామని తనలో తాను అనుకుంది. డబ్బుకు కొదువలేదు. తాను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తన పై అధికారులు కూడా కవిత మాటకు విలువిస్తారంటే తాను ఆ రంగంలో తిరిగి చూడాల్సిన పని కూడా లేదని సుస్పష్టం.
కవిత తన జీవిత భాగస్వామి గూర్చి మంచి ఆలోచనతో ఉంది. కానీ.. ? మంచివాళ్ళని గుర్తించటంలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ విషయం తనకు కనపడిన ప్రతి ఒక్కరు పెళ్ళి గురించి అడుగుతున్నప్పుడు అర్థం అయింది.
తన వివాహం గురించి అడిగిన స్నేహితురాలు వింధ్యతో ఇలా చెప్పింది కవిత.
“నా తల్లిగారి సొంత అన్నయ్య పరమేషు శ్రీకాకుళం జిల్లాలో విశ్వరుప్ అనే పెద్ద పల్లెటూరులో ఉంటారు. అతను పెద్ద వ్యాపారవేత్త మరియు సర్పంచ్. ఆయనకు ముగ్గురు కొడుకలని, వాళ్ళే వ్యాపారులు చూసుకుంటారని, వాళ్ళది మంచి బతుకని అమ్మ ఎప్పుడు చెప్తుండేది. మామయ్యని ఫోన్ లో వీడియో కాల్ లో చాలాసార్లు చూశాను కానీ.. వారి కొడుకులను మాత్రం నేను చూసి ఉండను.
మా తాతగారు అమ్మకు దూరపు పట్నంలో నాన్నగారికి ఇచ్చి పెళ్ళి చేశారు. నేను పుట్టాక అమ్మకూడ అక్కడికి వెళ్ళింది తక్కువే. మామయ్య కొడుకుల్లో ఇద్దరకి పెళ్ళి అయిందని నాన్న చెబితే కానీ తెలియదు. మరీ.. అమ్మ ఆ మూడో అతనికి ఇచ్చి పెళ్ళి చేద్దామని కూడా ఎందుకు చెప్పలేదు.. అదే జరిగితే అమ్మమ్మగారింటికే కోడలుగా వెళ్ళేదాన్నిగా. సరే మంచి వ్యక్తి దొరికితే ఎంత దూరమైన అతనితో వెళ్తా అని ఆ విషయం పక్కనెట్టింది.
మామయ్య ఇంటికి శుభకార్యానికి అమ్మనాన్నలు రాలేకపోవటంతో జర్ని బాగా తెలిసిన పక్కంటి అంకుల్ ని తోడు పంపి నన్ను వెళ్ళమన్నారు. ఖచ్చితంగా నెల రోజులు ఉండి రమ్మని, అంకుల్ ఏమో నిన్ను అక్కడికి చేర్చి పదిరోజులు ఉండి వచ్చేస్తాడని. తర్వాత నిన్ను తీసుకురావటానికి అమ్మనేను వస్తామని చెప్పి పంపారు.
లాంగ్ జర్ని అంత అయిపోయింది. ఒక కారు బుక్ చేసుకుంటే మామయ్య ఊరు అరగంటలో వచ్చేస్తుంది. అయితే ఊరు ఎక్కడ ఉందో తెలియక గూగుల్ సహాయంతో వెళ్తూ కలిసిన వాళ్ళని అడుగుతూ పోతున్నాం.
ఆ ఊరికి దగ్గర్లోకి రాగా కలిసిన ఇద్దరు యువకులను
‘విశ్వరూప్ ఊరు ఎంత దూరం ఉంటుంద’ని అడిగాం.
‘అబ్బే.. అలాంటి ఊరు ఈ ఏరియాలో లే’దన్నాడు ఒకడు.
‘షట్ అప్ రాస్కేల్. గూగుల్ లో చూపిస్తుం’దని అన్నాను.
ఇంతలో మరో యువకుడు మా ప్రయాణ అలసటను అర్థం చేసుకున్నాడేమో.. అతడ్ని వారించి
‘మరికొంత దూరం ముందుకు వెలితే వస్తుందండి మీకు కావల్సిన ఊరు’ చెప్పి వెళ్ళిపోతున్నాడు.
