రోల్ మోడల్
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- May 27, 2023
- 5 min read

'Role Model' - New Telugu Story Written By Ch. C. S. Sarma
'రోల్ మోడల్' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన వారు తల్లి దండ్రులు. వారి పెంపకం.. పిల్లలను ఉత్తములుగా, సజ్జనులుగా, కీర్తివంతులుగా చేస్తుంది. తల్లిదండ్రులు తమ భాధ్యతను సవ్యంగా నెరవేర్చి పిల్లలను జాతి రత్నాలుగా తయారు చేయాలి..
మాధవమూర్తి గారు వరండాలో వాలు కుర్చీలో కూర్చుని దిన పత్రికను చదువుతున్నారు.
అర్ధాంగి శ్యామల కాఫీ గ్లాసుతో వరండాలో ప్రవేశించింది. “ఏమండీ!.. కాఫీ!.. ” అంది.
పత్రికలోని దేశ ప్రధాని గారి లక్ష్యాలను ప్రణాళికలను చదువుతూ మాధవ మూర్తి భార్య పిలుపును ఆలకించలేదు.
శ్యామల కాస్త హెచ్చు స్థాయిలో.. ” ఏమండీ.. మిమ్మల్నే.. కాఫీ గ్లాసును అందుకోండి.. ” అంది చిరాకుగా ..
మాధవ మూర్తి తలను పైకెత్తి శ్యామల ముఖం లోకి చూచాడు.
“పత్రికను చేత పట్టుకొన్నారంటే ప్రపంచాన్నే మర్చి పోతారు.. ” వ్యంగంగా అంది శ్యామల.
చిరునవ్వుతో శ్యామల చేతిలోని కాఫీ గ్లాసును అందుకొన్నాడు మాధవ మూర్తి.
అపుడు సమయం ఉదయం ఆరుగంటలు.
రెండు చేతులు చూస్తూ.. “కరాగ్రే వసతే లక్ష్మీ.. కర మధ్యే సరస్వతి.. కర మూలే శ్రీ గౌరి.. ప్రాతః కాలే కర దర్శనం. ” అంటూ చేతులను కళ్ళకు అద్దుకొని మంచం దిగింది మాధవ మూర్తి ముద్దుల కూతురు సంధ్య.
దేవుని మందిరాన్ని సమీపించి చేతులు జోడించి..
‘కౌసల్యా సుప్రజా రామా.. పూర్వా సంధ్యా ప్రవర్ధతే.. ఉత్తిష్ట నరశార్ధూలమ్.. కర్తవ్యం దైవ మాహ్నికం.. ’ ముద్దు ముద్దుగా పలుకులతో శ్లోకం పూర్తిచేసి.. వరండాలో వాలు కుర్చీలో వున్న నాన్నగారి వద్దకు నవ్వుతూ వచ్చింది సంధ్య.
ఆమె కాలి గజ్జెలు ఘల్లు ఘల్లున మ్రోగి.. ఆనంద రవళిని ప్రీతిగా చెవులకు అందిస్తున్నాయి. సంధ్య ఏడవ తరగతి చదువుతోంది.
తన్ను సమీపించిన పన్నెండేళ్ళ కూతురును ఆప్యాయంగా చిరునవ్వుతో దగ్గిరికి తీసుకున్నాడు మాధవమూర్తి.
“రాయే.. రాయే!.. మా అమ్మ రాయే!.. ” ఆ మాటల్లో యెంతో ఆప్యాయత.. అభిమానం.. ప్రేమ.
“నాన్నా!.. ”
“ఏం తల్లీ!!.. ”
“ఈ రోజు ఆదివారం కదా!.. ”
“అవును తల్లీ!.. ”
“మీ కార్యక్రమం ఏమిటి?.. ”
మాధవ మూర్తి వాలు కుర్చీ ప్రక్కనే నిలబడివున్న అర్ధాంగి ముఖం లోకి ప్రశ్నార్ధకంగా చూచాడు.
శ్యామల తల ఆడించి చిరునవ్వుతో సమాధానం యిచ్చింది.
“సంధ్యా!.. ఇపుడేకదా నిద్ర లేచావు.. ” అంది శ్యామల.
ఒళ్ళు విరుచుకొంటూ సంధ్య.. “అమ్మా.. ఈరోజు ఆదివారం కదా.. ఆ కారణంగా పదిహేను నిముషాలు లేటుగా లేచాను!.. ” తల్లి మరో ప్రశ్న అడగకుండా తను చేసిన తప్పునకు తానే సంజాషి ఇచ్చింది సంధ్య.
భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మూసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.
వారికి గారాల పట్టి సంధ్య..
