top of page

సారస్వతి



'Saaraswathi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 21/08/2024

'సారస్వతి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


"అగ్నిమీళే పురోహితం... యజ్ఞస్య దేవమృత్విజం.. హోతారం రత్నధాతమమ్" అని నిరంతరం ఋగ్వేద స్తుతుల అలల శబ్ద స్వరాలతో ప్రవహించే పవిత్ర నది సరస్వతీ నది. ఏడు పుణ్య నదులలో సరస్వతీ నదిది ప్రథమ స్థానం. అనేక పాయలుగ ప్రవహించే సరస్వతీ నది తరంగాల శబ్దం వేద పఠనంలోని ఉదాత్తానుదాత్తాది స్వరాలను గుర్తు చేస్తుంది. ఆయా స్వరాల నడుమన ఉన్న గణ చక్రాలను తెలియచేస్తుంది. "అగ్నిమీళే పురో హితం" అనే పాదం 8 అక్షరాలతో 13 మాత్రలతో 18 ఉచ్ఛారణా స్వరాలతో 83 వ స్థానాన ఉన్నదన్న సత్యం సరస్వతీ నది తరంగాల సుస్వరాలను పరిశీలించే వేద గణితో పాసకులకు సునాయాసంగా తెలిసిపోతుంది.


అలాంటి పుణ్య సరస్వతీ నది బ్రహ్మవర్తం ప్రాంతాన ప్రవహిస్తుంది. అక్కడే దృషద్వతి నదికూడ ఉంది.

దృషద్వతి బ్రహ్మ కుండలంలో జన్మించింది . ఋగ్వేద సంకలన ఋషుల ఆశ్రమ ఛాయలన్నీ ఈ రెండు నదుల నడుమనే కనపడతాయి.


సరస్వతీ నది అలల మీద తేలియాడే హంసలు జ్ఞాన కళికలులా ప్రకాశిస్తుంటాయి. ఆ కళికలను చూస్తే చాలు. మానవ మేధస్సులోని అమాయకత్వం ఆవిరైపోతుంది. చురుకుదనం చురకత్తుల్లా మారి అజ్ఞాన సంహారం చేస్తుంది. ఆయా అలల మీద నిలిచే నురుగు వివిధ దేవళాల ఆకారాలతో ఆద్యాత్మిక చింతనను పెంచి పోషిస్తుంది.

బ్రహ్మవర్తం ప్రాంతమంటే సరస్వతీ నదికి మహా యిష్టం. అక్కడే సరస్వతీ నది పుణ్యస్త్రీగ అవతారమెత్తింది. ఆమె పుణ్య స్త్రీగా అవతారమెత్తడానికి కారణం ఏమిటంటే... రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.


బ్రహ్మవర్తం లో నివసించే ప్రజలు వేద మంత్రోచ్ఛారణ లోని గణ చక్రాల గణిత తేజస్సును, ఆద్యాత్మిక తేజ స్సును గమనించడానికి సరస్వతీనది పుణ్య స్త్రీ అవతారమెత్తింది అనేది ఒక కథ.  ఇలా మరో నాలుగు కథలు ప్రచారంలో ఉన్నాయి. సరస్వతీ నది పుణ్య స్త్రీ రూపం చూచి దృషద్వతి కూడా పుణ్య స్త్రీ రూపం ధరించింది. ఇద్దరు నదీమ తల్లులు కలిసి అలల మీద ఆడిపాడారు.


అలల కింద ధ్యాన ముద్రలో కొంత కాలం గడిపారు. ఆపై దృషద్వతి సరస్వతి దగ్గర సెలవు తీసుకుంది. సరస్వతీ  బ్రహ్మవర్త ప్రాంతానికి వచ్చే దేవతలకు, మహర్షులకు, బ్రహ్మర్షులకు జ్ఞాన జలాన్ని ఇచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. ఆ పుణ్య స్త్రీ ని కొందరు ఉభయభారతి అని అంటారు. ఎక్కువమంది మాతా! జ్ఞాన స్వరూపిణీ! సరస్వతీ అనే పిలుస్తారు.


ఒకసారి దేవేంద్రుడు అహల్యాదులకు చేసిన పాప భారంతో కటిక చీకటి ఆకారంగా మారిపోయాడు. ఆ ఆకారంతోనే అక్కడికి వచ్చా డు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రునికి జ్ఞాన జలాన్ని ప్రసాదించింది. దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని స్వీకరించాడు . 

దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని తాగగానే తన స్వస్వరూపాన్ని ధరించి దేదీప్యమానంగా వెలిగిపోయాడు. తను చేసిన తప్పులన్నిటిని తలచుకుని జ్ఞాన స్వరూపిణి సరస్వతి  ముందు తలవంచాడు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రుని కరుణించింది. 


దేవేంద్రుడు జ్ఞాన స్వరూపిణి ని సరస్వతిని నదిలా కాకుండా దేవీదేవతగ పూజించాడు. దేవీదేవత దేవేంద్రుని కోరిక మీద తను పుట్టిన పిప్పల వృక్ష చరిత్ర ను చెప్పింది. పిప్పలాది మహర్షుల గురించి చెప్పింది.


అలాగే తన కుమారుడు సరస్వతను, కుమార్తె సారస్వతిని దేవేంద్రునికి పరిచయం చేసింది. 


వేద మంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ నది బ్రహ్మత్వ మథనం నుండి పుట్టిన దేవీదేవత ఇద్దరు బిడ్డలను చూచి దేవేంద్రుడు "అద్భుతం మహాద్భుతం" అని అనుకున్నాడు. బ్రహ్మ సృష్టి ని పలు రీతులలో స్తుతించాడు.


 ఆపై దేవేంద్రుడు సారస్వతి వేద పఠనం విని మహదానంద పడ్డాడు. వేద పఠనంలో శాస్త్రీయంగా పఠించడం ముఖ్యం కానీ స్త్రీపురుష బేధం లేదనుకున్నాడు. మనుషులు సృష్టించే ఆచార నియమాలు వేరు. కా ల ధర్మం సృష్టించే ఆచార నియమాలు వేరు అనుకున్నాడు.


దేవేంద్రుడు దేవీదేవత దగ్గర సెలవు తీసుకు న్నాడు . ఇంద్రలోకం వెళ్ళాడు . తన ధర్మం తాను నిర్వర్తించ సాగాడు. అలా కొంత కాలం గడిచిపోయింది . ఒకానొకప్పుడు నిశాజ్ఞ అనే రాక్షసుడు దేవేందుని పై దండయాత్ర చేసాడు.


సరస్వత  తల్లి ఆజ్ఞ ను అనుసరించి దేవేంద్రునికి సమరంలో సహాయం చేసాడు. నిశాజ్ఞ సరస్వత ముందు నిలబడలేక పారిపోయాడు. సరస్వత దేవేంద్రునికి ఇంద్రలోకం అప్పగించి బ్రహ్మవర్తం వచ్చేసాడు. సరస్వతను తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి , సోదరి సారస్వతి ప్రశంసించారు. 


సారస్వతి ప్రకాశవంతమైన అందాన్ని, పదునైన తెలివితేటలను చూచిన తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి, సోదరుడు సరస్వత సారస్వతికి మంచి వరుని చూడాలనుకున్నారు. బ్రహ్మవర్తాన వసించే మహర్షుల, బ్రహ్మర్షుల సేవలు చేస్తూ, సారస్వతి అందరి మన్ననలను పొందసాగింది. జ్ఞానం కోసం అక్కడికి వచ్చిన వారి అభ్యాస సామర్థ్యాన్ని అనుసరించి వారిని జ్ఞానవంతులను చేయసాగింది.


పూరువంశ రాజు మతినారుడు. మంచి పరిపాలనా దక్షుడు. శత్రు రాజుల అహంకారాన్ని అణిచిన మహా పరాక్రమవంతుడు. మానవతావాదాన్ని నెత్తికి ఎత్తుకున్న మహాత్ముడు. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సని నమ్మిన ప్రజానురంజక పరిపాలకుడు..


ఒకానొక సమయంలో అతని  రాజ్యంలో కరువుకాటకాలు అధికమయ్యాయి. జీవరాశులన్నీ ఆహారం నిమిత్తం అల్లాడసాగాయి. వర్షాలు లేక భూములు బీటలు వారాయి. రాజ్యం లోని భయంకర కరువు ను కళ్ళార చూసిన మతినార మహారాజు "రాజ్యంలో కరువుకాటకాలు నశించాలి అంటే  ఏం చెయ్యాలి?" అ ని పురోహితులను, మహర్షులను అడిగాడు.


మతినార మహారాజు మాటలను విన్న పురోహితులు, మహర్షులు,"ఋక్షక పుత్ర..  మతినార మహారాజ! ప్రకృతి కాలుష్యం అధిక మైనప్పుడు రాజ్యంలో కరువుకాటకాలు పెరుగుతుంటాయి. అవి తొలగాలంటే సృష్టి రక్షకుడైన విష్ణు మూర్తి ని పూజించాలి. 


యజ్ఞో వై విష్ణుః అంటే యజ్ఞం విష్ణు స్వరూపం. యజ్ఞం చేయడం వలన వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటుంది. పశుపక్ష్యాదులు యజ్ఞయాగాదుల నుండి వచ్చిన గాలులను పీల్చడం ద్వారా మహాఆరోగ్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా యజ్ఞ యాగాదుల వద్ద ఉన్న ధేనువులు కామధేనువులుగ శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటాయి. యజ్ఞంలో వాడే నెయ్యి , పాలు , వివిధ ధాన్యాలవలన సంప్రాప్తించిన భస్మంతో అనేక ఔషదాలను తయారు చేయవచ్చును.  

 

యజ్ఞాలు ఆరు రకాలుగా ఉంటాయి. అవి ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం, స్వాద్యాయ యజ్ఞం,  యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం,సంశిత యజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ నువ్వు ఇంతకు ముందే శాస్త్ర పద్దతిన ఆచరించావు. ఇక ప్రజల క్షేమం, రాజ్య క్షేమం కోరుకునే రాజు సత్త్ర యాగం చెయ్యాలి. 13 రోజులు మొదలుకొని 100 రోజుల వరకు సత్త్ర యాగం చెయ్యాల్సి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల పాటు చేసే సుదీర్ఘ  సత్త్ర యాగం కూడా ఒకటి ఉంది." అని  చెప్పడంతో మతి నార మహారాజు సత్త్ర యాగం చేయడానికి మంచి ప్రదేశం సూచించమని మహర్షులను అడిగాడు. 


మహర్షులందరు ఏక కంఠంతో, "జ్వాల ఋక్షకుల పుత్ర! మతినార మహారాజ! ఋగ్వేదంలో సరస్వతీ నది రమారమి 50 పర్యాయాలు వివిధ నామ ధేయాలతో స్తుతించబడింది. అందుకే సరస్వతీ నది అలల కదలికలో 50 పవిత్ర కళలు కనపడుతుంటాయి. అందలి ఒక కళ మేథో తేజస్సును పెంచుతుంది. మరో కళ మేథో తేజస్సులో సురత్వాన్ని కలుపుకుని ప్రకాశిస్తుంది. ఇంకా ఆ కళలలో సంగీత కళ, యోగకళ వంటి కళలు ఉన్నాయి. అందుకే సరస్వతీ నది లోని నీటిని జ్ఞాన జలం అని అంటారు. అలాంటి సరస్వతీ నది ఒడ్డున ఉన్న బ్రహ్మవర్త ప్రదేశం నువ్వు చేసే సత్త్ర యాగం కు పవిత్ర ప్రదేశం" అని అన్నారు.


మతినార మహారాజు సరస్వతీ నది ప్రాంతాన ఉన్న బ్రహ్మవర్తం ను తన సత్త్ర యాగ కార్యక్రమానికి ఎంచుకున్నాడు. మతినార మహారాజు సరస్వతీ నది దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ప్లక్ష వృక్షాన్ని, కామ్యక వనమును సందర్శించాడు. సరస్వతీ దృషద్వతులను చూసాడు. అనేక పాయలతో ప్రవహించే సరస్వతీ నదిని చూసాడు. పాయపాయన ప్రకాశించే ప్రమోద జ్ఞాన కళలను చూసాడు. సురుల జన్మ సుర నదుల జన్మ అతి పవిత్రం అనుకున్నాడు. కొంత కాలం తను అక్కడ ఉండటానికి తగిన కుటీరాలను ఏర్పాటు చేయించాడు. 

మహర్షుల ఆదేశానుసారం, వృత్తాకార దీర్ఘచతు రస్రాకార చతురస్రాకార త్రిభుజాకార కూర్మాకార, మత్స్యాకార, వరాహాకారాది యజ్ఞ వేదికలను వేద గణాను సారం కొందరు ఋషులు పదుగురి సహాయంతో నిర్మించారు. మరికొందరు ఋషులు సత్త్ర యాగానికి కావాల్సిన వస్తువులను, ధినుసులను సమస్తం ఏర్పాటు చేయ సాగారు. 


ఋషులకు కొందరు రాజ భటులు, కొందరు రాజ్య ప్రజలు సహాయంగా ఉన్నారు. అక్కడి వారం దరికి సరస్వత, సారస్వతీ తగిన విధంగా సహాయం చేయడమేగాక సరస్వతీ నదిలో ఏ ప్రదేశంలో ఎలాంటి నీరు ఉంటుంది అన్న పవిత్ర విషయాలన్నిటిని ఋషులకు, మహర్షులకు చెబుతున్నారు.  మతినార మహారాజు సత్త్ర యాగంలో తను పాటించవలసిన నియమాదులను మహర్షుల ద్వారా తెలుసుకుంటూ , సరస్వత, సారస్వతిని గమనించలేదు. 


అధ్వరులు , పురోహితులు, ఋషులు, మహర్షుల ఆధ్వర్యంలో సత్త్ర యాగం ప్రారంభమైంది. యజ్ఞ వేదికల నుండి ఎగసి పడే అగ్ని దేవుని కాంతులలో సరస్వతీ నది సరికొత్త కాంతులను సంతరించుకుంది. మహర్షుల మంత్రాలకు అనుకూలంగా సరస్వతీ నది, అలల నృత్యం చేయసాగింది. ఆ నృత్యం నటరా జునే మంత్ర ముగ్దుడిని చేయసాగింది.


మతి నార మహారాజు మండలం పాటు సత్త్ర యాగం చేసాడు.. యాగానంతరం పుణ్య స్త్రీ రూపంలో ఉన్న జ్ఞాన స్వరూపిణి సరస్వతీ నది మతినార మహారాజు కు దర్శనం ఇచ్చింది. మతినార మహారాజు రాజ్యం లో వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణ సమతుల్యత పెరగసాగింది.. అది తెలిసి మతినార మహారాజు మిక్కి లి సంతోషించాడు. 


సత్త్ర యాగం మరో పదిరోజులు మరింత విజయవంతంగ ముగిసింది.   ఒకనాటి పున్నమి రాత్రి జ్ఞాన జలం తాగుతున్న సారస్వతిని మతినార మహారాజు చూసాడు. సారస్వతి తెల్లని కాంతులు విరజిమ్మే శరత్కాల మేఘంలా ఉంది. శరదృతు చంద్రబింబం లా ఉంది. మతి నార మహారాజు నెమ్మదిగా సారస్వతి దగ్గరకు వెళ్ళా డు. సారస్వతిని అతి దగ్గరగా చూసిన మతినార మహా రాజుకు రాజహంసలు, జాజిపూల దండలు ,కురిసే మంచు గుర్తుకు వచ్చాయి . మతినార మహారాజు సారస్వతిని చూస్తూ , తనని తాను పరిచయం చేసుకున్నాడు. అప్పుడు సారస్వతి తను సరస్వతీ నది కుమార్తె సారస్వతిని అని చెప్పింది.


సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు మనసు క్షణం పాటు సుందర జగతిన విహరించింది. మతినార మహారాజు ఆ జగతిలో వెండికొండను, ఆది శేషుని, రెల్లు పూలను, మల్లెపూలను, కల్ప వృ క్షం ను, పాల సముద్రం ను, తెల్ల తారలను, ఆకాశ గంగ ను వాటి నడుమ విహరించే సారస్వతిని చూసాడు. వెంటనే మతినార మహారాజు కు సారస్వతి మీద అభి మానం తో కూడిన అనురాగం జనించింది.


అంతవరకు సత్త్ర యాగం జరుగుతున్నప్పుడు తనూ , తన సోదరుడు సరస్వత, మహర్షులకు ఎలా సహాయపడింది వివరిస్తూ, సత్త్ర యాగం లో వెయ్యవలసిన హయ్యంగ వీనాదులగురించి సారస్వతి మతి నార మహారాజు కు చెప్పింది. సారస్వతి జ్ఞానం మతినార మహారాజు మేథస్సును మరింత పదును చేసింది.


మతినార మహారాజు తన మేథో సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాడు. తన మేథో సామర్థ్యం కొంత పెరగటానికి సారస్వతియే ప్రధాన కారణం అని గమనించాడు. దానితో సారస్వతి మీద అనురాగం అంతకు ముందున్నదానికంటే రెట్టింపయ్యింది. తన ఎదలో సారస్వతి మీద ఉన్న అభిమానం బాధ్యతతో కూడుకున్నదని మతినార మహారాజు మనసులో అనుకున్నాడు.


సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు  సత్త్ర యాగ నియమాలను పెంచాడు..మరింత నియమ నిష్టలతో సత్త్ర యాగం చేసాడు. దానితో తన రాజ్యంలో విజ్ఞాన బలం పెరిగింది. ప్రజల ఆలోచనాధోరణి మారింది. శ్రమశక్తి పెరిగింది. ఇదంతా తెలిసిన మతి నార మహారాజు సారస్వతిలో చదువుల తల్లి సరస్వతి ని చూసాడు. సారస్వతి మీద భక్తి బాధ్యతలతో కూడిన ప్రేమాభిమానాలను పెంచుకున్నాడు.


మతినార మహారాజు మనోభావం గ్రహించిన సారస్వతి తనూ తన సోదరుడు జ్ఞాన జలం తాగి ఎలా ఎదిగింది మతినార మహారాజు కు చెబుతూ రాజుకు జ్ఞాన జలం అందించింది. సారస్వతి ఇచ్చిన జ్ఞాన జలాన్ని మతి నార మహారాజు తన రాజ్యంలోని వారందరికి అందించాడు. ప్రజలలో మహా తేజస్సుతో కూడిన శక్తి వచ్చింది. వారిలో "కరువు రక్కసిని తరిమి కొడదాం" అన్న సదాలోచన పెరిగింది.


సరస్వతీ నది అలల మీద ఏర్పాటు చేసిన సారస్వతి జన్మదిన వేడుకలకు మతినార మహారాజు,అతని అనుచరులతో పాటు వచ్చాడు.ఆ  వేడుకకు హయగ్రీవ స్వామి కూడా వచ్చాడు. జ్ఞాన స్వరూపిణి సరస్వతి హయగ్రీవ స్వామిని తన గురువుగా అందరికీ పరిచ యం చేస్తూ, "హయగ్రీవ స్వామి వేద సంరక్షకుడు. వేద జ్ఞాన తేజోవిలాసి. విష్ణు స్వరూపుడు. సుందరానంద హయగ్రీవ తేజం” అంటూ హయగ్రీవ స్తోత్రం తో స్వామిని పూజించింది.


హయగ్రీవ స్వామి సరస్వతీ నది పుణ్యస్త్రీగ మారడానికి కారణం ఇలా చెప్పాడు.


"ఒకసారి దుర్వాసన మహర్షి వేద మంత్రాలను శ్రుతి మించిన ఉచ్ఛారణ తో ఉచ్ఛరించాడు. అప్పుడు సరస్వతీ నదిలోని అలలు హేళన చేసినట్లు ఎగసి పడినవి. అందుకు దుర్వాసుడు కోపించి “సరస్వతీ నది.. నువ్వు మానవ కాంతవై జన్మించి ఇద్దరు బిడ్డలకు తల్లివవుదువుగాక” అని శపించాడు. ఆ శాప ప్రభావం తో సర స్వతి నది ఉభయభారతి అయ్యి సారస్వతికి, సరస్వత కు తల్లి అయ్యింది.  ఈ సారస్వతి కారణ జన్మురాలు" అని  హయిగ్రీవ స్వామి చెప్పాడు. 


గుర్రపు తలతో తెల్ల ని వస్త్రాలతో తెల్లని రంగుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్న హయగ్రీవ స్వామి ని అందరూ స్తుతించారు.


అనంతరం సారస్వతి "సరస్వతీ మాత బ్రహ్మముహూర్తం లో వాగుపాసకుల నాలుక మీద ఉంటుంది. ‘ఓం ఐం ఐం ఐం హ్రీం హ్రీం హ్రీం  సరస్వత్యైః నమః’ అని ప్రార్దిస్తే ఆ తల్లి కరుణిస్తుంది" అని మతినార మహారాజు కు చెప్పింది. 


సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు "శ్వేత స్వరూపిణి అయిన సరస్వతి మాత, సరస్వతి నది జ్ఞాన తేజం కనులార చూసాను. మనసార ఆ తల్లి చరణ సేవ చేసాను. మరి నీల సరస్వతీ మాత స్వరూపం ఎలా ఉంటుంది? ఆ తల్లి ని ఎలా పూజించాలి?" అని సారస్వతిని అడిగాడు.


మతినార మహారాజు మాటలను విన్న సారస్వతి, "సరస్వతీ నది పుణ్య స్త్రీగా మారి జ్ఞాన స్వరూపిణి అయ్యింది. ఆ జ్ఞాన స్వరూపిణియే నా తల్లి. ఇక నీల సరస్వతీ మాత మా అమ్మ ప్రతిరూపమే.


నీల సరస్వతీ మాత  సర్వశత్రు క్షయంకరి. భక్తులకు వరదాయిని. శత్రువుల పాలిట భయంకర నీల స్వరూపిణి. ఆ తల్లి సౌమ్య రూపంలో ఉంటుంది. క్రోధ రూపం లో ఉంటుంది. చండ రూపంలో ఉంటుంది. హూంకారమయ నీల సరస్వతి బలిహోమ ప్రియురాలు. ఆ తల్లిని మనసు పెట్టి ప్రార్థిస్తే మంచి బుద్ధిని, యశస్సు ను, కవిత్వమును ప్రసాదిస్తుంది. సరస్వతీ మాత జ్ఞానానికి, వాక్కుకు ప్రధాన దేవత అయితే నీల సరస్వతి జ్ఞానానికి అవగాహనకు ప్రధాన దేవత. నీల సరస్వతి హోమం మహోన్నత హోమం" అని నీల సరస్వతి హోమం చేసే విధి విధానాలను చెప్పింది. 


సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు నీల సరస్వతిని పూజించి మరలా సత్త్ర యాగం చేసాడు.ఇలా మతినార మహారాజు సరస్వతీ నది ఒడ్డున 12 సంవత్సరాల పాటు మహానిష్టతో సత్త్ర యాగాన్ని చేసాడు. మహారాజు చేసే సత్త్ర యాగానికి సారస్వతి  అన్ని విధాలుగా సహకరించింది. దానితో మతినార మహారాజు రాజ్యంలోని కరువుకాటకాలు సమస్తం  తొలగిపోయాయి. ప్రజలందరూ ఆనందంగా జీవించసాగారు. ఈ విషయం తెలిసి మతినార మహారాజు మిక్కిలి సంతోషించాడు. సత్త్ర యాగాన్ని ధర్మ బద్ధం గా ముగించాడు.


మతినార మహారాజు సత్త్ర యాగాన్ని ముగించే ముందు యాగాగ్ని దేవుని మనసార చూసాడు. ఆ యాగాగ్నిలో సారస్వతి నవ వధువు గా మతినార మహారాజుకు దర్శనం ఇచ్చింది.


మతినార మహారాజు జ్ఞాన స్వరూపిణి సరస్వ తిని ప్రత్యేకంగా కలిసాడు. తన సత్త్ర  యాగ ప్రయోజ నం నెరవేరిందని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి చెప్పా డు. సత్త్ర  యాగ సమయంలో సారస్వతి తనకు చేసిన సహాయం మొత్తాన్ని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి పూస గుచ్చినట్లు చెప్పాడు. యాగాన్ని లో సారస్వతి దర్శన మిచ్చిన సంగతిని కూడ చెప్పాడు . సారస్వతి తన మనసుతో ఎలా పెనవేసుకు పోయింది చెప్పాడు.


జ్ఞాన స్వరూపిణి సరస్వతి మతినార మహారాజు మాటలను విని చిరు దరహాసం తో తన సమ్మతిని తెలిపింది. అంత సారస్వతి మతినార మహారాజు ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . . ఆ పుణ్య దంపతులకు పుట్టిన కుమారుని పేరు త్రసుడు. త్రసుని మనుమడు దుష్యంత మహా రాజు.


                    శుభం భూయాత్ 


 వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

 


35 views0 comments

Комментарии


bottom of page