మేం ముందుకు వెళ్ళగానే అతడు చెప్పినట్లు ఊరు వచ్చింది. మామయ్య ఇల్లు చాలా విశాలంగా ఉంది. చాలా గదులు ఉన్నాయి. ఇంటి చుట్టూ మొక్కలు, పచ్చని చెట్టు, పూదోటలు అంతా అందంగా ఉంది. శుభకార్యానికి ఇంకా చాలా రోజులు వ్యవధి ఉండటంతో ఇల్లు అలికిడిగా లేదు. కారు దిగగానే మాకు ఎవరూ ఎదురు పడలేదు.
ఇందాక వివరాలు చెప్పిన ఇద్దరూ వచ్చి మా పక్కనుండే ఇంట్లోకి దర్జాగా వెళ్ళటం చూశాను. వారి వాలకం చూసి ఆ ఇంటి పనిమనుషులుగా అర్థం అయింది. ఆలస్యం చేయకుండా ‘హే.. మిమ్మల్నే.. మా సామాన్లు లోపలికి తీసుకెళ్ళండి’ అరిచాను.
వాళ్ళు లెక్కచేయకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ అరిచాను. ఇద్దరు వచ్చారు. పిలిచిన వెంటనే రాలేదని చీవాట్లు పెట్టి వివేక్, ప్రభుగా వాళ్ళ పేర్లు తెలుసుకున్నాను.
వివరాలు చెప్పిన వివేక్ సామాన్లు పట్టుకెళ్ళమంటే నీమీద ఇష్టంతో పట్టుకెళ్తున్నాననే సంకేతాలు అతడి కళ్ళతో ఇచ్చాడు. నేను అతడిని పట్టించుకోలేదు కానీ.. అతని చూపులు అతడిని పట్టించుకునేలా చేస్తున్నాయి.
మామయ్య-అత్తయ్య మేనమామలు పలకరింపులు ఊపందుకున్నాయి. ఇద్దరు మేనమామలు వారి పిల్లలు చూశాను కానీ.. పెళ్ళవని మరో మామయ్యని చూడలేదు. ఎలా ఉంటాడో తెలియదు. అడగదామని అనుకున్నాను. కానీ.. నా పెళ్ళి ప్రస్థాన తెస్తారని అడగలేదు. ఒక పెద్ద గదిలో అంకుల్ కు నాకు విడివిడిగా రెండు బెడ్స్ వేయించారు.
వచ్చి రెండు రోజులు అవుతుంది. ఇంట్లో ఎక్కువగా మా బందువులు ఎవరు తిరగటం కంటే ఈ ఇద్దరు పనివాళ్ళే తిరగటం చూస్తున్నాను. బహుశా మా మామయ్య వాళ్ళు పనివాళ్ళని అంత మంచిగా చూసుకుంటారని అనుకున్నా.. వీళ్ళు పెద్దగా పని చేసినట్లు కూడా చూడలేదు. అందుకే వాళ్ళని పిలిచి పని అప్పజెప్పాలని అనుకున్నాను.
వాళ్ళని పిలిచి ‘నా బట్టలు ఐరన్ చేయ’మన్నాను.
చేయనన్నాడు ప్రభు.
బట్టలు ఇవ్వమన్నాడు వివేక్
బట్టలు చూపించగా ‘ఇవి ఆల్రెడీ ఇస్త్రీ చేసినవే కదా’ ప్రశ్నించాడు
‘నన్నే ప్రశ్నిస్తావా..’ అని చిరాకుతో నా బట్టలు అన్ని నలిపేసి
‘ఇప్పుడు నలిగిపోయాయి కదా చేయి’ అన్నాను.
‘చేస్తాను. కానీ.. ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేస్తే..’ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు.
మామయ్యతో చెబుతానంటే క్షమాపణ కోరాడు.
అప్పటి నుండి వాళ్ళు కనిపిస్తే చాలు ఏదో ఒక పని అప్పజెప్పేదాన్ని. ఏదైనా అంటే మామయ్యకు చెబుతాననే దాన్ని. భయంతో పని చేసేవాళ్ళు. అంత భయపడినా శుభకార్యం దగ్గర పడిన సమయంలో ఒకరోజు వివేక్ వచ్చి
"నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ నిన్ను పొందే అదృష్టం నాకు కొంచెం కూడా లేదండి" అన్నాడు.
ఒక పల్లెటూరిలో ఒక పనివాడు నన్ను అలా అనటంతో సహనం కోల్పోయిన నేను అతడి చెంప ఛెళ్ళుమనిపించాను. అది చూసి ఎప్పుడు నాపై వాడివేడిగా ఉండే ప్రభు అరుస్తాడనుకున్నాను. కానీ.. వివేక్ ని భుజం తట్టి ఓదార్చాడు. నాకేం అర్థం కాలేదు.
ఇది జరిగి రెండు రోజులైంది. వివేక్ ఇంటికి కూడా రాలేదు.
శుభకార్యం ముందు రోజు ఇల్లంతా చుట్టాలతో కళకళలాడుతోంది. అయినా పనులు చేయటానికి వివేక్ రాలేదు. అతడిని కొట్టాననే బాధ నాకు లేదు. పనికి రాకపోయినా మామయ్య ఏం అనటం లేదనే ఆలోచన వస్తుంది.
శుభకార్యం రోజు తెల్లవారుజామునే వివేక్ ఇంట్లో దర్శనమిచ్చాడు. అన్ని పనులు అతడే చేస్తున్నాడు. నేను కొట్టాననే ఆలోచన, బాధ అతడిలో లేనట్లు ఉన్నాయి. వివేక్ కి తోడుగా ప్రభు ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. అలా అలా రెండున్నర కావొస్తుంది. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
అంత దూరంలో నుండి ఎవరో ఇద్దరు భోజనం చేస్తున్నట్టు, ఒక ఆవిడ వడ్డిస్తున్నట్టు చూసి దొంగచాటుగా చూశాను. ప్రభు, వివేక్ లకు మా అత్తయ్యే స్వయంగా, ప్రేమగా వడ్డిస్తుంది. ఇంత కార్యంలో కూడా పని మనుషులకు కూడా దగ్గరుండి భోజనం పెడుతుండటం చూసి ఇంత మంచి కుటుంబంలో మా అమ్మ పుట్టినందుకు కళ్ళలో కొన్ని కన్నీటి బిందువులు వచ్చాయి నాకు.
అంగరంగవైభవంగా శుభకార్యం అయిపోయాక రెండు రోజుల్లోనే అమ్మానాన్నలు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. కారు దిగగానే ఎదురెళ్ళాను.
అక్కడే కనపడిన వివేక్ ని చూసి
‘హేయ్.. మిస్టర్. ఇలా రా. వచ్చి లగేజీ లోపలికి తీసుకురా’ అన్నాను. అమ్మానాన్నలను లోపలికి తీసుకెళ్ళాను. వివేక్ లగేజీ తీసుకొచ్చాడు. ఉన్నట్టుండి ఎందుకో నా మనసు అతడి వైపు లాగింది. సముదాయించుకున్నాను. అయినా.. వివేక్ ని మనసారా నేను పెట్టాలనుకున్న ఇబ్బందులు అన్ని పెట్టాను. ఇక మేం వెళ్ళాల్సిన టైం వచ్చింది. లగేజీ ఒక కారులో మేం ఒక కారులో రెండు కార్లని సెట్ చేశారు మామయ్య.
వివేక్ ని పిలిచి లగేజీ కార్లో పెట్టించాను. ఏది చెప్పినా.. చిరునవ్వుతో చేసే వివేక్ ఆ రోజు డల్ గా ఉండటం గమనించాను. ముఖం పై ఉదయానికి ఉదయమే చిరునవ్వు ఎలా మాయమయిందబ్బా అనుకున్నా. అయినా నా మనసు అతడ్ని కనికరించలేదు. లగేజీ కారులో పెట్టి అక్కడే నిల్చున్నాడు. అమ్మనాన్నలతో నేను కారు దగ్గరకు వచ్చాను.
నాన్న వివేక్ ని చూసి చేతులు జోడించి
"బాబు.. నువ్వా బాగున్నావా.. ? ఒసేయ్ నీ చిన్న తమ్ముడు మనం వెళ్ళిపోయినప్పుడు కనిపించాడే " అన్నాడు.
‘అదృష్టం అండీ’ అంటూ ‘ఒరేయ్ తమ్ముడు.. ఎలా ఉన్నావ్ రా’ అని ఏడుస్తూ వివేక్ ని హత్తుకుంటే దగ్గరుండి అవన్నీ చూసిన నేను షాక్ అయిపోయాను. నా గుండె బరువెక్కింది. మనసు అల్లకల్లోలం అవటం మొదలెట్టింది. నోటి వెంట మాట రాలేదు. నన్ను నేను మర్చిపోయాను. తేరుకునేలోపు మా కారు బయలుదేరింది. వివేక్ ని మనస్ఫూర్తిగా చూడాలనిపించింది. అద్దంలోంచి తొంగి చూశాను. నవ్వుతూ చెయ్యి ఊపి నన్ను సాగనంపాడు.
ఉండబట్టలేక నాన్నని అడిగాను.
‘అంత పెద్ద కుటుంబంలో వివేక్ ఏంటీ.. ఇంత సాధారణంగా ఉన్నా’డని.. ?
అమ్మ విని ఇలా చెప్పింది.
‘వివేక్ కి చిన్నప్పుడు చదువు ఆబ్బలేదు, చదువుకోమని బడికి పంపితే పొలానికి పోయేవాడు మామయ్యకు చదువుకోని వారంటే అందులోను అక్షరం ముక్క రానివారంటే పడదు. అందుకే ఇంట్లో ఉన్నా.. వివేక్ ని పట్టించుకోడట, కానీ.. ఇప్పుడున్న జనరేషన్ లో వివేకే గొప్పవాడని, నీతికి, నిజాయితికి పెట్టింది పేరని. ఆపదంటే లేదనకుండా సహాయం చేసే గుణమే అతడికి మంచివాడిగా గుర్తింపు తెచ్చిందని చదువు లేకపోయినా సంస్కారం ఉంటే నా తమ్ముడు ఎక్కడ అయినా రారాజే’ అని చెప్పింది.
అమ్మ మాటలు వినగానే ఈ నెల రోజుల్లో అతడు చేసిన ప్రతి పని ఇప్పుడు పాజిటివ్ గా గుర్తు చేసుకున్నాను. నిజమే.. వివేక్ నీతివంతుడని నా కళ్ళతో స్వయంగా చూశాను. చదువనే అహంకారం వలనే ఇద్దరు అన్నదమ్ములు శుభకార్యంలో ఏ పని చేయకపోగా అన్నీ తానై చూసుకున్నాడని, ఆ ధ్యాస లో పడి తన ఆకలిని సైతం మర్చిపోతే అత్తమ్మ వడ్డించిందని ఒక్కొక్కటిగా జరిగినవి గుర్తు చేసుకున్నాను.. చదువుకుని అన్నీ తెలుసు అనుకునే వాళ్ళందరు క్రమశిక్షణ లేనివాళ్ళే. అలాంటి ఈ కొత్త ప్రపంచంలో చదువులేకపోయినా.. మంచితనం, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిజం మాట్లాడటం వంటి లక్షణాలు ఒకే మనిషిలో నేను చూశాను. కానీ.. ! ఆలస్యంగా అతడిని గుర్తించాను.
నా కళ్ళముందే ఒక మంచి మనిషి ఉన్నా అతడిని ఒకరు చెప్పే వరకు గుర్తించే సామర్థ్యం నాకు లేకపోయింది. ఈ బాధ కంటే.. అతడిని ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలే నన్ను ఏడుపు ఆపుకోనివ్వటం లేదు. పైగా అతడు ఎవరో కాదు నా మేనమామ కొడుకు. నేను అది కూడా గుర్తించలేకపోయాను.
ఒక మనిషి గూర్చి తెలుసుకోకుండా ఇన్ని రోజులు గడిపాను. ఇంటికి చేరాము. అన్ని వివేక్ ఆలోనలే. ఇప్పుడు ఎంత ఏడ్చినా నాకు తనవి తీరటం లేదు. ఏడ్చే కొద్దీ తాను నా సొంతం కావాలని నా మనసు పట్టుబడుతుంది. నిజమే.. నా మనసు కోరేది తప్పేం కాదు కదా.. ? నా మేనమామ కొడుకుని నేను కోరుకోవడం ఎలా తప్పవుతుంది.. ?
అంతా నా తప్పే. ఇప్పుడు మరికొన్ని రోజులు అక్కడ ఉంటే బాగుణ్ణనే ఆలోచన నా మదిలో మొదులుతుందిప్పుడు. ఆ కొన్ని రోజులు వివేక్ తో ఉండాలని ఆశపడుతోంది. ఏ లక్షణాలు ఉన్న మనిషిని నేను పెళ్ళి చేసుకోవా లనుకున్నానో.. ఆ లక్షణాలు ఉన్న మనిషి నా సొంత బావ రూపంలో ఉన్నా ఇప్పుడు అతడిని నేను పొందగలనా.. లేదా.. ?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నా పొగరుబోతు చర్యలకు వివేక్ నన్ను చేసుకోటానికి ఒప్పుకుంటాడా.. ఎందుకంటే ఒక ఆడదే కాదు ఒక మగాడు కూడా తనకు మంచి మనసున్న అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటాడు కదా.. ! అందుకే జరిగింది మనసులో పెట్టుకుని, వివేక్ ని తలుచుకుని, నా పెళ్లి ప్రస్థావన తెస్తున్నా.. ఏనాడూ వివేక్ గూర్చి చెప్పలేకపోయాను.
అది తలుచుకుంటే మనసు మనసులా ఉండదు. అయినా అతడినే కోరుకుంటుంది నా మనసు. ఇక ఆలస్యం చేయను. అతడు నాకు దక్కాలంటే ఒకసారి అమ్మనాన్నలకు అడగాల్సిందే. అతనే నాకు సరైన వాడు. ఎందుకంటే అతడు నేను పెట్టిన బాధలను మౌనంగా, చిరునవ్వతో ఎదుర్కున్నాడు. ఒకనొక సందర్భంలో నేనంటే ఇష్టపడ్డాడు కూడా..
అలాగే ఎన్ని బాధలు పెట్టినా.. వివేక్ తప్ప నెల రోజులు ప్రేమ చూపిన వారెవ్వరు నేను వెళ్ళినపుడు బాధపడలేదు, సాగనంపటానికి కూడా రాలేదు. అద్దంలోంచి వివేక్ ని చూస్తే.. నేనెవ్వరో నువ్వు వెళ్ళిపోయినపుడు తెలిసింది. తనను బాధపెట్టినందుకు నేను బాధపడతానని అర్థం చేసుకుని ఏం పర్వాలేదు నేనేం ఫీల్ కాలేదని హ్యాపీగా ఉండమనే సంకేతాలు వివేక్ కళ్ళతోనే ఇచ్చాడు.
అతడే నేను కోరుకున్న రైట్ పర్సెన్. మీ అందరి దీవెనలు ఉంటే అమ్మానాన్నలు సహకారంతో వివేక్ ని నా సొంతం చేసుకుంటాను. ఎందుకంటే అతడు నా బావ కాబట్టి. ఆ అర్హత నాకుంది కాబట్టి. తనను బాధపెట్టినందుకు రెట్టింపు ఇవ్వల్సిన ప్రేమ చాలా ఉంది కాబట్టి”
స్నేహితురాలికి వివరంగా చెప్పింది కవిత.
“తప్పకుండా నీకు ఆ రైట్ పర్సెన్ తో వివాహం జరుగుతుంది" అంది స్నేహితురాలు వింధ్య.
*** *** *** *** *** *** ***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments