top of page

సాహసంగా..



'Sahasamgaa' New Telugu Story Written By Pandranki Subramani

'సాహసంగా..' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సాహసంగా.. ప్రవాహానికెదురీదంగా - కథ ఇతివృత్తం పైన చిన్నపాటి ప్రస్తావన-- ఏదీ యెదురు చూడకుండా పరుల మంచి కోసం చేసిన మంచి కార్యం ఊరకే పోదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతిఫలం ఏదో ఒక రూపంలో ఉంటుందని చెప్పడానికి ఓ చిరు ప్రయత్నం.


- పాండ్రంకి సుబ్రమణి


ఉర్లగడ్డ గ్రామం విజయనగరం పొలిమేరన—పర్వత శ్రేణి చివరి వరసన ఉంది. అక్కడ రామప్పడు భూమి లేని వ్యవసాయ కూలీ. చెట్టూ పుట్టా ఆసరాలేని- రెక్కల్ని ముక్కలు చేసుకుని జీవిస్తూన్న కష్టజీవి. అతడి మనుగడకి ఆయువుపట్టుగా రెండు న్నాయి. ఒకటి సుగణం- మరొకటి దుర్గణం--


అప్పగించిన పనిని ముగించడానికి ఒళ్లు దాచుకోడు. వేళాపాలా చూడడు. పని ముగించిన తరవాతనే రొక్కం రూపంలోనో లేదా ధాన్యపు గింజల రూపంలోనో పండ్లు కాయల రూపంలోనో బత్తెం పుచ్చు కుంటాడు కళ్ళకద్దుకుని. మరొక పార్శ్వాన అతడిలో కానవచ్చే దుర్గణం ఏమంటే-- గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటాడు. అదీను తన గురించి కాదు. తన తండ్రి గురించి కూడా కాదు. ఎప్పుడో చిన్నప్పుడు చూచిన తన తాతయ్య పటాలం పోలయ్య గురించి--


ఎలా చెప్తాడని, చాతిని ఆమాంబాపతు బార చాచుకుని చెప్తాడు. ఇది అతడి జీవన సహచరి మహలక్ష్మికి నచ్చదు.


“హీరో పోజులు కొట్టడానికి కూడా కారణం—సందర్భం ఉండాలయ్యా సామీ! మీ తాతయ్య గురించి తెగ వాగేస్తున్నావు గాని—అతగాడి గురించిన ప్రూఫ్ ఏమైనా ఉందా నీ వద్దా-- కనీసం ఆయన బొమ్మనయినా మా అత్తామామా దాచుకున్నారా? అంతెందుకు, ఆయనేసుకొని తిరిగిన మిలిటరీ వాళ్ళ మోటు బెల్టయినా మోటు బూటయినా నీ వద్దుందా! లేవు. అసలు నువ్వెప్పుడైనా ఆ పటాలం మనిషిని కనులార చూసున్నావా అని! ”


పెళ్ళాం మాటలకు రామప్పడు సర్రున బుసకొడ్తాడు—“ఏమిటే నీ గుర్రు వాగుడూ! అదేదో ఎక్సాట్రా గాడిలా దనుములాడేస్తున్నావే! రెండో ప్రపంచ యుధ్ధంలో గన్ను పట్టుకుని మార్చ్ చేసిన మా తాతయ్య గురించి నేను చెప్పుకుంటుంటే మధ్య నీకెందుకే అంతటి అసూయా! మా తాతయ్యను ఆషామాషీ మనిషిననుకోకే పిచ్చి మొహమా! బర్మా అడవుల్లో పొట్టి జపానుగాళ్లతో లడాయి చేసి చేసీ ఎంతో మంది శత్రువుల్ని కూల్చి కూల్చి వీర స్వర్గం పొందాడే--


ఆయన మనవణ్ణిని చెప్పుకుంటే నాకు గర్వం కాదటే? ఆడి రక్తం నాలో లేదటే! నా ముఖం అచ్చు మా తాతయ్య ముఖంలాగే ఉంటాదని మా బాబు ఎన్నిసార్లు చెప్పేవాడని- ”


“మరి మీ బాబు గురించి గొప్పలెందుకు చెప్పవని? ”


“ఆయనెప్పుడూ నాగలి తప్ప గన్ను పట్టుకోలేదుగా! అది నేనెన్నడూ చూడలేదుగా! ”


దానితో మహలక్ష్మి ఊరకుండిపోతుంది;మరీ ఎక్కువగా కారమూ ఉప్పూ దట్టంగా వేసిన చేపల పులుసులా సంభాషణ మారకూడదని. భర్తకి తన తాతగారి వీరత్వం గురించి, పోరాట పటిమ గురించి తలచుకుంటేనే ఉద్రేకం పుంజుకొస్తుందనేది ఆమెకు ఆది నుంచీ తెలిసిన అంశమేగా! మరీ ఘాటుగా వాదిస్తే, రెచ్చిపోయి టెంటు సినిమాకి తీసుకెళ్లడేమో- వెన్నెలరాత్రి మన సు మత్తుగా మూల్గినప్పుడు మల్లెపూలు కొనుక్కోవడానికి చేతిలో రూపాయి బిళ్ల పెట్టడేమో! అంచేత- ఇంగితమనే తెప్పతో ఒడ్డుకు చేరుకుని అంతటితో సంభాషణకి మలుపు తిప్పుతుందామె;


వయ్యారాలు పోతూ- ఒంటి సొంపుల్ని కళ్ళకు కుట్టేలా ఝులిపిస్తూ—“ఐనా అదేమిటి మాఁవా బంగారు కడ్జీలంటి ఒళ్లు అలా గుళ్ల చేసుకుంటావూ! రాత్రీ పగలూ అంత కూడబెట్టుకుని ఏం చేద్దామని? ఇదంతా నాకా లేక నీకా-- మనకేమైనా పిల్లాజెల్లా-- ”అని మెత్తగా మత్తుగా దువ్వ నారంభిస్తుంది.


కాని అతడంత త్వరగా కరగడు. మిలిటరీ తాతయ్య వారసుడైన రామప్పడు జూలు విదిలిస్తాడు— “ఓసి ఎర్రి ముఖమా! మగాడి కష్టం గురించి—మగతనం గురించీ నీకేమి తెలుసే? అలా ఒళ్లు దాచుకోకుండా పని చేయబట్టే కదా నా ఒంటిలోని కండలు ఇలా ఉబ్బాయీ-- అసలు నువ్వు కరిగిపోయిందీ నన్ను చూసటే? నా కండరాల వంపులకు కరిగి కాదటే నా నిట్రాట గుడిసెలోకి పెళ్లయిన మొదటి రాత్రికే పుట్టింటి నుంచి పరుగెత్తుకొచ్చావూ! ”


ఆ చివరి మాటతో మహలక్ష్మి సిగ్గుతో మొగ్గయి పోతుంది. మొగుడి కౌగలిలోకి చప్పున ఆపుకోలేని తమకంతో వంకర్లుపోతూ చేరుతుంది;పట్ట పగల్నే చుక్కల్లేని రాత్రి పూటగా మార్చివేస్తూ--

నిజాషాఢ శుద్ధ పౌర్ణమి. మూడు రోజులుగా పెళ్లాం మాట ప్రకారం మెట్ట వీధిన ఉన్న భవాని అమ్మవారి గుడిలో స్వంత పనీ పాటా మానుకుని ఆలయ ప్రాంగణ శుధ్ది కార్యంలో మునిగి ఉన్నాడు రామప్పడు;ఊరి పెద్దలతో- ఆలయ ధర్మకర్తలతో భుజాలు కలిపి-- భర్తతో కలిసి మహలక్ష్మీ కూడా ఆలయ శుధ్ధి కార్య క్రమంలో పాలు పంచుకోసాగింది.. ఆ విధంగానైనా అమ్మ వారికి జాలి కలిగి తన కడుపు పండేలా చేస్తుందేమోని..


కాని అనుకున్నది ఒకటీ జరిగింది మరొకటీను-- గుడి జాతరకు సన్నాహాలు పూర్తికాకముందే అమ్మవారికి మంగళ హారతులు ఎత్తకముందే-- మహలక్ష్మి ఆశలన్నీ అడియాసలయిపోయాయి. మొక్కుబడులు మలుపు తిరిగక ముందే ఆగిపో యాయి. ఎలాగంటే- తనకోసం ఎదురు చూసే సంగతటుంచి, తనను ఊరి జనం తలవడమే మరిచారా- అన్న ఆక్రోశం వల్ల గావాలి మేఘాలు ఉన్నపాటున మద మెక్కిన ఏనుగుల గుంపులా ఘర్ణించాయి.


పల్లెపట్టుల్నివాన బాదుడుతోవర్ష బీభత్సంతో వాయించే సాయి. గుడిసెలూ పెంకుటిండ్లూ అన్న వ్యత్యాసం లేకుండా కుండపోత వర్షాలతో అల్లల్లాడించేసాయి. సైకిళ్ళూ స్కూటర్లూ వరద ఉధృతికి దొర్లనారంభించాయి. అప్పుడు ఎక్కడికో పనుండి పొరుగూరు వెళ్లిన మహలక్ష్మి పరుగు పరుగున రామప్పడి వద్దకు చేరింది.


