సాధిస్తాం!
- Gadwala Somanna
- 2 hours ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Sadhistham, #సాధిస్తాం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 63
Sadhistham - Somanna Gari Kavithalu Part 63 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/04/2025
సాధిస్తాం! - సోమన్న గారి కవితలు పార్ట్ 63 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
సాధిస్తాం!
----------------------------------------
పుస్తకాలు చదువుతాం
అజ్ఞానము త్రుంచుతాం
విజ్ఞానము పొందుకొని
విజేతగా నిలబడుతాం
చెడుతనమును మానుకొని
లోపాలను దిద్దుకొని
వెన్నెల్లా వెలుగుతాం
సుగుణాలను అద్దుకొని
అపజయాలు తట్టుకొని
అడ్డంకులు ఎదుర్కొని
సింగమై జీవిస్తాం
కుతంత్రాలు వదులుకొని
బంధకాలు త్రెంచుకొని
బంధాలను కలుపుకొని
సమైక్యత సాధిస్తాం
విశ్వాసం నింపుకొని

కనీస కర్తవ్యం!
----------------------------------------
కాసింత సంస్కారము
పెద్దలపై గౌరవము
నేర్పిస్తే పిల్లలకు
కొనియాడును సమాజము
మంచి మంచి అలవాట్లు
ఎదుగుటకు మేలి మెట్లు
లేకపోతే మాత్రము
బ్రతుకులోన! అగచాట్లు
నైతిక విలువలు నేర్పి
క్రమశిక్షణ అలవర్చి
అత్యుత్తమ పౌరులుగా
ఇవ్వాలి తీర్చిదిద్ది!
ఇది అందరీ బాధ్యత
మరువకూడదోయ్! పెద్దలు
ఆదిలోనే వంచితే
ఏదైనా సాధ్యమే!

మంచి అలవాటు పుస్తక పఠనం!
----------------------------------------
పుస్తకాల పఠనము
పిల్లలకు నేర్పాలి
మితిలేని విజ్ఞానము
వారి సొంతమవ్వాలి
శ్రేష్ఠమైన అలవాటు
పుస్తక పారాయణము
లేకపోతే చేటు
తొలగదు అజ్ఞానము
చిన్ననాటి నుంచి
అలవాటు చేయాలి
అందులోని మంచి
వారికందజేయాలి
హస్త భూషణం నాడు
పుస్తకమే నేస్తము
చరవాణి ఈనాడు
అభివృద్ధికవరోధము
కనీస మన బాధ్యత
విస్మరించకూడదోయ్!
పుస్తకాల విలువను
గుర్తింపజేయాలి

అమ్మ మాట వినాలి!
----------------------------------------
అమ్మ మాట ఆలకించి
అనురాగము చూపించి
అవనిలోన ఎదగాలి
ఆదర్శం చూపాలి
అమ్మ ప్రేమ చవి చూచి
గుండెల్లో అది దాచి
పదిమందికి పంచాలి
ఆమె ఘనత పెంచాలి
దండలోని దారంలా
పూలలోని అందంలా
జీవితమే సాగాలి
ఉన్నతిని సాధించాలి
అమ్మే కదా లోకము
ఇంటిలోన స్వర్గము
లేకుంటే ఉంటుందోయ్!
అడుగడుగునా నరకము

స్నేహాన్ని కాపాడుకో!
----------------------------------------
అమూల్యమైన ఆస్తులు
అవనిలోన మిత్రులు
ఎప్పుడూ కోల్పోకు
ఆ స్థితి తెచ్చుకోకు
వారు మన కంటి వెలుగు
జాగ్రత్తగా మెలుగు
లేదంటే మాత్రము
అతలాకుతలమగు
ఖరీదైన బహుమతులు
తరగని సిరిసంపదలు
జీవితాన స్నేహితులు
గుండెలోని స్పందనలు
స్నేహాన్ని గెలుసుకో!
పదిలంగా దాచుకో
పది కాలాల పాటు
మనసులోన నిలుపుకో!
స్నేహితులు దూరమైతే
మిగిలేదిక కన్నీరు
విలువ తెలియకపోతే
పరిస్థితులు దిగజారు
-గద్వాల సోమన్న
Comments