top of page

సాక్షి!?..... 



'Saakshi' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 29/04/2024

'సాక్షి' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


సమయం సాయంత్రం ఎనిమిది గంటలు.... 


సత్య రిక్షా తొక్కి బ్రతికే పేదవాడు. పాతికేళ్ళు. అతనికి డైబ్బై ఏళ్ల తల్లి ఉంది. అది లేబర్ కాలనీ. ఆ గుడిశ ప్రక్కన ముందు వెనుక పది పన్నెండు గుడిసెలు వున్నాయి. అందరూ కూలీ చేసుకొని బ్రతికే లేబర్ వాళ్ళు. ఆ ఉదయం పన్నెండు గంటలకు ఆ కాలనీలో అరకిలోమీటరు దూరంలో వున్న నాలుగు రోడ్ల జంక్షన్‍లో ఒక హత్య జరిగింది. 


దయానంద్ బ్యాంక్ ఎంప్లాయి. జ్వరంగా వున్నందున బాస్‍కు చెప్పి అరరోజు లీవు పెట్టి దయానంద్ తన స్కూటర్‍పై ఇంటికి బయలుదేరాడు. 


సిగ్నల్ పడింది. దయానంద్ స్కూటర్‍ను ఆపాడు. పెడల్ మీది నుంచి కాళ్ళను క్రిందికి దించాడు. శరవేగంతో బులెట్ వచ్చి అతని వీపున ఎడమ వైపు తాకింది. దయానంద్ ’అమ్మా!... ’ అంటూ క్రింద పడిపోయాడు. వీపంతా రక్తం. అతని ప్రక్కనే సత్య రిక్షాను ఆపి నిలబడి వున్నాడు. దయానంద్ అరుపు విని వెనక్కు తిరిగి చూచాడు. ఇరువురు అగంతకులు దయానంద్‍ను కాల్చినవారు బులెట్‍పై సిగ్నల్‍ను కూడా లెక్క చేయకుండా ముందుకు వేగంగా వెళ్ళిపోయారు. 


సత్య చాలా మంచి మనిషి. చదువు లేదు. నిరుపేదవాడు. కానీ మంచి మానవతకు మారుపేరు. 

క్రిందపడి విలవిల్లాడుతున్న దయానంద్‍ను ఎత్తుకొని తన రిక్షా సీట్లో కూర్చోపెట్టి అరకిలో మీటరు దూరంలో వున్న హాస్పిటల్‍కు తీసుకొని వెళ్ళాడు. మేల్ నర్స్ లతో జరిగిన విషయాన్ని చెప్పి అతన్ని హాస్పిటల్లోనికి చేర్చాడు. హాస్పిటల్ వారు అతను నీకు ఏమౌతారు అని అడుగగా నా స్నేహితుడు అని చెప్పి పేపర్లు మీద సంతకం చేసి దయానంద్‍ను హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద తీసికొని వెళ్ళేలా చేశారు. అతని వివరాలను అడిగి తెలుసుకొని దయానంద్ ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. 


అతని భార్య, బావమరిది హాస్పిటల్‍కు పరుగెత్తారు. సత్యా విచారంగా తన గూటికి చేరాడు. 

అతని మనస్సులో ఎంతో ఆవేదన. దయానంద్‍ను కాల్చిన వారెవరు? అతన్ని వారు ఎందుకు కాల్చినట్లు? వారికి ఇతనిపై ఎందుకు పగ?... పట్టపగలు నాలుగు రోడ్ల కూడలిలో అతన్ని వారు కాల్చి పారిపోయారంటే దయానంద్‍కు, వారికి ఏదో పెద్ద తగాదా, పగ కారణం అయ్యుంటుంది. వాళ్ళు గొప్పోళ్ళు. నేనా పేదోణ్ణి. 


’దయానంద్‍ను హాస్పిటల్లో చేర్చి కాపాడినందుకు మనస్సున ఒక వైపు సంతోషం... మరోవైపు బాధ’ ఆ మనుషులు నేను చేసిన పనిని గురించి తెలుసుకొని, నామీద పగబట్టి నన్ను లేపేస్తారేమో!... నేను చచ్చిపోతే అమ్మకు ఎవరు దిక్కు!.... ఓ దేవుడా!.... నేను మంచి చేశానా!.... తప్పు చేశానా!..... నాకు ముందు ఏం జరుగబోతుందో!.... ఎప్పుడూ లేనిది ఈరోజు నా యెదలో ఏదో గుబులు, భయం, బాధ. 


ఆ ఆలోచనలతో సత్య మౌనంగా తల్లి కనకమ్మ అన్నం వంకాయ కూరతో అందించిన సత్తు కంచాన్ని చేతికి తీసుకొన్నాడు. నాలుగు ముద్దలు తిని వాకిట తాను సాకే కుక్కకు మిగిలిన అన్నం పెట్టి చేయి కడుక్కుని మౌనంగా పడుకొన్నాడు. 


ఎప్పుడూ గలగలా ఏదో మాట్లాడే సత్య మౌనాన్ని చూచి ఆ తల్లి "ఏరా సత్తీ!.... ఓ మాదిరిగా వుండవు!.... ఒళ్ళు బాగాలేదా!.... " సత్య ముఖంలోనికి పరిశీలనగా చూస్తూ అడిగింది కనకమ్మ. 

"అవునమ్మా!.... తలనొప్పిగా వుందే కాసేపు నిద్రోతే తగ్గిపోతది" గుడిశలో ఓ మూల చాపమీద వాలాడు సత్య. 


’పాపం ఆ అయ్యగారికి ఎట్టుందో!’ విచారంగా అనుకొన్నాడు. 


"వుండు నే తల ఒత్తుతా!... నీ నొప్పి తగ్గిపోతది... తలదాపున కనకమ్మ సత్య నొసటిని ఒత్తసాగింది. ఎంతో కలవరంతో వున్న సత్య కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి నిద్రపోయాడు. 

   *

పద్దెనిమిదేళ్ళ వయస్కులు బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసుకొనేదానికి అర్హులు. అకౌంట్ ఓపెన్ చేసుకొనేదానికి బ్యాంక్‍కు ఇవ్వవలసిన డాక్యుమెంట్స్.... 

1. ఐడి ప్రతి / పాస్‍పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి

2. ఇంటి (వుంటున్న) విలాసం అడ్రెస్

3. పాన్‍కార్డు (పాన్‍కార్డు లేని పక్షంలో ఫామ్ 16)

4. రెండు పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోలు

అన్నీ అటెస్ట్ చేయబడినవిగా ఉండాలి. 


పై నాలుగు డాక్యుమెంట్సు బ్యాంకు వారికి ఇచ్చి, బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకొన్న మొత్తాన్ని వారికి చెల్లించిన బ్యాంక్‍ అధికారులు వ్యక్తిగత అకౌంట్‍ను ఓపెన్ చేస్తారు. 

ఇరువురు అగంతకులు సేట్ ఛమన్ లాల్‍తో ఆ బ్యాంక్‍కు ఆ క్రిందటి రోజున వచ్చారు. ఆ బ్యాంకులో సేట్ ఛమన్‍లాల్‍ గారికి అకౌంట్ వుంది. 


ఆ ఇరువురు వ్యక్తులు తన మిత్రులని హరియానా నుండి వ్యాపారరీత్యా ఆ వూరికి వచ్చారని వారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని బ్యాంక్ మేనేజర్‍ను కోరాడు సేట్ ఛమన్‍లాల్. 

వారు సమ్మతించి కావల్సిన పై డాక్యుమెంట్లను అడిగారు. తన అసిస్టెంట్ దయానంద్‍ను పిలిచి వారిని పరిచయం చేసి బ్యాంక్‍కు కావలసిన పై డాక్యుమెంట్లను వారి వద్దనుంచి తీసికొని అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాడు మేనేజర్. వారిని దయానంద్‍తో వెళ్ళమన్నారు. 


నలుగురూ దయానంద్ సీట్ వద్దకు వచ్చారు. ఆ ముగ్గురూ దయానంద్ చెప్పగా వారి టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు. డాక్యుమెంట్స్ గురించి వారిని దయానంద్ అడిగాడు. 

వారి ఐ. డి ప్రూఫ్, ఇంటి అడ్రస్ (సేట్ చమన్ లాల్ గారిదే) పాస్‍పోర్ట్ సైజ్ రెండు ఫొటోలు ఇచ్చారు. 


పాన్ కార్టు‍ను ఇవ్వలేదు. దాన్ని గురించి దయానంద్ వారిని అడిగాడు. తరువాత ఇస్తామని చెప్పారు. 


అది లేనిదే అకౌంట్ ఓపెన్ చేయలేమని వారికి వినయంగా దయానంద్ చెప్పాడు. వారి ముఖ కవళికలు మారాయి. ముఖంలో ఆవేశఛాయలు. సేట్ చమన్ లాల్ బ్యాంకు మేనేజర్‍ను కలిసి విషయం చెప్పాడు. ఈలోగా ఆగంతకులు ఇరువురూ దయానంద్‍తో వాదనకు దిగారు. బ్యాంక్‍ను గురించి పరుషంగా మాట్లాడారు. దయానంద్‍కు సహనం సన్నగిల్లింది. ముగ్గురి మధ్యన వాదన తీవ్రస్థాయిలో జరిగింది. 


"ఆ డాక్యుమెంట్స్ లేకుండా నేను అకౌంట్ ఓపెన్ చేయలేను. మీరు వెళ్ళి బ్యాంకు మేనేజర్‍ గారిని సంప్రదించండి" అని ఆవేశంగా వారు ఇచ్చిన డాక్యుమెంట్స్‍ను వారి ముందుకు తోశాడు దయానంద్. 


ఆ ఇరువురూ మేనేజర్ రూములో ప్రవేశించారు. విషయాన్ని చెప్పి దయానంద్ మీద కంప్లయింట్ చేశారు. 


వీరికన్నా ముందు మేనేజర్ గారి గదికి వచ్చిన సేట్ చమన్ లాల్ చెప్పిన మాటలను విని వారివద్ద పాన్‍కార్డు లేని విషయాన్ని ఎరిగిన మేనేజర్.... 

"చమన్ లాల్ సార్! అకౌంట్ ఓపెనింగ్‍కు కావలసిన డాక్యుమెంట్స్ వివరాలను మీకు నేను, దయానంద్ కూడా చెప్పాడు. ఏ ఒక్కటి లేకపోయినా అకౌంట్ ఓపెన్ చేయలేము. అది బ్యాంక్ రూలు. మీరు వెళ్ళి దాన్ని తీసుకొని రండి. ప్లీజ్" ఎంతో వినయంగా చెప్పాడు బ్యాంకు మేనేజర్ ముకుందరావు. 


ముగ్గురూ ఆగ్రహావేశాలతో బ్యాంక్ నుండి బయటికి నడిచారు. ఇది జరిగిన కథ. దాని ఫలితం అగంతకులు తమతో వాదించిన దయానంద్‍ను వెనుకనుంచి కాల్చి పారిపోయారు. 

  *

ఆగంతకులు వారి మనుషుల ద్వారా దయానంద్‍ను గురించి విచారించారు. దయనంద్‍ను గురించి ఆశించిన వివరాలు వారికి తెలియలేదు. తాము దయానిధిని కాల్చేటప్పుడు చూచినవాడు సత్య. అతను సాక్ష్యం చెబితే తమకు జైలు శిక్ష తప్పదు. కనుక సత్యను కలిసి అతని నోరు నొక్కేయాలని నిర్ణయించుకొన్నారు. సత్యను గురించి విచారించి అతను ఉన్న గుడిశ ప్రాంతానికి వచ్చారు. 


సత్య తల్లి వారిని చూచింది. వారు తమ గుడిశ వైపు రావడం గమనించింది. నిద్రపోతున్న సత్యను లేపి విషయం చెప్పింది. సమయం సాయంత్రం ఏడుగంటలు. ఆ కాలనీలో కార్పోరేషన్ లైట్లు వెలుగుతున్నాయి. 


చల్లగాని వర్షం తూరగా పడుతూ వుంది. 

ఉలిక్కిపడి లేచిన సత్య తల్లిమాటలను విని వేగంగా లేచాడు. కిటికీ తెరిచి వీధివైపునకు చూచాడు. ఆ అగంతకులు తన గుడిసెకు యాభై అడుగుల దూరంలో వుండి, తన గుడిశవైపు రావడాన్ని గమనించాడు. అతని అనుమానం నిజం అయ్యింది. మనస్సులో భయం.... శరీరంలో వణుకు. దొంగలా తలుపు కొద్దిగా తెరుచుకొని గుడిసె వెనుక వైపు నుంచి పారిపోయాడు. 

ఆగంతకులు అతను గుడిసె నుండి బయటికి వచ్చి వెనుక వైపునకు పరుగుపెట్టడాన్ని గమనించారు. అతన్ని ఫాలో అయ్యారు. వీధిలో ప్రవేశించి ఎడమప్రక్కగా పరుగుతీశాడు సత్య. తళుక్కున అతని మస్తిష్కంలో మెరుపులాంటి అలోచన ’నేను హాస్పిటల్లో ప్రవేశిస్తే అన్నివిధాల మేలు’ అనుకొన్నాడు. వేగంగా పరుగుతీసి హాస్పిటల్ ఆవరణంలో ప్రవేశించాడు. అతనికి తాను దయానంద్‍ను అడ్మిట్ చేసినప్పుడు తాను కలిసిన డాక్టర్ గాయత్రి ఎదురైంది. రొప్పుతూ రోస్తూ సత్య అగంతకులు తన్ను తరుముకొస్తున్న విషయాన్ని, వారే దయానంద్‍ను కాల్చిన వారని, తన్ను కాపాడమని గాయత్రి కాళ్ళమీద పడ్డాడు. 


గాయత్రి అతన్ని లేవనెత్తి నర్స్ ను పిలిచి "ఇతన్ని నా రూమ్ కు తీసుకొని వెళ్ళు. కాఫీ టిఫిన్ ఏర్పాటు చెయ్యండి" అని చెప్పింది డాక్టర్ గాయత్రి. 


కన్నీటిని తుడుచుకొని చేతులు జోడించాడు సత్య. 

నర్స్ అతన్ని తీసుకొని డాక్టర్ గారి రూమ్ వైపుకు నడిచింది. 

డాక్టర్ గాయత్రి గారి భర్త డి. ఐజి వారిని ఫోన్ చేసింది. 

"సార్! గుడ్ ఈవెనింగ్!"


"అవును.... వేళా పాళా లేకుండా వర్షాన్ని కురిపిస్తున్నావేంటి దేవీ!" నవ్వుతూ అడిగాడు డి. ఐ. జి కాశ్యప్. 


"అయ్యా!... స్వామీ... ఇది కార్తీక మాసం. వర్షాకాలం. వాన కురియకుండా వెన్నెల కాస్తుందా! ఒక ముఖ్యమైన విషయం.... " డాక్టర్ గాయత్రి సంక్లిప్తంగా దయానంద్, సత్యను గురించి చెప్పింది. 

"ఓకే! అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి దేవి!"


"నలుగురు పోలీసులను గన్‍లతో హాస్పిటల్‍కు వెంటనే పంపండి. ఆ అగంతకులు సత్య కోసం మన హస్పిటల్‍కు తప్పకుండా వస్తారని నా అనుమానం. "


"ఓకే డన్! అరగంటలోపు నలుగురు సాయుధ పోలీసులు హాస్పిటల్‍ను చేరుతారు డార్లింగ్ సంతోషమేనా!" నవ్వాడు కాశ్యప్. 


"ధన్యవాదాలు డి. ఐ. జి గారూ" గాయత్రి అందంగా నవ్వింది. వార్డ్ వైపు నడిచింది. ఐ. సి. యూలో వున్న పేషంట్స్ ని చూచి తన గదికి చేరింది. 

  *

ఆగంతకులు హాస్పిటల్‍ను సమీపించారు. వారు సత్య హాస్పిటల్లో దూరడాన్ని చూడలేదు. 

కానీ!... అనుమానం!.... 

"ఏరా! ఆనాయాలు ఎటు పోయుంటాడురా! " అడిగాడు పెద్దోడు. 


"బావా! నేనేమన్నా జ్యోతిష్కుడినా నన్ను అడుగుతావు. నీకు ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు" వెటకారంగా జవాబు చెప్పాడు చిన్నోడు. 


ఇద్దరూ ముఫ్ఫై ఐదు, ముప్ఫై ఏళ్ళ వయస్కులు. గంజాయి నల్లమందు, స్మగ్లింగ్ వ్యాపారస్తులు. సేట్ చమన్‍లాల్‍కి బాగా కావలసినవారు. కారణం వారు దక్షిణ రాష్ట్రాల్లో రహస్యంగా సాగించే వ్యాపారం అదే. పేరుకు వజ్రాల వ్యాపారి గేట్ దగ్గర వున్న గేట్ కీపర్‍ను ఇరువురూ సమీపించరు. వారి వాలకాన్ని చూచి ఆ పేదవాడు భయపడ్డాడు. 


గడ్డాలు, కోరమీసాలు, పెద్దోడి తలనెత్తిన్ జేమ్స్ బాండ్ టోపీ. "ఏంకావాలి సార్!" వినయంగా అడిగాడు గేట్ కీపర్. 


పెద్దోడు నవ్వుతూ అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని ఐదువందల నోటును వుంచాడు. 

గేట్ కీపర్‍కి కళ్ళు మెరిసిపోయాయి. 


"చెప్పండి సార్!.... ఏం చేయాలి!.... " చిరునవ్వుతో అడిగాడు. 


"నీపేరు ఏంటి?"


"వీరభద్రుడు సార్!" ఐదువందల నోటును జేబులో పెట్టుకొని ఒకసారి తడిమి చూచుకొన్నాడు ఆనందంగా. 


పెద్దోడు సత్య వేషధారణను వర్ణించాడు. 

"అలాంటివాడు ఎవడైనా లోనికి వెళ్ళాడా!" అడిగాడు చిన్నోడు. 


"ఆ.... ఎల్లాడు సార్. ఆడిపేరు సత్య. రిక్ష తొక్కుతాడు" చెప్పాడు వీరభద్రుడు. 


ఆ అగంతకులు ఇరువురికీ తెలియదు సత్య వారి కాల్పుకు గురైన దయానంద్‍ను ఆ హాస్పిటల్‍లోనే చేర్పించాడని. 


వీరభద్రుని భుజం తట్టి ముందు పెద్దోడు వెనకాల చిన్నోడు హాస్పిటల్లో ప్రవేశించారు. 

నర్స్ వారికి ఎదురైంది. 


"మీ పెద్ద డాక్టర్ వున్నారా?" అడిగాడు పెద్దోడు. 


"వున్నారు సార్!" నర్స్ జవాబు. 


"ఎక్కడ?"


"వారి రూములో సార్!"


"ఆ గదిని చూపించు"


నర్స్ "నాతో రండి సార్!" అంది. 


ముందు నర్స్... వెనుక ఇరువురు ఆగంతకులు నడిచారు. కొన్ని క్షణాల్లో కారిడార్ మలుపు తిరిగారు. 

"సార్!.... అదే మా మేడమ్ గారి రూము" గదిని చూపించింది నర్స్. 


"థాంక్యూ" చిరునవ్వుతో చెప్పాడు పెద్దోడు. 


చిన్నోడు పళ్ళు ఇకిలించాడు. 

డాక్టర్ గాయత్రి సత్యను స్టోర్ రూముకు మార్చింది. 

పెద్దోడు తలుపును తోశాడు. తెరుచుకుంది. ముందు అతను వెనుకాల చిన్నోడు గదిలోకి ప్రవేశించారు. 


గాయత్రి ఏదో కేస్ పేపర్స్ ను చూస్తూ వుంది. 

"గుడ్ ఈవెనింగ్ మేడమ్" చిరునవ్వుతో చెప్పాడు పెద్దోడు. 


తన పర్మిషన్ లేకుండా గదిలోనికి వచ్చినవారిని చూచి ముఖం చిట్లించింది డాక్టర్ గాయత్రి. 

ఆమె చెప్పకముందే ఇరువురూ ఆమె టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు. 

"ఎవరు మీరు?" 


"మానవులం!.... " వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు పెద్దోడు. 


"నా పర్మిషన్ లేకుండా లోనికి రావడం తప్పు కదా!" వారి ముఖాలను పరిశీలనగా చూస్తూ అడిగింది డాక్టర్ గాయత్రి. 


"అది మీకు తప్పు... మాకు ఒప్పు" నవ్వాడు చిన్నోడు. 

"మీకు ఏం కావాలి?"


"సైకిల్ రిక్షా సత్యా!"

’అతను ఇక్కడ వున్నాడని వీరికెలా తెలుసు!’ మనస్సున అనుకొంది డాక్టర్ గాయత్రి. 

"అలాంటివారు ఎవరూ ఇక్కడ లేరు" అంది గాయత్రి రూం నుండి బయటికి వెళ్ళేటందుకు లేచి నిలబడింది. 


"వున్నాడు మేడం!" ఆవేశంగా అన్నాడు పెద్దోడు. 

"లేడు..... !" తీక్షణ స్వరంతో చెప్పింది డాక్టర్ గాయత్రి. 


పెద్దోడు కిటికీని సమీపించాడు. తుపాకీని ప్యాంట్ జేబు నుండి తీశారు. కిటికీ గుండా శూన్యంలోనికి కాల్చాడు. వికటంగా నవ్వుతూ.... 


"మేడం!.... మీవంటివారు అబద్ధం చెప్పకూడదు" తుపాకీని ఆమెవైపుకు త్రిప్పాడు. 

"నిజం చెప్పండి.... ! లేకపోతే..... "


తలుపును తెరుచుకొని నలుగురు సాయుధ పోలీసులు గదిలోనికి ప్రవేశించారు. 

వారిలో సీనియర్..... 


"గుడ్ ఈవెనింగ్ మేడం! వీరిరువురూ ఎవరు? ఇక్కడ వాతావరణం వారి వాలకం చేతిలో తుపాకీ ఏంటి మేడం ఇదంతా! మమ్మల్ని ఏం చేయమంటారు?" అడిగాడు. 


"అరెస్ట్ దెమ్! వీరు హంతకులు బ్యాంక్ ఆఫీసర్ దయనంద్‍ను కాల్చింది వీరే" ఆవేశంగా చెప్పింది డాక్టర్ గాయత్రి. 


ఒక పోలీస్ పెద్దోడి చేతిలోని తుపాకీని లాక్కున్నాడు. 

పోలీసులు ఆ ఇరువురి చేతులకు బేడీలు తగిలించారు. 

పెద్దోడు.... చిన్నోడు ఆశ్చర్యంతో అవమానంతో తలలు దించుకొన్నారు. 

"టేక్ దెమ్ టు స్టేషన్!" ఆజ్ఞాపించింది డాక్టర్ గాయత్రి. 


పోలీసులు వారిని లాక్కొని తీసుకొని వెళ్ళి జీప్ ఎక్కించారు. 

ఇంటర్ కమ్‍లో మాట్లాడి స్టోర్ రూములో వున్న సత్యను తన గదికి పిలిపించింది గాయత్రి. 

"సత్యా!.... "

"అమ్మగోరూ!... "


"నిన్ను చంపాలని ఇక్కడికి వచ్చిన హంతకులను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళారు. ఇక నీవు భయపడకు.... బాధపడకు. అవసరం వచ్చినప్పుడు నీవు కోర్టులో సాక్షిగా నిలబడి, దయానంద్ పై జరిగిన కాల్పును గురించిన నిజాన్ని నీవు కోర్టులో చెప్పాలి. చెబుతావుగా!" అనునయంగా అడిగింది డాక్టర్ గాయత్రి. 


"అమ్మా!.... తప్పకుండా చెబుతానమ్మా!" ఆనందంగ చెప్పాడు సత్య. 


"ఇక నీవు నిర్భయంగా మీ ఇంటికి వెళ్ళు సత్యా!" చిరునవ్వుతో చెప్పింది డాక్టర్ గాయత్రి. 

ఆమెకు నమస్కరించి ఆనందంగా సత్య తన ఇంటివైపుకు బయలుదేరాడు. 

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




37 views0 comments

Comments


bottom of page