ఊపిరందక రొప్పుతూ అంది–“ఊరంతా మోకాలు లోతంత నీళ్పు మాఁవా! మరి కాసేపట్లో నడుం పైకి వచ్చేస్తాయి“


రామప్పడు చివరి దశ శుధ్ది కార్య క్రమంలో భాగంగా గుడి మెట్లు కడగడం మాని తలపాగాను చేతిలోకి తీసుకుంటూ అన్నాడు- “అది నాకు చెప్పాలా! తెలుస్తూనే ఉందిగా ఇక్కణ్ణించి చూస్తుంటే- లోతట్టు వీధులన్నీ తెప్పల్లా తేలుతున్నాయి. అలాగని గుడి శుధ్ధి పనులు సగంలో మానేయడమా! మహా అపచారం కదూ! ”


“ఇసయం అది కాదు మాఁవా! పోలమ్మ అక్కయ్యకి పురుటి నొప్పులు ఆరంభమయాయి”

అది విని కోపంగా అరిచినంత పని చేసాడు రామప్పడు- “పురుటి నొప్పులొచ్చాయని వజవజ బెంబేలు పడిపోతే ఎలాగే! దాని మొగుడేమి చేస్తున్నాడే! వెంటనే మనూరి వైద్య కేంద్రానికి తీసుకెళ్లొచ్చుగా! ”


మహలక్ష్మి యింకా ఊపిరందుకోవడానికి పాటుపడుతూనే అంది- “వాన బాదుడికి వైద్య కేంద్రం అటుగా ఒరిగిపో యింది మాఁవా! అదీను—ఇప్పుడు కేంద్రంలో డాక్టర్ కూడా లేడాయె—ఎనిమిదోనెల గర్భిణీగా ఉన్న వాళ్లావిడను పట్టణంలో విడిచి రావడానికి-- ”


“హాఁ! మరి నర్సమ్మ ఉంటుందిగా! ఆవిడది ప్రక్క ఊరేగా-- ”


“అయ్యోరామ! గాలి వానకు క్లీనిక్కు పూర్తిగా కూలి నర్సమ్మకి దెబ్బలు తగిలాయట. నడుం బెణికి లేవలేక పోతుందట“


అంతే- ఆ ఒక్కమాటతో కరకట్టవేపు వేగంగా నడిచాడు రామప్పడు ఓసారి అమ్మవారి వేపు చేతులు జోడించి;అప్పటికే చుట్టూ పేర్కున్న నీటి మడుగులకెదురుగా దూసుకుంటూ—


అలా వెళ్లిన వెంటనే మారప్పణ్ణి చూసి అంతదూరంనుంచే గట్టిగా అరిచాడు.


రామప్పడు “వాగువంతెన అక్కడుంటే- వదిన్నిఇక్కడకెందుకు తీసుకొచ్చావురా నాయనా! బుర్ర పనిచేయదేమిటి? ”


“ఓరి నాయనో! నీకింకా తెలీదేమిటీ? పున్నాగ వాగు వంతెన వరదకి ఎప్పుడో కొట్టుకుపోయింది”


ఆ మాటతో గుండె గతుక్కుమం ది రామప్పడికి. ఇక వేరే మార్గం లేక చుట్టుప్రక్కల తేరిపార చూసాడు. వాళ్లకెదురుగా కనిపిస్తున్నది చిన్నపాటి వాగే—కాని వర్షానికి పొంగి పొర్లుతుంది ఉగ్ర రూపమెత్తిన ముత్యాలమ్మోరిలా-- నిండు గర్భణీగా ఉన్న పోలమ్మ పరవళ్లు తొక్కుతూన్న వాగులో కాలు మోప లేదు. కాలు మోపి నిలవలేదు. ఎటూ పాలుపోక గ్రుడ్లు మిటకరించి చూస్తూ నిల్చున్నాడు రామప్పడు.


టౌనుకి పూడ్చిన కచ్చడ ఎడ్ల బండి అవతలి గట్టునే ఉంది. అప్పుడు మహాలక్ష్మి అతడి ముఖాన అన్నమాటలు పొంగే వరదలా నిలువెల్లా తాకాయి- “ఎందుకు మాఁవా ఈ తాపత్రయం! ఎవరి కోసం మాఁవా ఈ ఆరాటమంతా? ఏది నీదని—ఏది నాదని—ఎవరికి మిగుల్తుందని-- ”


ఆ మాటలు గుర్తు రావడంతో అతడిలో ఆవేశం ఒకింత వైరాగ్యం మరికొంత తన్నుకు వచ్చాయి. కాని ఏమీ చేయలేని పరిస్థితి! ఏదీ తోచని దీనస్థితి! నిస్సహాయంగా పురుటి నొప్పితో మెలికలు తిరిగి పోతూన్న పోలమ్మను అసహా యంగా చూడసాగాడు. మరి కొద్ది సేపట్లో పోలమ్మ పురుడు పోసుకోబోతున్నది. ఇప్పుడో అప్పుడో చెప్పడం కష్టం. అప్పుడు మహాలక్ష్మికి దు:ఖమూ ఆవేశమూ ఒక్కసారిగా ముప్పరిగొన్నాయి.


భర్త దగ్గరకు వచ్చింది- సూటిగా చూస్తూ- “మాఁవా! నువ్వెవడివి? ”


“నేనా—నేనా—పటాలం పోలయ్య మనవణ్ణి కదూ! ”


“మరైతే—పోలయ్య తాతగాని ఉంటే ఇప్పుడేమి చేస్తాడు? చేతులు నులుపుకుంటూ నిల్చుంటాడా? ”


“లేదు. ఒక్క నిమిషం కూడా నిల్చోడు. బర్మా పోరులో మాతాత పటాలం పోలయ్యలాగే తెగేసి దూకాలి“ అంటూ ఎవరూ ఎదురు చూడని విధంగా—అటు వాగుకి ఎడంగా ఉన్న హద్దురాళ్ల పైన ఒక్క దూకుడుతో ప్రాకి రెండు చేతుల్తో పట్టులోకి తీసుకుని ఇటు కాళ్ళను ఆసరాగా ఉంచుకుని ఉరకలు వేస్తూన్న వాగుకి అడ్డంగా పడుకున్నాడు-


ఇద్దరి బరువుని తానై మోస్తూన్న పోల మ్మను తన వీపు పైన నడచుకుంటూ అటువేపు సాగిపొమ్మని పురమాయిస్తూ- అది ఆలోచించడానికి సమయం కాదని—పోల మ్మతో బాటు మహలక్ష్మి కూడా ధైర్యం పుంజుకుని రామప్పడి శారీరపు వంతెన పై నుండి నడచి వెళ్లిపోయారు ఆ దరికి. వాళ్ళిద్దరిబరువునీ పళ్లు గిట్టకరచుకుని భరించ సాగాడు రామప్పడు. చిన్నపాటి కుదుపు చాలు- సన్నపాటి తడబాటు చాలు; రామప్పడితో సహా పోలమ్మా మహలక్ష్మీ వాగులో కొట్టుకు పోవడానికి-- ఆతరవాత ఒక్క ఉదుటున మెరుపు తీగెలా లేచాడు. ఎంతైనా పటాలం పోలయ్య మనవడు కదూ!


ఆలోపల మారప్పుడు కూడా దూకుడుగా వాగుకి ఎదురుగా నడుస్తూ అటు దరిచేరాడు. అక్కడ సిధ్ధంగా ఉన్న కచ్చడ బండిలోకి పోలమ్మనూ మహలక్ష్మినీ ఎక్కించుకుని పొరుగూరి గవర్నమెంటువారి ప్రసూతి ఆస్ప త్రి వేపు బండిని కదలించాడు రామప్పడు, మారప్పణ్ణి ప్రక్కన కూర్చోబెట్టుకుని-


పోలమ్మ పడ్తూన్న నొప్పుల్ని చూస్తుంటే రామప్పడికి అనిపించింది—బిడ్డ అడ్డం తిరిగిందేమోనని-- ప్రసూతి వార్డు చేరీ చేరిన వెంటనే పోలమ్మ పురుడు పోసుకుంది. మొత్తానికామె అక్కడ ఎక్కువ రోజులే ఉండాల్సి వచ్చింది.


వారం రోజుల తరవాత—వానాగాలీ తగ్గుముఖం పట్టిన తరవాత ఇంటి వాకిట కల్లాపు చల్లి ముగ్గు వేయడానికి తలుపు తీసిన మహాలక్ష్మి ఆశ్చర్యంతో కెవ్వున అరిచింది. అక్కడ దళసరి గుడ్డతో చుట్టబడి పండంటి మగపిల్లాడు అర్థం కాని భాషలో వాడిలో వాడుగా గునుస్తూ దొర్లుతున్నాడు. గబుక్కున వెళ్లి గుండెలకు హత్తుకుని భర్త వద్దకు పరుగెత్తిందామె.


అక్కడేమో—కవల పిల్లల్ని కన్న పోలమ్మ ప్రక్కన ఒక పిల్లాడే ఉండటం గమనించిన వాళ్లత్త తాయారమ్మ గట్టిగా అర వసాగింది- “మరొక పిల్లాడేడే పోలమ్మా! అటెళ్ళి నీ కోసం తినడానికి జావ చేసి తీసుకొచ్చేటప్పటికి మాయమైపోయాడా? ”


“అదే అత్తయ్యా నాకూ బోధపడటం లేదూ! రాత్రి అంతా నాప్రక్కనే ఉన్నారిద్దరూనూ- ఇప్పుడు చూస్తేనేమో- ఒక పిల్లాడు మాయ మైపోయాడు. ఈ రోజుల్లో ఆస్పత్రుల్లో కూడా పిల్లల్ని ఎత్తుకుపోయే ఆడ దొంగలు చొరబడుతున్నారత్తయ్యా! ఇప్పుడే డ్యూటీ మెడికల్ ఆఫీసరుకి చెప్పొస్తానుండు“అంటూ కదలబోయింది పోలమ్మ.


అప్పుడక్కడకు చేరుకున్న మారప్పడు ఇద్దర్నీ ఆపాడు - భార్య వేపు కన్నుగీటుతూ—“అత్తా కోడల్లిద్దరూ కొంచెం ఆగండి. విషయాన్ని సీరియస్ చేసేయకండి. ఎవరో పిల్లల్లేని మొగుడూ పెళ్లాలు వచ్చి ఒక బిడ్డను తీసుకుపోయుంటారు. ఇప్పటికే మనింట్లో ఇద్దరున్నారు.


ఇప్పుడిప్పుడే పుట్టిన ఈ షోగ్గాడితో చేరిస్తే—మొత్తం ముగ్గురవుతారు. ఈ భారాన్ని ఎలా మోయాలో తెలియక సతమతమవుతుంటేను-- “


ఆ మాట విని మారమ్మ ఎగిరి పడింది- “అలాగని బంగారు ముద్ద వంటి మగపిల్లాడిని పోగొట్టుకుంటామా! కేసు పోలీసుఠాణా వద్దకువెళ్ళ వలసిందే! ఈ ఆస్పత్రి వాళ్లపైన కూడా కెసు పెట్టాల్సిందే-- ఎన్నో దొంగతనాల గురించి విన్నాను గాని—ప్రసూతి వార్డులో పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా యెత్తుకుపోవడమనేది నేనింత వరకూ వినలేదంటే వినలేదు- ”


“వాస్తవం! దీనిని పోలీసు కేసు చేయాల్సిందే! కాని ఇక్కడ—ఇప్పుడు కాదు. ఇంటికెళ్లిన తరవాత-- - అంతవరకూ ఎవ్వరూ నోరు మెదపకండి. ఊరంతా దండోరా వేయించి నా పరువు తీయించకండి. గొడవ మరీ పెద్దది చేస్తే—పోలీసు ఇంక్వయిరీలంటూ పోలమ్మను సహితం ఇక్కణ్ణించి కదలనీయరు. అంతా వివరంగా మనూరి సర్పంచుకి చెప్తాలే— ఆయనేదో చేస్తాడు తప్పకుండా—


ఓట్లు రాలాలి కదా రేపు. ఎవరి కోసం చేస్తాడు మరి-- ఇకపైన కూడా నా మాట మీరారో—ఇక సంగతులంతే-- ”అంటూ నడచుకుంటూ వచ్చిన దారమ్మటే బైటకు వెళ్లిపోయాడతడు.


పోలమ్మ చీరచెంగుని ముఖానికి అడ్డం పెట్టుకుని దు:ఖ భాజితురాలైనట్టు తల వంచుకుంది. తన రెండవ కవల బిడ్డ ఇక్కడి కంటే అక్కడే బాగుంటాడని మనసా వాచా కర్మణ: తలపోసుకుంటూ--


ఆమెకు తెలుసు. ఆమె అంత రాత్మకు తెలుసు- ఈరోజు తనూ తన కవల బిడ్డలిద్దరూ వరద జోరులో బ్రతికి బట్ట కట్టగలిగారంటే—పిల్లల్లేని ఆ మొగుడూ పెళ్లాలూ పెట్టిన ప్రాణ భిక్షేనని.

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



Comments


bottom of page