“ఆ.. నాన్నగారూ.. ప్రోగ్రామ్ ఏమిటో చెప్పండి.. ” గోముగా అడిగింది సంధ్య.
“అమ్మా!.. ”
“ఏం.. నాన్నా!.. ”
“ఈ రోజు మన ప్రోగ్రామ్ నీవే చెప్పు.. ”
“ఆ.. ఆమె కోరడమూ.. మీరు ఆమెనే ఫిక్స్ చేయమనడం.. బాగుంది.. వరస.. ” వెటకారంగా అంది శ్యామల..
“శ్యామూ!.. ఎందుకే బిడ్డను అలా విమర్శిస్తావు.. సౌమ్యంగా మాట్లా డవే!.. ” అభ్యర్ధనగా చెప్పాడు మాధవమూర్తి.
“నాన్నా!.. ”
“ఏం.. అమ్మ!.. ”
“నేను మా స్నేహితురాలు శ్యామల ఇంటికి వెళ్ళి.. ఇద్దరం కలసి హోంవర్క్ ముగించిన తర్వాత ఇంటికి వస్తాను. ఆ తర్వాత సాయంత్రం పార్క్ కు వెళదాము.. ” తల్లి వైపు చూచి.. ”అమ్మా.. నీకు సమ్మతమేగా.. ” అడిగింది సంధ్య.
తల్లి తండ్రి “ సరే!.. ” అన్నారు.
సంధ్య ఆనందంగా నవ్వుతూ ఇంట్లోకి పరిగెత్తింది. పుస్తకాల సంచీని భుజానికి తగిలించుకొని వరండాలోకి వచ్చింది. తల్లి తండ్రికి చెప్పి స్నేహితురాలు శ్యామల ఇంటికి వెళ్లిపోయింది.
మాధవమూర్తి వారి భార్య శ్యామల.. ఇరువురు ప్రైమరీ స్కూల్ టీచర్లు. పేద కుటుంబీకుల సంతతి. వారి తల్లి తండ్రులు ను చిన్న వయస్సునుండే గమనించి.. బాగా చదివి.. మంచి వుద్యోగంలో ప్రవేశించి.. తల్లీ తండ్రికి ఆనందాన్ని కలిగించాలనే సంకల్పంతో ఇరువురూ ప్లస్ టూ వరకు చదివి టీచర్ ట్రైనింగ్ ముగించి.. తొలుత మాధవ మూర్తి.. మూడు సంవత్సరాల తర్వాత శ్యామల.. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. మాధవ మూర్తి తండ్రి గోపాలయ్య.. తల్లి శాంతి.
గోపాలయ్య గారు వ్యవసాయదారుడు. ఆ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకు పురోహితుడు. సత్యం.. ధర్మం.. నీతి.. న్యాయా దులను అభిమానించి.. పాటించే వ్యక్తి. వారి భార్య శాంతి అన్ని విధాలా వారికి తగినదే.
ఆ తల్లి తండ్రుల సంరక్షణలో మాధవమూర్తి క్రమ బద్ధంగా పెరిగాడు. తమ కుటుంబ స్థితిగతులను అనుసరించి.. తల్లి తండ్రి పడే కష్టాలను అర్ధం చేసుకొని.. గొంతెమ్మ కోర్కెలతో కన్నవారికి భారం కాకుండా.. చిన్న వయస్సు నుండి టీచర్ కావాలని కలలు కని ఉపాధ్యాయుడుగా అయినారు.
శ్యామల మాధవమూర్తి పొరిగింటి అమ్మాయి. మాధవమూర్తి అంటే చిన్నప్పటినుంచి అభిమానం.. గౌరవం.. ఆమె తండ్రి తిరుపతి.. తల్లి కనకం. తిరుపతి వ్యవసాయ దారుడు. కనకం గృహిణి.
రెండు కుటుంబాల మధ్యన మంచి స్నేహం. ఆ కారణంగా యుక్త వయస్కులైన మాధవమూర్తి.. శ్యామలల వివాహాన్ని వారిరువురి మనసెరిగిన ఆ పెద్దలు ఆ వూర్లోని రామాలయంలో బంధువుల సమక్షంలో జరిపించారు. వారిరువురి చిన్ననాటి అభిప్రాయం.. ‘కాకిలా ఎంతో కాలం బ్రతికేకన్నా.. కోకిలలా కొంత కాలం బ్రతకడం మిన్న.. ’ అని.
వారి వివాహం జరిగిన రెండు సంవత్సరాలకు సంధ్య జన్మించింది. ఆర్ధిక వసతులను అనుసరించి ఆ దంపతులు సంధ్య ఒక్కటే చాలనుకొన్నారు ఆ ఇరువురు ప్రైమిరీ స్కూల్ టీచర్లు.
