top of page

 సాహసం సేయరా! డింభకా!!

#SahasamSeyaraDimbhaka, # సాహసంసేయరాడింభకా, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Sahasam Seyara Dimbhaka - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 24/03/2025

సాహసం సేయరా! డింభకా!! - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


సరళ బేంకులో జాబ్ చేస్తోంది. భర్త మోహన్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం, నెలలో సగం రోజులు కేంపులతో గడిచిపోతుంది. ఉన్న ఒక్క కొడుకు ప్రణవ్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. గారాబం ఎక్కువై మొండిగా ప్రవర్తిస్తుంటాడు. చదువు తక్కువ, ఆటలు చిరుతిళ్లు ఎక్కువ. తను అనుకున్నదే జరగాలంటాడు. 


మోహన్ తండ్రి వెంకటరావు స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేసి రిటైరై ఊర్లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. మోహన్ పెద్ద వాడు. శ్రీధర్ రెండవ కొడుకు పూణేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. 


కొడుకులు గ్రామం వదిలి తమ దగ్గరకు వచ్చేయమంటే ప్రశాంత పల్లె వాతావరణానికి అలవాటు పడి ఉరుకుల పరుగుల పట్టణ జీవితానికి ఇష్టపడని వెంకటరావు భార్య ఆకస్మిక మరణంతో గత్యంతరం లేక వ్యవసాయ భూమిని కౌలుకిచ్చి ఆరు నెలలు పెద్దబ్బాయి వద్ద ఆరునెలలు రెండవ అబ్బాయి వద్ద కాలం గడుపుతున్నారు. ఎప్పటి నుంచో చిన్న కొడుకు శ్రీధర్ తమ దగ్గరకు రమ్మని అడుగుతుంటే ప్రస్తుతం ఆయన రెండవ కొడుకు దగ్గర పూణేలో ఉంటున్నారు. 


వెంకటరావు గారు ఆధ్యాత్మికం సాంప్రదాయం క్రమశిక్షణ పాటించే వ్యక్తి. ఉదయాన్నే లేచి ధ్యానం చేసి స్నానం అయిన తర్వాత పూజ గాయత్రి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే బ్రేక్ ఫాస్టు చేస్తారు. కొడుకు, కోడలు డ్యూటీలకు, మనవడు ప్రణవ్ కాలేజీకి వెళ్లిన తర్వాత కొంతసేపు టీవీలో భక్తి కార్యక్రమాలు చూసి కొంతసేపు రామకోటి రాసుకుని సమయం ఉంటే భగవద్గీత పారాయణం చేస్తారు. 


మధ్యాహ్నమవగానే డైనింగ్ టేబిల్ మీద కోడలు వండి తయారు చేసిన భోజనం తిని తన గదిలో నాలుగ్గంటల వరకు విశ్రమమిస్తారు. తన వయసు వారు ఆ ప్రాంతంలో పరిచయం లేనందున ఇంటి వద్దే సమయం గడుపుతుంటారు. 


శలవు రోజుల్లో కొడుకు, కోడలు, మనవడు ఇంటివద్ద ఉంటారు కనక ఆయనకు వారితో సమయం గడిచిపోతుంది. ప్రణవ్ ఇంటి వద్ద ఉంటే వెంకటరావు గారికి టీవీ రిమోట్ దొరకదు. వాడి క్రికెట్ యానిమేషన్ ఇతర ప్రోగ్రాములతో టైమ్ పాస్ చేస్తాడు. శలవు రోజున ఉదయం ఎనిమిది తర్వాతే నిద్ర లేస్తాడు. లేస్తూనే టీవీ రిమోట్ అందుకుంటాడు. 


బ్రష్ చేసి బ్రేక్ ఫాస్టుకి రమ్మని సరళ కేకలేసినా లెక్క చెయ్యడు. వాడి అలవాట్లకు వెంకటరావు బాధ పడుతుంటారు. మోహన్ని డాడ్ అని సరళని మమ్మీ అని తాతని గ్రాండ్ పా అని పిలుస్తుంటాడు. ఎప్పుడూ వీడియో గేమ్స్, ఫోన్లో ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమా పాటలకు స్టెప్పులు వేస్తుంటాడు. వెంకటరావు ఎంత చెప్పినా వినడు. 


 వెంకటరావు గారు అక్షరాబ్యాసంలో మనవలకు తాత తండ్రుల పేర్లు పెట్టమంటే పాత సాంప్రదాయ పేర్లు ఇప్పటి పిల్లలకు నప్పవని తీసి పారేసారు. కోడలు సరళతో పిల్లాడికి మాతృభాష తెలుగు చదవడం రాయడం నేర్పించమని ఎన్నో సార్లు చెప్పినా లాభం లేకపోయింది. మనవడు క్రమశిక్షణ లేకుండా బద్దకంగా అల్లరి చిల్లరి అలవాట్లు చూసి బాధపడుతుంటారు. 


మోహన్ కేంపులో బయట ఉంటే సరళ తన బేంక్ డ్యూటీతో పాటు కొడుకు ప్రణవ్ చదువు భాద్యత చూసుకుంటుంది. ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేపి బ్రష్, స్నానం చేయించి

కాలేజీ బస్ టైముకి లంచ్ బాక్స్ తయారుచేసి బ్రేక్ ఫాస్టు తినిపించి పంపేసరికి తలప్రాణం తోకకొచ్చినంత పనౌతుంది సరళకు. 


ఇప్పుడు తాతయ్య ఇంటి వద్ద లేరు కనక ప్రణవ్ దే ఇష్టారాజ్యం. స్కూల్ అవగానే డూప్లికేట్ కీ తో మూడు గంటలకు ఫ్లాట్ కి వచ్చే ప్రణవ్ షూస్ కూడా విప్పకుండా డ్రాయింగ్ రూమ్ సోఫాలో బుక్స్ పడేసి యూనిఫామ్ తో పడుకుని రిమోట్ తీసి టీవీ ఆన్ చేసి లీనమైపోతాడు. సరళ లేండ్ లైన్లో ఇంటికి చేరావా అని ఫోన్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వడు. రెండు మూడుసార్లు ఫోన్ చేసి డైనింగ్ టేబిల్ మీద స్నేక్స్ తినమని చెబితే డిస్ట్రబ్ అయినట్టు విసుగ్గా సమాధానం చెబుతాడు. సాయంకాలం తను డ్యూటీ నుంచి వచ్చే వరకు టీవీ ప్రోగ్రామ్స్ లో లీనమై పోతాడు. 


  *

"డాక్టరు గారూ, ఎలాగున్నాడండి మా ప్రణవ్ ! " ఆతృత ఆందోళనలతో ఆపరేషన్ థియేటర్ నుంచి పైకి వచ్చిన డాక్టర్ని అడిగింది సరళ. 


"తలకి హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. శరీరం మీద మల్టిపుల్ ఫ్రేక్చర్స్ ఉన్నాయి. కోలుకోడానికి సమయం పడుతుంది." జవాబు చెప్పేడు డాక్టరు. 


కొడుక్కి పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థిమిత పడి మనసులో దేవుడికి నమస్కరించి బయట ఉన్న కుర్చీలో కూర్చుంది సరళ. 


"ఏమైందండి బాబుకి ? " అడిగింది పక్క కుర్చీ మీద కూర్చున్న ప్రమీల. 


"మోటరు సైకిల్ యాక్సిడెంటు జరిగింది"


"ఎలా?" 


సరళ ఒక నిట్టూర్పు వదిలి చెప్పడం మొదలెట్టింది. 


నెక్లెస్ రోడ్లో ఎవరో ఇంద్రజాలికుడు కళ్లకు గంతలు కట్టుకుని మోటరు బైక్ నడపడం ప్రణవ్ టీ. వీ. లో చూసాడట. అప్పటి నుంచి తనూ అలా బైక్ నడుపుతానని ఫ్రెండ్స్ వద్ద అనే వాడట. వాడికింకా మైనార్టీ తీరనందున డ్రైవింగు లైసెన్సు ఇవ్వలేదు. ప్రణవ్ ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. మాకు వాడొక్కడే కొడుకు. 


మా పెద్దబ్బాయి శ్రీ కాంత్ ఐదు సంవత్సరాల వయసప్పుడు ఆడుకుంటూ బంతి పడిందని నీళ్ల డ్రమ్ లో వంగి తియ్యబోతే జారి కింద పడి చచ్చిపోయాడు. అప్నటికి ప్రణవ్ వయసు మూడు సంవత్సరాలు. పెద్దబ్బాయి మరణం తర్వాత వీడిని అపురూపంగా చూసుకుంటున్నాము. 

గారాబం ఎక్కువైంది. ఏది కావాలంటె అది తెచ్చి ఇచ్చేవాళ్లం. అందువల్ల మొండితనం పెరిగి తన పట్టుదల సాధించుకునే వాడు. 


ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయనీ తనకీ కావాలంటే కొనిచ్చాము. ఎప్పుడు చూసినా స్నేహితులతో చాటింగులు అలాగే టీవీల్లో పోకేమాన్, డ్రాగాన్ లాంటి ఎడ్వంచర్ వీడియో గేమ్స్, బైక్ రేసింగులు చూస్తుంటాడు. మేము ఎప్పుడైన కోపగిస్తే తిండిమాని గదిలో గడియ పెట్టుకుని

ముభావంగా ఉంటాడు. 


పెద్దబ్బాయికి జరిగిన ప్రమాదం వల్ల వీడికేమైన జరిగితే తట్టుకోలేము. అందువల్ల వీడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. నా శ్రీవారు మెడికల్ రిప్రజెంటీవ్. నెలలో సగం రోజులు టూర్లో ఉంటారు. నేను బ్యాంకు లో జాబ్ చేస్తున్నాను. 


ప్రణవ్ అప్పుడప్పుడు వాళ్ల నాన్న మోటర్ బైకు బయటికి తీసుకెల్తూంటాడు. లైసెన్సు లేనందున బయటకు తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని భయపెట్టే వాళ్లం. ఐనా వాడి మొండి పట్టుదలకు తల ఒగ్గవలసి వస్తోంది. మా వారు డ్యూటీ మీద వైజాగ్ వెళ్లారు. ప్రణవ్ కి రెండు రోజుల శలవు కలిసొచ్చింది. నేను బ్యాంకు డ్యూటీలో ఉన్నాను. 


ఎప్పటిలా వాళ్ల నాన్న బైకు బయటకు తీసుకెళ్లాడట. ఫ్రెండ్స్ ముందు తనూ కళ్లకు చేతి రుమాలు కట్టుకుని బైక్ నడుపుతానని ఛాలెంజ్ చేసాడట. వాళ్లు ఎగతాళిగా మాట్లాడగానే రోషంతో మొహానికి చేతిరుమాలు చుట్టుకుని బైక్ స్ఫీడు పెంచి బయలు దేరాడట. 


కొంత దూరమెళ్లి బేలన్సు తప్పి కరెంటు స్తంభాన్ని గుద్దేశాడట. హెల్మెట్ ఉన్నందున తలకి ఏమీ కాలేదు. భగవంతుడి దయవల్ల చిన్న దెబ్బలతో బతికి బయట పడ్డాడని " ఏడుస్తూ చెప్పింది సరళ. 


అంతా విని మీ బాధలాంటిదే నాది కూడా అంటూ ప్రమీల తన గోడు చెప్పడం మొదలెట్టింది.


మాకు అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయి చిన్నది. అబ్బాయి పెద్ద. కార్పొరేట్ హైస్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. మగపిల్లాడు వంశోద్ధారకుడని గారాబం ముద్దు చేసాము. 

ఏది కావాలంటె అది కొనిస్తున్నాము. 


ఫ్రెండ్స్ దగ్గరున్నాయని తనకూ ఖరీదైన సైకిల్ కావాలంటే కొన్నాము. మొబైల్ కొనమంటే కొనిచ్చాము. మొబైల్ ఫోన్లో ఏవేవో వీడియో గేములు, సూపర్ మేన్, స్పైడర్

మేన్, క్రైమ్ స్టోరీలు చూస్తూ పిచ్చిగా అరుస్తుంటాడు. 


స్కూల్ నుంచి వస్తూనే యూనిఫాం విప్పి సోఫాలో పడేసి టి. వి. ఆన్ చేసి భోజనం పెట్టినా టి. వి. చూస్తూనే తింటాడు. రకరకాల కార్టూన్ ఛానల్స్ మారుస్తూ ప్లేట్లో అన్నం తినడు. "అన్నం తినరా" అంటే డిస్ట్రబ్ చెయ్యొద్దని చికాకు పడతాడు. ప్లేట్లోది తినడానికి గంట చేస్తాడు. 


క్రికెట్ లీగ్ మేచ్ లు ప్రారంభమైతే టి. వి. కి అతుక్కుపోతాడు. మా శ్రీవారిది బిజినెస్ అయినందున ఆ పనుల్లో బిజీగా ఉంటారు. నేనే పిల్లల బాగోగులు చూసుకుంటాను. 


మొన్న ఆదివారం నేనూ, మావారు గుడికి వెల్తూ మా అబ్బాయిని రమ్మంటే టి. వి. లో లీనమై రాను పొమ్మన్నాడు చిరాగ్గా.  చిరుజల్లు వాన మొదలైతే అమ్మాయిని వెంట పెట్టుకుని గుడికెళ్లి తిరిగొచ్చి గొడుగు ఆరుతుందని వరండాలో పెట్టి లోపలికెళ్లాము. 


అబ్బాయికి ఏమైందో టి. వి. చూస్తూ హోల్లోంచి బయటి కొచ్చి వరండాలో ఆరబెట్టిన నల్ల గొడుగు పట్టుకుని మేముంటున్న మూడవ అంతస్తు నుంచి కిందకు దూకేసాడు. 


పాత గొడుగై నందున వాడి బరువుకి ఊసలు విరిగి కింద పూలకుండీల మీద పడ్డాడు. సెక్యూరిటి గార్డు చూసి మాకు తెలియ చేస్తే వెంటనే అంబులెన్సులో హాస్పిటల్ కి తీసుకొచ్చాము. రెండు కాళ్లకి దెబ్బలు తగిలాయి. నిన్న ఆపరేషను జరిగింది." తన బాధ చెప్పుకుంది

ప్రమీల. 


  *


ఇదండీ నేటి పిల్లల పరిస్థితి. ఇంగ్లిష్ చదువులు, స్మార్టు ఫోన్లు, టి. వి. ల్లో వీడియో గేమ్స్, కార్టూన్, ఎడ్వెంచర్ పిక్చర్స్, క్రికెట్ ఆటలతో కాలక్షేపం. 


స్కూల్ అవగానే ఇంటి కొచ్చి టి. వి. లు, స్మార్టు ఫోన్ల సందడితో బయటి ప్రపంచంతో సంబంధ ముండదు. ఇంటి భోజనం పనికిరాదు. పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్ లు, రక

రకాల జంక్ ఫుడ్ తిని చిన్న వయసులోనే ఊబ కాయం. 


మైదానంలో ఆట పాటలు ఏమీ ఉండవు. టి. వి. ల్లో వచ్చే సాహసక్రీడలు గన్ ఫైరింగులు, నరుక్కోవడం, చంపుకోడం కౄర స్వభావ పాత్రల విదేశీ సినిమాలు పిల్లల మనస్తత్వాల్ని కలుషితం చేసి ఆప్యాయతలు, అనురాగాలకు దూరం చేస్తున్నాయి. 


సున్నితమైన వారి మనసుల్ని కర్కశంగా చేస్తూ మానసికంగా కుంగ తీస్తున్నాయి. ఈ యంత్ర యుగంలో పేరెంట్సు వారి వృత్తి వ్యాపారాల్లో పిల్లల కోసం సమయం కేటాయించ లేక పోవడం కూడా దురదృష్టమే. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


 
 
 

Comments


bottom of page