కానీ దైవ నిర్ణయం వేరైంది. సంధ్యకు మూడు సంవత్సరాల ప్రాయంలో శ్యామల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు శివరాం.
సంధ్యా శివరాంలు మాధవమూర్తి శ్యామలకు పంచ ప్రాణాలు. ఉన్నంతలో ఎంతో గారాబంగా సాకుతున్నారు.
సంధ్యకు తమ్ముడు శివరాం అంటే ఎంతో ప్రేమ.. ఆదరణ.. అభిమానం.
*** *** ***
గ్రామానికి కొంచెం దూరంగా వుండే కాలనీ లోని ఓ గుడెసెలో గాలికి రేగిన నిప్పురవ్వ.. గాలి జోరుతో ప్రబలి అగ్ని కీలలుగా మారి కొద్ది నిముషాల్లో ఐదారు గుడిసెలకు నిప్పు అంటుకొని.. గాలి వేగానికి గణగణ రవంతో మంట ఒక గుడిసె నుండి మరో గుడిసెకు పాకిపోయింది. మొగవారు పొలాల్లో పనికి వెళ్లివున్నందున.. ఆడవారు.. చిన్న పిల్లలు.. వారి మట్టి కుండలు, ప్లాస్టిక్ బకెట్లు, తొట్లలోని నీటితో మంటలను ఆర్పసాగారు.
పొగ మంటలను చూచిన పొలాల్లోని వారూ పరుగెత్తుకు వచ్చారు. దిగుడు బావుల నుండి నీరు బకెట్లు, కుండలతో సేకరించి.. చాలా కష్టపడి.. చెమటలు కార్చి ఒక గంటకు ఆ మంటలను ఆర్పారు.
ఇది జరిగింది ఉదయం పన్నెండు గంటల లోపు. ఆ రోజు సాయంత్రం స్కూలు పిల్లలంతా లాస్ట్ పిరియడు తర్వాత గ్రౌండ్ లో సమావేశమయ్యారు. వారందరికి నాయకురాలు సంధ్య.
“మంటలతో కాలనీ కాలిపోయింది. మనమంతా మన తల్లితండ్రులను అడిగి కొంత ధనాన్ని, ధాన్యం, బట్టలు సేకరించి ఆ పేదవారికి సహాయం చేద్దాము. మానవ సేవయే మాధవ సేవ.. ఈ నా సంకల్పం నచ్చినవారంతా చేతులెత్తాలి.. ” చిరునవ్వుతో సంధ్య అందరి ముఖాల్లోకి చూచింది.
వారంతా చేతులెత్తి సంధ్య నిర్ణయంతో ఏకీ భవించారు..
మరుదినం స్కూలు ప్రార్ధన ముగిశాక హెడ్మాస్టారుగారికి సంధ్య ఆమె స్నేహితులు కొందరు కలసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. వారు టీచర్ల దగ్గరనుండి విరాళాలను వసూలు చేయండి అని చెప్పి ముందుగా హెడ్మాస్టారురు ఐదు వందల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కొందరు పిల్లలు స్కూల్లో, ఎక్కువమంది గ్రామంలో ఇల్లు ఇల్లు తిరిగి డబ్బు, ధాన్యం, వస్త్రాలు సేకరించారు.
అన్నింటిని స్కూలుకు చేర్చారు. పల్లెల్లో ముఖ్యులను పిలిచి హెడ్మాస్టారు గారు తమ పిల్లలు సేకరిచిన డబ్బు, బట్టలు, ధాన్యాన్ని వారికి ఇచ్చారు. సంధ్యా బృందాన్ని హెడ్మాస్టారు గోవిందరాజు గారు, టీచర్లు ఎంతగానో అభినందించారు.
*** **** ***
“నమస్కారం సార్!.. ”
వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవమూర్తి తలెత్తి ముందుకు చూచారు.
ఎదురుగా హైస్కూల్ మాస్టారు రమణమూర్తి గారు.
“ఓ.. రమణమూర్తి గారా!.. మాస్టారు.. రండి.. రండి.. ” చిరునవ్వుతో ఆహ్వానించాడు మాధవమూర్తి.
నవ్వుతూ రమణమూర్తి మాధవమూర్తి గారి ప్రక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు.
“మాధవమూర్తి గారూ!. ”
“చెప్పండి సార్!.. ”
“మీ అమ్మాయి సంధ్య చాలా తెలివి గలది. ఏక సంత గ్రాహి. మంచి తత్వం.. మంచి పద్ధతులు.. పిల్లలందరికి ఆమె ఆదర్శప్రాయురాలు. ఇలాగే చదువులు సాగించిందంటే భావిజీవితంలో ఎంతో వున్నత శిఖరాలను అధిరోహిస్తూ అందరికీ ఆదర్శప్రాయురాలుగా నిలుస్తుంది. యదార్ధం చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు సార్!.. ” పరవశంతో ఎంతో ఆనందంగా చెప్పారు మాస్టారు రమణమూర్తి.
“సార్!.. అంతా ఆ దైవ నిర్ణయం.. బిడ్డను పద్ధతిగా పెంచడం మన భాధ్యత. వారి భావిజీవితం ఎలా రూపు దిద్దుకొంటుందో మనకు తెలియదుకదా!.. అందునా ఆడబిడ్డ విషయం.. అంతా.. ఆ సర్వేశ్వరుల నిర్ణయం.. ” చిరునవ్వుతో చెప్పాడు మాధవమూర్తి.
“మాధవమూర్తి గారూ!.. ”
“చెప్పండి సార్!.. ”
“మీ అమ్మాయి మంచి దశమంతురాలు. ఇపుడు ఆమె ఏమి చేస్తోందో మీకు తెలుసా!.. ’
“ఆ.. పిల్ల స్నేహితురాలు ఇంటికి కలసి చదువుకోటానికి అని చెప్పి వెళ్లింది సార్!.. ” చెప్పాడు మాధవమూర్తి.
“అవును.. ఆ మాట నిజమే!.. అంతే కాదు.. ” అన్నాడు రమణమూర్తి గారు.
“అంతే కాదా!.. ” ఆశ్చర్యంతో అడిగాడు మాధవమూర్తి.
“అవును.. ”
“అదేమిటి సార్!.. ”
“ఆమె తన క్రింది తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతూ వుంది. తనకువున్న జ్ఞానాన్ని పదిమందికి పంచుతూ వుంది. మా స్కూల్లో క్రింది తరగతుల పిల్లలు రెండు వందలమంది వుంటారు. యధార్ధం చెప్పాలంటే వారందరికి మీ సంధ్య నాయకురాలు. ప్రియ స్నేహితురాలు.
ఆమెలోని ఆ సద్భావాలను ప్రోత్సహించండి. అభిమానించండి. మా కంటే.. అంటే.. మా ఉపాధ్యాయుల కంటే మీరు.. తల్లి ఆమెకు ఆదిగురువులు. మీ శిక్షణ అమోఘం. సంధ్య ఎంతో ఉన్నతికి వస్తుంది. ఎందరో ఆమె చుట్టూ వుంటారు. ఒకనాడు దేశాన్ని శాసించే నాయకు రాలుగా, మంచికి మానవత్వానికి ‘రోల్ మోడల్’ గా కాబో తుంది. ఆ బిడ్డను జాగ్రత్తగా చూచుకోండి.
ఆమె అభిప్రాయాలూ ఆశయాలు మీ వలన నేర్చుకున్నవే.. మా అందరకి ఎంతో ఆనందదాయకం. రేపు శనివారం సాయంత్రం మన స్కూల్లో.. స్కూల్ దినోత్సవం.. అందరూ తల్లి తండ్రులు వస్తారు. మీరు రావాలి.. స్కూల్ యాజమాన్యం.. సంధ్యకు వుత్తమ విద్యార్ధిని. అందరికీ ‘రోల్ మోడల్’ అనే బిరుదుతో సత్కరించ బోతున్నారు.
ఈ చర్యకు కారణం.. మా విద్యార్ధులు అందరూ సంధ్య లాగా చక్కగా చదివి.. అందరితో కలసిమెలసి మంచి స్నేహానికి అర్ధాన్ని వివరించే రీతిగా.. ఉత్తమ విద్యార్ధులుగా తయారు కావాలనేది మా ఆకాంక్ష సార్!.. ” ఆవేశంతో చెప్పుకొచ్చిన రమణమూర్తి మాస్టారు నయనాలు భావోద్వేగం తో చెమ్మగిల్లాయి.
“తప్పకుండా వస్తాము సార్!.. ” చేతులు జోడించి వినయంతో చెప్పాడు మాధవమూర్తి.
ప్రతినమస్కారం చేసి రమణమూర్తి మాస్టారు బయలు దేరారు. వారికి సంధ్య ఎదురైంది.. నమస్కరించింది. ఆగి ఆమె తలపై తన కుడిచేతిని వుంచి.. మనసారా దీవించి ముందుకు సాగారు మాస్టారు రమణమూర్తి గారు.
*** *** ***
//సమాప్తి//
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments